వినికిడి శక్తి: 'ఒక్కసారి పోతే.. పూర్తిగా పోయినట్లే', మళ్లీ వినడం అసాధ్యమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలిజబెత్ యాన్ బ్రౌన్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
రాకెట్ లాంచ్‌లు, డెత్ మెటల్ కాన్సర్ట్‌లు (మ్యూజిక్ కాన్సర్ట్స్) మాత్రమే వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం కావు. మనం చేసే అనేక రోజువారీ పనులు కూడా వినికిడిని దెబ్బతీయొచ్చు. రాబోయే దశాబ్దాల్లో మీ చెవులను కాపాడుకోవడానికి మీరేం చేయగలరో ఈ కథనంలో చూద్దాం..
మీరు రోజూ వెళ్లే జిమ్‌ను నిర్లక్ష్యం చేసినా.. కొద్దినెలలు కష్టపడి మళ్లీ మీరు మీ కండలను పునర్నిర్మించుకోవచ్చు. కానీ, మీ వినికిడి శక్తి? దీన్ని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ పొందలేరు.
''ఒక్కసారి పోతే, అది పూర్తిగా పోయినట్లే'' అని అమెరికాలోని ఒహియోకు చెందిన క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో ఆడియాలజిస్ట్, హియరింగ్ లాస్ స్పెషలిస్ట్ వాలెరీ పావ్లోవిచ్ రఫ్ తెలిపారు.
కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గుతుందని మనకు ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ, టీనేజర్లు, 10 ఏళ్లలోపు పిల్లలతో సహా, మరింత చిన్న వయస్సు రోగుల్లో వినికిడి లోపానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు ఆడియాలజిస్టులు.

"మనం చిన్న వయసులో ఉన్నప్పుడు చెవులను కాపాడుకునే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించం" అని అరిజోనాలోని మాయో క్లినిక్‌కు చెందిన ఆడియాలజిస్ట్ జేమీ బోగల్ చెప్పారు.
కేవలం రాకెట్ ప్రయోగాలు, డెత్ మెటల్ కాన్సర్ట్స్ (మ్యూజిక్ కాన్సర్ట్స్) గురించి మాత్రమే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజువారీ చేసే అనేక పనులు కూడా ఆశ్చర్యకరమైన రీతిలో మీ దీర్ఘకాలిక వినికిడిపై ప్రభావాన్ని చూపగలవు.

ఫొటో సోర్స్, BBC/ Serenity Strull/ Getty Images
వినికిడి శక్తి ఎలా పనిచేస్తుంది?
మీ కర్ణభేరి దాటి, చెవి లోపలి భాగంలో 'కాక్లియా' అనే ద్రవంతో నిండిన ఒక గది ఉంటుంది. దీని లోపలి పొరల్లో వేలాది సూక్ష్మ రోమ కణాలు ఉంటాయి.
ప్రతి కణం పైభాగంలో డజన్ల కొద్దీ సున్నితమైన చిన్న చిన్న వెంట్రుకల కుచ్చులు ఉంటాయి. అలాగే కింది భాగంలో ఒక నాడీ కణం ఉంటుంది. ఈ నాడీ కణం శ్రవణ నాడికి అనుసంధానమై ఉంటుంది. ఇది మెదడుకు విద్యుత్ సంకేతాలను చేరవేస్తుంది.
తరంగాల రూపంలో శబ్దం చెవిలోకి ప్రవేశించినప్పుడు, ఈ చిన్న వెంట్రుకలు గాలికి చెట్లు ఊగినట్లుగా ఊగుతాయి. ఈ వెంట్రుకల కదలిక విద్యుత్ ప్రేరణలుగా మారుతుంది. దీనిని మన మెదడు శబ్దంగా గ్రహిస్తుంది.
ఎక్కువ సేపు భారీ శబ్దాలు విన్నప్పుడు, అవి పెనుగాలుల మాదిరిగా పని చేసి, ఈ చిన్నచిన్న రోమాలను వంగిపోయేలా చేస్తాయి లేదా విరిచేస్తాయి. మీ కనురెప్పల వెంట్రుకల మాదిరిగా ఇవి మళ్లీ పెరగవు.
''మనిషి చెవిలోని సూక్ష్మ రోమ కణాలు మీరు పుట్టినప్పుడే ఉంటాయి'' అని పావ్లోవిచ్ రఫ్ తెలిపారు.
''ఒకసారి ఈ కణాలను కనుక కోల్పోతే... శాశ్వతంగా వీటిని కోల్పోయినట్లే. వాటిని మళ్లీ ఫిక్స్ చేయడం కుదరదు'' అని పావ్లోవిచ్ రఫ్ చెప్పారు.
జీబ్రాఫిష్, కోడి వంటి కొన్ని జాతుల్లో ఈ రోమ కణాలు తిరిగి పెరగడం ద్వారా ప్రేరణ పొంది.. ఈ సూక్ష్మ రోమ కణాలను తిరిగి పెంచే జన్యు చికిత్సలపై ప్రస్తుతం పరిశోధకులు పనిచేస్తున్నారు.
అయితే, అప్పటి వరకు.. దీనికి చేయాల్సిందల్లా.. మీకున్న వాటిని రక్షించుకోవడమేనని పావ్లోవిచ్ రఫ్ సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీ శబ్దాలను ఎక్కువసేపు వినడం
''సాధారణంగా లైవ్ మ్యూజిక్ మైకులు, ఎప్పుడూ చాలా పెద్ద శబ్దంతోనే వస్తుంటాయి" అని పావ్లోవిచ్ రఫ్ అన్నారు.
అలాంటి వేదికల వద్ద వచ్చే ఆ మొత్తం శబ్ద తీవ్రత కేవలం 10 లేదా 15 నిమిషాలకే లోపలి చెవికి నష్టం కలిగిస్తుందని ఆమె వివరించారు.
"కాన్సర్ట్ మొత్తం వినాలనుకుంటే, కచ్చితంగా ఇయర్‌ప్లగ్స్ ధరించాలి. అయితే, సాధారణ ఫోమ్ ఇయర్‌ప్లగ్స్ అయితే, సంగీతం అసలు శబ్దాన్ని కాస్తా మార్చివేస్తాయి'' అని చెప్పారు.
దానికి బదులుగా, శబ్ద స్వభావాన్ని మార్చకుండా దానిని మృదువుగా మార్చే "హై-ఫిడెలిటీ ప్లగ్స్"ను కొనుక్కోండి. "మీరు 25 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2500) లేదా అంతకంటే తక్కువ ధరకే కొన్ని చాలా మంచి హై-ఫిడెలిటీ ప్లగ్స్‌ను పొందవచ్చు" అని పావ్లోవిచ్ రఫ్ చెప్పారు.
సంగీత ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజిషియన్ ఇయర్‌ప్లగ్స్‌ను కొనాలనుకుంటే, వాటి ధర సుమారు 175 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.16 వేల కంటే ఎక్కువగా ఉంటుంది. వాటిని ఆడియాలజిస్టులు అమరుస్తారు.
క్రీడా కార్యక్రమాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే స్టేడియంలు తరచుగా తమ అభిమానుల కేరింతల శబ్దాల గురించి గొప్పగా చెప్పుకుంటాయి.
"క్రీడా కార్యక్రమాలలో పసిపిల్లలు వినికిడి రక్షణ పరికరాలు ధరించడం నేను తరచుగా చూస్తుంటాను, కానీ వారి తల్లిదండ్రులు ధరించరు" అని పావ్లోవిచ్ రఫ్ అన్నారు.
"మరి మీ చెవుల సంగతేంటి? ఈ చిన్నారులు పెద్దయ్యాక వారి అరుపులు వినాలని అనుకోరా?" అని పావ్లోవిచ్ రఫ్ ప్రశ్నించారు.
''ఎక్కువ సేపు పాటు పెద్ద శబ్దాన్ని వినడం వల్ల, టీనేజర్లు, చిన్న పిల్లలు వినికిడి శక్తిని కోల్పోతున్నారు'' అని పావ్లోవిచ్ రఫ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లినిక్‌లో ఇటీవల చికిత్స చేసిన ఆరేళ్ల చిన్నారి కేసును ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె వినికిడికి సంబంధించి తన కుటుంబం ఎలాంటి తేడాను గుర్తించనప్పటికీ.. తన స్కూల్ ల్యాప్‌టాప్‌లో గరిష్ట వాల్యూమ్ పెట్టడం వల్ల ఆమె చెవికి కలిగిన నష్టానికి సంబంధించిన ఆనవాళ్లను పావ్లోవిచ్ రఫ్ గమనించారు.
స్వీడన్‌లో తొమ్మిదేళ్ల పిల్లల్లో జరిపిన ఒక అధ్యయనంలో.. తరచూ హెడ్‌ఫోన్లు వాడే పిల్లలు, వాడని పిల్లల మధ్య వినికిడి శక్తిలో గణాంకాలపరంగా స్పష్టమైన తేడా ఉన్నట్లు గమనించారు.
స్పీకర్ల ద్వారా వచ్చే పెద్ద శబ్దాలు, వ్యక్తిగత ఆడియో పరికరాల (హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు వంటి) వాడకం వల్ల 35 ఏళ్లలోపు వయసున్న దాదాపు 135 కోట్ల మంది ప్రజలు అకస్మాత్తుగా వినికిడి లోపం బారినపడే ప్రమాదం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం చాలా పరికరాలు 'యాక్టివ్ వాల్యూమ్ లిమిటర్స్'తో శబ్దాలను సురక్షితమైన స్థాయిలకే పరిమితం చేస్తున్నాయని, ఈ నిబంధనలను గౌరవించడం చాలా ముఖ్యమని పావ్లోవిచ్ రఫ్ అన్నారు.
''మీరు హెడ్‌ఫోన్లు పెట్టుకున్నప్పుడు, మీకు దగ్గరగా నిలబడిన వ్యక్తితో సాధారణంగా మాట్లాడగలుగుతుంటే ఏ సమస్యా లేనట్లే. కానీ, అవతలి వ్యక్తి మీతో అరవాల్సి వస్తే లేదా వారు చెప్పేది మీకు వినబడకపోయినా.. వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందని అర్థం'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC
మరమ్మతులు, ప్రయాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గార్డెనింగ్, ఇల్లు మరమ్మతులు చేసేటప్పుడు కాస్త శబ్దం వస్తుంటుంది. ఈ శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు, అమెరికాలోని చాలా ప్రాంతాల్లో శబ్దం చేసే గ్యాస్‌తో నడిచే పరికరాలకు బదులు, ఎలాంటి శబ్దం చేయని ఎలక్ట్రిక్ పరికరాలతో రీప్లేస్ చేయడాన్ని తప్పనిసరి చేశారు.
అంతేకాక, ఈ పనులు చేసేటప్పుడు చెవికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇయర్ ప్రొటక్షన్ పెట్టుకోవాలి. అది ఇయర్‌ప్లగ్‌లైనా లేదా ఓవర్-ది-ఇయర్ ఇయర్‌మఫ్‌లైనా అని పావ్లోవిచ్ రఫ్, బోగల్ తెలిపారు.
''ఇయర్‌మఫ్స్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ, మంచి శబ్ద రక్షణను అందిస్తాయి. వాటిని పెట్టుకోవడంలో పొరపాటు జరగడం కూడా కష్టమే" అని బోగల్ చెప్పారు.
శబ్దాలతో కూడిన పనులు చేసేటప్పుడు పాడ్‌కాస్ట్ లేదా మ్యూజిక్ వినాలనుకుంటే, నాయిస్-క్యాన్సిలింగ్ ఇయర్‌మఫ్స్ వాడటం మంచిది అని బోగల్, పావ్లోవిచ్ రఫ్ తెలిపారు.
వాతావరణం బాగున్నప్పుడు, కారు కిటికీ కిందకి దించి, లోపలికి తాజా గాలిని ఆహ్వానించాలని చాలామంది కోరుకుంటారు. అయితే, ఎలాంటి రద్దీ లేకుండా నిశ్శబ్దంగా ఉండే వీధుల్లో అలా చేయడం ఓకే. కానీ, జాతీయ రహదారిపై కారు కిటికీ తెరిచి ప్రయాణించడం వినికిడి శక్తికి హాని కలిగించవచ్చని పావ్లోవిచ్ రఫ్ హెచ్చరిస్తున్నారు.
మీరు భావించే దానికంటే పెద్దగా గాలి శబ్దం చేస్తుంది. కిటికీ కిందకి దించి కారు నడిపే అలవాటు ఉన్న ప్రజల్లో ఒకవైపు వినికిడి కోల్పోవచ్చని ఆడియాలజిస్టులు చెబుతున్నారు.
బైకులు నడిపే వారు ఎప్పుడూ ఇయర్‌ప్లగ్‌లు పెట్టుకోవాలని సూచించారు. కానీ, హై-ఫిడెలిటీ ప్లగ్‌లను వాడటం వల్ల ఎమర్జెన్సీ వాహనాలను, ఇతర ట్రాఫిక్ శబ్దాలను మీరు వినగలరు.

ఫొటో సోర్స్, Getty Images
ఇయర్‌ప్లగ్‌ల అతి వినియోగం
ఇది చదివిన తర్వాత, మీరు అనుకున్నదానికంటే తరచుగా ఇయర్‌ప్లగ్‌లు పెట్టుకోవాలని మీకు అనిపించొచ్చు, అలా అనుకుంటున్నది మీరొక్కరే కాదు.
మీ చెవి లోపల ఏదైనా పెట్టుకునేటప్పుడు మీరు చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
చెవి అనేది దానికదే సొంతంగా శుభ్రపరుచుకునే అవయవం. ఇయర్ కెనాల్‌ను తేమగా ఉంచడానికి, అలాగే చర్మానికి చెందిన మృత కణాలను, పేరుకుపోయిన బ్యాక్టీరియాను బయటకు పంపడానికి చెవి గులిమిని ఉపయోగిస్తుంది.
చర్మంపై ఉండే ఒక రకమైన 'కన్వేయర్ బెల్ట్' వ్యవస్థ వల్ల, మనం మాట్లాడేటప్పుడు లేదా నమలేటప్పుడు మన దవడల కదలికల వల్ల... ఆ చెవి గులిమి, అది మోసుకొచ్చే వ్యర్థాలన్నీ క్రమంగా కర్ణభేరి నుంచి చెవి బయటి రంధ్రం వైపుకు వస్తాయి. ఆ తర్వాత మనం స్నానం చేసేటప్పుడు అవి సహజంగానే బయటకు పోతాయి.
చెవి లోపల కాటన్ బడ్స్‌ను కానీ, ఇయర్‌ప్లగ్స్‌ను కానీ పెట్టుకున్నప్పుడు.. చెవి గులిమిపై ఒత్తిడి పడి, అది కర్ణభేరి గుండా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల దురద లేదా ఒత్తిడి వంటి భావన కలగవచ్చు. కాలక్రమేణా.. శబ్ద తరంగాలకు ఇది అడ్డులా మారుతుంది. దీంతో, చెముడు వస్తుంది. లోపలే కూరుకుపోయే బ్యాక్టీరియా, లోపలుండే తేమ కూడా ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు.
చెవి గులిమి ఉందని మీకనిపిస్తే.. ఈ అడ్డంకిని క్లియర్ చేసుకునేందుకు వైద్యుడిని లేదా ఆడియోలజిస్ట్‌ను కలవడం మంచిది. చెవి గులిమిని సాఫ్ట్‌గా మార్చే ఓవర్ ది కౌంటర్ డ్రాప్‌లు (ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే చుక్కల మందులు) అందుబాటులో ఉంటాయి. సిరంజీ, వేడి నీళ్లను వాడుతూ దాన్ని మెల్లగా బయటికి తీసేయొచ్చు.
చెవిలో గులిమి పేరుకుపోయి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రతి రాత్రి ఇయర్‌ప్లగ్‌లు ధరించకపోవడమే మంచిదని పావ్లోవిచ్ రఫ్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC
వినికిడి శక్తికి సంబంధించి ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి?
ఉదాహరణకు, అమెరికా అంతటా అనేక రాష్ట్రాలు పాఠశాలల్లో చిన్న పిల్లలకు వినికిడి లోపం ఉందేమో పరీక్షించడంలో చాలా బాగా పనిచేస్తున్నాయని బోగల్ చెబుతున్నారు. "అయితే, వయసు పెరిగేకొద్దీ ఏదైనా సమస్య కనిపించే వరకు మనం పెద్దగా పరీక్షలు చేయించుకోం" అని చెప్పారు.
మీకు 60 ఏళ్లు రావడానికి ముందే స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, వినికిడి కోల్పోవడం ఏ వయసులోనైనా జరగవచ్చు. శబ్ద వాతావరణం ఉన్నప్పుడు మాటలు వినడంలో ఇబ్బందులు పడుతుంటే, 30 ఏళ్లయినా, అంతకంటే చిన్నవారైనా జాగ్రత్తలు తీసుకోవాలని పావ్లోవిచ్ రఫ్ చెప్పారు.
''ఏదైనా ఇబ్బంది తలెత్తే ముందు, దాని మొదటి లక్షణం కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలని నేను సూచిస్తాను" అని పావ్లోవిచ్ రఫ్ అన్నారు.
"చాలాసార్లు, శబ్దం వల్ల కలిగే వినికిడి లోపానికి ముందు టిన్నిటస్.. అంటే చెవుల్లో రింగింగ్ శబ్దం వస్తుంది. కాబట్టి మీరు పెద్ద శబ్దానికి గురై.. మీ చెవుల్లో రింగింగ్ శబ్దం వస్తుంటే.. మీరు వినికిడి పరీక్ష చేయించుకోవడం మంచిది" అని సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























