కాన్వెంట్‌లో కలుసుకుని పెళ్లి చేసుకున్న యువ క్రైస్తవ నన్స్ కథ

మతం, చర్చ్, స్వలింగ వివాహాలు, నన్స్, సిస్టర్స్

ఫొటో సోర్స్, Courtesy of Francília Costa and Luiza Silvério

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్సిలియా(ఎడమ),లుయిజా(కుడి)
    • రచయిత, ఇయాన్ ఏల్వ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆ అమ్మాయిలిద్దరూ 19 ఏళ్ల ప్రాయంలో నన్స్‌గా కాన్వెంట్‌లో చేరారు. ఇద్దరికి తొలిచూపులో ఒకరంటే ఒకరికి నచ్చలేదు.

నిష్టగా బ్రహ్మచర్యం పాటించే, వైవాహిక జీవితపు ఆలోచనలు లేని క్రైస్తవ మత ఆధ్యాత్మిక జీవితాన్ని బోధించే కాన్వెంట్‌లో చేరిన ఆ ఇద్దరమ్మాయిలు తర్వాత పెళ్లి చేసుకున్నారు.

అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది?

లూయీజా సిల్వేరియో తనకు కాబోయే భార్యను మొదటిసారి కలిసినవేళ వారిద్దరి మధ్య పెద్దగా మంచి లేకపోగా, ద్వేషం ఉంది. 19 ఏళ్ల వయసులో వారు క్రైస్తవ మతాన్ని బోధించే కాన్వెంట్‌లో అడుగు పెట్టారు.

ప్రస్తుతం వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. ఫ్రాన్సిలీయా కోస్టా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘నేను కూడా ఆమె గురించి సరిగ్గా ఇలాగే అనుకున్నా. అసలు ఒకమ్మాయి ఇంత పొగరుగా ఎలా ఉండగలదు’’ అనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆరేళ్ల కిందట లుజియా ఆ కాన్వెంట్‌కు వచ్చేసమయానికి అంతకు ఐదేళ్ల ముందునుంచే ఫ్రాన్సిలియా అక్కడ ఉంటున్నారు. నిరాడంబరంగా జీవించడం, బ్రహ్మచర్యం, భగవంతుడిపట్ల విధేయత వంటివాటిపై అప్పటికే ఆమె ప్రతిజ్ఞలు చేశారు. మతధర్మ శాస్త్రం (థియాలజీ)లో డిగ్రీ చదువుతున్నారు.

ఈశాన్య బ్రెజిల్‌లోని పియౌయి గ్రామీణ ప్రాంతంలో తాతయ్య, అమ్మమ్మల దగ్గర ఫ్రాన్సిలియా పెరిగారు. మతపరంగా వాళ్లకు భక్తి భావం చాలా ఎక్కువ. ఆ ప్రభావంతో ఫ్రాన్సిలియా సహజంగానే కాన్వెంట్ లైఫ్‌ వైపు మొగ్గుచూపారు.

ఆ తర్వాత లుజియా అక్కడకు వచ్చారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్ గెరాయిస్‌లో ఉన్నప్పుడు, తన టీనేజ్‌లో ఏర్పడిన శూన్యతకు ఆమె అసంతృప్తికి లోనయ్యారు. అప్పుడే జీవితాన్ని ఆధ్యాత్మిక సేవలో గడపాలని ఆమె భావించారు.

మతం, చర్చ్, స్వలింగ వివాహాలు, నన్స్, సిస్టర్స్

ఫొటో సోర్స్, Courtesy of Francília Costa and Luiza Silvério

ఫొటో క్యాప్షన్, డబ్బు ఆదా చేసుకోవడం కోసం ఒకే ఫ్లాట్‌లో ఉండాలని ఫ్రాన్సిలియా, లుయిజా నిర్ణయించుకున్నారు.

‘దేవుని సేవకు అంకితమవుదామనుకుని’

''కాన్వెంట్‌లోకి ఓ లక్ష్యంతో మేం వచ్చాం. దేవుడికి సేవ చేయాలన్నదే ఆ లక్ష్యం'' అని ఫ్రాన్సిలియా చెప్పారు.

తర్వాతి సంవత్సరాల్లో ఆ లక్ష్యం ఈ ఇద్దరు ‘సిస్టర్స్’ను ఒకరికొకరు బాగా దగ్గర చేసింది. మొదట వాళ్లు మంచి స్నేహితురాళ్లయ్యారు. ఒకరిపై ఒకరికున్న ఏహ్యభావన పోయి నెమ్మదిగా ఒకరినొకరు ఆరాధించుకోవడం మొదలుపెట్టారు.

వారి స్నేహం పెరిగే కొద్దీ కాన్వెంట్‌ జీవితంపై వారికున్న అంకితభావం తగ్గిపోతూ వచ్చింది.

డబ్బులు ఆదా చేయడం కోసం ఫ్రాన్సిలియా, లుయిజా ఒకే ఫ్లాట్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.

కరోనా వల్ల ఫ్రాన్సిలియాకు తరచూ ప్యానిక్ ఎటాక్స్ వస్తుండేవి. వైరస్ బారిన పడతానేమో, ఇతరులకు వైరస్ వ్యాపిస్తుందేమోనన్న భయం ఆమెను వెంటాడేది. చికిత్స తీసుకుంటున్న సమయంలో తన ప్రాధామ్యాలపై ఆమె పునరాలోచన ప్రారంభించారు.

''మతపరమైన జీవితం చాలా బాగుంటుంది. కానీ మనకు శారీరక, మానసిక ఆరోగ్యం కావాలి. దానికి ఎలా ప్రార్థించాలో తెలుసుకుంటే మాత్రమే సరిపోదు'' అని ఆమె చెప్పారు.

మతం, చర్చ్, స్వలింగ వివాహాలు, నన్స్, సిస్టర్స్

ఫొటో సోర్స్, Courtesy of Francília Costa and Luiza Silvério

ఫొటో క్యాప్షన్, ఓ రొమాంటిక్ కామెడీ చూసిన తర్వాత ఫ్రాన్సిలియా తన ప్రేమను వ్యక్తపరిచారు.

కొత్త జీవితానికి ప్రారంభం

అమ్మమ్మ చనిపోయిన తర్వాత లుజియా కూడా పానిక్ ఎటాక్స్ బారిన పడుతుండేవారు. తర్వాత ఆమె డిప్రెషన్‌తో బాధపడ్డారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన ఆమెకు కూడా చికిత్స వల్ల కలిగింది.

మతపరమైన ప్రతిజ్ఞలు, మిగిలిన జీవితమంతా కాన్వెంట్‌లో జీవించాలన్న కలను వదిలిపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు.

''తన మానసిక ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లుజియాకు కూడా ఏర్పడింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ వయసులో ఉన్న అమ్మాయికి ఎక్కడైనా సరే తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఆలోచన కలిగే సామర్థ్యం ఉండడం ఆశ్చర్యం. నేను ఇక్కడికన్నా బయటి జీవితమే ఎక్కువకాలం జీవించినప్పటికీ కొత్త జీవితం ప్రారంభించాలని నేనాలోచించలేకపోయా'' అని ఫ్రాన్సిలియా చెప్పారు.

స్నేహితురాలి ఆలోచనలతో స్ఫూర్తి పొందిన ఫ్రాన్సిలియా కూడా చివరికి అదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమె కూడా కాన్వెంట్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.

అక్కడ ఉండడంకన్నా అక్కడినుంచి వెళ్లడం మరింత కష్టమని అర్థమైనా కూడా వారు తమ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.

''బయట జీవించడం అంత తేలికకాదు. అది నిజంగా చాలా కష్టమైన విషయం'' అని లుజియా చెప్పారు.

''మనం కాలేజ్‌కి వెళ్లగలుగుతామో లేదో తెలియదు. ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు'' అని ఆమె అన్నారు.

ఫ్రాన్సిలియా కూడా అలాగే భావించారు.

''ఓ ఇంటర్వ్యూ జరిగినట్టు ఊహించుకుంటే- మీ డిగ్రీ ఏంటని అందులో అడుగుతారు. నా డిగ్రీ మతపరమైనశాస్త్రంలో చేశాను. దాంతో నాకు ఏ రకమైన ఉద్యోగం దొరుకుతుంది?'' అని ఆమె అన్నారు.

మతం, చర్చ్, స్వలింగ వివాహాలు, నన్స్, సిస్టర్స్

ఫొటో సోర్స్, Courtesy of Francília Costa and Luiza Silvério

ఫొటో క్యాప్షన్, దేవుడే తమను కలిపాడని ఫ్రాన్సిలియా, లుయిజా భావిస్తున్నారు.

ప్రేమగా మారిన ద్వేషం

ఫ్రాన్సిలియా కాన్వెంట్ నుంచి వెళ్లాలని నిర్ణయిం తీసుకున్న తర్వాత ఏడేళ్లగా కాన్వెంట్‌లో ధరించిన నన్ డ్రస్ కాకుండా కొత్త జీవితం ప్రారంభించేందుకు వీలుగా కొత్త దుస్తులు కొనాల్సి వచ్చింది.

అతిపెద్ద సమస్య అద్దె కట్టడం. అందుకోసం డబ్బు ఆదా చేయాలి. ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉండాలని స్నేహితురాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.

అలా ఒక రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి రొమాంటిక్ కామెడీ లవ్ ఇన్ వెరోనా చూశారు. అందులో ప్రధాన పాత్రలు మొదట ఒకరినొకరు ద్వేషించుకుంటాయి. తర్వాత ప్రేమలో పడతాయి. ఆ తరహాలోనే లుజియాపై ఫ్రాన్సిలియా తన ప్రేమను వ్యక్తపరిచారు.

తాము బైసెక్సువల్ అన్న విషయం టీనేజర్లుగా ఉన్నప్పుడు వారు గ్రహించారు. కానీ నన్‌లుగా మారడం, కాన్వెంట్‌కు వెళ్లాలన్న వారి నిర్ణయాన్ని అది ప్రభావితం చేయలేదు.

''మాకు దేవుడంటే భయం కలగలేదు. కాన్వెంట్‌లో ఉండడానికి భయం పుట్టలేదు. ఎవరితోనూ ఏ రిలేషన్ షిప్‌లోనూ ఉండాలని నేను అనుకోలేదు. నేను బ్రహ్మచర్యంలో ఉండాలని, నా మతాన్ని అనుసరించాలని, చర్చికి తగ్గట్టుగా ఉండాలని మాత్రమే అనుకున్నా.

''దేని గురించి అయినా ఆలోచించే సమయం అప్పుడు లేదు. లోపలికి రావడం చాలా తేలిక. కాన్వెంట్ నుంచి బయటకు రావడం నేను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన విషయం'' అని ఫ్రాన్సిలియా అంగీకరించారు.

జంటగా ఇప్పుడు కలిసి జీవిస్తున్న వారిద్దరికీ మతంపై తమ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలనేదే పెద్ద సమస్యగా మారింది.

కాన్వెంట్‌ నుంచి బయటికొచ్చిన ఏడాది తర్వాత, వాళ్ల పెళ్లికి రెండేళ్ల ముందు 2025 అక్టోబరులో రోమన్ క్యాథలిక్ చర్చ్‌కు తొలి లాటిన్ అమెరికా నాయకుడు అయిన పోప్ ఫ్రాన్సిస్ స్వలింగ జంటలకు, ఇతర ప్రత్యేక జంటలకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆశీర్వాదం ఇవ్వడానికి అనుమతిచ్చారు.

అయితే చర్చ్ ఇప్పటికీ స్వలింగ సంబంధాలను పాపంగా భావిస్తుందని, స్వలింగ వివాహాలను అధికారికంగా గుర్తించదని అన్నారు.

''నేను ఫ్రాన్స్‌లియా ఇంట్లో ఎక్కువ మాట్లాడుకునే విషయం ఇదే. మనిషిరూపంలోని జీసస్‌ని, దైవరూపంలోని జీసస్‌ని వేర్వేరుగా చూడలేం. ఆయన ఒక్కరే. అలాగే మా లైంగికతను, విశ్వాసాన్ని వేర్వేరుగా చూడలేం. ఎందుకంటే అవి రెండూ మాలోనే ఉన్నాయి. మతపరమైన విశ్వాసాలున్న జంట మాది'' అని లుయిజా చెప్పారు.

మతం, చర్చ్, స్వలింగ వివాహాలు, నన్స్, సిస్టర్స్

ఫొటో సోర్స్, Courtesy of Francília Costa and Luiza Silvério

ఫొటో క్యాప్షన్, లుయిజా, ఫ్రాన్సిలియా పెళ్లికి బహుమతిగా వారి పెళ్లిఫోటోలు తీస్తామని ఇద్దరు ఫోటోగ్రాఫర్లు చెప్పారు.

‘మమ్మల్ని కలిపింది దేవుడే’

ఈ జంట ఇప్పటికీ కాన్వెంట్‌లో ఉండేవారితో కాంటాక్ట్‌లోనే ఉంది. కానీ చర్చి తరఫున ఎవరూ వాళ్ల పెళ్లికి హాజరు కాలేదు.

''కానీ మాకు చాలా ప్రేమ, సందేశాలు అందాయి. ఆ రోజు మాకోసం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి'' అని లుయిజా చెప్పారు.

''చర్చిలో తీసుకున్న ఫోటో మా దగ్గర లేకపోవచ్చు. కానీ బ్రెజిల్‌లో ఎంతో గౌరవించే మేరీ మాత విగ్రహం దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఫోటో మా దగ్గర ఉంది. మాకు ఆమె సంతోషాన్ని, సహాయాన్ని అందిస్తుంది. మా కుటుంబాన్ని దేవునికి దగ్గర చేస్తుంది'' అని తెలిపారు.

టీనేజర్లుగా ఉన్నప్పుడు తమను కాన్వెంట్‌ వైపు ఆకర్షించిన సేవాభావాన్ని ఇప్పుడు కూడా వారు విడిచిపెట్టలేదు.

సోషల్ మీడియాలో వారి కథను షేర్ చేసిన తర్వాత లైంగికత, లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్ల నుంచి విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి.

''మా కథ గురించి, మా లైంగికత గురించి, మా విశ్వాసం గురించి మామూలుగా మట్లాడాలన్న కోరికను ఇది మరింత బలపర్చింది. ఇది పూర్తిగా అర్ధవంతమైనది. చాలామందికి ఉపయోగపడుతుంది'' అని లుయిజా చెప్పారు.

‘‘వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ప్రపంచంలో క్యూపిడ్ (ప్రేమను కలిపే వ్యక్తి) ఎవరైనా ఉంటే మా విషయంలో ఆ పాత్రను దేవుడే పోషించాడని చెప్తాం’’ అని అన్నారు లుయిజా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)