రేంజ్ యాంగ్జైటీ: ‘చార్జింగ్ సరిపోతుందో లేదో’ - ఈ భయమే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు అడ్డంకిగా ఉందా

ఫొటో సోర్స్, LightRocket via Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో, భారత్‌లో మొత్తం ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాటా 5 శాతం మార్కును అధిగమించింది.
ఇది.. మార్కెట్లో ప్రజలు భారీ స్థాయిలో వినియోగించడానికి ఒక ముఖ్యమైన మలుపుగా కనిపిస్తుంది.
"ఈ మార్పు వాస్తవ రూపం దాల్చుతోంది" అంటూ భారత ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఇటీవల విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో పేర్కొంది.
రూ. 10 లక్షలకు పైన ధర ఉన్న కార్ల కొనుగోళ్లల్లో ఈవీల కొనుగోలు పెరుగుతోంది.
ఈ శ్రేణిలో ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి 10 వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే.
ఎలక్ట్రిక్ త్రీవీలర్స్, మోటార్‌బైక్స్ ఇప్పటికే వాటి సంబంధిత కేటగిరీల్లో వరుసగా 30 శాతం, 15 శాతానికి పైగా అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.

ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది.
భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 90 శాతం దిగుమతి చేసుకుంటుంది.
క్రూడాయిల్ ధరలు 50 శాతం పెరగడంతో.. గత నాలుగేళ్లుగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చింది.
ఇంధన వినియోగం తగ్గించేందుకు కార్ పూల్ సేవలను, ప్రజా రవాణా సదుపాయాలను, ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటును ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
''పెరుగుతున్న ఈ అనిశ్చితి, ఇంధన ధరలు పెరుగుదలకు తోడై.. ఈవీల ప్రాముఖ్యాన్ని మరింత పెంచేలా చేసే ఒక చోదకంలాగా పనిచేస్తోంది'' అని జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు మించి, వివిధ దీర్ఘకాలిక కారకాలు కూడా ఈవీల కొనుగోళ్లపై ఆసక్తి పెరగడానికి దోహదం చేశాయి.
ముఖ్యంగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 2032 మార్చి వరకు అమల్లో ఉండే సీఏఎఫ్ఈ-3గా పిలిచే నియంత్రణ ప్రమాణాలు.
సీఏఎఫ్ఈ-3 అంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫేజ్ 3.
''ఇవి అర్ధవంతంగా కఠినతరం చేసిన నిబంధనలు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మరింత స్పష్టమైన వృద్ధిని పెంచే అవకాశం ఉంది'' అని బెర్న్స్టెయిన్కు చెందిన విశ్లేషకులు వేణుగోపాల్ గర్రె, పరమ్ షా ఒక నోట్లో పేర్కొన్నారు.
''భారత్ ప్రస్తుతం తన ఈవీ ప్రోత్సాహకాలను కఠినమైన లక్ష్యాలతో కానీ, జరిమానాలతో కానీ ముడిపెట్టలేదు. కానీ, సీఏఎఫ్ఈ-3 నిబంధనలు ఈ లక్ష్యాలను తప్పనిసరి చేస్తాయి'' అని వేణుగోపాల్, పరమ్ షా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం.. 2032 నాటికి కార్లలో కర్బన్ ఉద్గారాలను కిలోమీటరుకు 113 గ్రాముల నుంచి 76 గ్రాములకు తగ్గించాలన్నది ప్రతిపాదన. అంటే 33 శాతం ఈ ఉద్గారాలను తగ్గించాల్సి ఉంది.
అంతేకాక, ఎనిమిది ఓఈఎంలపై (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్) విధించిన సుమారు బిలియన్ డాలర్ల జరిమానాలను వసూలు చేయని ప్రస్తుత పరిస్థితి మాదిరిగా కాకుండా, సీఏఎఫ్ఈ-3 నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసి, జరిమానాలను వసూలు చేసే అవకాశం ఉందని బెర్న్‌స్టెయిన్ పేర్కొంది. ఇవన్నీ ఈవీల వాడకాన్ని పెంచనున్నాయి.
దేశంలో అత్యంత కాలుష్య కేంద్రాలలో ఒకటైన దిల్లీ వంటి ప్రాంతాలు కన్వెన్షనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లను దశలవారీగా తొలగించాలని, 2027 నాటికి కొత్త ఐసీఈ టూ, త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రతిపాదిస్తూ తాజాగా ఈ ముసాయిదా విధానాలను విడుదల చేశారు.
మరో సానుకూలమైన అంశం వరుసగా కొత్తగా వాహనాల లాంచింగ్ కొనసాగడమని నోమురా తెలిపింది.
2030 నాటికి భారత్‌లో ప్యాసెంజర్ వెహికిల్ మార్కెట్లో ఈవీల వినియోగం 9 శాతానికి చేరుకోనుందని అంచనావేసింది.
టూ-వీలర్ విభాగంలో కూడా.. అందుబాటు ధరల్లో వచ్చే సరికొత్త మోడళ్ల వల్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, 2030 నాటికి ఎలక్ట్రిక్ త్రీవీలర్ల అమ్మకాలు సాధారణ త్రీవీలర్ల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనావేస్తున్నారు. ఇది ఈ మార్పును వేగవంతం చేస్తుంది.
ఈవీ మార్కెట్‌కు సంబంధించి ఇన్ని ప్రోత్సాహక సంకేతాలు ఉన్నప్పటికీ.. ఈవీల వినియోగంలో ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది.
నోమురా డేటా ప్రకారం.. చైనాలో ప్రయాణికుల కార్లలో ఈవీల వినియోగం 2020లో 5.7 శాతం నుంచి గతేడాది 53.3 శాతానికి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌లో 20 శాతం, అమెరికాలో 8 శాతం వీటి వినియోగం ఉంది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఈవీల వినియోగంలో ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. చార్జింగ్ సదుపాయాలు.
గత మూడేళ్లలో పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2,000 నుంచి 10 వేలకు పైగా పెరిగింది. అయినప్పటికీ, ప్రాంతాలవారీగా చార్జింగ్ స్టేషన్ సదుపాయాలు అసమానంగా ఉన్నాయి.
భారత్లోనిచార్జింగ్ స్టేషన్లలో 50 శాతం 4 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
అంతేకాక.. చార్జింగ్ పాయింట్ల విషయంలో భారత్, చైనా మధ్యలో ఉన్న తేడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది. చైనాలో 2 కోట్ల పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు ఉండగా.. భారత్‌లో పది వేలే ఉన్నాయి.
చార్జింగ్ పరిమితుల కారణంగా తలెత్తిన ''రేంజ్ యాంగ్జైటీ''.. అంటే, ప్రయాణాన్ని పూర్తి చేయడానికి బ్యాటరీ చార్జ్ సరిపోతుందో లేదోనన్న భయం వినియోగదారులకు ఈ వాహనాల కొనడానికి ఒక ముఖ్య అవరోధంగా నిలుస్తుందని నోమురా పేర్కొంది.
భారత స్థానిక సరఫరా వ్యవస్థలో ఉన్న అంతరాయాలు.. మరో ముఖ్యమైన ఆందోళనకర అంశంగా విశ్లేషకులు చూస్తున్నారు.
ఈవీలకు అవసరమైన బ్యాటరీలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్స్కు సంబంధించిన ప్రపంచ సరఫరాలపైనే భారత్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది.
దేశీయ ఉత్పత్తిని పెంచాలనే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. లిథియం, కోబాల్ట్ రిఫైనింగ్‌కు చెందిన 70 శాతం నుంచి 80 శాతం, రేర్ ఎర్త్ సెపరేషన్లో సుమారు 90 శాతం చైనా నియంత్రిస్తోందని కేపీఎంజీ చెప్పింది.
ఇవన్నీ భారత్‌లో ఈవీల ఆవిష్కరణను ఆలస్యం చేయడంతో పాటు, ధరల పోటీతత్వాన్ని ప్రభావితం చేయగలవని తన తాజా నివేదికలో కేపీఎంజీ పేర్కొంది.
ఈ సవాళ్లకు తక్షణ పరిష్కారాలు సాధ్యం కాకపోవచ్చు. '' గనుల తవ్వకం నుంచి బ్యాటరీ ప్యాక్ వరకు లేదా అయస్కాంతాల తయారీ సరఫరా గొలుసును నిర్మించేందుకు ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. సరఫరా భద్రత కోసం స్వల్పకాలిక చర్యలు, దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో దీర్ఘకాలిక కార్యక్రమాలు వంటివి భారత్‌కు అవసరం'' అని కేపీఎంజీ చెప్పింది.
కొనుగోలుదారుల కోణంలో చూస్తే.. సీఏఎఫ్ఈ-3 ప్రమాణాలను సకాలంలో అమలు చేయడం ఈవీలకు కీలక చోదకంగా పనిచేస్తుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.
మూడేళ్లుగా ఈ ప్రమాణాలపై చర్చలు జరుగుతున్నా.. ఈ ప్రమాణాలు ఇంకా టెంటేటివ్గానే ఉన్నాయి. అయితే, తుది ముసాయిదా త్వరలో విడుదల కానుందని అంటున్నారు.
''నిబంధనల విషయంలో స్పష్టత లేనప్పుడు.. పెట్టుబడుల నిర్ణయాలను తయారీదారులు వాయిదా వేస్తారు. సరఫరా చెయిన్లు మరింత నెమ్మదిగా మారతాయి. విస్తృతమైన వ్యవస్థ ఇంకా అనిశ్చితంగానే ఉంటుంది'' అని పేర్కొన్నారు.
విధానాలపై స్పష్టతే.. వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























