అమ్నియోసెంటెసిస్: 35 ఏళ్ల తరువాత గర్భం దాల్చిన మహిళలు ఈ ప్రత్యేక పరీక్ష చేయించుకోవాలా?

ఫొటో సోర్స్, Tannaz irani/FB
- రచయిత, చరణ్ జిత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, ఫరా ఖాన్ లేదా అమెరికన్ నటి హాలీ బెర్రీ కావచ్చు..ఇలా 40 ఏళ్లు పైబడిన వయస్సులో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళల ఉదాహరణలు చాలా ఉన్నాయి.
ఈరోజుల్లో నాలుగుపదుల వయసులోనో లేదా అంతకంటే ఎక్కువ వయసులోనో తల్లి కావాలని నిర్ణయించుకునే మహిళలు చాలా మంది ఉన్నారు.
భారతీయ టెలివిజన్, సినీ నటి తన్నజ్ ఇరానీ 30 నుంచి 40 ఏళ్ళ మధ్య పిల్లలు పుట్టడంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి మాట్లాడారు.
"రెండో బిడ్డ నా 40 ఏళ్ళ వయసులో పుట్టాడు. ఆ సమయంలో నేను అమ్నియోసెంటెసిస్ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది" అని ఆమె ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
పుట్టబోయే బిడ్డకు డౌన్ సిండ్రోమ్ లేదా ఏదైనా వెన్నెముక సమస్యలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష జరిగింది. ఎందుకంటే నలభై ఏళ్ల వయసులో బిడ్డలను కంటే సాధారణం కంటే ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి.
తన్నజ్ ఇరానీ చెప్పిన అమ్నియోసెంటెసిస్ పరీక్ష ఏంటి? అది ఎప్పుడు, ఎలా చేస్తారు? ఈ పరీక్ష గర్భవతుపై దుష్ప్రభావాలు చూపుతుందా, దీని కోసం ఎటువంటి నియమాలను పాటించాలి? డౌన్ సిండ్రోమ్, జన్యు వ్యాధులను నిర్ధరించడానికి ఇతర పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రసూతి వైద్యులు, స్త్రీల వైద్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.


ఫొటో సోర్స్, Getty Images
అమ్నియోసెంటెసిస్ పరీక్ష అంటే?
గర్భధారణ సమయంలో చేసే ప్రత్యేక వైద్యపరీక్షే అమ్నియోసెంటెసిస్ . బిడ్డకు జన్యుపరమైన వ్యాధులు, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. జన్యుపరమైన వ్యాధులు అంటే తల్లిదండ్రుల నుంచి లేదా వారిలో ఒకరి నుంచి పిల్లలకు సంక్రమించే వ్యాధులు.
లూథియానాలోని సీఎంసీ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ హెడ్ ప్రొఫెసర్ డా. తపస్యధర్ ఈ ప్రక్రియను వివరించారు.
"అల్ట్రాసౌండ్ సాయంతో సూదిని అత్యంత జాగ్రత్తగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, శిశువు అవయవాలు లేదా ఇతర ముఖ్య శరీర భాగాలకు హాని కలగకుండా ఉండే ప్రాంతం నుంచి కొద్దిపాటి ద్రవాన్ని తీస్తారు. ఈ ద్రవాన్ని పరీక్షకు పంపుతారు. ఈ ద్రవంలో ఉండే కణాలను ఏదైనా రుగ్మత ఉందో లేదో నిర్థరించడానికి, జన్యు, క్రోమోజోమ్ లోపాలు తెలుసుకోవడానికి పరీక్షిస్తారు’’
"ఈ పరీక్ష సాధారణంగా 15-20 వారాల వ్యవధిలో జరుగుతుంది. కానీ దీనిని అంతకంటే ముందుగా కూడా చేయవచ్చు. ఇలా ముందుగా చేసే పరీక్షను కొరియోనిక్ విల్లస్ శాంపిలింగ్ అంటారు. ఈ పరీక్ష 11 నుంచి 13 వారాల మధ్య చేస్తారు" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి అమ్నియోసెంటెసిస్ పరీక్ష చేస్తారని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.
డౌన్ సిండ్రోమ్ ఒక జన్యుపరమైన పరిస్థితి. దీనివల్ల శారీరక, మానసిక అభివృద్ధి సాధారణం కంటే నెమ్మదిగా జరుగుతుంది.
ఎడ్వర్డ్ సిండ్రోమ్ అరుదైన జన్యు పరిస్థితి. దీనికి చికిత్స చేయలేం. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల జీవితకాలం చాలా తక్కువ.
దీని గురించి మరింత సమాచారం ఇస్తూ జన్యుపరమైన రుగ్మతలతో పాటు, తలసేమియా, పిల్లలలో వెన్నెముక రుగ్మత, కండరాల క్షీణత మరికొన్ని ఇతర రక్త రుగ్మతల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ పరీక్ష చేస్తారని డాక్టర్ తపస్య చెప్పారు.
"ఈ పరీక్ష ఏ క్రోమోజోమ్‌లో లోపం ఉందో చూపుతుంది. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ ఉంటే 21వ క్రోమోజోమ్‌లో లోపం ఉన్నట్టు. ఇదేవిధంగా వివిధ వ్యాధులకు వేర్వేరు సంఖ్యలు ఉన్నాయి. పరీక్ష ఫలితాలు సాధారణంగా ఉంటే, శిశువు 99 శాతం ఆరోగ్యంగా ఉండే అవకాశంఉంటుంది" అని డాక్టర్ తపస్య వివరించారు.
"జన్యు ఉత్పరివర్తనం, లేదా ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు అనుమానం ఉంటే, వాటిని నిర్ధరించేందుకు మరిన్ని ఆధునిక పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి" అని ఆమె తెలిపారు.
ఈ పరీక్ష ఎప్పుడు చేస్తారు?
శిశువు ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రభావం చూపే కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు గర్భిణులకు అమ్నియోసెంటెసెస్ పరీక్ష చేయాలని వైద్యులు సూచిస్తారు.
"గర్భధారణ సమయంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో శిశువుకు అమ్నియోసెంటిసిస్ ద్వారా గుర్తించగలిగే వ్యాధి ఏదైనా ఉండే సూచనలు కనిపిస్తే ఈ పరీక్షను సిఫార్సు చేస్తారు. అలాగే శిశువు తండ్రికి లేదా కుటుంబంలోని సమీప బంధువులకు అలాంటి జన్యుపరమైన వ్యాధులు ఉంటే కూడా ఈ పరీక్ష అవసరమవుతుంది" అని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.
వయసుపైబడిన మహిళలు గర్భవతులైనప్పుడు ఈ పరీక్ష అవసరం మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
"ఈ రోజుల్లో చాలా మంది మహిళలు 35 ఏళ్ల తర్వాతే తల్లవ్వాలనుకుంటున్నారు. కొంతమంది మహిళలు ఐవీఎఫ్ ద్వారా 40 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చుతున్నారు" అని డాక్టర్ తపస్య తెలిపారు.
"వయసు పెరిగేకొద్దీ డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మేం ఈ పరీక్ష సూచిస్తాం" అని ఆమె చెప్పారు.
"ముందు అల్ట్రాసౌండ్ చేస్తాం. అందులో బిడ్డకు జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉంటే, మరొక స్క్రీనింగ్ పరీక్ష చేస్తాం. ఆ పరీక్షలో కూడా సమస్య ఉన్నట్లు తేలితేనే అమ్నియోసెంటెసిస్ చేస్తాం. ఈ రెండు పరీక్షల ఫలితాల్లో బిడ్డలో లోపం లేదని తేలితే అమ్నియోసెంటెసెస్ అవసరం ఉండదు" అని డాక్టర్ తపస్య తెలిపారు.

అందరికీ ఈ పరీక్ష అవసరమా?
"గర్భిణులందరికీ అమ్నియోసెంటిసిస్ పరీక్షను సిఫారసు చేయరు. దీనికి ముందు పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు డ్యూయల్ మార్కర్ టెస్ట్. గర్భధారణ 11 నుంచి 13 వారాల మధ్య లెవల్-1 అల్ట్రాసౌండ్ చేస్తారు.దీన్ని ఎన్టీ స్కాన్ అని కూడా పిలుస్తారు. డ్యూయల్ మార్కర్ టెస్ట్ గర్భధారణ మొదటి త్రైమాసికంలో చేసే రక్త పరీక్ష" అని గైనకాలజిస్ట్ డాక్టర్ యుక్తా శర్మ అన్నారు.
"ఈ పరీక్షల్లో ఏవైనా అసాధారణతలు కనిపిస్తే, నాన్-ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టులు చేస్తారు. ఇది కూడా ఒక రక్త పరీక్షే. ఈ పరీక్షల్లోనూ సమస్యలు కనిపిస్తేనే అమ్నియోసెంటిసిస్ చేయించుకోవాలని సూచిస్తాం" అని ఆమె చెప్పారు.
"గర్భిణీకి డయాబెటిస్ ఉన్నా, లేదా లేటు వయస్సులో గర్భం వస్తే మాత్రమే అమ్నియోసెంటిసిస్ చెస్తారు. ముందుగా చేసిన పరీక్షల్లో బిడ్డకు తీవ్రమైన ప్రమాదం ఉండే సూచనలు కనిపిస్తేనే ఈ పరీక్ష చేస్తారు" అని ఆమె వివరించారు.
"దశాబ్దం క్రితం వరకు ఈ పరీక్షలు చాలా అరుదుగా జరిగేవి. ఇంతకుముందు దిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. అంతేకాక ఇవి చాలా ఖరీదైన పరీక్షలు కూడా. అయితే ఇప్పుడు తక్కువ ఖర్చుతో, ఎక్కువ సంఖ్యలో ల్యాబ్‌లలో అందుబాటులోకి వచ్చాయి" అని తపస్య చెప్పారు.
"భారత్‌లో ప్రస్తుతం హై-రిస్క్ గర్భధారణ కేసులు పెరిగాయి. గతంలో కొంతమంది మహిళలకు ముందుగా జన్మించిన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉండటంతో వారు ఆందోళన చెందేవారు. అలాంటి పరీక్షల కోసం విదేశాలకు కూడా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది" అని ఆమె చెప్పారు.
ఈ పరీక్ష ఖర్చు సాధారణంగా 20,000 నుంచి 25,000 రూపాయల మధ్య ఉంటుందని, అయితే కొన్ని ఆసుపత్రులు దీని కంటే కొంచెం ఎక్కువ వసూలు చేస్తాయి. మరికొన్ని చోట్ల తక్కువగానే ఉంటుందని డాక్టర్ తపస్య చెప్పారు.
ప్రమాదాలేంటి?
అమ్నియోసెంటెసిస్ తర్వాత గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం ప్రతి 200 మంది గర్భిణులలో ఒక కేసుగా ఉండవచ్చు. గర్భంలో కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.
హెచ్ఐవీ పాజిటివ్, హెపటైటిస్ బీ లేదా హెపటైటిస్ సీ ఉన్న గర్భిణికి, ఈ పరీక్ష చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్లు బిడ్డకు కూడ సోకే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాల గురించి వైద్యుడు లేదా నిపుణుల బృందం గర్భిణీతో ముందుగానే చర్చిస్తుంది.
ఈ ప్రక్రియలో సన్నని సూదిని గర్భంలో ప్రవేశపెట్టి ద్రవాన్ని తీసుకుంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో సుమారు 1% వరకు గర్భస్రావం లేదా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండవచ్చని, కొన్ని కేసుల్లో పరీక్ష తర్వాత తేలికపాటి నొప్పి కూడా ఉంటుందని తపస్య చెప్పారు.
"ఇది సాధారణ పరీక్ష కాదు, ఎందుకంటే ఆ సమయంలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది" అని డాక్టర్ యుక్తా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శిశువుకు వ్యాధి నిర్థరణ అయితే?
పరీక్షా ఫలితాల్లో శిశువుకు ఏదైనా వ్యాధి ఉన్నట్లు తేలితే, అది శిశువుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో డాక్టర్లు వివరిస్తారు.తరువాత గర్భిణీకి సలహా, మద్దతు అందిస్తారు. ఆపై గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం ద్వారా తొలగించాలా అని ఆ మహిళ నిర్ణయించుకోవచ్చు.
"బిడ్డ భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదం ఉన్న సందర్భాల్లో 24 వారాల వరకు గర్భస్రావం చేయడానికి గైనకాలజిస్ట్‌కు భారత ప్రభుత్వం అధికారం ఇచ్చింది'' అని తపస్య చెప్పారు.
"ఉదాహరణకు ఇలాంటి కేసులేవైనా ఉంటే పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్లో రిపోర్ట్ చేస్తాం. అక్కడ ఒక కమిటీ ఏర్పడి, ఆ గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం చేయాలా అనే నిర్ణయం తీసుకుంటుంది" అని ఆమె చెప్పారు.
అయితే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్‌లోని నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె చెప్పారు.
"ఎవరైనా గర్భస్రావం చేయించుకోవాలనుకుంటే వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే మానసిక ఆరోగ్య సహాయం కూడా అందిస్తారు" అని ఆమె అన్నారు.
"ఏదైనా లోపం ఉన్నప్పటికీ గర్భాన్ని కొనసాగించాలనుకునే మహిళల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటాం. అన్ని వివరాలు చెప్పిన తర్వాతే వారు నిర్ణయం తీసుకుంటారు" అని తపస్య వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి నియమాలు పాటిస్తారు?
"ఈ పరీక్ష పీసీ-పీఎన్డీటీ (ప్రీ-కాన్సెప్షనల్ అండ్ ప్రీ-నేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్) చట్టం కింద వస్తుంది. అందువల్ల అల్ట్రాసౌండ్ గానీ, అమ్నియోసెంటెసిస్ గానీ ఏ పరీక్షలోనూ శిశువు లింగాన్ని చెప్పడానికి అనుమతి లేదు. ఈ పరీక్షలను దుర్వినియోగం చేసి లింగ నిర్ధరణ చేయకుండా ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తారు" అని డాక్టర్ యుక్తా శర్మ అన్నారు.
"కాబట్టి పరీక్ష నిర్వహించడానికి అనుమతి ఉన్న కేంద్రంలో మాత్రమే చెయ్యాలి. అక్కడ రోగి చిరునామా, గుర్తింపు వివరాలు, పరీక్షను సూచించిన డాక్టర్ సమాచారం వంటి అన్ని వివరాలు నమోదు చేసి భద్రపరచాలి. ఏ రోగికి, ఎందుకు పరీక్ష జరిగింది అన్నది స్పష్టంగా రికార్డు చేయాలి" అని ఆమె చెప్పారు.
"అల్ట్రాసౌండ్ లేదా ఫీటల్ మెడిసిన్ నిపుణులే ఈ పరీక్షలు చేయగలరు. డాక్టర్ సూచన లేకుండా ఈ పరీక్షలు చేయడం సాధ్యం కాదు. డాక్టర్లు కూడా ముందుగా అవసరమైన ఫారమ్‌లు పూరించి, తమ పేరు, నంబర్, స్టాంప్ వంటి వివరాలు నమోదు చేస్తారు" అని శర్మ చెప్పారు.
"పరీక్ష చేయడానికి ముందు రోగి సమ్మతి కూడా తీసుకుంటారు, భార్యాభర్తల సంతకాలు అవసరం. ఈ పరీక్ష ప్రక్రియ ఏమిటి అనేది వారికి వివరించాలి. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పాలి" అని ఆమె వివరించారు.
"ఈ పరీక్ష కోసం రోగిని గర్భస్థ శిశువైద్యంలో శిక్షణ పొందిన, గుర్తింపు పొందిన నిపుణుల వద్దకు మాత్రమే పంపుతారు’’ అని డాక్టర్ తపస్య తెలిపారు.
ప్రీ-నేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (లింగ నిర్థరణ నిషేధం) చట్టం, 1994 ప్రకారం, గర్భధారణ సమయంలో పుట్టబోయే బిడ్డ ఆడ,మగ అని చెప్పడం చట్టవిరుద్ధం. ఆడపిల్లల భ్రూణహత్యలను అరికట్టడం, ఉల్లంఘించిన వారికి శిక్ష విధించడం ఈ చట్టం ఉద్దేశం.
భారత్‌లో పీఎన్డిటీ చట్టం అమలులో ఉండడంతో అల్ట్రాసౌండ్ సమయంలో లేదా అమ్నియోసెంటెసిస్ సమయంలో శిశువు లింగాన్ని ఎవరూ చెప్పరని డాక్టర్ శర్మ చెప్పారు.
"అమ్నియోసెంటెసిస్ సమయంలో, మేం శిశువు జన్యు నిర్మాణాన్ని మాత్రమే పరిశీలిస్తాం. అంటే జన్యువులు సాధారణంగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూస్తాం" అని ఆమె చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































