టిబెట్ నుంచి కైలాస మానస సరోవర యాత్ర ఎందుకంత కష్టం? దారిలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?

ఫొటో సోర్స్, Krishna Adhikari
నేపాల్‌లోని భోటేకోశి, త్రిశూలి నదులలో సంభవించిన వరదలు కొండచరియల విపత్తు కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అనేకమంది ఇబ్బందులలో చిక్కుకున్నారు.
భారత్‌కు చెందిన సుమారు 300 మంది సహా వందలమంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.
మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించామని, వారు సురక్షితంగా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గురించి ఎలాంటి సమాచారం లేదని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ బుధవారం చెప్పారు.
"34మంది పురుషులు, 46 మంది మహిళలతో సహా మొత్తం 80 మంది మరికొందరు వలంటీర్లతో కలిసి సమీపంలోని హోటళ్లలో బస చేస్తున్నారు. విధ్వంసం తీవ్రత వల్ల పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. వాళ్ల గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు" అని జగ్గీ వాసుదేవ్ అన్నారు.

ఈశా ఫౌండేషన్ గ్రూపులో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, భారత్ సహా 19 దేశాలకు చెందిన భక్తులు ఉన్నారు. గిరాంగ్ వెళ్లేందుకు జగ్గీ వాసుదేవ్ అధికారులను అనుమతి కోరారు.
గిరాంగ్ కౌంటీ సరిహద్దు.. చైనా- నేపాల్ మధ్య పర్యటకుల రాకపోకలకు ప్రధాన ప్రవేశ మార్గం. ఇక్కడ సుమారు 4వేల మంది నివసిస్తున్నారు.
టిబెట్ గుండా ప్రవహించే నదిలో బుధవారం ఉదయం ఆకస్మికంగా సంభవించిన వరద కారణంగా నేపాల్‌లోని రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాలు ప్రభావితమయ్యాయి.
కైలాస మానస సరోవరానికి వెళ్లే ప్రధాన మార్గాలలో ఒకటైన రసువా జిల్లాలో ఆకస్మిక వరద వల్ల రోడ్లు, వంతెనలు, రవాణా మార్గాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కైలాస మానసరోవర్‌కు మార్గాలు
సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరానికి హిందూ, బౌద్ధ, జైన మతాలలో ప్రాముఖ్యత ఉంది. ఏటా వందల మంది యాత్రికులు వీటిని సందర్శిస్తారు.
భారత ప్రభుత్వం ప్రతీ ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కైలాస్ మానస సరోవర్ యాత్రను రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిర్వహిస్తోంది.
రెండు మార్గాలలో (లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్ ), నాథులా పాస్ (సిక్కిం) జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కైలాస మానససరోవర యాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
లిపులేఖ్ పాస్, నాథులా నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రను ఏ ప్రైవేట్ సంస్థ కూడా నిర్వహించదు.
లిపులేఖ్ కనుమ (ఉత్తరాఖండ్) మీదుగా వెళ్లే మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉండగా, నాథు లా పాస్ మీదుగా వెళ్లే మార్గంలో సుమారు 36 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల నిర్వహించే మూడో మార్గం కాఠ్‌మాండూ నుంచి మొదలవుతుంది. ఈ మార్గం కాఠ్‌మాండూ నుంచి నేపాల్‌గంజ్‌కు చేరుకుని ఆపై భూమార్గంలో టిబెట్‌కు ప్రయాణిస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
నేపాల్ మీదుగా రెండు ప్రైవేట్ మార్గాలు
నేపాల్ నుండి కైలాస్ మానస సరోవర్‌కు వెళ్లే మార్గం కాఠ్‌మాండూ నుంచి మొదలై ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు నడిపే రోడ్డు లేదా హెలికాప్టర్ మార్గాల ద్వారా టిబెట్‌కు చేరుకుంటుంది.
టిబెట్‌లోని గైరాంగ్, నేపాల్‌లోని రసువా మీదుగా వెళ్లే రోడ్డు మార్గానికి సుమారు 10 నుండి 14 రోజులు పడుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం చెబుతోంది.
ఈ ప్రయాణం కాఠ్‌మాండూ నుంచి సరిహద్దు చెక్‌పాయింట్ వరకు రోడ్డు మార్గంలో చేరుకుని అక్కడి నుండి టిబెట్‌లోని డార్చెన్‌కు కొనసాగుతుంది. డార్చెన్ నుండి కాలినడకన ట్రెక్ ప్రారంభమవుతుంది.
హెలికాప్టర్ మార్గం నేపాల్‌గంజ్- సిమికోట్/హిల్సా మీదుగా వెళుతుంది.
దీనికి సుమారు 5 నుండి 11 రోజుల సమయం పడుతుంది. ఇందులో భాగంగా కాఠ్‌మాండూ నుంచి నేపాల్‌గంజ్‌కు ప్రయాణించి ఆ తర్వాత ఒక చిన్న విమానంలో సిమికోట్‌కు, అక్కడి నుంచి సరిహద్దులో ఉన్న హిల్సాకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంటుంది.
ఇక్కడి నుంచి పురాంగ్, కైలాస పర్వతానికి ఉన్న కొద్ది దూరాన్ని రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చైనీస్ గ్రూప్ వీసా, టిబెట్ ట్రావెల్ పర్మిట్‌తో సహా ప్రత్యేక అనుమతులు అవసరం.
ప్రతి ఏటా మే- సెప్టెంబర్ మధ్య ఈ మార్గాల గుండా అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారు.

ఫొటో సోర్స్, Krishna Adhikari
రసువా మార్గం ఎందుకు ప్రసిద్ధి చెందింది?
రసువా, రసువాగఢి సరిహద్దు పోస్ట్ నేపాల్ నుండి టిబెట్‌లోని కైలాస్ మానస సరోవర్‌కు ప్రధాన గేట్‌వేలు.
ఈ ప్రయాణం కాఠ్‌మాండూ నుంచి ప్రారంభమై రసువా జిల్లా గుండా ప్రయాణించి నేపాల్-చైనా సరిహద్దులో ఉన్న రసువాగఢి సరిహద్దు పోస్టుకు చేరుకుంటుంది.
బుధవారం నాటి విపత్తుకు ఈ ప్రాంతంలోనే జరిగింది.
ఇక్కడ సరిహద్దు దాటిన తర్వాత, ఈ మార్గం నేరుగా టిబెట్‌లోని జిరాంగ్ పోర్ట్‌కు దారి తీస్తుంది. ఆ తర్వాత ప్రయాణం కైలాస మానస సరోవర్ వైపు కొనసాగుతుంది.
కాఠ్‌మాండూ నుంచి టిబెట్, నేపాల్ సరిహద్దు కేంద్రమైన రసువాగఢికి చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం యాత్రికులు చైనీస్ గ్రూప్ వీసా టిబెట్ ప్రయాణ అనుమతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఆమోదం పొందాలి.

సాధారణంగా, రసువాగఢిలో చైనీస్ గ్రూప్ వీసాలు, టిబెట్ ప్రయాణ అనుమతుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి అప్పటికే ఆమోదం పొంది ఉంటాయి. పత్రాల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు కాఠ్‌మాండూ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రసువాగఢి సరిహద్దు పోస్ట్ గుండా 13,523 మంది యాత్రికులు ప్రయాణించారని నేపాల్ పర్యటక శాఖ చెబుతోంది.
భారత ప్రభుత్వం నడిపే రెండు మార్గాలు కేవలం భారత పౌరుల కోసం మాత్రమే కావడంతో రసువాగఢి మార్గం విదేశీ ప్రయాణికులలో బాగా ప్రాచుర్యం పొందింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























