విశాఖ: యారాడలో ఫిషింగ్ జెట్టీ గురించి స్థానికులు కొందరిలో ఆగ్రహం, మరికొందరిలో ఆనందం ఎందుకు? అసలేమిటీ జెట్టీ...

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 6 నిమిషాలు
విశాఖ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న అందమైన గ్రామం యారాడ.
కొండలు, సముద్రం మధ్య ప్రశాంతంగా జీవించే ఈ గ్రామం ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనతో కలవరపడుతోంది.
యారాడ దగ్గర ఫిషింగ్ జెట్టీ నిర్మాణం ఆలోచన… యారాడతో పాటు గంగవరం గ్రామాల్లో ఆందోళనకు దారితీసింది.
ఒకవైపు జీవనోపాధి కోల్పోతామన్న యారాడ రైతుల భయం.. మరోవైపు జెట్టీ కోసం ఎదురు చూస్తున్న గంగవరం మత్స్యకారుల ఆశలు...
ఇంతకీ ఈ రెండు గ్రామాల్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏం చేయనుంది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్….

జెట్టీ అంటే ఏమిటి?
సముద్రం దగ్గర నిలబడి చూస్తే… నీళ్లలోకి ముందుకు పొడిగించి కట్టిన నిర్మాణమే జెట్టీ. ఇది ప్రధానంగా పడవలు, చిన్న నౌకలు సురక్షితంగా నిలిచేలా చేయడానికి ఉపయోగపడుతుంది.
మత్స్యకారులు తమ పడవలను కట్టే స్థలం. అలాగే, సరుకులను ఎక్కించడం, దింపడం జరిగే చోటు కూడా ఇదే.
ఇంకో ముఖ్యమైన పని ఏమిటంటే… అలలు నేరుగా తీరాన్ని తాకకుండా కొంత మేర అడ్డుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక విశాఖ లాంటి తీర ప్రాంతాల్లోని జెట్టీలైతే పర్యాటక ఆకర్షణలుగా కూడా మారాయి.
అయితే… జెట్టీ లేకపోతే ఏమవుతుందనే అనుమానం కూడా వస్తుంది..
పడవలు తీరానికి సురక్షితంగా చేరుకోవడం కష్టమవుతుంది. అలలు నేరుగా తాకి వాటిని తిప్పికొట్టే ప్రమాదం ఉంటుంది.
సరుకులు ఎక్కించడం, దింపడం కష్టమవుతుంది. ముఖ్యంగా మత్స్యకారులకు ఇది పెద్ద సమస్య.
వర్షాకాలం లేదా గాలివానల సమయంలో… సముద్రంలోకి వెళ్లడం మరింత ప్రమాదకరంగా మారుతుంది.
తీర ప్రాంతాల్లో రవాణా, వాణిజ్యం, జీవన విధానం అన్నీ ప్రభావితమవుతాయి.

'తీర గ్రామమే... కానీ, మత్స్యకార గ్రామం కాదు'
గ్రౌండ్ రిపోర్టులో భాగంగా గంగవరం, యారాడ గ్రామాలకు బీబీసీ బృందం వెళ్లింది.
పారిశ్రామిక ప్రాంతం గాజువాకకి సమీపంలోని యారాడ కొండ చేరుకోవాలంటే కొంత ఘాట్ రోడ్ ప్రయాణం చేయాలి.
విశాఖలో ఎక్కడ నుంచైనా కనిపించే డాల్ఫిన్స్ నోస్ అనే పేరున్న కొండే ఈ యారాడ కొండ. అక్కడ తూర్పు నౌకాదళం కార్యాలయాలు, క్వార్టర్లు కొన్ని ఉన్నాయి.
అక్కడే కొండపై ఉన్న డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ ఇప్పటికీ సేవలను అందిస్తుంది.
ఇక్కడ 1873 నుంచి ఉన్న పాత లైట్ హౌస్ ప్రకృతి విపత్తులకు ధ్వంసం కావడంతో...1957లో అప్పటి రవాణా శాఖ మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ఈ లైట్ హౌస్‌ని తిరిగి ప్రారంభించారు.
ఈ లైట్ హౌస్ దాటుకుని కొండ దిగువకు వెళ్తే... కోనసీమను తలపించే విధంగా కొబ్బరి చెట్ల మధ్య ఒక అందమైన తీర ప్రాంత గ్రామం యారాడ కనిపిస్తుంది.
తీర ప్రాంత గ్రామమే అయినా గ్రామంలో ఎక్కడ మత్స్యకార నివాసాలు కనిపించవు. కానీ, తీరంలో కొన్ని వేట పడవలు కనిపించాయి.

"యారాడ సముద్రంలో చేపలు ఎక్కువగా దొరుకుతాయని గంగవరం ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారులు ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకుంటారు. మేం దానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు" అని యారాడకు చెందిన రైతు రాము బీబీసీతో అన్నారు.
"యారాడలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులే ఉంటారు. మా జీవనోపాధి వ్యవసాయమే. అరటి, కొబ్బరి, మామిడి, బొప్పాయి, జీడిమామిడి పంటలు పండిస్తాం. గ్రామంలో దాదాపు 6 వందల ఎకరాలలో పంటలు పండుతాయి. మా గ్రామంలో మొత్తం 5600 మంది జనాభా. అందులో మత్స్యకారులెవరు లేరు" అని అరటి రైతు చిట్టిబాబు బీబీసీతో చెప్పారు. తీర ప్రాంతానికి అనుకుని ఉన్న ఆయన అరటి తోటకు బీబీసీ బృందాన్ని తీసుకెళ్లారు.
"తీర ప్రాంతమే అయినా ఇక్కడి ప్రజలకు చేపల వేట వృత్తి కాదు. కొండల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటితో మేం వ్యవసాయం చేస్తున్నాం. మా ఊరు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది" అని మరో గ్రామస్థుడు విశ్వనాథ్ చెప్పారు.

'జెట్టీ వస్తే మా ఊరు మునిగిపోతుంది'
జెట్టీ నిర్మాణం వల్ల గ్రామం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని యారాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
"జెట్టీ కడితే సముద్రం ముందుకు వచ్చి మా ఇళ్లు ముంచేస్తుంది. మేం పూర్తిగా నివాసాలు కోల్పోతాం" అని గ్రామస్థులు వెంకట అప్పారావు, హేమంత్ బీబీసీతో అన్నారు.
''అధికారులు ఈ మధ్య కాలంలో మా గ్రామానికి వచ్చి జెట్టీ నిర్మాణం కోసం కొన్ని కొలతలు తీసుకున్నారు. అదంతా మేం చూశాం. కానీ, అసలు జెట్టీ నిర్మాణంపై మా గ్రామంలోని ఎవరితోనూ ఇటు అధికారులు గానీ, అటు ప్రజా ప్రతినిధులు గానీ ఎవరూ చర్చించలేదు" అని యారాడ గ్రామస్థులతో మాట్లాడినప్పుడు వారు ఆరోపించారు.
‘‘ఏదైనా తీర ప్రాంతంలో జెట్టీ నిర్మిస్తే... సమీపంలోని ఇళ్లు మునిగిపోతాయని చెప్పలేం. అది ఆ జెట్టీ నిర్మిస్తున్న ప్రాంతం, సమీపంలో ఉన్న గ్రామాల మధ్య భౌగోళికంగా ఉన్న స్థితిగతులపై ఆధారపడుతుంది. దానిని అంచనా వేసిన తర్వాతే జెట్టీ నిర్మాణం జరుపుతారు" అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ రీజియన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి బీబీసీతో చెప్పారు.

'టూరిజమే మాకు మేలు'
యారాడ ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఫోటోషూట్లు, సినిమా షూటింగులకు యారాడ కొండ, బీచ్ హాట్ స్పాట్లు.
మేం వెళ్లినప్పుడు కూడా ఇటు యారాడ బీచ్‌కు చేరుకునే రోడ్డులో, బీచ్‌లో ఫోటో షూట్లు జరుగుతున్నాయి.
"ఎక్కడెక్కడి నుంచో ఫోటోషూట్లకు వస్తున్నారు. యారాడ చాలా ఫేమస్ అయింది. ఇక్కడికి వచ్చే పర్యటకులపై ఆధారపడే మేం ఈ దుకాణాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాం. ఇక్కడ జెట్టీ నిర్మిస్తే మా బతుకులు ఏమైపోతాయి?" అని యారాడ బీచ్ వద్ద మొక్కజొన్నలు అమ్ముకుంటున్న వెంకటలక్ష్మీ బీబీసీతో అన్నారు.
"జెట్టీ వద్దు… మాకు టూరిజమే మేలు" అని మరో గ్రామస్థుడు వెంకట అప్పారావు అంటున్నారు.

గంగవరం మత్స్యకారులేమంటున్నారంటే...
యారాడ మత్స్యకారులతో మాట్లాడి... యారాడ కొండ దిగువన ఉన్న గంగవరం మత్స్యకార గ్రామానికి బీబీసీ వెళ్లింది.
గంగవరం గ్రామానికి దగ్గరలో తీరం ఉండదు. అక్కడి మత్స్యకారులు సమీపంలో తీర ప్రాంతానికి వెళ్లాలంటే... కనీసం ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న యారాడ బీచ్‌కే రావాలి. అయితే, ప్రస్తుతం గంగవరం మత్స్యకారులు చేపల వేటకు వివిధ ప్రాంతాలకు వెళ్తూ జీవనోపాధిని వెతుక్కుంటున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో గంగవరం మత్స్యకారులు జెట్టీకి మద్దతు ఇస్తున్నారు. యారాడలో జెట్టీ వస్తే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని చెప్తున్నారు.
"గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో మా మత్స్యకారులు ఇళ్లు, ఆస్తులు, ప్రాణాలు పొగొట్టుకున్నారు. అప్పుడు జరిగిన ఒప్పందంలో భాగంగా...యారాడలో జెట్టీ నిర్మిస్తామని మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికైనా ఆ హామీ నిలబెట్టుకోవాలి" అని గంగవరానికి చెందిన మత్స్యకారుడు వెంకట కుమార్ బీబీసీకి చెప్పారు.
జెట్టీ వల్ల చేపల వేటకు వెళ్లే మాకు మంచి జరగడమే కాదు... యారాడ వాళ్లకి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గంగవరం మత్స్యకారులు బీబీసీతో అన్నారు.
‘‘యారాడ గ్రామస్థులకు జెట్టీ వద్దు, గంగవరం మత్స్యకారులకి జెట్టీ కావాలి. ప్రభుత్వం యారాడలో జెట్టీ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తోంది. పైగా యారాడ పర్యటక ప్రాంతం. కాబట్టి దానికి నష్టం లేకుండా… మా మత్స్యకారులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అని గంగవరంకు చెందిన మత్స్యకారుడు అమ్మోరు బీబీసీతో చెప్పారు.

అధికారుల మాటేమిటి?
జిల్లా మత్స్యశాఖ అధికారులతో బీబీసీ మాట్లాడింది. యారాడలో జెట్టీ కోసం పరిశీలన చేసినట్లు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు.
"మారిటైమ్ బోర్డు, స్టీల్ ప్లాంట్ అధికారులతో కలిసి యారాడను సందర్శించాం. జెట్టీ నిర్మాణంపై డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. ఆ నివేదిక రావడానికి ఇంకా సమయం పడుతుంది" అని జాయింట్ డైరెక్టర్ లక్షణరావు చెప్పారు.
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాత్రం జెట్టీ నిర్మాణాన్ని సమర్థిస్తున్నారు.
"జెట్టీ వల్ల చేపల వ్యాపారం పెరుగుతుంది. కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. యారాడ మరింత అభివృద్ధి చెందుతుంది" అని ఆయన అన్నారు.
అలాగే రెండు గ్రామాల ప్రజలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

పరిష్కారమేంటంటే..
యారాడలో జెట్టీ నిర్మాణం... పర్యటక అభివృద్ధి వర్సెస్ మత్స్యకారుల జీవనోపాధి అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది.
ఒకవైపు జీవనోపాధి కోల్పోతామన్న యారాడ రైతుల భయం… మరోవైపు జెట్టీ కోసం ఎదురుచూస్తున్న గంగవరం మత్స్యకారుల ఆశల మధ్య ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. రెండు గ్రామాల ప్రజలతో చేసే చర్చలపైనే ఆధారపడి ఉంటుందని యారాడ, గంగవరం గ్రామస్థులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































