రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు బీజేపీని ఇరకాటంలో పెడతాయా?

'రిజర్వేషన్ హటావో ఆందోళన్', రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ఇటీవల దిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి చర్చతో పాటు 'జై భీమ్' నినాదాలు కూడా వినిపించాయి.

ఆ ఉద్యమం జరిగిన కొద్ది రోజులకే అదే జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరో ఉద్యమం మొదలైంది.

'రిజర్వేషన్ హటావో ఆందోళన్' పేరుతో జరుగుతున్న ఈ నిరసన ప్రదర్శనలతో రిజర్వేషన్ల అంశం మరోసారి దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీకి ఇది కేవలం రిజర్వేషన్ పాలసీపై చర్చ మాత్రమే కాదు. ఆ పార్టీ రాజకీయంగా ఎదుర్కొంటున్న ఒక సవాల్ కూడా.

ఒకవైపు బీజేపీకి మద్దత్తిస్తున్న ప్రధాన వర్గం జనరల్ కేటగిరీ చాలా కాలంగా అసంతృప్తి ఉంది. మరోవైపు ఇతర వెనుకబడిన తరగతులు, అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో బీజేపీ తన సామాజిక మద్దతును ఈ కమ్యూనిటీల్లో విస్తరించుకుంది.

మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తన మద్దతుదారుల్లో ఒకవర్గాన్ని దూరం చేసుకోకుండా రిజర్వేషన్లపై వస్తున్న ఈ కొత్త డిమాండ్లను బీజేపీ ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న అసలైన సవాలు.

అన్‌రిజర్వ్‌డ్ కులాల డిమాండ్లను పరిష్కరిస్తూనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన పట్టును బీజేపీ నిలుపుకోగలదా? ఒక వర్గానికి భరోసా కల్పించే ప్రయత్నం మరోవర్గంలో అభద్రతా భావాన్ని సృష్టించే పరిస్థితి ఏర్పడుతుందా?

‘ది లెన్స్’ లో కలెక్టివ్ న్యూస్‌రూమ్‌ జర్నలిజం డైరెక్టర్‌ ముకేశ్ శర్మ ఈ అంశంపై మూడు కోణాల్లో నిపుణులతో చర్చించారు.

రాజకీయ కోణాలపై అమర్ ఉజాలా సీనియర్ జర్నలిస్ట్ హిమాన్షు మిశ్రాతో, దళితులకు రిజర్వేషన్లపై మొదలైన సామాజిక చర్చ గురించి దళితుల అంశాలపై రాసే కాలమిస్టు, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ అదితి నారాయణి పాసవాన్‌తో , రిజర్వేషన్లను తొలగించాలంటూ సాగిన ప్రచారం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశంపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బద్రీ నారాయణ్‌తో ముకేశ్ శర్మ చర్చించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రశ్న: బీజేపీ వ్యతిరేక ఉద్యమమా, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమమా?

ఈ ప్రశ్నకు హిమాన్షు మిశ్రా బదులిచ్చారు.

బీజేపీ ఒక కుల ఆధారిత వర్గాన్ని నిర్మించుకుంది. ఈ ధోరణి 2014లో మోదీ శకంతో మొదలైందని ఆయన అన్నారు. అంతకు ముందు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల వాటా దాదాపు 22 శాతం ఉండేదని, అది 37 శాతానికి పెరిగిందని మిశ్రా గుర్తు చేశారు. బీజేపీ తన సంప్రదాయ ఓటర్లైన అగ్రకులాలను దాటి తన మద్దతుని విస్తరించుకుందని చెప్పారు.

" మన ప్రయోజనాలను కాపాడేది బీజేపీ మాత్రమే అని అగ్ర కులాలు వారు అనుకున్నారు. కానీ బీజేపీ ఒక కులాల సమూహాన్ని ఏర్పాటు చేసినప్పుడు, తమను పక్కన పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వారు భావించడం ప్రారంభించారు. అందుకే దానికి గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారు"

మోదీ శకం ప్రారంభమైన తర్వాత బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్‌లో కదలిక కనిపించడం ఇదే తొలిసారనీ, ఈ విషయంలో ఏం చేయాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కొందరు జేపీ నడ్డాను కలిశారు. సమస్య ఏంటంటే, మెరిట్ ఆధారిత రిజర్వేషన్ల డిమాండ్‌కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు. బీజేపీ అలా చేస్తే ఓబీసీ ఓటు బ్యాంక్‌ను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

'రిజర్వేషన్ హటావో ఆందోళన్', రిజర్వేషన్లు
ఫొటో క్యాప్షన్, హిమాన్షు మిశ్రా

‘బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది’

‘‘ఇది పార్టీ కోణం. ఇప్పుడు నిరసనల్లో పాల్గొంటున్నవారు లేదా అగ్రకులాల వారి కోణాన్ని పరిశీలిద్దాం. వారి డిమాండ్లను బీజేపీ కాకపోతే మరెవరు పట్టించుకుంటారు? చివరికి వారు కూడా ఎక్కడో ఒకచోట తమ రాజకీయ నాయకత్వాన్ని వెతుక్కోవాల్సిందే. మరి ఈ ఉద్యమం కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించనుందా? లేక ఇది రాజకీయ ఉదాసీనతకు సంకేతమా?

పరిస్థితి చాలా వరకు ఉదాసీనంగానే ఉంది. దేశ జనాభాలో అత్యధికంగా ఉంది యువతే. కానీ దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు లేవు.

ఇప్పుడు నాణ్యమైన విద్యకు సంబంధించిన ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఉపాధికి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వీటిని అందిపుచ్చుకునే ప్రతిపక్ష నాయకుడు లేరు.

కాక్రోచ్ జనతా పార్టీ అయినా, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అయినా, వీటికి ఒక నాయకత్వం అంటూ లేకపోవడంతో ఈ అయోమయం కొనసాగుతుంది.

సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ఈ ఉద్యమం ఏ దిశగా వెళ్తుందో, లేదా దాని నుంచి ఉద్భవించిన రాజకీయ శక్తి ఏ దిశగా పయనిస్తుందో వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది.’’ అని మిశ్రా అన్నారు.

'రిజర్వేషన్ హటావో ఆందోళన్', రిజర్వేషన్లు
ఫొటో క్యాప్షన్, అదితి నారాయణి పాసవాన్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను తొలగించలేం: అదితీ పాసవాన్

'నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల నేను నష్టపోతున్నాను' అని ఒక జనరల్ కేటగిరీ యువకుడు ముందుకొచ్చి అంటే, ఆయనకి మీరేం బదులిస్తారు?

ఈ ప్రశ్నకు అదితి నారాయణి పాసవాన్ సమాధానమిచ్చారు.

‘‘దళిత సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారికి ఇకపై రిజర్వేషన్లు ఇవ్వకూడదని కొందరు భావిస్తున్నారు. అయితే ముందుగా 'ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు' అంటే ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంది. దానికి ఒక ప్రమాణాన్ని నిర్వచించాల్సి ఉంది’’ అని అదితీ అన్నారు.

ఎస్సీలు, ఎస్టీలకు వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు లభించలేదని ఆమె చెప్పారు. ఒకవేళ రిజర్వేషన్లను తొలగించడం గురించి మాట్లాడితే, అది ఆర్థిక పరిస్థితిపై ఆధారపడకూడదని, దానిని దాటి ఆలోచించాల్సి ఉంటుందని చెప్పారు. సమాజంలో వారి స్థానం, గౌరవం, ప్రాతినిధ్యం, న్యాయం గురించి మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. చర్చించాల్సిన అంశాలు, ప్రమాణాలు చాలా ఉన్నాయని చెప్పారు.

'అగ్రకులాలపై రిజర్వేషన్ల ప్రభావం పడుతోంది' అన్న అంశంపై ఆమె స్పందించారు.

"మీరు పేద వర్గానికి చెందినవారైతే, ప్రభుత్వం మీ కోసం ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఏర్పాటు చేసింది. మీరు ఆ కేటగిరీలో పోటీ చేయాలి. మీరు మా కేటగిరీలోకి రారు. మనమంతా మనకు కేటాయించిన కేటగిరీల్లోనే పోటీ పడుతున్నాం" అని అన్నారు.

‘‘ఈ రోజు ఒక యువకుడినో యువతినో ఒక దళిత ఐఏఎస్ అధికారి ఉన్నారు, తనను పెళ్లి చేసుకోవడానికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా? అని అడిగి చూడండి...వారి సమాధానమేంటో మీకు తెలిసే ఉంటుంది.

కులాల మధ్యే కొన్ని ఉపకులాలు ఎక్కువ అభివృద్ధి చెందగలిగే పరిస్థితి ఉంటే దాన్ని ఎలా పరిష్కరిస్తారు?

దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు అదితీ.

"బిహార్‌లోనే ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాల్లో 25 నుంచి 27 ఉపకులాలు ఉన్నాయి. వాటిలో ముషహర్, భూయన్ లేదా పాసావాన్ వంటి కొన్ని కులాలకు గణనీయమైన రాజకీయ ప్రాతినిధ్యం ఉంది. అదే సమయంలో ఇతర సముదాయాలకు ఆ ప్రాతినిధ్యం లేదు."

‘‘దీనిపై ఒక అధ్యయనం చేయాలి. ఒక శ్వేతపత్రాన్ని సిద్ధం చేయాలి. ఆ తర్వాత మన సమాజం ఏ స్థాయిలో, ఏ ప్రమాణాల మేరకు సాధికారత పొందిందో, ఇంకా ఎక్కడ వెనుకబడి ఉందో గుర్తించాలి’’

‘‘ఈ దేశంలోని అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్లు అణగారిన వర్గాల నుంచే వస్తున్నారని మీరు అనుకుంటున్నారా? న్యూస్‌రూమ్‌లలో కూర్చున్నవారు ఈ వర్గాల నుంచే వస్తున్నారా? మేం ప్రయోజనాలు పొందుతున్నామని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ దళితులుగా మేం కేవలం ప్రయోజనాలు పొందేవారిగానే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం" అన్నారు అదితీ.

'రిజర్వేషన్ హటావో ఆందోళన్', రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

"మాకు సానుభూతి వద్దు. సమానత్వం కావాలి"

ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన యూజీసీ నిబంధనలు అసంతృప్తికి, రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి దారితీశాయని చెబుతున్నారు. అగ్రకులాల ఆందోళనలు సమర్థించదగినవేనా?

అదితి దీనికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు: ఎంతమాత్రం కాదు.

దళిత విద్యార్థులు పీహెచ్‌డీ థీసిస్‌లను సమర్పించడం తరచుగా ఎనిమిదేళ్ల వరకు పడుతుందని ఆమె చెప్పారు. ఈ జాప్యం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని అన్నారు. పీహెచ్‌డీ పూర్తి చేయలేకపోతే వారి ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు.

"ఇంటర్వ్యూల్లో మా వర్గానికి చెందినవారు ఎప్పుడూ తక్కువ మార్కులు సాధిస్తారని మీరు గమనించే ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇంగ్లిష్‌ మాట్లాడటంలో లోపమా? లోపం ఎక్కడ ఉంది? మేము ఏ అంశంలో మెరుగుపడాలో తెలియజేయకపోతే ఎలా?

యూజీసీ నోటిఫికేషన్‌లో కులం ఆధారంగా ఎవరైనా వివక్షకు గురవుతున్నామని భావిస్తే, ఫిర్యాదు చేసేందుకు ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు కదా అని అడిగినప్పుడు...

"ప్రతి అంశానికి ఒక పరిష్కార వ్యవస్థ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని యూజీసీ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఆ కమిటీలో కాలేజీ ప్రిన్సిపాల్, ఆ కళాశాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు, కళాశాల పాలక మండలి సభ్యులు ఉంటారు.

అంటే అన్ని వర్గాలకు చెందినవారు అక్కడ కూర్చుని ఇలాంటి కేసులను వింటారు. కాబట్టి ఎవరూ ఒకరిని తప్పుడు కేసులో ఇరికించలేరు" అని అదితీ పాసవాన్ అన్నారు.

'రిజర్వేషన్ హటావో ఆందోళన్', రిజర్వేషన్లు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ బద్రీ నారాయణ్

'ప్రజాస్వామ్యం బలహీనపడింది': ప్రొఫెసర్ బద్రీ నారాయణ్

కులం, దాని సమీకరణ, సంఘీభావంపై మీరు చాలా పరిశోధన చేశారు. రిజర్వేషన్ హటావో ఉద్యమం వంటి పరిణామాల్లో ఏవైనా కొత్త సామాజిక సమీకరణాలు కనిపిస్తున్నాయా?

ఈ ప్రశ్నకు, సామాజిక వర్గాలపై క్షేత్రస్థాయిలో ఉన్న అవగాహన చాలా మారిపోయిందన్నారు ప్రొఫెసర్ బద్రీ నారాయణ్.

"గతంలో సొంత భూమి ఉన్న వర్గాల్లో అగ్రకులాలే ఉండేవి. కానీ గత 20 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలోని భూ రికార్డులను పరిశీలిస్తే, అనేక ఓబీసీ వర్గాలు సాధికారత పొందినట్లు కనిపిస్తుంది. భూమి వారి చేతుల్లోకి కూడా వచ్చింది."

"రెండో మార్పు ఏంటంటే, ఆధునికత రాకతో కులవివక్ష తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఆధునికత చాలా మార్పులను తీసుకొచ్చింది. ఒకవైపు ప్రజాస్వామ్యం కులాన్ని బలహీనపరిచింది. మరోవైపు ఎన్నికల ప్రజాస్వామ్యం కులాన్ని బలోపేతం చేసింది. ఇది ఒక పెద్ద వైరుధ్యం" అన్నారాయన.

ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అవగాహన సామాజికమైనదేనా? లేక రాజకీయ గుర్తింపుకి ఆవిర్భావమా?

రోజువారీ జీవితంలో కులం బలహీనపడిందన్నారు బద్రీ నారాయణ్. ‘‘నేడు అంటరానితనం ఏ స్థాయిలో ఉందో చూడండి, అది ఎంత తగ్గిపోయిందో గమనించండి. ప్రజలు కలిసి భోజనం చేస్తున్నారు. కులాంతర వివాహాలు కూడా ప్రారంభమయ్యాయి’’ అని ఆయన అన్నారు.

"కొత్త తరం, మనం జెన్-జెడ్ అని పిలిచే తరం, చాలా విషయాలను నమ్మదు. రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం వారు తమ స్నేహితులతో ఉన్నప్పుడు కులం ప్రభావం చూపదు. కానీ రాజకీయ అంశం వచ్చిన వెంటనే, కులం తెరపైకి వస్తుంది" అన్నారాయన.

రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమంలో 'మెరిట్' అనే పదం పదేపదే వినిపిస్తోంది. ఈ మొత్తం ఉద్యమాన్ని, ఈ మొత్తం వ్యవస్థను మెరిట్ ఎలా నిర్వచిస్తుంది?

ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ ప్రకారం, మెరిట్ అనేది చాలా సాపేక్షమైన పదం. కొన్ని ప్రాంతాల్లో మెరిట్‌ను వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మెరిట్‌కు కులంతో తప్పనిసరిగా పెద్దగా సంబంధం ఉండాల్సిన అవసరం లేదన్నారు. మెరిట్ అనేది వ్యక్తిగత సామర్థ్యానికి సంబంధించిన అంశం కూడా. ఇలాంటి విషయాల్లో మెరిట్ ప్రధానమైన అంశం కాకపోవచ్చని చెప్పారు.

"సమస్య అసమానత. పెరుగుతున్న అసమానత. అసమానతకు కొత్త అర్థాలు వస్తున్నాయి. సమాజం ఒకేలా ఉండదు కాబట్టి అది నిరంతరం మారుతూనే ఉంటుంది" అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)