టీటీటీఎస్: గర్భంలోని ఏకరూప కవలల్లో ఒకరు అసాధారణంగా పెరుగుతూ, మరొకరు ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొనే ఈ సమస్యకు ఓ వినూత్న చికిత్స దారి చూపిందా?

కవల పిల్లల చికిత్స, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్), బ్రియోనీ

ఫొటో సోర్స్, Brioney Garrett

ఫొటో క్యాప్షన్, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్) బారినపడిన కవలలు
    • రచయిత, ఫిలిప్పా రాక్స్‌‌‌‌‌‌బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గర్భధారణ ప్రారంభ దశలోనే ఒక అరుదైన, తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న కవల శిశువుల జీవితాల్లో శక్తిమంతమైన ధ్వని తరంగాలను ఉపయోగించిన ఒక వినూత్న చికిత్సా విధానానికి, ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.

ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్) బారినపడిన కవల పిండాల మధ్యన రక్తప్రసరణ అసమానంగా ఉంటుంది. దీనివల్ల ఒక శిశువు ప్రమాదకరస్థాయిలో ఎదుగుదల లోపానికి గురవుతుంది మరొక శిశువు అసాధారణంగా పెరుగుతుంది. ఇది ఇద్దరి ప్రాణాలకు ముప్పే.

బ్రియోనీ గారెట్ గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె కవల కుమార్తెల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు, లండన్‌లోని ఒక ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యకు కారణమైన రక్తనాళాలను మూసివేయడానికి ఈ చికిత్సను ఉపయోగించారు.

ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ఈ చికిత్స కారణంగా నాన్సీ, మార్గో అనే ఆ కవల పిల్లలు ఆరోగ్యంగా జన్మించారు. ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉన్న వీరు త్వరలోనే బడికి వెళ్లనున్నారు.

ఈ ప్రయోగంలో పాల్గొన్న 10 మంది మహిళల్లో ఐదుగురికి అదనపు చికిత్స అవసరమైంది. అలాగే చికిత్స అనంతరం 20 మంది కవల శిశువుల్లో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కవల పిల్లల చికిత్స, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్), బ్రియోనీ

ఫొటో సోర్స్, Brioney Garrett

ఈ పరిశోధన నిర్వహించిన క్వీన్ షార్లెట్ అండ్ చెల్సి ఆసుపత్రి పరిశోధకులు, తల్లి కడుపులోకి సూది లేదా టెలిస్కోప్ తరహా పరికరాలను ప్రవేశపెట్టకుండా, ఈ సమస్యకు చికిత్స అందించే విధానం అందుబాటులోకి రావడం ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు.

అయితే ఈ చికిత్సను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలంటే మరింత మంది గర్భిణులపై మరింతగా అధ్యయనాలు నిర్వహించి, ఇదొక సమర్థవంతమైన చికిత్స అని నిరూపించాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

"మేము ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయేదో అనే ఆలోచన ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. రోజూ ఆ దేవుడి దయను గుర్తుచేసుకుంటా" అన్నారు బ్రియోనీ.

సులభంగా సాగిన చికిత్స

బ్రియోనీ విషయంలో మాత్రం చికిత్స మరింత సులభంగా జరిగింది. దీనికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. ప్రత్యేకంగా రూపొందించిన యంత్రం ద్వారా ఆమె మావిలోని సూక్ష్మ రక్తనాళాలపై శక్తివంతమైన అల్ట్రాసౌండ్ తరంగాలను ప్రయోగించారు.

"చాలా వేగంగా పూర్తయింది. అంతగా నొప్పి కూడా అనిపించలేదు" అని ఆమె తెలిపారు.

ఒకే మావిని పంచుకునే ఏకరూప కవల గర్భధారణల్లో 10 నుంచి 15 శాతం వరకు టీటీటీఎస్ సమస్య కనిపిస్తుంది. బ్రిటన్‌లో ప్రతి ఏడాది సుమారు 300 నుంచి 400 గర్భధారణల్లో ఈ పరిస్థితి తలెత్తుతుంది.

ఈ పరిస్థితిలో ఇద్దరు శిశువుల మధ్య రక్తప్రసరణ అసమానంగా ఉండటంతో ఎక్కువ రక్తం అందుకునే శిశువు చుట్టూ అధికంగా ద్రవం పేరుకుపోతుంది. మరోవైపు రక్తం దానం చేసే చిన్న శిశువు చుట్టూ ప్రమాదకర స్థాయిలో ద్రవం తగ్గిపోతుంది. దీంతో ఇద్దరు శిశువుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

సాధారణంగా ఈ సమస్యకు చికిత్సగా గర్భాశయంలోకి సూదిని ప్రవేశపెట్టి కొంత ద్రవాన్ని తొలగించడం లేదా లేజర్ సాయంతో రక్తనాళాలను మూసివేయడం చేస్తారు.

కవల పిల్లల చికిత్స, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్), బ్రియోనీ

ఫొటో సోర్స్, Brioney Garrett

ఫొటో క్యాప్షన్, నాన్సీ, మార్గో

దుష్ప్రభావాలు లేవు

బ్రియోనీతో పాటు బ్రిటన్, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన గర్భిణులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. గర్భధారణ ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్షల ద్వారా వారికి ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు.

ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌లో ఫీటల్ మెడిసిన్ అధికారి, ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ప్రసూతి శాస్త్ర ప్రొఫెసర్ క్రిస్టోఫ్ లీస్ ఈ పరిశోధనను ఎంతో ఆశాజనకమైనదిగా అభివర్ణించారు.

"పూర్తిస్థాయి అధ్యయనంలో కూడా ఇది విజయవంతమైతే, క్లిష్టమైన చికిత్స చేయించుకోవాల్సి వచ్చే అనేక మంది మహిళలకు ఇది ఆశాకిరణంగా నిలుస్తుంది" అని ఆయన అన్నారు.

శరీర అవయవాల అంతర్గత స్థితిని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ను ఉపయోగిస్తారు. దాన్ని అత్యంత సురక్షితమైన విధానంగా పరిగణిస్తారు. అయితే ఈ చికిత్సలో ఉపయోగించిన అల్ట్రాసౌండ్ పూర్తిగా భిన్నమైంది. ఇది అత్యంత కేంద్రీకృతమైన ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది.

ఈ తరంగాల వల్ల ఉత్పత్తి అయ్యే వేడి, చర్మానికి ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల లోతులో ఉండే, రెండు మిల్లీమీటర్ల మందమైన రక్తనాళాలను కూడా మూసివేయగలదు.

ఈ అధ్యయన చికిత్స ద్వారా రక్తనాళాల్లో 90 శాతం వరకు రక్తప్రసరణను విజయవంతంగా నిలిపివేశారు. ఎలాంటి అవాంఛిత దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు.

ఈ అధ్యయనానికి మద్దతు ఇచ్చిన ట్విన్స్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ, ఈ కొత్త విధానం గణనీయమైన మార్పు తీసుకురాగలదని పేర్కొంది.

"శస్త్రచికిత్స అవసరం లేకుండా, టీటీటీఎస్‌ను మరింత ముందుగానే గుర్తించి, ఈ ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొంటున్న కుటుంబాలకు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉన్న ఏ విధానమైనా కీలక మలుపు కావచ్చు" అని ఆ సంస్థ ఆరోగ్య భాగస్వామ్యాలు, పరిశోధనాధికారి హెలెన్ పెక్ తెలిపారు.

కవల పిల్లల చికిత్స, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎస్), బ్రియోనీ

ఫొటో సోర్స్, Brioney Garrett

‘మేం భయపడినట్టు జరగలేదు’

బ్రియోనీకి స్కానింగ్ చేసిన కొన్ని వారాల తర్వాత ఈ చికిత్స ఫలించినట్లు స్పష్టమైంది. ఇద్దరు శిశువుల మధ్య రక్తప్రసరణ సమతుల్యమైంది. అయితే ఆమె గర్భధారణలో తరువాతి దశల్లో మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఎదురయ్యాయి.

తగినంత ద్రవం లేని మార్గో పరిస్థితి ఎంతో మెరుగుపడిందని, అలాగే నాన్సీ గుండెపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గిందని స్కానింగ్ పరీక్షలు చూపించాయని బ్రియోనీ తెలిపారు.

దాదాపు 34 వారాల గర్భధారణ తర్వాత కవలలు జన్మించారు. నాన్సీ బరువు మూడు పౌండ్లు ఏడు ఔన్సులు కాగా, మార్గో బరువు మూడు పౌండ్ల మూడు ఔన్సులు ఉంది.

"ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టారు. మార్గో గురించి మేం ఆందోళన చెందినంత చిన్నగా ఆమె పుట్టలేదు" అని బ్రియోనీ చెప్పారు.

ఈ సెప్టెంబర్‌లో ఇద్దరూ ప్రాథమిక పాఠశాలలో చేరనున్నారు.

"వాళ్లు చాలా సరదాగా ఉంటారు. తెలివైనవాళ్లు, ఉత్సాహంగా ఉంటారు. తమ వయసు పిల్లలతో చక్కగా కలిసిపోతారు" అని బ్రియోనీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)