‘మా ముందున్న బస్సు మీద సుమారు 40 అడుగుల మేర బురద పేరుకుపోయింది’.. నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పి.శివశంకర్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
‘ముందున్న బస్సును సుమారు నలభై అడుగుల ఎత్తు వరకు బురద కప్పేసింది’ అని తమిళనాడు నుంచి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన తిరుచ్చికి చెందిన కర్పగం చెప్పారు.
నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో వివిధ దేశాలకు చెందిన పర్యటకులు చిక్కుకుపోయారు.
తమిళనాడు నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వందమందికి పైగా ప్రయాణికుల్లో కొందరు నేపాల్‌లో సురక్షితంగా ఉన్నట్టు భారత విదేశాంగమంత్రిత్వశాఖ తెలిపింది.
వరదలనుంచి సురక్షితంగా బయటపడ్డ కొందరితో ‘బీబీసీ తమిళ్’ మాట్లాడింది. వరదతీవ్రతను ప్రత్యక్షంగా చూసిన వారు అప్పటి పరిస్థితులను వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ వరద నష్టం
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోశి నది వరదల కారణంగా మరణించిన సంఖ్య 500 దాటినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.
ఇంకా చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన వంద మందికి పైగా ప్రయాణికులు వరదల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందున్న బస్సుపై 40 అడుగుల ఎత్తున బురద
"మేం డ్రైవర్ సీటువైపు నుంచి బయటకు రావడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాం" అని తిరుచ్చి జిల్లాకు చెందిన వరద బాధితురాలు కర్పగం చెప్పారు.
కైలాస్ మానస సరోవర యాత్ర చేపట్టిన తమిళనాడుకు చెందిన 57 మందిలో కర్పగం ఒకరు. కుంభకోణంలోని ఏజెన్సీ ద్వారా 57మందితో కలిసి ఆమె నేపాల్ వెళ్లారు.
"తమిళనాడు నుంచి వెళ్లిన మేం మూడు బస్సుల్లో ప్రయాణించాం. వరదలు సంభవించిన సమయంలో మా ముందున్న బస్సును బురద ముంచేయడాన్ని మా కళ్లారా చూశాం. మా వెనుక ఉన్న బస్సుకు ఏమైందో తెలియదు" అని చెప్పారు.
మధ్యలో ఉన్న తమ బస్సు మాత్రమే సురక్షితంగా ఉందని కర్పగం తెలిపారు.
"సుమారు 30 నుంచి 40 అడుగుల ఎత్తువరకు ఎగసిన బురద ఆ బస్సును పూర్తిగా ముంచేసింది" అని వణుకుతున్న గొంతుతో కర్పగం చెప్పారు.
"ఆ బస్సులోని ప్రయాణికుల పరిస్థితి ఏంటో మాకు తెలియదు" అని అన్నారు.
"మధ్యలో ఉన్న మా బస్సులో ప్రయాణికులు చురుగ్గా స్పందించి డ్రైవర్ సీటు వైపు నుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న పోలీస్ రెస్క్యూ సెంటర్‌కు వెళ్లడం వల్లే మేం ప్రాణాలతో బయటపడ్డాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'రెండు రోజులుగా ఆహారం లేదు'
"రెండు రోజులుగా మాకు ఆహారం లేదు. మేమింకా పూర్తిగా బయటపపడలేదు" అని నేపాల్‌లోని త్రిశూలి శిబిరంలో ఉన్న తమిళనాడుకు చెందిన శివరంజని అన్నారు.
నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల త్రిశూలి నది పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
" వరద ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. మాకు ముందుగా విశ్రాంతి కావాలి. మేం క్షేమంగానే ఉన్నాం. కానీ పూర్తిగా కోలుకోలేదు" అని ఆమె అన్నారు.
"రెండు రోజులుగా మాకు ఆహారం లేకపోవడంతో ఏది దొరికితే అతి తిన్నాం. మేం శిబిరంలో ఉంటున్నాం. సిబ్బంది చేతనైన సాయం చేశారు" అని చెప్పారు.
తమను కాఠ్మాండూకు తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోందని శివరంజని అన్నారు.
‘సమాచారం అందించే అవకాశం లేదు’
"మేం భారత రాయబార కార్యాలయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక్కడి నుంచి భారత్‌కు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం" అని చిదంబరానికి చెందిన త్యాగరాజన్ చెప్పారు. వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ 21 మందిలో త్యాగరాజన్ ఒకరు. నేపాల్ నుంచి ఆయన బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు.
విద్యుత్, టెలికమ్యూనికేషన్ కనెక్షన్లకు తీవ్ర అంతరాయం కలగడంతో ఎవరినైనా కాంటాక్ట్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























