గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించిన మొదటి దేశంగా నిలిచేందుకు ఆస్ట్రేలియా ఏం చేస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టాబీ విల్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
పిల్లల కోసం ఏళ్లపాటు ఎదురుచూసి, చివరకు ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత క్రిస్సీ వాల్టర్స్కు తన ఆరోగ్యానికి సంబంధించిన ఓ విషయం తెలిసింది. ఆమె కూతురు ఆమె లేకుండానే పెరిగి పెద్దవ్వాలన్న సంగతి తెలిసింది. పాప పుట్టిన ఆరు నెలల తర్వాత ఆమెకు ఈ విషయం చెప్పారు.
బ్రిస్బేన్‌కు రెండు గంటల దూరంలో ఉండే చిన్న నగరం టూవూంబాలోని ఇంట్లో ఉన్నప్పుడు వాల్టర్స్కి భారీగా రక్తస్రావమైంది. ఆమె అనేక ఆస్పత్రులు తిరిగారు. డాక్టర్ల అప్పాయింట్మెంట్లు, బయాప్సీల తర్వాత ఆమెకు గర్భాశయ క్యాన్సర్ అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్టు నిర్ధరణ అయింది. వాల్టర్స్ వయసు 39ఏళ్లు.
''చాలా పెద్ద తప్పు జరిగిపోయింది..అని నేను మా ఆయనతో చెప్పా'' అని వాల్టర్స్ గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ఆమె దశాబ్దం కాలంగా చికిత్సలు పొందుతున్నారు. చాలా కష్టమైన చికిత్సలవి. అయినప్పటికీ క్యాన్సర్ ఆమె శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించింది. ఇప్పుడు ఆమె శరీరం పరిస్థితి చికిత్స చేయలేని విధంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
''నా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోను'' అని ఆమె చెప్పారు.


ఫొటో సోర్స్, University of Sydney
స్కూళ్లలో పిల్లలకు వ్యాక్సీన్లు
వాల్టర్స్ కూతురికి ఇప్పుడు 12 ఏళ్ల వయసు. ఆమె జీవితమంతా ఈ వ్యాధి చుట్టూనే తిరుగుతున్నట్టు ఉంటుంది. పాపకు మూడేళ్ల వయసున్నప్పటినుంచి మరణం గురించి తమ కుటుంబం ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకునేదని వాల్టర్స్ తెలిపారు.
2026కి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా మారిందంటే తల్లి ప్రాణాలను హరించబోతున్న క్యాన్సర్‌ను దేశంలో నిర్మూలించే లక్ష్యంతో పిల్లలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యాక్సిన్లు వేయడం మొదలుపెట్టింది.
దశాబ్దంలోగా ఇది పూర్తిచేయాలని భావిస్తోంది. క్యాన్సర్‌ను నిర్మూలించిన తొలి దేశంగా నిలిచేందుకు ఇతర దేశాలతో పోటీ పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్ నిర్మూలనకు రెండు విధానాలు
ఆస్ట్రేలియా హైస్కూల్‌కు వెళ్లిన వాళ్లకు ఓ దృశ్యం సహజంగా కనిపిస్తుంటుంది. 12నుంచి 13 ఏళ్ల వయసున్న అమ్మాయిల క్యూ ఉంటుంది. ఓ ప్లాస్టిక్ చైర్లో ఒకరి తర్వాత ఒకరు కూర్చుంటారు. ఇంజెక్షన్ సూది ఒక్క క్షణం మాత్రమే బాధిస్తుందని ఒక నర్సు నచ్చజెపుతుంటారు.
కొన్ని నిమిషాల తర్వాత వారు తమ చేతిపై గుండ్రటి ప్లాస్టర్ వేసుకుని తిరిగి క్లాస్ రూమ్‌కు వెళ్తారు.
హైస్కూల్ విద్యార్థులకు అక్కడ మూడు వ్యాక్సిన్లు వేస్తారు. జాతీయ రోగనిరోధకవ్యవస్థ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ఇందులో హ్యూమన్ పాపిల్లోమావైరస్(హెచ్‌పీవీ)వ్యాక్సిన్ కూడా ఉంది.
హెచ్‌పీవీకి ఎలాంటి లక్షణాలూ లేనప్పటికీ, చికిత్స లేకుండానే కనిపించకుండాపోయే అవకాశమున్నప్పటికీ కొన్నిసార్లు గర్భాశయ క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఎక్కువగా సోకుతున్న క్యాన్సర్లలో ఇది నాలుగోది.
అదృష్టవశాత్తూ ముందే వ్యాక్సిన్ తీసుకుంటే నిరోధించగల క్యాన్సర్లలో ఇదొకటి.
సర్వికల్ క్యాన్సర్ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో కృషిచేస్తున్న ప్రొఫెసర్ కారెన్ కాన్‌ఫెల్ ఆస్ట్రేలియా లోపలాబయటా దీని ప్రభావాన్ని చూశారు. ''గర్భాశయ క్యాన్సర్ ప్రభావం పడ్డ తల్లి లేదా సోదరి, అమ్మమ్మ లేదా, నాయనమ్మ ప్రతి ఒక్కరికీ ఉంటారు'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2006లో ఏం జరిగిందంటే...
దశాబ్దాల పరిశోధనల తర్వాత ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక కొత్త టీకాను అభివృద్ధి చేశారు. హెచ్పీవీని అడ్డుకోగల ఆ టీకా పేరు గార్డాసిల్. మెడిసన్స్ రెగ్యులేటర్ దాన్ని ఆమోదించింది. ఏడాది తర్వాత జాతీయ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.
భవిష్యత్తులో క్యాన్సర్ లేని ప్రపంచం ఉంటుందన్న ఆశను ఈ టీకా అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులకు ఇచ్చింది. కాన్‌ఫెల్ ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికో విధానం రూపొందించింది.
''ఆస్ట్రేలియాలో ప్రజారోగ్య రంగంలో జరిగిన ఆవిష్కవరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించేందుకు మంచి ఉదాహరణలుగా నిలిచాయి'' అని కాన్‌ఫెల్ చెప్పారు.
విస్తృత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌తో పాటు ఆస్ట్రేలియాలో స్క్రీనింగ్ స్కీమ్ భారీ స్థాయిలో ఉంది. 2013నుంచి ఈ వ్యాక్సిన్లను అబ్బాయిలకు కూడా వేస్తున్నారు.
పాప్ స్మియర్ పరీక్ష నుంచి మరింత సున్నితమైన హెచ్‌పీవీ ఆధారిత గర్భాశయ స్క్రీనింగ్‌కు మారిన తొలి దేశాల్లో ఒకటిగా 2017లో ఆస్ట్రేలియా నిలిచింది. ఈ స్క్రీనింగ్ ప్రతి ఐదేళ్లకోసారి అవసరం.
అలాగే మహిళలు తమకు తాముగా శాంపిల్ తీసుకునే అవకాశం కూడా కల్పించిన మొదటి దేశం ఆస్ట్రేలియా. దీన్ని ప్రభుత్వం ''గేమ్-చేంజర్''గా వర్ణించింది. పెల్విక్ పరీక్షలకు భయపడేవారికి, ఆరోగ్య వసతులు లేనివారికి ఇది ఉపయోగకరంగా మారింది.

ఫొటో సోర్స్, Nathan Morris/Australian Broadcasting Corporation
లక్ష్య సాధనలో ఆస్ట్రేలియా ఎక్కడుంది?
ఆచరణాత్మకంగా చూస్తే ఆస్ట్రేలియాలో ప్రజాసమస్యగా గర్భాశయ క్యాన్సర్‌ని నిర్మూలించడమంటే మొత్తం పూర్తిగా తొలగిపోతుందని కాదు. ప్రతి లక్షమంది ప్రజల్లో గర్భాశయ క్యాన్సర్ బాధితుల సంఖ్య నాలుగు కన్నా తక్కువ ఉంటే శాస్త్రవేత్తలు దాన్ని వ్యాధి నిర్మూలనగా పరిగణిస్తారు.
2035నాటికి ఆస్ట్రేలియా క్యాన్సర్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునే అవకాశముందని నిపుణులు ప్రచురించిన రిపోర్టులో ఉంది.
1982 నుంచి ఇప్పటిదాకా గర్భాశయ క్యాన్సర్ కేసులు, మరణాలు సగానికి పైగా తగ్గాయి.
మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే 2021నాటి డేటాలో తొలిసారి ఓ విషయం తేలింది. 25ఏళ్లలోపు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు లేవు.
అన్ని వయసుల మహిళల్లో ఇది పూర్తిగా జరగలేదు. కానీ గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన దిశగా సాగుతోంది.
అయితే టీకాలు ఇవ్వడంలో కొంచెం తగ్గుదల కనిపిస్తోందని కాన్‌ఫెల్ హెచ్చరించారు. ముఖ్యంగా అబారిజినల్, టొర్రెస్ స్ట్రైట్ ద్వీపాలకు చెందిన ప్రజల్లో వ్యాక్సిన్లరేటు తక్కువగా ఉంది. వారికి ఆరోగ్య వసతులు అందడంలో అనేక అడ్డంకులున్నాయి. అది ఫలితాల్లో కనిపిస్తోంది.
ఆదివాసీ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రేట్లు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి వల్ల వారు మరణించే అవకాశం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏంటి?
మామూలు మహిళలతో పోలిస్తే ఆదివాసీ మహిళల్లో క్యాన్సర్ ముదిరిపోయిన దశలో గుర్తిస్తారని డాక్టర్ నటాలియో స్ట్రోబల్ చెప్పారు. ఆదివాసీ కమ్యూనిటీల్లో వ్యాధి నియంత్రణలో నటాలియో నిపుణురాలు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి దేశం లక్ష్యంగా పెట్టుకున్న 2035కన్నా 12 సంవత్సరాలు ఆలస్యంగా అబార్జినల్, టొర్రెస్ స్ట్రైట్ ద్వీపాల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన జరుగుతుందని పరిశోధనలో తేలింది.
కరోనా మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో వ్యాక్సిన్లపై పెరిగిన సందేహాలు, వైద్యసేవలకు సంబంధించి పెరిగిన ఖర్చులు, పిల్లలు స్కూలుకు వెళ్లకపోవడం, వ్యాక్సిన్, ఇతర పరిస్థితులు ఆస్ట్రేలియా తన లక్ష్యాన్ని చేరడంలో అడ్డంకులుగా నిలుస్తున్నాయని స్ట్రోబెల్ ఆమె పరిశోధనా భాగస్వామి జోస్లిన్ జోన్స్ చెప్పారు.
''ఎవరన్నా టీకా తీసుకోవడం మిస్సయితే వారికి తిరిగి టీకా ఇవ్వడంపై సరైన విధంగా దృష్టిపెట్టడం లేదు. ఆ బాధ్యత కుటుంబంపై ఎక్కువగా ఉంటుంది. వాళ్లు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి. చాలామందికి ఇది ఉచిత టీకా అని తెలియదు'' అని జోన్స్ తెలిపారు.
ఖర్చు కూడా పెద్ద అడ్డంకిగా ఉంటుంది. తక్కువ, మధ్యరకం స్థాయి ఆదాయం ఉన్న దేశాలకు వ్యాధి నిర్మూలనకు సహకరించే ఆరోగ్య వ్యవస్థకు కావాల్సిన వనరులు ఉండకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మహిళల ఆరోగ్యంగా ఉంటే అనేక ప్రయోజనాలు’
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనపై పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయని కాన్‌ఫెల్, ఆమె బృందం ప్రభుత్వాలకు సర్దిచెప్పే ప్రయత్నంచేశారు. దీర్ఘకాలంలో ఇవి డబ్బును ఆదా చేస్తాయని చెప్పారు.
ప్రాణాలు నిలబడడంతో పాటు, నమ్మలేనిస్థాయిలో సమాజంపై ప్రభావం ఉంటుందని, పనిలో, ఆర్థిక ఉత్పత్తి పెరుగుదలలో మహిళలు భాగంగా ఉండగలుగుతారని చెప్పారు. కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ పెట్టుబడికి ఇది లాభమన్న ఆధారాలున్నాయని కాన్‌ఫెల్ చెప్పారు.
ప్రభుత్వ నిధులు, దాతృత్వం ద్వారా ఆస్ట్రేలియా తన పొరుగు దేశాలు వనాటు, పపువా న్యూ గినియా వంటి దేశాలకు కూడా వ్యాధినిర్మూలనలో సాయం చేస్తోంది.
తక్కువ ఆదాయం ఉండే దేశాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సహకరించే విదేశీ సహాయానికి అంతర్జాతీయంగా నిధులు తగ్గడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలక టీకాలు అందించే గవి సంస్థకు తమ మద్దతు నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2025 మార్చిలో ప్రకటించారు.
అధిక ఆదాయ దేశంగా ఉండడం, ప్రపంచస్థాయి ఆరోగ్యవ్యవస్థ ఉండడం, ఆ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండడం మన అదృష్టమని కాన్‌ఫెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?
గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడడం పూర్తిస్థాయి ఉద్యోగం లాంటిదని, కానీ ఇది చాలా ఖరీదైనదని వాల్టర్స్ చెప్పారు.
నిరంతరంగా సాగే ఆస్పత్రి అప్పాయింట్మెంట్లు, చికిత్సవల్ల శరీరాన్ని చెర్నోబిల్లా పూర్తిగా దెబ్బతీసినట్టు అనిపించే దుష్ప్రభావాలు, మన గురించి మనం నిరంతరం పట్టించుకోవాల్సిఉండడం, ఆస్ట్రేలియా ఆరోగ్యవ్యవస్థ నుంచి సబ్సిడీలు ఉన్నప్పటికీ భారీ ఆర్థిక ఒత్తిడి వంటివి ఉంటాయి.
అయినా భవిష్యత్తులో ఈ పరిస్థితి తొలగిపోతుందనే గొప్ప ఆశ ఉంటుంది.
''దీన్ని తొలగించిన మొదటిదేశంగా నిలిచేందుకు కొన్ని దేశాల మధ్య పరుగుపందెలాంటి పరిస్థితి నెలకొంది'' అని కాన్‌ఫెల్ చెప్పారు.
2027నాటికి గర్భాశయ క్యాన్సర్ తొలగించాలని స్వీడన్, రువాండా లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్క్రీనింగ్, వ్యాక్సిన్ అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కీలక మైలురాళ్లను చేరడంలో రెండు దేశాలు లక్ష్యంగా ఉన్నాయి.
2040నాటికి గర్భాశయ క్యాన్సర్ తొలగించాలని యూకే లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, పరీక్షలు తగ్గడం వంటి సమస్యలు ఇటీవలికాలంలో ఎదురయ్యాయి.
హెచ్ఐవీ వంటి వ్యాధుల నివారణ, నియంత్రణలో అద్భుతమైన ఉదాహరణలున్నప్పటికీ గర్భాశయ క్యాన్సర్‌లో అనుసరించాల్సిన విధానం ప్రత్యేకమైనదని, అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు సాగాలని కాన్‌ఫెల్ చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారి మనం ఆ క్యాన్సర్‌ను నిర్మూలించాలని ప్రకటించింది.
క్యాన్సర్ విషయంలో ఇదో కొత్త ఆలోచననని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































