ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...

ఫొటో సోర్స్, Vijay Mishra
- రచయిత, సీతూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హబిబాన్ ఖాతున్ ఈ మధ్య చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. గత 32 ఏళ్లలో ఆమెకు మనశ్శాంతి లభించడం ఇదే తొలిసారి.
తల్లికి 103 ఏళ్లు పైబడ్డాయని, ఆమె మాట్లాడలేరని, వినలేరని హబిబాన్ 56 ఏళ్ల కొడుకు రహ్మతుల్లా బీబీసీతో అన్నారు.
తాజాాగా వెలువడిన కోర్టు తీర్పుతో తన తల్లి చాలా సంతోషంగా ఉన్నారని రహ్మతుల్లా చెప్పారు.
హబిబాన్ తన నగలు అమ్మి ఒక భూమిని కొనుగోలు చేశారు. 32 ఏళ్ల తర్వాత ఆమె తన భూమిని తిరిగి పొందారు.
సుమారు 1,633 చదరపు అడుగుల భూమి కోసం 103 ఏళ్ల హబిబాన్ 32 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు.

అసలేంటి విషయం?
బిహార్‌లోని తూర్పు చంపారన్ (మోతిహరి) జిల్లాలోని మంగళపూర్ గ్రామంలో హబిబాన్ ఖాతున్, ఆమె భర్త నయిముల్లా అన్సారీతో నివసించేవారు.
నయిముల్లా అన్సారీ అసోంలో పండ్లను అమ్మేవారు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కూతురు.
1993 మార్చి 6న నయిముల్లా అన్సారీ మంగళపూర్ నివాసి అఫాక్ అక్తర్ అనే వ్యక్తి నుంచి 1 కత్తా చార్ ధురా (సుమారు 1,633 చదరపు అడుగుల) భూమిని కొనుగోలు చేశారు.
రెండు రోజుల తర్వాత 1993 మార్చి 8న నయిముల్లా అన్సారీ కజిన్ లియాఖత్ హుస్సేన్ అదే భూమిని తన పేరుపై నమోదు చేసుకున్నారు. ఇక్కడే భూ వివాదం మొదలైంది.
వివాదం ముదరడంతో, నయిముల్లా అన్సారీ సివిల్ వ్యవహారాలకు సంబంధించిన దిగువ న్యాయస్థానం మోతిహరి మున్సిఫ్ కోర్టును ఆశ్రయించారు.
"మున్సిఫ్ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కేసు జిల్లా జడ్జి కోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా 2004లో మాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది" హబిబాన్ కుమారుడు రహ్మతుల్లా చెప్పారు.

ఫొటో సోర్స్, Vijay Mishra
కోర్టుల చుట్టూ తిరిగిన కుటుంబం
నయిముల్లా అన్సారీకి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత.. లియాఖత్ హుస్సేన్ 2010లో పట్నా హైకోర్టులో దీనిపై అప్పీల్ దాఖలు చేశారు.
2014 ఆగస్టులో లియాఖత్ హుస్సేన్ అప్పీల్‌ను పట్నా హైకోర్టు కొట్టేసింది.
''లియాఖత్ హుస్సేన్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసిన తర్వాత.. మున్సిఫ్ సదర్‌లో తీర్పు అమలు చేయాలని మేం పిటిషన్ దాఖలు చేశాం. కానీ, కరోనా కారణంతో మున్సిఫ్ సదర్ మారుతూ వచ్చారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదు'' అని రహ్మతుల్లా చెప్పారు.
మున్సిఫ్ సదర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన సివిల్ జడ్జి ఆస్తి, భూమి మొదలైన వాటికి సంబంధించిన కేసులను విచారిస్తారు.

ఫొటో సోర్స్, ANI
2014లో హైకోర్టు నిర్ణయం.. 2026లో అమలు
2014లో లియాఖత్ హుస్సేన్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. కానీ, హైకోర్టు ఆదేశాల తర్వాత 12 ఏళ్లకు హబిబాన్ ఖాతున్‌కు అనుకూలంగా వచ్చిన నిర్ణయాన్ని అమలు చేశారు.
తూర్పు చంపారన్ సెషన్స్ జడ్జి కార్యాలయం జూన్ 4న ఒక లేఖను జారీ చేసి, జూన్ 12న కోర్టు ఉత్తర్వును అమలు చేయాలని ఆదేశించింది.
ఆ తర్వాత, జూన్ 12న అడ్మినిస్ట్రేషన్ ఫోర్స్ సమక్షంలో హబిబాన్ ఖాతున్ భూమిని ఆక్రమణ నుంచి విడిపించారు.
అ సమయంలో కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్-ఛార్జ్ వినీత్ కుమార్ కూడా ఆ సంఘటన స్థలంలో ఉన్నారు. ''కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం మా బాధ్యత. కోర్టు ఉత్తర్వు ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, భూమిని అసలు యజమానికి అప్పగించాం" అని తెలిపారు.
లియాఖత్ హుస్సేన్ వృతిరీత్యా వడ్రంగి. హబిబాన్ ఖాతున్ భూమిలో, పరిపాలన యంత్రాంగం కూల్చివేసిన గుడిసెలో ఆయన నివసించేవారు.
ఈ విషయంపై మాట్లాడిన రహ్మతుల్లా, ''హైకోర్టు నిర్ణయం తర్వాత లియాఖత్ హుస్సేన్ సైలెంట్‌గా ఉండిపోయారు. మేం మాత్రం కోర్టులో పోరాడుతూ ఉండేవాళ్లం. 97 ఏళ్ల వయసులో కూడా మా అమ్మ మున్సిఫ్ కోర్టుకు వెళ్లేవారు. కానీ, మున్సిఫ్ సదర్ మాత్రం తరచూ బదిలీ అయ్యేవారు. అందుకే మా కేసు విచారణకు రాలేదు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Vijay Mishra
భూమిని పొందిన తర్వాత సంతోషం
నయిముల్లా అన్సారీ, హబిబాన్ ఖాతున్‌ల చిన్న కొడుకు రహ్మతుల్లా. వారికి వ్యవసాయ భూమి లేదు. రహ్మతుల్లా సోదరులు ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నారు. రహ్మతుల్లా కల్యాణ్‌పూర్ పోస్టు ఆఫీసులో పోస్టు మాస్టర్‌గా చేస్తుండగా.. మరో సోదరుడు ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందారు.
"అమ్మ సంతోషంగా ఉన్నారు, కానీ నాన్న బ్రతికి ఉంటే ఆమె ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేవారు. ఆయన పదేళ్ల కిందట చనిపోయారు. అమ్మ, నాన్న ఎంతో కష్టపడి ఈ భూమిని కొన్నారు" అని రహ్మతుల్లా చెప్పారు.
"మన న్యాయ ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉందో, అందులో ఒక సామాన్యుడు ఎలా చిక్కుకుపోతాడో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ కేసులో న్యాయం జరిగినప్పటికీ, న్యాయం అమలు కాలేదు" అని పట్నాకు చెందిన ఎకనామిక్స్ మేగజీన్ 'తలాష్' సంపాదకురాలు మీరా దత్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































