నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?

నూటపదహార్లు సంప్రదాయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఆంధ్రలో 84 రూపాయలు తెలంగాణలో 100 రూపాయలకు సమానం. అలాగే తెలంగాణలో 116 రూపాయలు.. ఆంధ్రాలో 100 రూపాయలకు సమానం. అందుకే ఇప్పటికీ శుభకార్యాల్లో నూట పదహార్లు చదివిస్తారు" అనే కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది.

తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల్లో "నూట పదహార్లు/116" అనే సంప్రదాయపు మూలాలు నిజాం కాలం కరెన్సీ - ద్రవ్య మారక వ్యవస్థలో ఉంది అనే మాట ప్రచారంలో ఉంది.

చరిత్రలో ఉస్మానియా సిక్కా రూపాయికి, బ్రిటిష్ ఇండియన్ రూపాయికి మధ్య 7:6 మారకపు నిష్పత్తి నమోదై ఉంది. తర్వాత భారత రూపాయి అమల్లోకి వచ్చినప్పుడు కూడా అదే నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుని మార్పిడి చేశారు.

ఈ లెక్క ఆధారంగానే 84 – 100 - 116 అనే వివరణ ప్రచారంలోకి వచ్చిందని న్యూమిస్‌మాటిస్టులు చెబుతున్నారు.

ఆ నూట పదహార్లే ఇప్పుడు శుభకార్యాలు, పురోహితుల 'దక్షిణ'లోకి వచ్చి కొనసాగుతోందా?ఈ నూటపదహార్లు కథేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు
ఫొటో క్యాప్షన్, నిజాం పాలనలో తెలంగాణలో కరెన్సీ విలువ బ్రిటిష్ ఇండియా కరెన్సీ కంటే తక్కువగా ఉండేదని 'ది మానిటరీ యూజ్ ఆఫ్ సిల్వర్ ఇన్ 1933' అనే పుస్తకంలో రాశారు.

నిజాం పాలనలో కరెన్సీ, ద్రవ్య మారకం...

1948కి ముందు ప్రస్తుత తెలంగాణాలో ఎక్కువ భాగం "హైదరాబాద్ సంస్థానం"లో నిజాం పాలనలో ఉండేది.

ఆంధ్ర ప్రాంతం (మద్రాస్ ప్రెసిడెన్సీ భాగం) బ్రిటిష్ భారతదేశంలో ఉండేది.

1948 వరకు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలోని అతి పెద్ద సంస్థానాల్లో ఒకటి. ఈ ప్రాంతానికి సొంత కరెన్సీ ఉండేది. దాని పేరు ఉస్మానియా సిక్కా.

ఈ కరెన్సీని నిజాం ప్రభుత్వం ముద్రించేది. 1948లో హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఈ కరెన్సీ చలామణిలో కొనసాగింది.

1959 వరకు పూర్తిగా రద్దు కాలేదు.

అందువల్ల హైదరాబాద్ సంస్థానంలో నిజాం సిక్కా...ఆంధ్రా - మద్రాస్ ప్రాంతంలో బ్రిటిష్ ఇండియన్ రూపాయి వేర్వేరు ద్రవ్య వ్యవస్థలుగా చలామణిలో ఉండేవి.

ఈ రెండు కరెన్సీల మధ్య మారకం విలువలో తేడా ఉన్నట్టు అది..."116 హైదరాబాదు సిక్కాలు = 100 బ్రిటిష్ ఇండియన్ రూపాయలు" అప్పట్లో అమెరికా గవర్నమెంట్ ముద్రించిన 'ది మానిటరీ యూజ్ ఆఫ్ సిల్వర్ ఇన్ 1933' వంటి కొన్ని పుస్తకాల్లో ప్రచురితమైంది.

అలాగే 1938లోని నిజాం ప్రభుత్వ బడ్జెట్ పత్రాల్లో కూడా ఇది ఉందని పురాతన నాణేల సేకరించి అధ్యయనం చేసే న్యూమిస్‌మాటిస్టులు చెబుతున్నారు.

బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు
ఫొటో క్యాప్షన్, న్యూమిస్‌మాటిస్ట్ కందుల వెంకటేశ్

పురోహితుల దక్షిణ నుంచి సంప్రదాయంగా...

వందేళ్ల క్రితం కోస్తా, రాయలసీమ నుంచి ఉపాధి కోసం వెళ్లేవారితో పాటు పురోహితులు, పండితులు, కళాకారులు నిజాం రాష్ట్రంలో శుభకార్యాలు, పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లేవారని న్యూమిస్‌మాటిస్టులు చెబుతున్నారు.

ఆ సందర్భాల్లో వారికి దక్షిణ, సంభావన 'ఉస్మానియా సిక్కా కరెన్సీ'లోనే ఇచ్చేవారని వారు వివరించారు.

ఆ తర్వాత వారు ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వచ్చి ఆ డబ్బును బ్రిటిష్ ఇండియన్ రూపాయిగా మార్చుకునేటప్పుడు... ఉస్మానియా సిక్కా విలువ బ్రిటిష్ ఇండియన్ రూపాయి కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో నష్టం జరిగేదని చెబుతున్నారు.

ఆ నష్టం లేకుండా ఉండేందుకు రూ.100కు బదులుగా రూ.116 ఇవ్వడం ప్రారంభమైందని, అంటే తెలంగాణలో రూ.116 ఇస్తే... ఆంధ్ర ప్రాంతంలో దానికి సుమారు రూ.100 విలువ వచ్చేదనే లెక్కతో అదనంగా 16 రూపాయలు జోడించే ఆనవాయితీ ఏర్పడిందని న్యూమిస్‌మాటిస్ట్ కందుల వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

ఈ వివరణకు ఆధారంగా 1933లో అమెరికా ప్రభుత్వం ప్రచురించిన 'ది మానిటరీ యూజ్ ఆఫ్ సిల్వర్ ఇన్ 1933' నిజాం ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు, ఉస్మానియా సిక్కాపై జరిగిన ఇతర అధ్యయనాలను న్యూమిస్‌మాటిస్టులు ప్రస్తావిస్తున్నారు.

కాలక్రమేణా ద్రవ్య మారక అవసరం తగ్గిపోయినా... రూ.116తో దక్షిణ లేదా సంభావన ఇవ్వడం మాత్రం శుభకార్యాల్లో ఒక ఆనవాయితీగా కొనసాగిందనేది వారి వాదన.

పురోహితులు, కళాకారులు, పండితులు తమకు వాస్తవ విలువ తగ్గకుండా ఉండేందుకు 116 రూపాయల దక్షిణ/సంభావన సంప్రదాయం నిజాం కాలం నుంచి వచ్చిందని కందుల వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు
ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ ఇండియాలో వంద రూపాయలు.. నిజాం పాలనలోని తెలంగాణలో 116 సిక్కాలకు సమానం అని చరిత్రకారులు చెబుతున్నారు.

"నూట పదహార్లు" సంప్రదాయం

నేటికీ ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, వ్రతాలు, శుభకార్యాల్లో 100, 500, 1000, 10,000… ఇలా ఏ మొత్తం అయినా చివర "16" వచ్చేలా 116...516... 1116...10,116...1,00,116 చదివించడం సాధారణంగా కనిపించే ఆనవాయితీగా మారింది.

ఈ విషయంపై బీబీసీ కొందరు పురోహితులతో మాట్లాడింది.

"గుడి విరాళాలు, కట్నాలు, చదివింపులు, పురోహితుల దక్షిణ ఈ అన్ని సందర్భాల్లో "నూట పదహార్లు/వెయ్యి నూట పదహార్లు" వంటి మొత్తాలు ఇవ్వడం స్థానిక సామాజిక మతాచారంలో భాగమై పోయింది. చివర సున్నా (0) తో ముగిసే మొత్తం శుభప్రదం కాదు, కనుక 16 జత చేసి 'అపూర్ణం కాకుండా' చేస్తారన్న విశ్వాసం కూడా ఉంది" అని 65 ఏళ్ల పురోహితులు డీవీవీఎస్ శర్మ బీబీసీతో చెప్పారు.

హిందూ గ్రంథాలలో 16 (షోడశోపచారాలు, 16 సంస్కారాలు) వంటి సంఖ్యకు పవిత్రత, సంపూర్ణత ఉందని భావించి 16ని జోడిస్తారనే ప్రచారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో కొనసాగింది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా...116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయిందని న్యూమిస్మాటిస్ట్ కందుల వెంకటేశ్‌తోపాటు పురోహితులు డీవీవీఎస్ శర్మ బీబీసీతో అన్నారు.

అయితే... శుభకార్యాల్లో 116 రూపాయలు చదివే సంప్రదాయం పూర్తిగా ఆ కరెన్సీ మారకం నుంచే పుట్టిందని నిర్ధరించే అధికారిక ప్రభుత్వ పత్రం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆధారం ప్రస్తుతం అందుబాటులో లేవు.

అందువల్ల ఈ వివరణను న్యూమిస్మాటిస్టులు, కొందరు చరిత్ర పరిశోధకులు చెబుతున్న ఒక చారిత్రక వ్యాఖ్యానంగానే చూడాల్సి ఉంటుంది.

బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు
ఫొటో క్యాప్షన్, నిజాం సిక్కా నాణేలు ప్రధానంగా వెండితో తయారు చేసేవారు. వాటిలో కాపర్ లేదా నికెల్ కూడా కొంత కలిసేది.

వాడుక ప్రాంతం, చట్టబద్ధత...

నిజాం సిక్కా- (Hyderabadi / Osmania Sicca Rupee). దీనిని హాలి సిక్కా అని కూడా అనేవారు. ఇది హైదరాబాద్ సంస్థానం (ప్రస్తుత తెలంగాణా–మహారాష్ట్ర–కర్ణాటకలోని కొన్ని భాగాలు)లో చట్టబద్ధ కరెన్సీ. ఇక బ్రిటిష్ ఇండియన్ రూపాయి - బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం మొత్తానికి (మద్రాస్, బొంబాయి, బెంగాల్ ప్రెసిడెన్సీలు, పలు ప్రిన్సిలీ స్టేట్స్‌లో కూడా) వాడుకలో ఉన్న అధికారిక కరెన్సీ.

"అంటే నిజాం సిక్కా స్థానిక/ప్రిన్సిలీ స్టేట్ కరెన్సీ, బ్రిటిష్ రూపాయి అంతర్జాతీయ - ఇంపీరియల్ కరెన్సీగా వాడుకలో ఉండేవి.

హాలి సిక్కా విలువ బ్రిటిష్ ఇండియన్ రూపాయికంటే కొద్దిగా తక్కువ విలువ కలిగి ఉండేదని ది మోనిటరీ యూజ్ ఆఫ్ సిల్వర్ అనే పుస్తకంలో ప్రచురితమైంది.

7 హాలి సిక్కా రూపాయలు = 6 బ్రిటిష్ ఇండియన్ రూపాయలని అందులో పేర్కొన్నారు.

"ఇదే కారణంగా హైదరాబాద్ - బ్రిటిష్ భారతదేశం మధ్య వ్యాపారం, దక్షిణ/గిఫ్ట్ వంటి లావాదేవీల్లో ప్రత్యేక మారకం రేట్లు అమలయ్యేవి. ప్రజల నోటి లెక్కల్లో 116 =100, 84=100 అని ఉండేవి. అంటే నిజాం సిక్కా రూపాయి కొనుగోలు శక్తి బ్రిటిష్ రూపాయి కంటే తక్కువని అర్థమవుతుంది కదా" అని కందుల వెంకటేశ్ బీబీసీతో అన్నారు.

అంటే... హైదరాబాద్ స్టేట్ రూ.100 = భారత రూ.85.71 (సుమారు రూ.86)

భారత రూ.100 = హైదరాబాద్ స్టేట్ రూ.116.67 (సుమారు రూ.116)

బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు

ఉస్మానియా సిక్కా స్థిరీకరణ నిధి

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం తన రూపాయికి, ఇంగ్లిష్ పౌండ్ స్టెర్లింగ్‌కు మధ్య ఒక స్థిరమైన నిష్పత్తిని ఎలా ఉంచిందో, అదే పద్ధతులను ఈ ప్రభుత్వం కూడా ఉపయోగించింది.

దీని ద్వారా ఉస్మానియా సిక్కా, బ్రిటిష్ గవర్నమెంట్ రూపాయిల మధ్య విలువల్లో వచ్చే మార్పులను నియంత్రించారు.

బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసే నాణేల్లోని వెండి పరిమాణం ప్రకారం నిష్పత్తి చూస్తే...100 బ్రిటిష్ ఇండియా రూపాయలకు 116 - 14 - 7 ఉస్మానియా సిక్కాలు వచ్చేవి.

ఉస్మానియా సిక్కా విలువ పెరిగితే 114 లేదా 115 వరకు, అదే తగ్గితే...119 లేదా 120 వరకు అంటే 100 బ్రిటిష్ ఇండియా రూపాయలకు సమానంగా ఉండేలా పరిమితులు ఉంచారు.

బ్రిటిష్ ఇండియా రూపాయిలను ఇచ్చి ఉస్మానియా సిక్కాలను కొనడం ద్వారా లేదా వెండిని కొనుగోలు చేసి కొత్త ఉస్మానియా సిక్కా నాణేలను ముద్రించడం ద్వారా కరెన్సీ విలువను స్థిరంగా ఉంచేవారు.

1950లో భారత రూపాయిని హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఒక మారకం విలువను నిర్ణయించింది.

బ్రిటిష్ ఇండియా, నిజాం సిక్కా, భారత రూపాయి, నూటపదహార్లు, వెయ్యి నూట పదహార్లు
ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ ఇండియా రూపాయి.. అదే కాలంలోని నిజాం తెలంగాణలో ఉస్మానియా సిక్కా

అప్పటి నాణేలు ఎలా ఉండేవంటే...

నిజాం సిక్కా నాణేల ముందు భాగంలో చార్మినార్ చిత్రం, చుట్టూ పర్షియన్/ఉర్దూ శాసనాలతో పాటు "నిజాం-ఉల్-ముల్క్, ఆసఫ్ జాహి" వంటి పదాలు ఉండేవి. అలాగే నాణేం వెనుక భాగంలో దాని విలువ ఉండేవి.

బ్రిటిష్ ఇండియా నాణేలకైతే ముందుభాగంలో బ్రిటిష్ రాజు/రాణి (విక్టోరియా, జార్జ్, మొదలైన వారు)...చుట్టూ ఇంగ్లీషు లిపిలో "Queen Victoria - Empress of India" వంటి శాసనాలు, వెనుక భాగంలో "One Rupee India" అని ఇంగ్లీషులో ఉండేవి.

హైదరాబాదు సిక్కాకు Hyderabad Currency Act 1918 ద్వారా చట్టబద్ధత కల్పించారు. నాణేలు, నోట్లు నిజాం ప్రభుత్వమే మింట్/ప్రింట్ చేసి జారీ చేసేది.

మొదట లండన్ మింట్, తర్వాత స్థానిక సైఫాబాద్ మింట్, నాసిక్ ప్రింటింగ్ ఇతర అంశాలు చారిత్రక రికార్డుల్లో ఉన్నాయని కందుల వెంకటేశ్ చెప్పారు.

నిజాం సిక్కా నాణేలు ప్రధానంగా వెండితో తయారై, దానికి కాపర్ లేదా నికెల్ కూడా కొంత కలిసేది. బ్రిటిష్ ఇండియా నాణేలు కూడా ఇలాగే తయారయ్యేవి.

నిజాం హాలి సిక్కా, బ్రిటిష్ ఇండియన్ రూపాయి రెండూ "రూపాయి" పేరుతో ఉన్నా, ఒకటి ప్రాంతీయ ప్రిన్సిలీ స్టేట్ కరెన్సీ; మరొకటి అప్పటీ బ్రిటిష్ ఇండియా అధికారిక కరెన్సీ

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)