ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతి, హత్యలకు ముందు తీసుకున్నారని చెబుతున్న సెల్ఫీ వీడియోలో ఏముందంటే..

షాబాద్ ఆరు హత్యలు, రాజ్ కుమార్ మృతి, రంగారెడ్డి, పోక్సో కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ శివార్లలోని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికినట్లు పోలీసులు తెలిపారు.
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు పి. రాజ్ కుమార్ మరణించారని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికినట్లు పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని హత్య చేసిన కేసులో రాజ్ కుమార్ నిందితుడు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, సోమవారం ఆయన మృతదేహం లభ్యమైంది.

''రాజ్ కుమార్‌కి చాలా సిమ్ కార్డులున్నాయి. మాకున్న సమాచారం ప్రకారం 16 సిమ్ కార్డులు వాడారు. బెట్టింగ్ యాప్‌లు వాడే అలవాటుతో ఇన్ని సిమ్‌లు వినియోగించాడు. ఫోన్లు కూడా చాలా మార్చాడు. ఆయనకు దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పు ఉన్నట్లు మాకు తెలిసింది. దీనివల్ల ఆయన మానసికంగా డిస్టర్బ్ అయ్యాడు'' అని కమిషనర్ తరుణ్ జోషి మీడియాతో చెప్పారు.

తాజా ఘటనలో హత్యలు చేయడానికి ఆయన కారును అద్దెకు తీసుకున్నారని కమిషనర్ చెప్పారు. రాజ్ కుమార్‌ని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వివరించారు.

''ఈరోజు మధ్యాహ్నం సుమారు 2-3 మధ్య మాకు 100 నంబర్‌కి ఒక ఫోన్ వచ్చింది. పెంజెర్ల దగ్గర ఒక వెంచర్లో మృతదేహం ఉందని చెప్పారు. మేం వెళ్లి చూసిన తరువాత అది రాజ్ కుమార్‌దే అని గుర్తించాం. ఆ మృతదేహంతో పాటు ఫోన్, బస్ టికెట్, ఇతర వస్తువులు దొరికాయి. పక్కనే ఒక లీటర్ పురుగుల మందు డబ్బా కనిపించింది. బహుశా ఆ పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని మేం అనుకుంటున్నాం. ఆయన దగ్గర రూ.1,260 నగదు కూడా దొరికింది'' అని తరుణ్ జోషి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షాబాద్ ఆరు హత్యలు, రాజ్ కుమార్ మృతి, రంగారెడ్డి, పోక్సో కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి

ఫోన్‌లో సెల్ఫీ వీడియో: కమిషనర్

హత్యలు జరిగిన జులై 10వ తేదీ సాయంత్రం 4.55కి తన ఫోన్‌లో రాజ్ కుమార్ ఒక వీడియో రికార్డు చేసుకున్నారని కమిషనర్ తరుణ్ జోషి అన్నారు.

రాజ్ కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్నామని ఒక ఫోన్‌ను మీడియాకు చూపించారు. అందులో 2.26 నిమిషాల వీడియో ఉందనీ, అందులో కొంత భాగం వినిపిస్తానని సీపీ చెప్పారు. ఆ వీడియోను ప్లే చేసి కొంత భాగం మీడియాకు వినిపించారు.

రాజ్ కుమార్ విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు ఆ వీడియోలో చెప్పారని కమిషనర్ అన్నారు. అదే విషయాన్ని హత్యలు చేసిన తరువాత రాజ్ కుమార్ తన తండ్రికి చెప్పారని వివరించారు.

పోలీస్ కమిషనర్ వినిపించిన ఆ వీడియోలో.. ''పైసలన్నీ వాళ్లకే పెట్టాను. 2 ఎకరాలు అమ్మి సగం వాళ్లకే పెట్టాను. ఏం చేసుకున్నారో తెలియదు. నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాక్ చేసి.. నాకు ఇద్దరు పిల్లలు, నా పిల్లలకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా ఆ అమ్మాయిని నమ్మి అప్పుల పాలై భూమి లేకుండా చేసుకున్నా. చివరకు నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. నన్ను ఇంత మోసం చేసినందుకు ఆ అమ్మాయిని, ఆ కుటుంబంలో వాళ్ల…'' అన్న మాటలు మాత్రం వినిపించాయి.

ఆ అమ్మాయి కుటుంబమే తనను వాడుకొని మోసం చేసిందని వీడియోలో రాజ్ కుమార్ ఆరోపించారు.

అయితే రాజ్ కుమార్‌కి, ఆ అమ్మాయికి మధ్య సన్నిహిత సంబంధం ఉందా? అని బీబీసీ ఇంతకుముందే అమ్మాయి మేనమామను ప్రశ్నించింది. ఆ ఆరోపణను ఆయన తిరస్కరించారు.

షాబాద్ ఆరు హత్యలు, రాజ్ కుమార్ మృతి, రంగారెడ్డి, పోక్సో కేసు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, భార్య(మధ్యలో), కుమారుడితో రాజ్ కుమార్

అసలేం జరిగింది?

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు.

జులై 10వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ తెల్లారేలోగా పి. రాజ్‌కుమార్ ఆరుగురిని హత్య చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

''రాజ్‌కుమార్‌పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. మొదట తనపై ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. ఆపై అదే గ్రామంలోని తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు చిన్న పిల్లలను చంపారు. ఇదంతా రాత్రి 11-12 గంటల మధ్య జరిగింది'' అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంతకుముందు ప్రచురితమైన బీబీసీ పూర్తి కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)