భారత రూపాయి రోజురోజుకీ పడిపోతుంటే.. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు మాత్రం ఎలా బలపడుతున్నాయి?

మనీ, రూపాయి, డాలర్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 8 నిమిషాలు

నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రి అయినప్పుడు అమెరికన్ డాలర్ విలువ 58.94 రూపాయలుగా ఉంది.

మోదీ రెండోసారి ఎన్నికల్లో గెలిచి వచ్చేసరికి రూపాయి విలువ 17 శాతానికి పైగా పడిపోయింది. 2019 మే 30 నాటికి డాలర్‌ విలువ 69.37 రూపాయలకు చేరింది.

నరేంద్ర మోదీ 2024 జూన్‌లో మూడోసారి బాధ్యతలు చేపట్టే సమయానికి 83.38 రూపాయలకు చేరుకుంది. అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూపాయి విలువలో 20 శాతానికి పైగా క్షీణత నమోదైంది.

ఈ మూడో విడత పదవీకాలంలో రెండేళ్లు పూర్తయ్యే సరికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.96 వద్ద ఉంది. ఈ రెండేళ్లలోనే 14.75 శాతం మేర విలువ తగ్గింది. మొత్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో రూపాయి విలువ 62.33 శాతం పతనమైంది.

అయితే, అంతకుముందు ప్రభుత్వాలలో రూపాయి విలువ పడిపోలేదని కాదు. రూపాయి బలహీనపడటం అనేది అన్ని ప్రభుత్వాల కాలంలోనూ జరిగింది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల (2004-2014) పాలనలో కూడా రూపాయి విలువ 31.65 శాతం క్షీణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలేసియా కరెన్సీ 'రింగిట్' విలువలో చాలా వృద్ధి నమోదైంది.

2004 మే నెలలో మన్మోహన్ సింగ్ భారత ప్రధాన మంత్రి అయినప్పుడు ఒక డాలర్ కోసం 45.31 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయే సమయానికి అది 60 మార్కుకు చేరుకుంది.

ప్రస్తుతం భారత కరెన్సీ రూపాయి బలహీనపడటంపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తన పోటీ దేశాల కంటే వేగంగా వృద్ధి చెందుతుంటే, ఆ దేశ కరెన్సీ బలోపేతం అవుతుంది.

కానీ, భారతదేశం విషయంలో అలా జరగడం లేదు. ఒకప్పుడు మోదీ ఆర్థిక విధానాలను ప్రశంసించిన సుర్జీత్ భల్లా సైతం, ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకుపోతుంటే రూపాయి ఎందుకు పడిపోతోందనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ ప్రభుత్వ విధానాలను ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణియన్ ప్రశ్నించారు.

ఏటా బలహీనపడుతున్న రూపాయి

గడచిన కొన్నేళ్లలో భారత ఆర్థిక వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో రూపాయి ఏటా బలహీనపడుతూనే వస్తోంది.

గత ఏడాది ఈ పతనం మరింత వేగవంతమైంది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారీ దిగుమతి సుంకాలను విధించడమే ఇందుకు కారణం.

ఆ తర్వాత ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం రూపాయిని వరుసగా సరికొత్త రికార్డు స్థాయి కనిష్టాలకు నెట్టింది.

మార్చి చివర, ఏప్రిల్ ప్రారంభంలో రూపాయిని నిలబెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా చర్యలు చేపట్టింది. కానీ, ఈ చర్యల వల్ల కొద్దిపాటి ఉపశమనం మాత్రమే లభించింది. దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లడం ఆగలేదు.

రూపాయి బలహీనపడటానికి కేవలం ఇరాన్ యుద్ధం మాత్రమే కారణం కాదని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒకప్పుడు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ కూడా అభిప్రాయపడుతున్నారు.

అరవింద్ సుబ్రమణియన్ మే 26న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన వ్యాసంలో, "యుద్ధానికి ముందు రెండు మూడేళ్ల కాలంలో తుర్కియేని మినహాయిస్తే బహుశా మరే దేశ కరెన్సీ కూడా భారత రూపాయి అంతగా పడిపోలేదు. రూపాయిని కాపాడేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అసాధారణ స్థాయిలో జోక్యం చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. 2022 నుంచి 2026 ఫిబ్రవరి మధ్య రూపాయి 20 శాతానికి పైగా క్షీణించింది. ఆర్‌బీఐ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది" అని తెలిపారు.

భారత రూపాయి బలహీనపడితే, ఆసియాలోని అనేక ఇతర దేశాల కరెన్సీలు మాత్రం బలోపేతమయ్యాయి.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలేసియా ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఆ దేశ కరెన్సీ సాధిస్తున్న వృద్ధిని బట్టే తెలుస్తోంది.

మలేసియా

మలేసియా కరెన్సీ 'రింగిట్' గత ఏడాది 9.25 శాతం బలోపేతం కాగా, అదే ఏడాది భారత రూపాయి 4.40 శాతం బలహీనపడింది.

మలేసియా రింగిట్ గత ఏడేళ్లలోనే అత్యంత బలమైన స్థాయికి చేరుకుంది. 2025 జనవరిలో ఇది దాదాపు 4.50 స్థాయికి పడిపోయినప్పటికీ, ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. ఈ అంచెలంచెల వృద్ధి రింగిట్‌ను ఆగ్నేయాసియాలోనే అత్యంత వేగంగా బలోపేతమవుతున్న కరెన్సీగా నిలిపింది.

దీని వెనుక అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి, మలేసియాపై విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం పెరగడం ఇందులో ఒకటి.

మలేసియా కరెన్సీ రింగిట్ బలోపేతం కావడానికి గల కారణాలను 'నిక్కీ ఆసియా' తన రిపోర్టులో వివరిస్తూ, "దీని వెనుక దేశ కరెంట్ అకౌంట్ మిగులు, బలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థ, 2025లో నమోదైన 4.9 శాతం జీడీపీ వృద్ధి రేటు వంటి ప్రాథమిక ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఎఫ్‌డీఐలలో కూడా వేగవంతమైన వృద్ధి కనిపించింది, ఇది స్థానిక కరెన్సీ డిమాండ్‌ను పెంచింది. 2025 జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో, మూడో త్రైమాసికంలో నికర విదేశీ పెట్టుబడుల ప్రవాహం 8.5 బిలియన్ రింగిట్లకు చేరుకుంది. రెండో త్రైమాసికంలో ఇది కేవలం 1.6 బిలియన్ రింగిట్లు మాత్రమే ఉంది" అని తెలిపింది.

నిక్కీ ఆసియాతో ఆగ్నేయాసియా ఆర్థిక నిపుణురాలు డోరిస్ లీయూ మాట్లాడుతూ, "రింగిట్ బలోపేతం కావడం అనేది మలేసియా వ్యాపార వాతావరణంపై పెరుగుతున్న ఆశాజనక ధోరణికి నిదర్శనం. ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రణాళికలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ విస్తరణ, చైనా, యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్య దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మలేసియా వ్యూహాత్మక దౌత్యం ఫలితంగా ఈ మార్పు చోటుచేసుకుంది" అని తెలిపారు.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్ కరెన్సీ 'బాట్' విలువ కూడా పుంజుకుంది.

థాయ్‌లాండ్

అమెరికా డాలర్‌తో పోలిస్తే బ్రాండ్ ఇమేజ్‌ను చాటుకుంటూ, బలంగా పుంజుకున్న ప్రధాన ఆసియా కరెన్సీలలో థాయ్‌లాండ్ కరెన్సీ 'బాట్' కూడా ఒకటిగా నిలిచింది.

జనవరి నెలలో బాట్ మరింత బలోపేతమై, ప్రతి డాలర్‌కు 31 కంటే కింది స్థాయికి చేరుకుంది. ఇది 2021 జూన్ తర్వాత నమోదైన అత్యంత బలమైన స్థాయి.

(ఒక థాయ్ బాట్ సుమారు 2.94 రూపాయలకు సమానం)

ఒక ఏడాది కిందటి నాటి పరిస్థితితో పోలిస్తే ఇందులో 10 శాతానికి పైగా వృద్ధి కనిపించింది.

"థాయ్‌లాండ్ ఒక చిన్న, సంపూర్ణ ఉదార ఆర్థిక వ్యవస్థ. పైగా ఎగుమతులపై ఆధారపడే దేశం, కాబట్టి బాట్ బలోపేతం కావడం మా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది" అని థాయ్‌లాండ్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి ఏకనితి నితిథాన్‌ప్రపాస్ జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అన్నారు.

కరెన్సీ పుంజుకోవడానికి థాయ్‌లాండ్ కరెంట్ అకౌంట్ మిగులు ప్రధాన కారణమని ఏకనితి వివరించారు. ఒక ఏడాది కిందట అమెరికాతో థాయ్‌లాండ్ వాణిజ్య మిగులు 35.6 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2025 నాటికి అది 51.3 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇందులో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కీలకపాత్ర పోషించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, థాయ్‌లాండ్ ద్రవ్య విధానం సాపేక్షంగా సరళంగానే ఉంటూ వచ్చింది. సాధారణ పరిస్థితులలో ఇటువంటి విధానం వడ్డీ రేట్ల వ్యత్యాసాన్ని తగ్గించి స్థానిక కరెన్సీని బలహీనపరుస్తుంది, అయినప్పటికీ బాట్ మాత్రం నిరంతరాయంగా బలపడుతూనే వచ్చింది.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

చైనా

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చైనా కరెన్సీ 'రెన్మిన్బీ (యువాన్)' మూడేళ్లలోనే అత్యంత బలమైన స్థాయికి చేరుకుంది.

మే 11న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, డాలర్‌తో పోలిస్తే రెన్మిన్బీ రోజువారీ మార్పిడి విలువను 6.8467గా ఖరారు చేసింది. 2023 మార్చి తర్వాత ఈ స్థాయిలో రెన్మిన్బీ బలపడటం ఇదే మొదటిసారి.

చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువగా ఉంచడం వల్లే ఆ దేశ వాణిజ్య మిగులు పెరుగుతోందని అమెరికా, ఐరోపా దేశాలు సుదీర్ఘకాలంగా ఆరోపిస్తున్నాయి.

గత ఏడాది యూరోతో పోలిస్తే రెన్మిన్బీ విలువ దాదాపు ఎనిమిది శాతం తగ్గింది. దీనివల్ల యూరోపియన్ యూనియన్‌కు చైనా చేసిన ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

రెన్మిన్బీ విలువను ఇప్పటికీ దాదాపు 20 శాతం తక్కువగానే అంచనా వేశారని, రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే ఇది మరింత బలోపేతం కావచ్చని 'గోల్డ్‌మన్ సాక్స్' అంచనా వేస్తోంది. చైనాలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణ క్షీణత (డిఫ్లేషన్) కూడా, యువాన్ తన అసలు విలువ కంటే బలహీనంగానే ఉందనే ఆందోళనను పెంచింది.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింగపూర్ డాలర్ సైతం గత ఏడాదితో పాటు ఈ ఏడాది ఐదు నెలల కాలంలో బాగా బలోపేతమైంది.

సింగపూర్

సింగపూర్ కరెన్సీని సింగపూర్ డాలర్ అంటారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే సింగపూర్ డాలర్ కూడా బలోపేతమైంది. గత ఐదు నెలల్లో ఇది దాదాపు ఒక శాతం మేర పుంజుకుంది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్‌కు 1.28 సింగపూర్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.

నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి లభిస్తున్న ఆదరణ సింగపూర్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.

ఇదేవారం సోమవారం నాడు సింగపూర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన ఆరు శాతంగా నమోదైంది. అయితే ఏప్రిల్‌లో దీని అంచనా 4.6 శాతంగా మాత్రమే ఉంది.

గత ఏడాది సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం వృద్ధి చెందింది. ఇది అంతకుముందు వేసిన 4.8 శాతం అంచనా కంటే ఎక్కువ.

సింగపూర్ ఏప్రిల్ నెలలో అత్యంత బలమైన వాణిజ్య గణాంకాలను నమోదు చేసింది.

దేశ ప్రధాన చమురుయేతర దేశీయ ఎగుమతులు ఏప్రిల్‌లో 24.5 శాతం పెరిగాయి. ఇది 2012 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 66.7 శాతం మేర భారీగా దూసుకెళ్లాయి. ఆసియా వ్యాప్తంగా కనిపిస్తున్న ఏఐ ఆధారిత పారిశ్రామిక వృద్ధిలో ఇది కూడా ఒక భాగంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చివరకు పాకిస్తాన్ రూపాయి కూడా ఈ నెలల్లో స్థిరంగా కొనసాగుతోంది.

పాకిస్తాన్

చివరకు, పాకిస్తాన్ రూపాయి సైతం స్థిరంగా కొనసాగుతోంది. గత ఆరు నెలల్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 1.31 శాతం బలోపేతం కాగా, ఇదే కాలంలో భారత రూపాయి ఆరు శాతానికి పైగా క్షీణించింది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 278 పాకిస్తాన్ రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.

దుబయ్‌కి చెందిన 'ఖలీజ్ టైమ్స్' వార్తా వెబ్‌సైట్‌తో సెంచురీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వలేచా మాట్లాడుతూ, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇటీవలి నెలల్లో పాకిస్తాన్ రూపాయి స్థిరంగా ఉందని తెలిపారు.

ఆ కథనం ప్రకారం, మార్చి త్రైమాసికంలో నమోదైన కరెంట్ అకౌంట్ మిగులు ఇందుకు ఒక ప్రధాన కారణం. ఇది పెరిగిన చమురు ధరలు, భౌగోళిక రాజకీయ (జియోపాలిటికల్) ముప్పుల సమయంలోనూ విదేశీ మార్పిడి నిల్వలపై ఒత్తిడిని తగ్గించింది.

దీనితో పాటు సౌదీ అరేబియా నుంచి లభించిన మద్దతు, నాలుగు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ యూరోబాండ్ మార్కెట్లోకి తిరిగి అడుగుపెట్టడం వంటి పరిణామాలు పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచాయి. అలాగే స్వల్పకాలిక నిధుల ఆందోళనలను కూడా తగ్గించాయి.

విజయ్ వలేచా ఇంకా మాట్లాడుతూ, "రూపాయి స్థిరత్వానికి బలమైన దేశీయ ఆర్థిక పురోగతి కంటే మెరుగైన అంతర్జాతీయ పరిస్థితులే ఎక్కువ దోహదం చేశాయి. రూపాయి బలోపేతం కావడం మరికొంత కాలం ముందుకు సాగవచ్చు, కానీ ఇందుకు సంబంధించిన సానుకూల అంశాలు ఇప్పటికే మార్కెట్ ధరల్లో ప్రతిఫలించాయి. ఒకవేళ చమురు ధరలు అదుపులో ఉండి, విదేశీ మార్పిడి నిల్వలు మెరుగై, విదేశాల నుంచి వచ్చే నిధులు (రెమిటెన్స్) బలంగా ఉంటూ, బయటి నిధుల రాక ఇలాగే కొనసాగితే రూపాయి మరింత బలోపేతం కావచ్చు" అని పేర్కొన్నారు.

రూపాయి పతనం, కరెన్సీ విలువ, భారత్, ఆసియా దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ఒక అమెరికా డాలర్ ధర సుమారు 96 రూపాయలుగా ఉంది.

రూపాయి పతనం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?

భారత కరెన్సీ రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. రూపాయి విలువ పడిపోయినప్పుడు ముడిచమురు, వంటగ్యాస్, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ వంటి నిత్యవసర వస్తువుల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. భారత్ వీటిలో చాలా వాటిని విదేశాల నుంచే కొనుగోలు చేస్తుంది.

బలహీనపడే రూపాయి అంతర్జాతీయ పెట్టుబడిదారుల లాభాలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల వారు ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూసేలా చేస్తుంది.

మే నెల ముగిసే సమయానికి విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.

స్థానిక స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ మూలధనం బయటకు వెళ్లిపోతుండటం వల్ల భారతదేశానికి కరెంట్ అకౌంట్ లోటును సమతుల్యం చేసుకోవడం సవాలుగా మారింది.

అయితే, దీనికి మరోవైపు కూడా ఉంది. బలహీనమైన రూపాయి భారతీయ ఎగుమతులను అంతర్జాతీయంగా మరింత పోటీతత్వంతో నిలబెడుతుంది. ఎందుకంటే విదేశాలలో భారతీయ వస్తువులు, సేవల ధరలు చౌకగా మారుతాయి.

బ్రిటన్ వంటి దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇది అమెరికా విధిస్తున్న సుంకాల ఒత్తిడి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది.

విదేశాలలో పనిచేస్తున్న భారతీయులు పంపే డబ్బుపై ఆధారపడే కుటుంబాలకు కూడా రూపాయి బలహీనపడటం ప్రయోజనకరంగా మారుతుంది. ఎందుకంటే, వారు పంపే ప్రతి డాలర్‌కు ఇక్కడ ఎక్కువ రూపాయలు లభిస్తాయి.

2025 మార్చి నాటికి ముగిసిన ఒక ఏడాది కాలంలో భారతదేశానికి 135 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రెమిటెన్స్ (విదేశీ నిధులు) అందాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)