‘దేవతలతో మాట్లాడతాను’ అని చెప్పుకునే నార్వే యువరాణికి సింహాసనం ఎందుకు దక్కలేదు?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల మరణించిన నార్వే దివంగత రాజు హెరాల్డ్5 పెద్ద కూతురే యువరాణి మార్తా లూయిస్.
అయితే కింగ్ హెరాల్డ్5 మరణం తర్వాత ఆ సింహాసనానికి ఆమె వారసురాలైనప్పటికీ ఆమె తమ్ముడు హాకాన్8 నార్వేకి రాజయ్యారు.
కింగ్ హెరాల్డ్ 5 మరణవార్తతో దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గాహర్ స్టోర్ ప్రకటించారు.
రాజుగా బాధ్యతలు స్వీకరించిన హాకాన్, తన తండ్రి, తాత, ముత్తాతలు ఉపయోగించిన "ఆల్ ఫర్ నార్వే" అనే నినాదాన్నే తాను కూడా కొనసాగిస్తానని ప్రకటించారు.
సంతానంలో పెద్ద అయిన మార్తా లూయిస్ రాణి కావాల్సి ఉండగా, ఆమె గతంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఆమెను రాజకుటుంబానికి దూరమయ్యారు.

2022లో ఆమె తన అధికారిక రాజరికం విధులను వదులుకున్నారు. తన భర్త, వివాదాస్పద స్వయం ప్రకటిత షమన్ (తాంత్రికుడు) డ్యూరెక్ వెరెట్‌తో కలిసి ప్రత్యామ్నాయ వైద్య రంగం (మంత్ర తంత్రాలతో)పై దృష్టి పెట్టేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజా జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన తేడా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అధికారిక విధులకు దూరమైనప్పటికీ 'ప్రిన్సెస్' హోదాను అలాగే ఉంచుకున్నారు.
క్యాన్సర్ అనేది మనుషులు స్వయంగా ఎంచుకునే జబ్బు అని మార్తా లూయిస్ భర్త వెరెట్ చేసిన వ్యాఖ్యలు, శాస్త్రీయ ఆధారాలులేని ఆయన వైద్య పద్ధతులు నార్వేలో తీవ్ర వివాదాన్ని రేపాయి.

ఫొటో సోర్స్, Getty Images
పురుషాధిక్య వారసత్వ చట్టం
మార్తా లూయిస్ రాజరికం వదులుకోవడానికి ముందే, ఆమె సింహాసనాన్ని అధిష్టించే అవకాశం లేకుండా పోయింది.
ఆమె 1971లో జన్మించినప్పుడు నార్వేలో పురుషాధిక్య వారసత్వ చట్టం అమల్లో ఉండేది. దీని ప్రకారం అక్కల కంటే తమ్ముళ్లకే సింహాసనంపై హక్కు ఉంటుంది.
మహిళలకు కూడా సమాన వారసత్వ హక్కులు కల్పిస్తూ 1990లో నార్వే రాజ్యాంగాన్ని సవరించారు.
అయితే ఈ మార్పును పాత వారికి కాకుండా, భవిష్యత్తు తరాలకే వర్తింపజేశారు.
దీంతో హాకాన్ వారసత్వ హక్కుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.
అయితే ఈ కొత్త చట్టం వల్ల హాకాన్ కుమార్తె, క్రౌన్ ప్రిన్సెస్ ఇంగ్రిడ్ అలెగ్జాండ్రాకు భవిష్యత్తులో నార్వేకు రాణి అయ్యే అవకాశం లభించింది.
15వ శతాబ్దం తర్వాత నార్వేకు ఆమె తొలి రాణి కానున్నారు.

ఫొటో సోర్స్, Corbis via Getty Images
'ప్రిన్సెస్'పై విమర్శలు, వివాదాలు
ప్రస్తుతం 54 ఏళ్ల మార్తా లూయిస్ దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల(నాటువైద్యం లేదా మంత్రతంత్రాలతో చేసేవి)ను ప్రచారం చేస్తూ వివాదాల్లో నిలిచారు.
ప్రజలు తమ ‘రక్షక దేవతల’తో మాట్లాడటానికి సాయపడేందుకు ఆమె ఒక స్కూల్ ఆమె స్థాపించారు.
వ్యక్తిగత వ్యాపారాల కోసం ఆమె 'రాజకుమారి' హోదాను వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
ఆమెకు 2002లో నార్వేకు చెందిన రచయిత అరి బెహ్న్తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. 2017లో వీరు విడాకులు తీసుకున్నారు.
తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడిన అరి బెహ్న్ 2019లో క్రిస్మస్ రోజున ఆత్మహత్య చేసుకున్నారు.
2013లో స్పానిష్ న్యూస్ పేపర్ ఏబీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మార్తా లూయిస్ మాట్లాడుతూ తనకు "దివ్యదృష్టి" ఉందని చెప్పారు.
"నేను భవిష్యత్తును చూడలేను, కానీ అవతలి వ్యక్తిలోని శక్తులను గ్రహించగలను. స్టేజ్ మీద మాట్లాడేందుకు భయపడే అమ్మాయి నుంచి ఆత్మ విశ్వాసం ఉన్న మహిళగా నేను ఎదిగాను. రోజూ నాతో మాట్లాడే రక్షక దేవతను కలిశాకే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది" అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తాంత్రికుడితో వివాహం
జూన్ 2022లో ఆమె డ్యూరెక్ వెరెట్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. తాము ప్రేమలో ఉన్నట్లు 2019లోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.
"నన్ను విమర్శించాలనుకునే వారు దయచేసి దూరంగా ఉండండి. నా జీవితాన్ని నిర్ణయించే హక్కు మీకు లేదు. డ్యూరెక్ నేను ఇష్టపడే వ్యక్తి" అని ఆమె అప్పట్లో ఇన్‌స్టా పోస్టులో రాశారు.
అయినప్పటికీ వీరిద్దరిపై నార్వేలో తీవ్ర విమర్శలు వచ్చాయి. వెరెట్ను ఒక మోసగాడిగా, కుట్ర సిద్ధాంతకర్తగా ప్రజలు భావించారు.
నార్వే మాజీ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ కూడా ఆయన ఆలోచనలను "చాలా వింతైనవి, వాస్తవాలకు దూరంగా ఉన్నవి" అని విమర్శించారు.
ఆరో తరం షమన్(తాంత్రికుడు)నని చెప్పుకునే ఆఫ్రికన్-అమెరికన్ డ్యూరెక్ వెరెట్, తాను చనిపోయి బతికి వచ్చానని, అమెరికాపై జరిగిన 9/11 దాడులను రెండేళ్ల ముందే ఊహించానని చెప్పుకుంటారు.
నార్వేలో తనపై వస్తున్న విమర్శలకు తన చర్మం రంగు కూడా ఒక కారణమని, ఇంతటి వర్ణవివక్షను తాను ఎప్పుడూ చూడలేదని ఆయన ఆరోపించారు. తనను తాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్లతో పోల్చుకున్నారు.
హాలీవుడ్ నటీమణులు గ్వినేత్ పాల్ట్రో, నినా డోబ్రెవ్లు తన పద్ధతుల వల్ల ప్రభావితమయ్యారని ఆయన తన వెబ్సైట్లో రాసుకున్నారు.
2022 సెప్టెంబర్‌లో జరిగిన ఒక సర్వే ప్రకారం మార్తా లూయిస్ అధికారిక కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించడానికి అర్హురాలని కేవలం 13శాతం మంది నార్వే ప్రజలు మాత్రమే భావించారు.
ఆమె వ్యక్తిత్వం కంటే, ఆమె నమ్ముతున్న ఈ వింత శక్తుల వల్లే ప్రజలు ఆమెను వ్యతిరేకిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























