విశాఖపట్నం: ‘‘అవకాశం ఉన్నంతవరకు ఈదండి అంటూ నా కళ్ల ముందే మా అన్నయ్య సముద్రంలో మునిగిపోయాడు’’

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, 1) చిన్నఅమ్మోరు 2) కర్రి చిన్న 3) కె.గరగయ్య 4) అమర అప్పలరాజు 5) రాగుతు బండియ్య 6) కె.సీతోడు 7) కె.చిన్నయ్య. వీరిలో కర్రి చిన్న మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

విశాఖ సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో బోటు బోల్తాపడిన ఘటనలో గల్లంతైన ఆరుగురి మత్స్యకారుల కోసం కొనసాగించిన ఆపరేషన్‌ను నిలిపివేశారు.

గల్లంతైన ఆరుగురి కోసం భారత తీర రక్షక దళం, నౌకాదళం, మెరైన్ పోలీసులు 72 గంటలపాటు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో...ఆపరేషన్‌ను ముగిస్తున్నట్లు మత్స్యశాఖ జాయిట్ డైరెక్టర్ వర్థన్ తెలిపారు. దీనిపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు అందచేస్తుందని చెప్పారు.

జూలై 1న విశాఖ తీరం నుంచి వేటకి వెళ్లి జూలై 4న వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వేట ముగించుకొని తిరిగొస్తుండగా బోటు తిరగబడి ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో ఏడుగురు మత్స్యకారులు ఉండగా వారిలో కర్రి చిన్నా మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.

చిన్నాను కాపాడి విశాఖ తీసుకుని వచ్చిన కోస్టుగార్డు సిబ్బంది అతడ్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఎక్కువ సమయంలో నీటిలో ఉండిపోవడంతో గుండెలో నొప్పి వచ్చిందని...ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బోటు మునిగిపోయిన తర్వాత సముద్రంలో తాను పడిన వేదనను చిన్నా వివరించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, UGC

‘‘బోటునే పట్టుకుని ఉండిపోయాం’’

జూలై 1తెల్లవారు జామున సుమారు 3 గంటలకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటు (IND-AP-MM-V5-83) లో మొత్తం మేం ఏడురుగు మత్స్యకారులం వేటకు బయలుదేరాం.

ఎప్పుడూ వెళ్లే జట్టే మాది. వేట బాగా సాగింది. ఇంతలో వాతావరణం బాగాలేదని వార్తలు వస్తున్నాయి. సముద్రంలో పరిస్థితి కూడా కల్లోలంగానే ఉంది. దాంతో హార్బర్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నాం.

"మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీరానికి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాం. అప్పటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ అల బోటును బలంగా తాకడంతో అది బోల్తా పడింది. అందులో ఉన్న మొబైల్ ఫోన్లు, సామగ్రి అన్నీ సముద్రంలో పడిపోయాయి. బోటు తిరగబడిన వెంటనే అన్నయ్య కొడుకు చంటి కనిపించలేదు. అలల్లో కొట్టుకుపోయి ఉంటాడనుకున్నాం. మేమంతా తిరగబడిన బోటునే పట్టుకుని సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు ఆరు గంటలు సముద్రంలోనే ఉన్నాం. తర్వాత మరో భారీ అల తాకడంతో మాకు ఆధారంగా ఉన్న బోటు కూడా మునిగిపోవడం ప్రారంభమైంది" అని ఆయన వివరించారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, శోకసంద్రంలో మునిగిపోయిన గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు

‘అన్నయ్య చివరివరకు ఈదమన్నాడు’

"బోటు పూర్తిగా మునిగిపోతుండటంతో ఇక ఈదడం తప్ప మరో మార్గం లేదని అర్థమైంది. ఆ సమయంలో మా పెద్దన్నయ్య, 'అవకాశం ఉన్నంత వరకు ఈదండి... ఏదైనా బోటు లేదా పెద్ద నౌక కనిపిస్తే వారి సాయంతో బతుకుతారు. నేను మాత్రం రాలేను' అని చెప్పి నా కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాడు.

అప్పటికే ఇద్దరు కనిపించకుండా పోయారు. మిగిలిన ఐదుగురం ఈదడం ప్రారంభించాం. కానీ రాత్రి అవుతున్న కొద్దీ ఒక్కొక్కరూ నా కళ్ల ముందే కనిపించకుండా పోయారు. చివరకు నేనొక్కడినే మిగిలాను. చుట్టూ చీకటి, ఎత్తైన అలలు తప్ప ఇంకేమీ కనిపించలేదు" అని చిన్నా తెలిపారు.

"దాదాపు 9 గంటల పాటుఈదాను. శరీరంలో శక్తి పూర్తిగా తగ్గిపోయింది. గుండెల్లో నొప్పి కూడా మొదలైంది. అయినా కుటుంబం గుర్తుకు రావడంతో బతకాలని నిర్ణయించుకున్నాను. అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఉదయం7 గంటల ప్రాంతంలో ఒక మర్చంట్ నౌక కనిపించింది. వెంటనే 'హెల్ప్... హెల్ప్...' అంటూ గట్టిగా అరిచాను. నౌక సిబ్బంది నన్ను గుర్తించి లైఫ్ జాకెట్ విసిరారు. దాన్ని వేసుకుని తాడుతో నౌకపైకి ఎక్కాను. పైకి చేరిన వెంటనే స్పృహ కోల్పోయాను." అని సముద్రంలో ఏం జరిగిందో చిన్నా వివరించారు.

తనతో పాటు వెళ్లిన వారంతా బంధువులేనని, ప్రమాదంలో ప్రాణాలతో పాటు వారి కుటుంబాల జీవనాధారం కూడా పోయిందని కారి చిన్న చెప్పారు.

"బోటు పూర్తిగా మునిగిపోయింది. మొబైల్ ఫోన్లు కూడా నీటిలో పోవడంతో కుటుంబాలకు సమాచారం ఇవ్వలేకపోయాం. ఇప్పటికీ నా బంధువుల ఆచూకీ తెలియదు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. మాకు ఉన్న జీవనాధారం ఆ బోటే. అది కూడా పోయింది. ప్రభుత్వం, అధికారులు బాధిత కుటుంబాలను ఆదుకుని, అవసరమైన సాయం అందిస్తేనే వారు తిరిగి నిలదొక్కుకోగలరు" అని చిన్నా కోరారు.

జానకిరామ్
ఫొటో క్యాప్షన్, బోటు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని జానకిరామ్ కోరారు.

‘కేంద్రానికి ఫిర్యాదు’

జూలై 4వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటలకే జిల్లా కలెక్టర్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ప్రమాద సమాచారం అందించినప్పటికీ, మరుసటి రోజు ఉదయం వరకు సమర్థవంతమైన గాలింపు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ బీబీసీతో అన్నారు.

ప్రాణాలతో బయటపడిన కారి చిన్నా ఇచ్చిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల వరకు మత్స్యకారులు ప్రాణాలతోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, అయినప్పటికీ రక్షణ చర్యలు ఆలస్యం కావడం కారణంగా వారిని కాపాడలేకపోయారని ఆయన పేర్కొన్నారు.

మత్స్యకారుల గల్లంతు ఘటనపై దర్యాప్తు చేయాలని మత్స్యకార సంఘాల తరపున డిమాండ్ చేశారు.

"బోటు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను పూర్తి స్థాయిలో కొనసాగించాలి. ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి." అంటూ ప్రభుత్వాన్ని వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, గల్లంతైన మత్స్యకారుల కుటుంబీకులు

బాధిత కుటుంబాలకు సహాయం...

బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 లక్షల చొప్పున అందజేయాలని విశాఖపట్నం కలెక్టర్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

పడవలోని మత్స్యకారులు గల్లంతైన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదన, ఆందోళన, అనిశ్చితి ఎంతగానో కలచివేస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు.

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని కనిపెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ ముగిసినప్పటీకి...ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అచ్చెంనాయుడు తెలిపారు

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, నూకమ్మ

మాకు దిక్కెవరు?

జులై 4వ తేదీ మధ్యాహ్నం 3గంటల కల్లా వచ్చేస్తామని చెప్పిన తమ కుటుంబసభ్యుల ఆచూకీ ఇంకా తెలియదని తెలుసుకుని మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. తమ వారు రావడం ఆలస్యమైతే వారి ఫోన్లకు ప్రయత్నిస్తే...వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌ వచ్చాయి. దీంతో తమకు అప్పుడే ఆందోళన మొదలైందని భీమిలికి చెందిన బండియ్య సోదరి కోదండ కన్నీళ్లు పెట్టుకున్నారు.

విశాఖ ఫిష్పింగ్ హార్బర్ వద్ద ఉన్న మత్స్యశాఖ కార్యాలయానికి చేరుకుని తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు పడ్డారు.

"ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు తీరానికి చేరుకుంటామని ఫోన్‌ చేశారు. కానీ రాలేదు. వచ్చేస్తామని ఫోన్ చేసి రెండు రోజులైపోతోంది. ఏం చేయాలో అర్థం లేదు" అని మరో మత్స్యకార మహిళ నూకమ్మ బీబీసీతో చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన నూకమ్మ మనవడు అప్పలరాజు వేట వెళ్లి గల్లంతైన వారిలో ఒకరు. అతనికి ఇటీవలే వివాహమైంది.

'ఏదో పని దొరకుతుందని భోగాపురం నుంచి వైజాగ్ వచ్చాం. నా మనవడు అప్పలరాజు ఏమయ్యాడో తెలియడం లేదు. మిగతా వారు కూడా మా బంధువులే. వీరు తిరిగి రాకపోతే మా కటుంబాలను ఆదుకునేదెవరు?' అని నూకమ్మ ప్రశ్నిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)