నేపాల్: సుమారు 900మంది ఇంకా సొరంగాల్లోనే... రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Nepal Army/Reuters
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. 900 మందికి పైగా మరణించినట్లు నిర్ధరించారు. దాదాపు నాలుగు వేల మంది గల్లంతయ్యారు.
వరద బాధితప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నేపాల్‌లోని వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టులలోని పలు సొరంగాలలో సుమారు 933 మంది చిక్కుకుపోయారని అంచనా. వీరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అప్పర్ త్రిశూలి 1, త్రిశూలి 3ఏ, త్రిశూలి 3బీ ప్రాజెక్టుల సొరంగాల నుంచి సిబ్బందిని సురక్షితంగా తరలించడానికి సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులే నేపాల్‌కు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి వనరులు.


ఫొటో సోర్స్, Reuters
వీటిలో కొన్ని ప్రాజెక్టుల సొరంగాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయి.
త్రిశూలి 3బీ ప్రాజెక్ట్, 3ఏ నుంచి నీటిని తీసుకుంటుంది. అప్పర్ త్రిశూలి 1 ప్రాజెక్ట్ నదిపై ఉన్న అత్యంత ఎత్తైన జలవిద్యుత్ ప్రాజెక్ట్. దీని నిర్మాణం జరుగుతున్నప్పుడు వరద వచ్చింది.
3ఏ ప్రాజెక్ట్ సొరంగంలోకి వెళ్లడానికి సహాయ సిబ్బంది ఆదివారం పెద్ద రంధ్రాన్ని తవ్వారు. సహాయ సిబ్బంది సొరంగంలో పెద్ద పెద్ద శబ్దాలు చేసినప్పటికీ లోపలి నుంచి ఎవరూ స్పందించలేదని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అన్నారు.

ఫొటో సోర్స్, PMO
ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?
నేపాల్‌లోని సుమారు 13 జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుసంధానమైన ఉన్న సొరంగాలలో కార్మికులు చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకుక నేపాల్ అధికారులు ఇప్పుడు కొండలలో బాంబులు పేల్చడానికి ప్రయత్నిస్తున్నారు.
సొరంగ మార్గాన్ని తెరిచేందుకు రసువాగఢిలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు నియంత్రిత (తక్కువ తీవ్రత గలవి) పేలుళ్లు జరిపారు.
రానున్న నాలుగైదు రోజుల్లో దేశంలోని ఉత్తర ప్రాంతంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా సహాయ చర్యలు మరింత క్లిష్టంగా మారతాయి.
రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి సైనికులు ప్రవేశించినప్పటికీ అక్కడ ఎవరూ లేరు. సొరంగం లోపల వెతకడానికి వాళ్లు డ్రోన్‌ను కూడా ఉపయోగించారు.
సొరంగాల్లో చిక్కుకున్న వారిని కాపాడే ఆపరేషన్‌లో సాయం చేయడానికి భారత్, చైనా దక్షిణ కొరియా నుంచి సహాయ బృందాలు నేపాల్ చేరుకున్నాయి.
సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడం, మృతదేహాల డీఎన్ఏను గుర్తించడం వంటి సాంకేతిక విషయాలలో తమకు విదేశీ సాయం అవసరమని నేపాల్ ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఎవరు ఏ సొరంగంలో ఉన్నారో?
సొరంగంలో చిక్కుకుపోయారని భావిస్తున్న తన సోదరుడి గురించి సమాచారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రియా ఖరేల్తో బీబీసీ మాట్లాడారు.
అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో ఆమె సోదరుడు మిలన్ ఖరేల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
"లోపల నుంచి వచ్చినవారు సొరంగంలో మనుషులు ఉన్నారని చెప్పారు. సైన్యం వాళ్లను త్వరగా కనుక్కుని రక్షిస్తుందని ఆశిస్తున్నా" అని ఆమె చెప్పారు.
అయితే ఆమెకు తన సోదరుడి గురించి ఎలాంటి సమాచారం అందలేదు.
"మేము తప్పిపోయిన, కాపాడిన, మరణించిన వారి జాబితాలను చూశాం. ఎక్కడా వాళ్ల పేర్లు కనిపించలేదు" అని ఆమె చెప్పారు.
నేపాల్‌లోని త్రిశూలి-3ఏ సైట్లో జలవిద్యుత్ సొరంగంలో తన భర్త చిక్కుకుపోయారని భావిస్తున్న ఒక మహిళ ఆయన బతికే ఉన్నారని ఆశాభావంతో ఉన్నారు.
"లోపల ఆక్సిజన్ వ్యవస్థ ఉన్నందున ఆయన బతికే ఉన్నారని నాకింకా 50 శాతం ఆశ ఉంది" అని నేపాలీ వార్తాపత్రిక కాంతిపూర్‌తో సీతా పాండే అన్నారు.
కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఆశ సన్నగిల్లుతోంది.
పాండే భర్త జిబాలాల్ అధికారితో సహా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న కనీసం 897 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని నేపాల్ విద్యుత్ అథారిటీ, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం చెబుతున్నాయి.
సహాయ సిబ్బంది రెండు రోజుల నుంచి సొరంగంలోకి ఆక్సిజన్ పంపిస్తున్నాయి. అయితే ఇది ముందే చేసి ఉండాల్సిందని కొన్ని కుటుంబాలు అంటున్నాయి.
"టైమ్ గడిచే కొద్దీ ఆశ తగ్గిపోతోంది. ఈ ఆపరేషన్ చాలా వేగంగా జరగాలి. ఎందుకంటే ప్రతి సెకను విలువైనది. కానీ ఇది చాలా నెమ్మదిగా సాగే ఆపరేషన్" అని ప్లాంట్‌లో చిక్కుకున్న మరో ఉద్యోగి బంధువైన జీబన్ ఖడ్కా అనే వ్యక్తి కాంతిపూర్ వార్తాపత్రికతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి ఎవరు బయట పడ్డారు?
వరద వచ్చాక మైలుంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న శివ, గిరితోపాటు మరో ఆరుగురికి కొండపైకి ఎక్కడం తప్ప మరో మార్గం లేకపోయిందని పీటీఐ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
వరద నీరు నివాసాలు, ఇతర నిర్మాణాలను ముంచెత్తడాన్ని రసువాలోని మైలుంగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి కొండపైకి పారిపోతూ వారు చూశారు.
ఒక బంధువుతో సహా తన సహచరులలో చాలామంది కొట్టుకుపోయారని గిరి 'నేపాల్ న్యూస్ వెబ్సైట్'తో చెప్పారు.
పట్టణానికి వెళ్లే దారి కొట్టుకుపోవడంతో శివ, ఆయన సహచరులు 12 గంటల పాటు అడవిలో నడిచి రాత్రంతా ఒక గుహలో తల దాచుకున్నారు.
సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిలో 279 మందిని రక్షించినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
మైలుంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టులో టెక్నికల్ వర్కర్‌గా పని చేస్తున్న గిరి, తర్వాతి రోజు ఉదయం తన సహచరులతో ప్రాజెక్ట్ సైట్‌కి వచ్చారు.
వారు తమను తాము నిరాశ్రయులుగా నమోదు చేసుకుని, సాయం కోరినట్లు అథారిటీ వెల్లడించింది. నేపాల్ సైన్యానికి చెందిన హెలికాప్టర్లో గిరిని కాఠ్మాండూకి తరలించారు.

కొండలపైకెక్కి ప్రాణాలు కాపాడుకుని...
అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సందీప్ రాణా 100 మంది ఇతర సహచరులతో కలిసి కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఎమర్జెన్సీ సైరన్ మోగినప్పుడు తాను ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉన్నానని రాణా సోమవారం 'ది రైజింగ్ నేపాల్' పత్రికతో చెప్పారు.
సైరన్ మోగిన తర్వాత కార్మికులు తమకు నిర్దేశించిన అసెంబ్లీ పాయింట్ వద్దకు చేరుకోవడానికి ముందే 12 కిలోమీటర్ల ఎగువన ఉన్న ఆనకట్ట వద్దకు భారీ వరద వచ్చిందని వారికి సమాచారం అందింది.
ఆ తర్వాత ఆ బృందం మరింత ఎత్తుకు ఎక్కడం ప్రారంభించి చివరికి త్రిశూలి నదికి సుమారు 30 నుండి 35 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ప్రాజెక్ట్ కార్యాలయం, శిబిరాలు, రహదారులు వరద నీటిలో మునిగిపోవడాన్ని వారు చూశారు.
"మేము పైకి ఎక్కుతూ, పడుతున్న రాళ్లను తప్పించుకోవలసి వచ్చింది. ఆగి ఆలోచించే సమయమే లేదు" అని రాణా వార్తాపత్రికకు తెలిపారు.
ఆ బృందం ఏడెనిమిది గంటలు కొండపైకి ఎక్కుతూనే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గ్రాంగ్ ప్రాంతంలోని ఒక రహదారికి చేరుకున్నారు. కాళికాస్థాన్ చేరుకునే సమయానికి రాణాతో ఇద్దరు మాత్రమే మిగిలారు. మిగిలిన వారు దారి మధ్యలోనే తలో దిక్కుకు వెళ్లారు.
ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి రామచంద్ర. త్రిశూలి నది ఒడ్డున ఉన్న ఒక సొరంగంలోకి వరద నుంచి ఆయన బయటపడ్డారు. ఆయనతో పాటు మరో ఆరుగురు సొరంగం నుంచి బయటకు రావడానికి ఆయన కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నప్పుడు నీరు లోపలికి రావడం మొదలైంది.
కొట్టుకుపోకుండా తమను తాము కాపాడుకోవడానికి వాళ్లు సొరంగం పైకప్పుకు అమర్చిన ఇనుప నిచ్చెనను పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులు తమకు తాము నిలదొక్కుకోడానికి ఒక రేకును ఉపయోగించుకుని సుమారు ఆరు గంటలపాటు ఒక నిచ్చెన నుండి మరొక నిచ్చెనకు మారుతూనే ఉన్నారని రాతోపతి న్యూస్ పోర్టల్‌కు చెప్పారు రామచంద్ర.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































