లైవ్, దిల్లీలో 16 మెట్రో రైల్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత
‘చర్చకు మేం సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే. రాహుల్ గాంధీకి ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు.. చర్చకు సరైన మార్గం ఇప్పటికే ఏర్పడినా సంఘర్షణ సృష్టించే ప్రయత్నమే ఇది’ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
సారాంశం
దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసం ఎదుట విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం మంగళవారం రాత్రి పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఇతర విపక్ష నేతలనూ విడిచిపెట్టారు.
రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
మంగళవారం జరిగిన పరిణామాలపై మంగళవారం రాత్రి 11.35 గంటలకు 'ఎక్స్' వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఛత్రసాల్ స్టేడియం నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ.. విపక్షాలన్నీ బుధవారం ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటున్నాయని చెప్పారు.
లైవ్ కవరేజీ
‘రాహుల్ గాంధీతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’
ఫొటో సోర్స్, R. Satish BABU / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం విజయ్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పార్టీ ఖండించింది.
రాహుల్ గాంధీని నిర్బంధించి, చేతులకు సంకెళ్లు వేసి
తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా చేసిన దాడని తమిళగ వెట్రి కళగం(టీవీకే)ఆరోపించింది.
‘‘దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా
ఖండించాలి. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష
దాడి. నీట్ పరీక్ష విశ్వసనీయత మొదటినుంచీ ప్రశ్నార్థకంగా ఉంది. విద్యార్థులపై
నిరంతర మానసిక ఒత్తిడి పెరిగింది. వారి కలలు ప్రశ్నార్థకంగా మారాయి. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి ’’ అని టీవీకే ‘ఎక్స్’లో
పోస్ట్ చేసింది.
దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత
ఫొటో సోర్స్, Getty Images
సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ ప్రకటించింది. తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు ఆపుతున్నట్లు పేర్కొంది.
అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది.
అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ
ఫొటో సోర్స్, https://x.com/RahulGandhi
ఫొటో క్యాప్షన్, ఛత్రసాల్ స్టేడియంలో రాహుల్ గాంధీ
ప్రధాని ఇంటి ముందు మంగళవారం చేపట్టిన ధర్నా, తనను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం తరువాత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు తనను ఉంచిన ఛత్రసాల్ స్టేడియంలో రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఒక కాలికి మాత్రమే షూ వేసుకుని కనిపించారు.
‘సోమవారం జరిగిన ఘటనలపై చర్చకు
అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని
స్పీకర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని తర్వాత స్పష్టమైంది. దీంతో ప్రధాని నివాసం ముందు ధర్నా
చేయాలని, విద్యార్థుల సమస్యలు, దేశంలోని సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలని
నిర్ణయించుకున్నాం.
భారత విద్యావ్యవస్థ ఎందుకు నాశనమైంది, పేపర్లు ఎందుకు
లీకవుతున్నాయి?విద్య ఎందుకు భారత్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది, పిల్లలను
చదివించడానికి ప్రజలు ఆర్థికంగా ఎందుకు పూర్తిగా నష్టపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ
సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పూలేదు.
విద్యార్థులు కోరినట్టుగా అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో
అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి.
ఈ మొత్తం వ్యవహారంపై
పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరపాలి.
ప్రతిపక్షనేతగా నేను ప్రధాని మోదీకి ఓ సలహా ఇస్తున్నా. సోమవారం
జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. పరీక్షల
వ్యవస్థ, విద్యావ్యవస్థల్లో వీలయినంత తొందరగా సంస్కరణలు తేవాలి.
విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్
ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్ష
నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్
వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
రాహుల్
గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని
ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
మంగళవారం
రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో
ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్
వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను
వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి
నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే
కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.
‘పూర్తిస్థాయి
చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ
ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.
‘నీట్
పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత
ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ
విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి
కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం
కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు
కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు
కాదు’ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్.
విద్యార్థుల
సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.