‘‘నాకు బిడ్డ పుట్టినా గుర్తించలేక పోయాను’’ ప్రసవం తరువాత జ్ఞాపకశక్తి కోల్పోయిన తల్లి

శామినా అలీ

ఫొటో సోర్స్, Samina Ali

ఫొటో క్యాప్షన్, శామినా అలీ
ప్రచురణ
చదివే సమయం: 8 నిమిషాలు

"బయటకు చూస్తే నా గర్భధారణలో ఎలాంటి సమస్యా కనిపించలేదు. అప్పటికి నా వయసు చాలా తక్కువ. శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేదాన్ని. అయినా, మొదటి నుంచే ఏదో సరిగా లేదనే ఓ వింత అనుభూతి కలిగేది. ఆ అనుమానం నన్ను వదిలేది కాదు’’

ఏదో సరిగా లేదనే భావన రచయిత్రి సమీనా అలీని చిన్నప్పటి నుంచే వెంటాడుతూ వచ్చింది.

మతాచారాలను కట్టుదిట్టంగా పాటించే ముస్లిం కుటుంబంలో జన్మించిన శామినా బాల్యంలో కొంతకాలం భారత్‌లో, మరికొంతకాలం అమెరికాలో గడిపారు.

తాను దురదృష్టమైన రోజున పుట్టానని ఆమె తల్లిదండ్రులు నమ్మేవారు. దురదృష్టం, బాధలు ఆమెను వెంటాడతాయేమోననే భయపడుతుండేవారు. అందుకే వెండి తాయెత్తులు కట్టించి, తమకు చేతనైనంతగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించేవారు.

అయితే 1999లో ఆమె మొదటిసారి గర్భం దాల్చినప్పుడు, వైద్యులకు అలాంటి ఆందోళనలేవీ కలగలేదు. గర్భస్థ శిశువుకు చేసిన స్కానింగ్‌లో కనిపించిన దృశ్యాలు... వినిపించిన గుండె చప్పుడుతో పూర్తిగా నిశ్చింత చెందారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"పరుగెత్తే గుర్రం డెక్కల్లా ఎంతో బలంగా గుండె కొట్టుకుంటున్న శబ్దం తప్ప ఇంకేమీ లేదు," అని శామినా బీబీసీ వరల్డ్ సర్వీస్ 'ఔట్‌లుక్' కార్యక్రమంలో చెప్పారు.

"ఆ గుండె చప్పుడు గది మొత్తం మారుమోగింది. అప్పుడు నేనే అనవసరంగా భయపడుతున్నానేమో అనిపించింది. కానీ ఏడో నెలకు వచ్చేసరికి లక్షణాలు కనిపించడం మొదలైంది. శరీరం అంతా బాగా వాపొచ్చింది. కంప్యూటర్‌పై టైప్ చేస్తున్నప్పుడు వేళ్లు ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు అనిపించేది. వాంతులు అయ్యేవి. చూపు మసకబారడం మొదలైంది."

అయినా వైద్యులు మాత్రం, "నువ్వు చిన్న వయసులో ఉన్నావు... ఆరోగ్యంగానే ఉన్నావు... నీకు ఎలాంటి సమస్యా లేదు" అని చెబుతూనే ఉన్నారు.

ఇస్మాయిల్‌కు జన్మనిచ్చిన రోజుల గురించి సామినాకు కొద్దిగానే గుర్తుంది

ఫొటో సోర్స్, Samina Ali

ఫొటో క్యాప్షన్, ఇస్మాయిల్‌కు జన్మనిచ్చిన రోజుల గురించి సామినాకు కొద్దిగానే గుర్తుంది

ఏమిటీ ప్రీ-ఎక్లాంప్సియా?

అప్పట్లో ఇప్పుటిలా ఇంటర్‌నెట్‌లో వెంటనే సమగ్ర సమాచారం వెతికే అవకాశం లేదు. అందుకే శామినా, రచయిత అయిన ఆమె భర్త స్కాట్ ఇద్దరూ తమకు బాగా తెలిసిన మార్గాన్నే ఆశ్రయించారు.

"మేం పుస్తకాలనే ఆశ్రయించాం. ‘వాట్ టు ఎక్స్‌పెక్ట్ వెన్ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్’ అనే పుస్తకం చదివాం. ‘‘చివర్లో ప్రీ-ఎక్లాంప్సియా గురించి ఒక పేజీ ఉంది. అందులో కనిపించిన లక్షణాల జాబితాలో నాకున్న లక్షణాలు కూడా ఉన్నాయి’’ అని శామినా బీబీసీ వరల్డ్ సర్వీస్ 'ఔట్‌లుక్' కార్యక్రమంలో చెప్పారు.

ప్రీ-ఎక్లాంప్సియా అంటే గర్భధారణ సమయంలో వచ్చే ఒక ప్రమాదకర ఆరోగ్య సమస్య. ఇది ప్లాసెంటాలో తలెత్తే సమస్యలతో ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు వస్తుందో వైద్యులకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. అయితే ఇది తీవ్రమైన రూపం దాల్చితే మెదడు సహా శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుంది.

నల్లజాతి లేదా దక్షిణాసియా మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, మూత్రంలో ప్రొటీన్‌ పోవడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు దీనికి సంకేతాలు.

ఆందోళన మరింత పెరగడంతో శామినా, స్కాట్ మరోసారి వైద్యులను ఆశ్రయించారు.

"నా ప్రసవానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. అందుకే ఈసారి నా భర్తను కూడా వెంట తీసుకెళ్లాను. ఆయన తెల్లజాతీయుడు, పైగా పురుషుడు. బహుశా ఆయన చెపితే వైద్యులు వినొచ్చని అనుకున్నా" అని శామినా చెప్పారు.

అయితే ఆమెకు చికిత్స అందిస్తున్న ప్రసూతి నిపు ణుడు మాత్రం, "అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి" అని చెప్పి పంపించారు.

సామినా ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆస్పత్రిలో పేజీలకొద్దీ రికార్డులు తయారయ్యాయి

ఫొటో సోర్స్, Marissa Leshnov for The Washington Post via Getty Images

ఫొటో క్యాప్షన్, సామినా ఆరోగ్య పరిస్థితిని వివరించే పేజీలకొద్దీ రికార్డులు తయారయ్యాయి

అవి పురిటి నొప్పులు కావు

శామినాకు అసలు పీడకల పురిటినొప్పులప్పుడే మొదలైంది.

"నాకు భరించలేని నొప్పి వచ్చింది. అది పురిటి నొప్పి కాదు. నా ఛాతీలో... తలలో... ఏ క్షణాన్నైనా తల పగిలిపోతుందేమో అనిపించేంత తీవ్రమైన నొప్పి. నా శరీరం మొత్తం కుప్పకూలిపోతున్నట్టు అనిపించింది" అని ఆమె చెప్పారు.

"నా ప్రసవాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా నర్సుల వెనక నిలబడిపోయేవారు. నా రక్తపోటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మధ్య మధ్యలో నాకు స్పృహ తప్పుతూ, మళ్లీ వస్తూ ఉండేది. అందుకే నన్ను తడుతూ బిడ్డను బయటకు నెట్టమంటూ నర్సులు చెప్పాల్సి వచ్చేది. నాకు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అప్పటికే మెదుడలో స్ట్రోక్స్ మొదలయ్యాయి.. ఛాతీలో వస్తున్న ఆ నొప్పి... చివరికి గుండెపోటు అని తేలింది."

ఆ తర్వాత ఏం జరిగిందో శామినాకు పెద్దగా గుర్తు లేదు. కొత్తగా పుట్టిన తన బిడ్డను అప్పుడప్పుడూ చూసిన క్షణాలు... భరించలేని నొప్పి... ఇవే ఆమె జ్ఞాపకాల్లో మిగిలిపోయాయి.

"నాకు కొడుకు పుట్టడం, నర్సులు వాడిని తీసుకెళ్లి స్నానం చేయించడం, నేను మంచంపై ఒక కన్ను మూసి, మరో కన్నుతో వాడిని చూడాలని ప్రయత్నించడం కూడా గుర్తుంది" అని ఆమె 'ఔట్‌లుక్' కార్యక్రమంలో చెప్పారు.

"నా కుమారుడు పుట్టిన ఇరవై నిమిషాల తర్వాత నాకు తీవ్రమైన మూర్ఛ వచ్చింది. అది శరీరమంతా వ్యాపించిన సహజ మత్తుమందులా అనిపించింది. ఆ క్షణం నుంచి నాకు నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదు."

ఆ తర్వాత శామినా, ఆమె కుమారుడు ఇస్మాయిల్‌ను అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. పోషకాహార లోపంతో ఉన్న ఇస్మాయిల్‌ను ప్రసూతి వార్డులో ఉంచగా, మెదడు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లిన శామినాను న్యూరాలజీ విభాగంలో యంత్రాల సాయంతో ప్రాణాలు నిలబెట్టారు.

ఐదు రోజుల తర్వాత ఆమెకు చికిత్స అందించిన న్యూరాలజిస్ట్ "అద్భుత యువతి’ అంటూ పిలిచిన శామినా స్పృహలోకి వచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాలతో తల్లిదండ్రులను, సోదరులను గుర్తుపట్టగలిగింది. తన మాతృభాష ఉర్దూలో మాట్లాడగలిగింది. కానీ ఇంగ్లిష్ మాట్లాడటానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. తన భర్తను గుర్తుపట్టలేకపోయింది. తాను బిడ్డకు జన్మనిచ్చానన్న విషయమే ఆమెకు గుర్తు లేదు.

"నా జ్ఞాపకాలు తిరిగి రావడానికి నా కుమారుడిని కలవడం ఉపయోగపడుతుందని న్యూరాలజిస్ట్ భావించారు" అని శామినా చెప్పారు.

"అందుకే అతడిని ఇంక్యుబేటర్‌ నుంచి తీసుకొచ్చారు. మా కుటుంబ సభ్యుల స్పందన చూసి అది చాలా ముఖ్యమైన క్షణమని మాత్రం అర్థమైంది. కానీ ఊహించడానికి, చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి సహాయపడే నా మెదడు పనితీరు అప్పటికే దెబ్బతింది. ఏదో అసాధారణమైనది జరుగుతోందని తెలిసింది... కానీ అది ఏమిటో మాత్రం అర్థం కాలేదు."

తల్లి తొలిసారి తన నవజాత శిశువును గుండెలకు హత్తుకునే ఆ క్షణం అందమైన జ్ఞాపకంగా మిగలాల్సింది. కానీ శామినా జీవితంలో అది అంతకంటే దారుణంగా మారింది.

"నర్సులు నా కుమారుడిని నా శరీరానికి అమర్చిన వైర్లు, గొట్టాలపైనే ఉంచారు. ఆ వైద్య పరికరాలపై మరో 2.7 కిలోల బరువు ఉండడం భరించలేనంత నొప్పిని కలిగించింది," అని ఆమె చెప్పారు.

"వాడు నా కొడుకేనని నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నేను భరించలేని నొప్పితో ఉన్నానన్న విషయమే. వాడిని నా మీద నుంచి తీసేయమని నర్సుతో చెప్పాలనుకున్నా మాట్లాడలేకపోయాను. నోట్లోంచి అస్పష్టమైన శబ్దాలు మాత్రమే వచ్చాయి. చివరకు వాడు నా చేతుల నుంచి జారిపోయాడు. ఆ క్షణంలో అందరి ఆనందం ఒక్కసారిగా భయంగా మారిపోయింది. మా ఇద్దరి తొలి కలయిక పూర్తిగా విషాదంగా ముగిసింది."

ఆ క్షణం ఎంత హృదయవిదారకమో అప్పటికి శామినా గ్రహించే స్థితిలో లేదు.

శామినా తన తల్లి నుంచి సాయం పొందాల్సిన పరిస్థితిలోకి పడిపోయారు. అదే సమయంలో ఆమెకు పుట్టిన బిడ్డ కూడా అమ్మమ్మపైనే ఆధారపడ్డాడు

ఫొటో సోర్స్, Samina Ali

ఫొటో క్యాప్షన్, శామినా తన తల్లి నుంచి సాయం పొందాల్సిన పరిస్థితిలోకి పడిపోయారు. అదే సమయంలో ఆమెకు పుట్టిన బిడ్డ కూడా అమ్మమ్మపైనే ఆధారపడ్డాడు

‘నా భర్తను దగ్గరకు రానిచ్చేదానిని కాను’

మరి ఆమె భర్త స్కాట్ పరిస్థితి?

"నేను చాలా దూకుడుగా ప్రవర్తించేదాన్ని. ఆయనను నా దగ్గరకు రానివ్వకుండా దూరంగా నెట్టేసేదాన్ని" అని శామినా చెప్పారు.

"ఆయన నా దగ్గరకు వచ్చిన ప్రతిసారీ నాకు భయమేసేది."

కొద్దికొద్దిగా శామినాకు ఇంగ్లిష్ మళ్లీ గుర్తుకు రావడం మొదలైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆమె మనసు, జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

"నా మెదడు ముక్కలైపోయినట్టే అనిపించేది" అని ఆమె చెప్పారు.

"ఆ ముక్కలన్నింటినీ దగ్గరగా చేర్చాల్సిన బాధ్యత నాదే. కానీ అది ఎంత కష్టమో అనుభవించినవారికే తెలుస్తుంది. మళ్లీ నిలబడి నడవడం... మాట్లాడటం నేర్చుకోవడం... చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం... ఇవన్నీ మొదటి నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది."

తాను కూడా అప్పుడే పుట్టిన తన కుమారుడిలాగే పూర్తిగా ఇతరులపై ఆధారపడే స్థితికి చేరుకున్నానని శామినా చెప్పారు.

"నేనూ ఒక చిన్నపిల్లలా మారిపోయాను. అది చాలా భయంకరమైన అనుభవం. అక్షరాలా అన్నింటినీ మళ్లీ నేర్చుకుంటున్నాను. నా 30 ఏళ్ల వయసులో... నా కుమారుడు ఏం నేర్చుకుంటున్నాడో నేనూ అదే నేర్చుకుంటున్నాను."

దాంతో అమ్మమ్మ శ్రద్ధ కోసం తనకూ, ఇస్మాయిల్‌కు మధ్య ఓ విచిత్రమైన పోటీ మొదలైంది.

"నాలో విపరీతమైన కోపం ఉండేది," అని శామినా చెప్పారు.

"నేను బతకాలి. అందుకు అమ్మ నాకు అండగా ఉండాల్సిందే అని అనుకునేదాన్ని. ఆమె నాకు సహాయం చేయనప్పుడు నేను అదుపు తప్పిపోయేదాన్ని. దాదాపు ఓ జంతువులా ప్రవర్తించేదాన్ని."

ఆస్పత్రి నుంచి ఇంటికి వెళితే, తెలిసిన పరిసరాలు కనిపించడం వల్ల శామినా జ్ఞాపకాలు క్రమంగా తిరిగి వస్తాయని ఆమెకు చికిత్స అందించిన న్యూరాలజిస్ట్ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా, సొంత ఇల్లే ఆమెకు పరాయిదిలా అనిపించింది.

"చుట్టూ వినిపించేదంతా అర్థంలేని శబ్దంలా అనిపించేది. ప్రపంచమంతా ఒక్కసారిగా వెలితిగా మారిపోయినట్టు ఉండేది," అని ఆమె చెప్పారు.

ఆస్పత్రిలో శామినా బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్న దృశ్యం. ఆమెకు ఇరువైపులా తల్లి, సోదరుడు ఉన్నారు.

ఫొటో సోర్స్, Samina Ali

పోరాడి... నిలబడి...

నా మెదడు మామూలు స్థితికి రావడానికి ఏడాదికిపైగా పడుతుందని వైద్యులు చెప్పారు. అంతవరకు భరించలేని తలనొప్పులతో బాధపడ్డాను. కొద్దిసేపు కూడా ఏ పని చేసే శక్తి ఉండేది కాదు. ఏ విషయమూ సరిగా అర్థమయ్యేది కాదు. నా మెదడంతా నిశ్శబ్దంగా మారిపోయినట్టు అనిపించేది. నేను ఉంటున్న శరీరమే నాదిగా అనిపించేది కాదు."

ఆరు వారాల తర్వాత... చివరకు శామినా మెదడు తనకు ఏం జరిగిందో, ఆ ఘటనలో తాను ఏం కోల్పోయిందో అర్థం చేసుకునే స్థితికి చేరుకుంది.

ఎన్నోసార్లు చూసినా గుర్తుపట్టలేకపోయిన తన పెళ్లి ఫొటో ఒక్కసారిగా ఆమెకు అర్థమైంది.

"అంతా ఒక్క క్షణంలో తిరిగి గుర్తొచ్చింది," అని ఆమె చెప్పారు.

"చివరికి నా జీవితం... నా ఇల్లు... అన్నీ గుర్తుపట్టగలిగాననే ఉపశమనం కలిగింది. కానీ అదే సమయంలో నేను ఎంత కోల్పోయానో కూడా అర్థమైంది. నా శరీరంపైనే నాకు కోపం వచ్చింది. అది నన్ను మోసం చేసిందని అనిపించింది."

ఆ భయానక ఘటనకు ముందు ఉన్న జీవితంలోకి తిరిగి వెళ్లడం మాత్రం దాదాపు అసాధ్యంగా మారింది. అందులో ముఖ్యంగా... ఆమె వైవాహిక జీవితంలోకి..

"అది కొత్తగా పుట్టినట్టే... మళ్లీ జన్మించినట్టే అనిపించింది," అని శామినా చెప్పారు.

"నేను కోలుకుంటున్న కొద్దీ... ఆ ప్రయాణం స్కాట్‌ను నెమ్మదిగా నా నుంచి దూరం చేస్తోందని ఆయన గ్రహించారు."

ఆ సమయంలో శామినా ఒక నవల కూడా రాస్తున్నారు.

తాను ఆపిన చోటు నుంచి మళ్లీ రచన కొనసాగించడం దాదాపు అసాధ్యమని ఆమె వైద్యుడు హెచ్చరించారు.

ప్రతి ఉదయం కంప్యూటర్ ముందు కూర్చొని, తానే రాసిన వాక్యాలను చదివితే అవి తనకే అర్థం కాకపోయేవి. తన మెదడే తనను మోసం చేస్తున్నట్టు అనిపించేది. అయినప్పటికీ శామినా వెనక్కి తగ్గలేదు.

"ఆ రచనను నేను వదల్లేదు. ఎందుకంటే అదే నాకు బతికే ఆధారం," అని ఆమె చెప్పారు.

"ధైర్యం అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది. మనల్ని జీవితం నేలకూల్చేస్తుంది. మనం నేలపై పడిపోతాం. కానీ మళ్లీ లేచి నిలబడాలా... వద్దా... అన్న నిర్ణయం కూడా అక్కడే తీసుకుంటాం."

ఐదేళ్ల తర్వాత శామినా పురస్కారాలు అందుకున్న నవల ‘మాడ్రస్ ఆన్ రెయినీ డేస్’ ను ప్రచురించారు.

ఆ పుస్తకం ప్రచురించడం ఆమె కోలుకునే ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. తన కుమారుడు ఇస్మాయిల్‌తో ఉన్న బంధాన్ని కొత్తగా అర్థం చేసుకోవడం మరో ముఖ్యమైన మలుపైంది.

"నా జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు తిరిగి వచ్చిన తర్వాత, వాడితో నాకు ఎంతో బలమైన అనుబంధం ఏర్పడింది" అని ఆమె చెప్పారు.

‘‘వాడు చిన్నగా మాటలు పలకడానికి ప్రయత్నించినప్పుడు... అది ఎంత కష్టమో నాకు తెలుసు. నడవడానికి ప్రయత్నిస్తూ పడిపోయినప్పుడు... ఆ అనుభవం కూడా నాకు అర్థమైంది. ఒకప్పుడు వాడిపట్ల నాలో ఉన్న అసహనం... క్రమంగా ఎంతో గాఢమైన అనుబంధంగా మారిపోయింది. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం అలాగే ఉంది."

దాదాపు మూడు దశాబ్దాలు గడిచాయి. ఇస్మాయిల్ పుట్టిన పదేళ్ల తర్వాత శామినాకు మరో కుమార్తె కూడా జన్మించింది.

వెనక్కి తిరిగి చూస్తే... శామినా నిజంగానే మళ్లీ లేచి నిలబడ్డారు. అంతే కాదు... ఆ ధైర్యాన్ని నిలబెట్టుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)