వరదలపై ‘కొత్త అధ్యయనాన్ని’ ఆధారంగా చూపుతూ ‘పరిహారం’ చెల్లించమంటున్న నేపాల్.. ఇంతకీ అందులో ఏముంది?

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
కిందటి నెలలో వరదల వల్ల జరిగిన నష్టానికి ఐక్యరాజ్యసమితి నుంచి ఆర్థిక సాయం కోరాలని నేపాల్ భావిస్తోంది. వరదలకు, వాతావరణ మార్పులకు సంబంధం ఉందనే కొత్త అధ్యయాన్ని ఇందుకు ఆధారంగా చేసుకోనుంది.
వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన దేశాలకు సాయం చేసే ఐక్యరాజ్య సమితి నష్టపరిహార నిధి నుంచి దాదాపు 1,920 కోట్లు పొందాలని నేపాల్ ఆశిస్తున్నట్టు బీబీసీకి సమాచారం ఉంది.
ఈ విపత్తు వల్ల బుధవారం (సెప్టెంబర్ 16) నాటికి నేపాల్‌లో సుమారు 1,400 మంది మరణించగా 6,150 మంది గల్లంతయినట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
గత నెలలో నేపాల్-టిబెట్ సరిహద్దు వెంట సంభవించిన విధ్వంసకర వరదలకు వాతావరణ మార్పులు ఒక కారణం కొవచ్చని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే పరిశోధనా బృందం గురువారం (సెప్టెంబర్ 17) ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.

శాటిలైట్, డ్రోన్ ఫోటోలతో నివేదిక
"ఈ విపత్తుకు దారితీసిన పరిస్థితులను సృష్టించడంలో మానవ ప్రమేయం వల్ల ఏర్పడుతున్న వాతావరణమార్పులు కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు" అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త, ఈ అధ్యయన సహ రచయిత డాక్టర్ ఫ్రీడెరిక్ ఒట్టో అన్నారు.
నేపాల్, టిబెట్ సరిహద్దుల్లోని పట్టణాలు, గ్రామాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం జరిగింది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు మరణించారు. అనేకమంది గల్లంతయ్యారు.
హిమాలయాల్లో నేపాల్ వైపు ఉన్న లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం దగ్గర కొండచరియలు, హిమానీనదం కూలిపోవడం వల్లే వరదలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యయనం ఆధారంగా సాయానికి వినతి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, అక్కడ ముందునుంచే ఉన్న భౌగోళిక బలహీనతలు కలిసి ఈ విపత్తుకు కారణమయ్యాయని ఆ అధ్యయనం పేర్కొంది.
మానవ కార్యకలాపాల ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో జూలై, ఆగస్ట్ నెలల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే సుమారు 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలోని హిమానీనదాలు కూడా సంవత్సరానికి సుమారు 1.6 అడుగుల చొప్పున తగ్గుతున్నాయి. దీనివల్ల ఇప్పటికే ఉన్న పగుళ్లు బలహీనపడి అస్థిరత పెరిగి ఉండొచ్చు.
గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీగా మంచుకురవడం వల్ల ఈ ఏడాది ఆరంభంలో కరిగిన మంచు నీటి పరిమాణం కూడా పెద్దమొత్తంలో పెరిగింది.
ఈ విపత్తుకు వాతావరణ మార్పులు ఒక్కటే కారణం కానప్పటికీ అవి ఇప్పటికే ఉన్న భౌగోళిక పరిస్థితులపై ప్రభావం చూపించాయని అధ్యయనం పేర్కొంది.
వరదల వల్ల జరిగిన నష్టం కారణంగా నేపాల్ పునర్నిర్మాణానికి సుమారు 4 లక్షల 80వేల కోట్లు అవసరమని ఆ దేశ నాయకులు అంటున్నారు.
గత ఏడాది ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి నష్టపరిహారనిధి నుంచి సాయం పొందాలంటే వాతావరణ మార్పుల వల్ల నష్టం జరిగిందని నిరూపించే ఆధారాలను ఆ దేశాలు సమర్పించాల్సిఉంటుంది. నేపాల్ అధికారులు ఈ నిధులు సాధించేందుకు శాటిలైట్, డ్రోన్ ఫోటోలతో ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నారు.
లాంగ్‌టాంగ్ లిరుంగ్‌లో రాళ్లు, మంచు కూలిపోవడానికి వాతావరణ మార్పులు ముఖ్యమైన కారణమనే తమ వాదనకు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నివేదిక ఇప్పుడు అత్యంత బలమైన ఆధారంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
"ఈ విపత్తులో వాతావరణం పాత్రను ఈ నివేదికలో వివరంగా పేర్కొన్నారు కాబట్టి మా వాదనకు ఇదే ప్రధాన ఆధారం అవుతుంది" అని నేపాల్ వ్యవసాయ, అటవీ, పర్యావరణశాఖ ప్రతినిధి మహేశ్వర్ ఢకాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యత తక్కువ.. బాధలు ఎక్కువ
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సాయం చేయాలని నేపాల్ అధికారులు ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలలో చాలా తక్కువ వాటా కలిగిన దేశాల్లో నేపాల్ ఒకటైనప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలకు అత్యంత ఎక్కువగాలోనయ్యే దేశాలలో ఒకటిగా ఉందని వారు ఆవేదన చెందారు.
తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా వచ్చే వారం న్యూయార్క్ వెళుతున్నారు. అక్కడ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొని ఇటీవలి విపత్తు, వాతావరణ మార్పులపై ప్రసంగిస్తారు.
"అత్యవసరమైన సహాయనిధిని కోరడానికి నేపాల్ 'పరిహారం' అనే పదాన్ని పదేపదే ఉపయోగించింది" అని బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్‌కు చెందిన వాతావరణ మార్పుల విధానాల నిపుణురాలు దాన్యా లియు అన్నారు.
ఈ వ్యత్యాసం ప్రభావిత దేశాలే ఎక్కువ ఖర్చును భరించి, లోటును పూడ్చకోడానికి ఇతరుల సహాయంపై ఆధారపడే విధానానికి బదులుగా కాలుష్యానికి కారణమైన వారే చెల్లించాలనే విధానాన్ని సూచిస్తోంది.
అయితే వరదల వల్ల ప్రభావితమైన సరిహద్దు ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులను నేపాల్ సమీకరించగలదా, అలా చేయడానికి ఎంత సమయం పడుతుందన్నది వేచి చూడాలి.
ఇప్పటికే దాదాపు 120 దేశాలు ఐక్యరాజ్యసమితి నష్టపరిహార నిధికి సుమారు 2లక్షల88వేలకోట్ల క్లెయిమ్‌లను సమర్పించాయి.
ఈ నిధిలో పంపిణీ కోసం 38వేల400కోట్ల రూపాయల కంటే కొంచెం తక్కువ మొత్తమే కేటాయించారని రిపోర్టుల్లో ఉంది.
నేపాల్‌కు త్వరగా నిధులు అందించేందుకు కొన్ని దేశాల విస్తృత మద్దతు లభించినప్పటికీ మరికొన్నిదేశాలు మాత్రం నిబంధనలను, విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పాయని నేపాల్ అధికారులు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ఫండ్‌కు చెందిన అధికారులు డిసెంబర్‌లో సమావేశమై ఏ అభ్యర్థనలను ఆమోదించాలో, నేపాల్ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవాలో లేదో చర్చించనున్నారు.

అధ్యయనంలో ఏం తేలింది?
2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం, దాని ఫలితంగా ఏర్పడిన హిమపాతం కూడా అక్కడి రాతి నిర్మాణాన్ని బలహీనపరిచి ఉండవచ్చు. అయితే ఇటీవలి వరదల విపత్తుపై ఆ భూకంపం ప్రభావం కచ్చితంగా ఎంత ఉందో నిర్ధరించలేమని వరల్డ్ వెదర్ అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనం ఇంకా పీర్-రివ్యూ జర్నల్‌లో ప్రచురితంకాలేదు. తీవ్రమైన వాతావరణ సంఘటనలను విశ్లేషించడానికి అన్ని అధ్యయనాల్లో ఒకే పీర్-రివ్యూ పద్ధతిని ఉపయోగిస్తారని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ వెబ్‌సైట్ తెలిపింది.
విపత్తు జరిగిన వెంటనే ఇతర నిపుణులు వేసిన అంచనాలను ఈ అధ్యయన ఫలితాలు మరింతగా బలపరుస్తున్నాయి.
హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే మంచుచరియలు విరిగిపడి ఉండొచ్చని అంతకుముందు కొంతమంది నిపుణులు బీబీసీతో చెప్పారు.
''ఏదైనా ఓ సంఘటనను వాతావరణ మార్పులతో నేరుగా ముడిపెట్టడం కష్టమైనప్పటికీ అంతిమంగా ఈ ఎత్తయిన పర్వత పర్యావరణాన్ని వాతావరణ మార్పు అస్థిరపరుస్తుంది" అని డండీ యూనివర్శిటీకి చెందిన హిమానీనదాల నిపుణులు డాక్టర్ సైమన్ కుక్ గత నెలలో బీబీసీతో చెప్పారు.
ఇటీవలి విపత్తుకు గల కారణాలపై వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ రిపోర్ట్ చాలా అర్థవంతమైన, ముఖ్యమైన అధ్యయనం అని కుక్ గురువారం (సెప్టెంబర్ 17) బీబీసీకి తెలిపారు.
"వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణమని కొన్ని బలమైన ఆధారాలను ఇది అందిస్తున్నప్పటికీ, వాస్తవంగా ఇది సరిగ్గా ఎలా జరిగిందో చెప్పే స్థితిలో మనం ఇంకా లేము" అని ఆయన అన్నారు.
''ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియల గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలపై భవిష్యత్తులో ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి, ఈ ఎత్తైన పర్వత ప్రాంతాలను పర్యవేక్షించడానికి మనం ఏం చేయగలమో కూడా తెలుసుకోవాలి'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























