యూట్యూబర్ నందు: వీసా మోసాలకు పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు, అసలు ఆరోపణలు ఏంటి? నందు ఏమన్నారు?

ఫొటో సోర్స్, nandu_world/Insta
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
యూకేలో నివాసముంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేసే గుంటూరుకి చెందిన రమానందన అలియాస్ నందు కుటుంబసభ్యులపై విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
వాస్తవానికి గతేడాది నవంబర్‌లోనే కేసులు నమోదైప్పటికీ కొద్దిరోజులుగా నందు కుటుంబసభ్యులపై పలు చోట్ల నుంచి మోసపూరిత ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమ పీఎస్‌లో నమోదైన కేసు వివరాలను, వాటి పురోగతిని తాజాగా వెల్లడిస్తున్నట్టు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం, సబ్ ఇన్‌స్పెక్టర్ రాజు బీబీసీకి తెలిపారు.
విలక్షణమైన వాయిస్‌తో యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన నందు, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో కూడా నటించారు.
పోలీసులతో పాటు ఇబ్రహీంపట్నంకి చెందిన ఫిర్యాదుదారుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఈ కేసులకు సంబంధించిన వివరాలను బీబీసీకి చెప్పారు.


ఫొటో సోర్స్, nandu_world/FB
ఆరోపణలు ఏంటి?
నందు కుటుంబంపై మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘నందు భర్త జాగర్లమూడి మధుకర్ యూకేలో 'ది డెస్టినీ రిక్రూట్‌మెంట్ – స్టాఫింగ్ సొల్యూషన్స్' మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుంటారు. ప్రధానంగా యూకే వీసాలు రెన్యువల్ చేస్తామని చెబుతుంటారు.
యూకేలో ఉన్న నాకు వీసా గడువు ముగిసిపోతుండటంతో 2024లో మధుకర్‌తో పాటు ఆయన భార్య నందు, గుంటూరులో ఉండే ఆమె తండ్రి మోహన్‌రావును సంప్రదించాను. వీసా రెన్యువల్‌తో పాటు ఉద్యోగ అవకాశం– 'సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్' (సీఓఎస్) ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకు రూ. 15 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. నేను నమ్మకంతో 2024 ఏప్రిల్ 2వ తేదీన 15లక్షల రూపాయలను మధుకర్ అకౌంట్‌లో జమ చేశాను.
నెలల తరబడి సమయం గడిచినా వీసా రాలేదు. సరైన సమాధానమూ ఇవ్వలేదు. ఓ సారి గట్టిగా నిలదీస్తే.. నాకు సీఓఎస్ ఇచ్చారు. నేను అది తీసుకుని ఉద్యోగ నిమిత్తం ఓ కంపెనీకి వెళ్తే అది నకిలీదని, చెల్లదని చెప్పారు. దాంతో నేను మోసపోయానని గ్రహించి నందు కుటుంబసభ్యులను నిలదీస్తే ఓసారి 2 లక్షలరూపాయలు తిరిగి ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు వీసా రాకపోవడంతో నేను విజయవాడ తిరిగి వచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో 2025 నవంబర్‌లో ఫిర్యాదు చేశాను'' అని బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, nandu_world/insta
గుంటూరులో కార్యాలయం మూత, పరారీలో నందు తండ్రి
శివ ఫిర్యాదు మేరకు తొలుత గుంటూరులో ఉండే నందు తండ్రి మోహన్‌రావుతో మాట్లాడి.. ప్రాధమిక ఆధారాల మేరకు 2025 నవంబర్ 22న నందును ఏ–2గా, ఆమె భర్త మధుకర్‌ను ఏ–1గా, ఆమె తండ్రి మోహన్‌రావును ఏ–3గా వివిధ సెక్షన్ల కింద కేసులు ( కేసు నెంబర్515/2025) నమోదు చేసినట్టు ఎస్.ఐ. రాజు బీబీసీకి వెల్లడించారు.
''గుంటూరులో ది డెస్టినీ పేరిట అరండల్‌పేటలో ఓ కార్యాలయం ఉండేది. నందు తండ్రి మోహన్‌రావు గుంటూరులోనే నివాసముండే వారు. అయితే మా వద్ద కేసు నమోదైన తర్వాత, పలుచోట్ల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోహన్‌రావు పరారయ్యారని తెలిసింది.
అలాగే గుంటూరులోని కార్యాలయాన్ని మూసివేశారు. మోహన్‌రావు ఆచూకీ కోసం యత్నిస్తున్నాం. నందు, మధుకర్‌తో మాట్లాడేందుకు యత్నిస్తుంటే వారిద్దరూ అందుబాటులోకి రావడం లేదు. ఫిర్యాదుల ఆధారంగా కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యం బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
‘‘మమ్మల్నీ మోసం చేశారు... మేం 2024లోనే ఫిర్యాదు చేశాం’’
వరంగల్‌కి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కూడా నందు కుటుంబంపై ఆరోపణలు చేశారు. బీబీసీతో మాట్లాడిన ఆయన తనతోపాటు తన స్నేహితులు రాజు, ప్రవీణ్ అనే మరో ఇద్దరిని నందు కుటుంబం 2024లోనే వీసాల పేరిట మోసం చేసిందని ఆరోపించారు.
''మేం ముగ్గురం కలిసి లండన్‌లో వర్క్ పర్మిట్ వీసా ప్రాసెసింగ్ కోసం 2022 మే 25న మధుకర్‌ను సంప్రదించాం. ఇందుకోసం ఆయన ఒక్కొక్కరికి 17లక్షల50వేల రూపాయలు చొప్పున (ఒక్కొక్కరికి 15,500 పౌండ్లు) చెల్లించాలని కోరారు. మేం జూన్ 20, 2022న కొంత మొత్తం, మిగిలిన మొత్తం సెప్టెంబర్‌లో చెల్లించాము. మొత్తంగా మేం ముగ్గురం మధుకర్‌కి 52 లక్షల 50 వేల రూపాయలు చెల్లించాం.
అయితే రెండేళ్లయినా వీసా ఇవ్వలేదు. పైగా ఫోన్‌లు ఎత్తడం మానేశారు. దాంతో మేం ఆగస్టు 2024లో గుంటూరులోని మధుకర్ ఆఫీసుకు వెళ్లాం. అప్పుడు అక్కడున్న తన ఉద్యోగి మొబైల్ ద్వారా మాతో మాట్లాడి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అక్టోబర్ వరకూ వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పైగా మా ఫోన్లన్నీ బ్లాక్ చేసేశారు. దీంతో మోసపోయామని గ్రహించి 2024 అక్టోబర్ 21న ఏపీ ఏడీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం'' అని ప్రవీణ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, nandu_world/insta
2025 డిసెంబర్‌లో స్పందించిన నందు
కొంతకాలం కిందట యూకేలో వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారంటూ కొందరు బాధితులు తమ వద్దకు వచ్చారని విజయవాడ ఏడీసీపీ గున్నం రామకష్ణ బీబీసీతో చెప్పారు.
''అప్పుడు గుంటూరులో ఉన్న నందు తండ్రి మోహన్‌రావును పిలిపించి మాట్లాడాను. వీలైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలని సూచించాం. కానీ వారు పూర్తిగా మోసపూరిత ధోరణిలోనే ఉన్నారని తాజా పరిస్థితులనుబట్టి అర్ధమవుతోంది. వాళ్లు ఎక్కడున్నా పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం'' అని ఏడీసీపీ రామకృష్ణ బీబీసీతో అన్నారు.
వరంగల్‌కి చెందిన ముగ్గురు యువకులు ఏపీ పోలీసులకు చేసిన ఫిర్యాదులు, విజయవాడ ఇబ్రహీపట్నంకు చెందిన యువకుడు శివ ఫిర్యాదు తర్వాత 2025 డిసెంబర్ 31న నందు ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘‘ వ్యక్తిగత ద్వేషంతో మా ఫ్యామిలీ గురించి కొందరు వ్యక్తులు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై యూకేలో లీగల్‌గా యాక్షన్ తీసుకున్నాం. యూకే నుంచి ఇండియా పారిపోయిన వాళ్లే ఇదంతా చేస్తున్నారు. నాకు, నా భర్తకి ఇండియాలో 21ఏళ్లుగా ఎటువంటి వ్యాపారాలు, కంపెనీలు లేవు. మా పేర్లు చెప్పి కొందరు డబ్బులు తీసుకుంటున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. తప్పుడు ప్రచారాలను దయచేసి నమ్మొద్దు'' అని ఆ వీడియోలో నందు విజ్టప్తి చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది.

ఫొటో సోర్స్, ugc
లీగల్ అడ్వైజర్ ఏమన్నారంటే..
ఈ వీడియోపై శివ, ప్రవీణ్‌లు బీబీసీతో మాట్లాడారు.
''మాకు వాళ్లతో వ్యక్తిగత గొడవలు ఏముంటాయి? మేం మధుకర్ అకౌంట్‌కి బ్యాంకు ద్వారా డబ్బులు పంపించిన లావాదేవీల రుజువులు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ పోలీసులకు ఇచ్చాం, మేమే కాదు.. ఏపీ, తెలంగాణలోనే కాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వారి బాధితులు ఉన్నారు'' అని చెప్పారు.
కాగా ఆ ఆరోపణలపై వివరణ కోరేందుకు బీబీసీ యత్నించగా నందు, ఆమె భర్త మధుకర్, నందు తండ్రి మోహన్‌రావులు అందుబాటులోకి రాలేదు.
మధుకర్ మొబైల్ ఫోన్‌కు కాల్ చేసిన ఆయన అందుబాటులోకి రావడం లేదు.
వారిపై వస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకు నందు గానీ, ఆమె భర్త గానీ తాజాగా స్పందించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు.
అయితే వారికి ఆంధ్రప్రదేశ్‌లో లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నానంటూ హైకోర్టు న్యాయవాది మాగంటి అనూరాధ మాట్లాడిన వీడియోను తన ''నందూస్ వరల్డ్’’ బ్లాగ్‌లో అసలేం జరిగింది పేరిట జూన్ 3వ తేదీన నందు పోస్ట్ చేశారు.
''యూకేలో వారి లీగల్ అడ్వైజర్స్‌తో నేను మాట్లాడాను. యూకేలో నందు, ఆమె భర్తకు పలు కంపెనీలు ఉన్నాయి 'ది డెస్టినీ రిక్రూట్‌మెంట్ – స్టాఫింగ్ సొల్యూషన్స్' అనే సంస్థ మధుకర్‌ది.. ఆ సంస్థకి నందుకి ఎటువంటి సంబంధం లేదు. లీగల్‌గా కూడా అస్సలు లేదు. ఒకవేళ ఆ సంస్థపై ఆరోపణలు ఉంటే అక్కడి కోర్టులు చూస్తాయి. కేవలం నందుకి సోషల్ మీడియాలో మంచి పేరు వస్తోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు'' అని ఆ వీడియోలో న్యాయవాది అనురాధ అన్నారు.
‘‘నందుని, వారి కుటుంబాన్ని ఎవ్వరేమీ చేయలేరు. వాళ్లకు యూకే పాస్‌పోర్టులున్నాయి. వాళ్లకి ఇండియాలో ఏ చట్టం వర్తించదు’’ అని అనూరాధ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
అయితే ఈ వీడియోపై తాము కూడా న్యాయనిపుణులతో మాట్లాడుతున్నామని శివ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























