బ్యూటీ ఇండస్ట్రీని జెన్ జడ్ శాసిస్తోందా?

సౌందర్య పరిశ్రమ, అంతర్జాతీయ కంపెనీలు, యువత, జెన్ జెడ్, అందం

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భారతీయ సౌందర్య ఉత్పత్తులు, బ్రాండ్‌లపై ఇటీవల అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకు ఆసక్తి పెరిగింది.

అమెరికాకు చెందిన లగ్జరీ కాస్మెటిక్స్ కంపెనీ ఎస్టీ లాడర్ ఈ ఏడాది మార్చిలో భారతీయ ఆయుర్వేద బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌ను పుర్తిగా కొనుగోలు చేసింది.

ఆ తర్వాత జూన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ గ్రూప్ కూడా డిజిటల్ పర్సనల్ కేర్ బ్రాండ్ ఇన్నోవిస్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

యూనిలివర్ కూడా రెండేళ్లలో తన వెంచర్ క్యాపిటల్ విభాగం ద్వారా భారత్‌లోని బ్యూటీ కంపెనీలలో కనీసం నాలుగు పెట్టుబడులు పెట్టింది.

ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి అయిన మీరా కులకర్ణి హిమాలయాల సమీపంలో ఒక గ్యారేజీలో చిన్న వ్యాపారంగా ఫారెస్ట్ ఎసెన్షియల్‌ను ప్రారంభించారు. రెండు దశాబ్దాల్లో ఆ సంస్థ ఓ స్టార్టప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంచేసే బిలియన్ డాలర్ల విలువైన సౌందర్య ఉత్పత్తుల సంస్థగా ఎదిగింది. భారత బ్యూటీ పరిశ్రమ ఎంత వేగంగా పెరిగిందో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఎదుగుదల ప్రతిబింబిస్తుంది. 2025లో భారత బ్యూటీ పరిశ్రమ విలువ సుమారు 23 బిలియన్ డాలర్లు(సుమారు 2.20 లక్షల కోట్ల రూపాయలు)గా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఒకప్పుడు సబ్బు, పౌడర్ మాత్రమే’

ఈ దశాబ్దం చివరి నాటికి బ్యూటీ పరిశ్రమ దాదాపు రెట్టింపు అయి 40 బిలియన్ డాలర్లకు (సుమారు 3.83 లక్షల కోట్ల రూపాయలకు) చేరుకుంటుందని అంచనా. ఈ పరిశ్రమ దేశ జీడీపీ, రిటైల్ మార్కెట్ వృద్ధి రేటు కంటే దాదాపు రెట్టింపు వేగంతో పెరుగుతోంది.

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కూడా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ వృద్ధికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

2019లో భారత తలసరి ఆదాయం లక్ష 90 వేల రూపాయలు దాటిందని బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. ఆ స్థాయిని దాటి తర్వాత ప్రజలు నిత్యావసరాలు

కాకుండా అవసరం లేని వస్తువులపై చేసే ఖర్చు వేగంగా పెరుగుతుంది.

2030 నాటికి భారత్‌లో సుమారు 15.5 కోట్ల కుటుంబాల వార్షిక ఆదాయం 9 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇది బ్యూటీ మార్కెట్ వృద్ధికి మరింత ఊతమిస్తుంది.

"భారతీయులు గతంలో సౌందర్య ఉత్పత్తులపై చాలా తక్కువ ఖర్చుపెట్టేవారు. ఎందుకంటే సబ్బు లేదా ఫేస్ పౌడర్ వంటి ప్రాథమిక వస్తువులు మినహా మరేమీ కొనగలిగేటంత ఆర్థిక స్తోమత ప్రజలకు ఉండేది కాదు''

''కానీ ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. దాంతో పాటు సౌందర్య ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకొస్తున్నాయి. వాటి గురించి ప్రజలకు ఎక్కువగా తెలుస్తోంది. ఈ ఉత్పత్తులు ప్రజలకు చేరడాన్ని ఇంటర్నెట్ సులభతరం చేసింది. సోషల్ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సహాయంతో బ్రాండ్‌లు నేరుగా వినియోగదారుల వద్దకు వెళ్తున్నాయి'' అని అని రెడ్‌సీర్ పార్టనర్ కుశాల్ భట్నాగర్ బీబీసీతో చెప్పారు.

రెడ్‌సీర్ అంచనాల ప్రకారం 2030 నాటికి సౌందర్య ఉత్పత్తులపై జరిగే మొత్తం ఖర్చులో సుమారు 35 శాతం ఇ-కామర్స్ ద్వారా జరుగుతుంది. ఐదేళ్ల క్రితం ఇది కేవలం ఎనిమిది శాతం.

సౌందర్య పరిశ్రమ, అంతర్జాతీయ కంపెనీలు, యువత, జెన్ జెడ్, అందం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కామర్స్, పెరుగుతున్న ఆదాయాలు, యువత ఎక్కువగా ఉండడం బ్యూటీ పరిశ్రమ వృద్ధికి కారణమవుతున్నాయి.

బాలీవుడ్ ప్రముఖుల భారీ పెట్టుబడులు

కరోనా మహమ్మారి బ్యూటీ పరిశ్రమలో భారీ మార్పు తీసుకొచ్చిందని వైశాలి గుప్తా చెప్పారు. కోవిడ్ కాలంలో ప్రారంభించిన ఆమె రెండు బ్యూటీ కంపెనీలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి.

ఆమె 2023లో బాలీవుడ్ నటి కృతి సనన్‌తో కలిసి 'హైఫన్' అనే వెగన్ స్కిన్‌కేర్ కంపెనీని ప్రారంభించారు. స్క్రబ్‌లు, ఫేస్ వాష్‌లు, లోషన్‌ల వంటి ఉత్పత్తులను తయారు చేసే ఎం- కెఫైన్ కంపెనీని కూడా ఆమె నడుపుతున్నారు. భారత తొలి కెఫైన్ ఆధారిత పర్సనల్ కేర్ బ్రాండ్‌గా ఎంసీ కెఫైన్ చెప్పుకుంటుంది.

"కరోనా కాలంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అదే సమయంలో టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ సేవలు భారీగా విస్తరించాయి. దీంతో భారతీయ వినియోగదారులకు ఇంతకుముందులేని బ్యూటీ, స్కిన్ కేర్ సమాచారం ఒక్కసారిగా అందుబాటులోకొచ్చింది.

కొరియా లేదా యూరప్‌లో ఏ సౌందర్య పోకడలు ట్రెండింగ్‌లో ఉన్నాయి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి లేదా మొటిమలను తగ్గించడానికి ఏ పదార్థాలు ఉపయోగపడతాయి వంటి విషయాలు వారికి తెలిశాయి'' అని వైశాలీ గుప్తా బీబీసీతో చెప్పారు.

''ఈ సమాచారం వల్ల వినియోగదారులు తమకు నిజంగా ఏమి కావాలో అర్థమయింది. అప్పటి నుంచి భారత్‌లో స్కిన్ స్కేర్ ఇండస్ట్రీ భారీగా పెరగడం అక్కడినుంచే మొదలయింది'' అని ఆమె తెలిపారు.

గత ఏడాదిలో గుప్తా బ్రాండ్‌ల మొత్తం అమ్మకాలు వంద శాతం పెరిగాయి. ఇకముందు కూడా రెండంకెల స్థాయిలో మంచి వృద్ధి ఉంటుందని ఆమె అంచనావేస్తున్నారు.

హైఫెన్, ఎం- కెఫైన్ రెండు బ్రాండ్‌లు తమ విభాగాల్లో ఇప్పుడు భారత్‌లో టాప్ 10 బ్రాండ్‌లలో ఉన్నాయని ఆమె చెబుతున్నారు.

"ఇది దీర్ఘకాలికంగా కొనసాగే వృద్ధి. ఈ మార్కెట్ ఇంకా చాలా పెద్దగా మారే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఆ వృద్ధి ప్రారంభదశలో ఉన్నాం'' అని వైశాలి గుప్తా తెలిపారు.

అందుకే దీపికా పదుకునే, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి వంటి పలువురు బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు ఇటీవలి సంవత్సరాల్లో స్కిన్ కేర్ కంపెనీలను ప్రారంభించడంలో ఆశ్చర్యం లేదు.

సౌందర్య పరిశ్రమ, అంతర్జాతీయ కంపెనీలు, యువత, జెన్ జెడ్, అందం

ఫొటో సోర్స్, m-caffeine

ఫొటో క్యాప్షన్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఎం-కెఫైన్‌లో పెట్టుబడులు పెట్టారు.

జెన్ జడ్ ప్రభావం ఎలా పెరిగింది?

బ్యూటీ ఉత్పత్తుల వినియోగదారుల సంఖ్య దేశంలోని అన్నిప్రాంతాల్లో పెరుగుతోంది. ఈ డిమాండ్ పెద్ద నగరాలకే పరమితం కాలేదు.

ఈ వృద్ధికి ప్రధాన కారణం జెన్-జడ్ అని వైశాలీ గుప్తా అభిప్రాయపడుతున్నారు. మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్-జడ్‌ చర్మ సంరక్షణ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై దాదాపు రెండింతలు ఖర్చు చేస్తున్నారు.

వాల్‌మార్ట్‌కు చెందిన భారత్‌లో అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లిప్‌కార్ట్ డేటా ద్వారా కూడా ఇది స్పష్టమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులు కొనేవారిలో సుమారు 56 శాతం మంది జెన్-జెడ్‌కు చెందినవారు ఉన్నారు. వారిలో 70 శాతం మంది యువత తాము కొనే ఉత్పత్తుల గురించి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో సౌందర్య ఉత్పత్తుల కోసం జరిగే ప్రతి మూడు సెర్చ్‌లలో రెండు ప్రధాన నగరాల వెలుపలినుంచే వస్తున్నాయి.

సౌందర్య ఉత్పత్తులపై చేసే మొత్తం ఖర్చులో జెన్-జెడ్, జెన్-ఆల్ఫా వాటా 2024లో 32 శాతం ఉండగా 2030 నాటికి సుమారు 50 శాతానికి పెరుగుతుందని రెడ్‌సీర్ తెలిపింది.

ఇది కీలకమైన మార్పుదశ అని ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండ్ స్ట్రాటజీ, ఇన్‌సైట్స్ విభాగం అధిపతి ప్రియాంక భార్గవ్ చెప్పారు.

ఒకప్పుడు భారత్‌లో యువతకు సౌందర్య ఉత్పత్తులు కొనడం కేవలం ఓ కోరిక. ఇప్పుడు రోజువారీ స్వీయ సంరక్షణలో అవో భాగంగా మారాయని ఆమె చెప్పారు.

మార్కెట్ మరింత పెరిగే కొద్దీ వినియోగదారులకు అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.

తర్వాతి దశలో కొన్ని ప్రత్యేక పదార్థాలతో కొత్త ఉత్పత్తులు తయారుచేసే చిన్న బ్రాండ్లు, చర్మ వైద్యుల సలహాతో తయారయ్యే ఉత్పత్తులు, చర్మానికి పోషణ అందించే ఉత్పత్తులు ఈ రంగం వృద్ధికి ప్రధాన కారణాలవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటివరకు కొన్ని బ్యూటీ బ్రాండ్‌లు మాత్రమే పెద్ద స్థాయికి ఎదిగాయి. అయితే ఇదే వేగంతో వృద్ధి కొనసాగితే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కనీసం పది నుంచి పదిహేను బ్యూటీ కంపెనీలు

200 మిలియన్ డాలర్లు (సుమారు19,000 కోట్లరూపాయలు) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని రెడ్‌సీర్‌కు చెందిన కుశాల్ భట్నాగర్ చెప్పారు.

''ఇలాంటిది జరిగితే చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లోకి వస్తాయని మేం భావిస్తున్నాం. ఈ రంగంలో ఐపీవోలు(ప్రాథమిక షేర్ల విక్రయం), ఎంఅండ్ఏ(కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు)కార్యకలాపాలు కూడా భారీగా పెరుగుతాయి'' అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)