సోనియా గాంధీ ఆత్మకథ ఏఏ విషయాలు బయటపెట్టనుంది?

సోనియా గాంధీ, భారతదేశ చరిత్ర

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, ఇండియా కరెస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

సోనియా గాంధీ 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనప్పుడు ఆమె గురించి చాలామందికి పెద్దగా తెలియదు.

ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య.

మొదట్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు.

‘అధ్యక్షురాలైన తొలి నెలల్లో.. తన పార్టీ నాయకులకు కూడా అంతుపట్టని వ్యక్తి సోనియా గాంధీ’ అని ఇండియా టుడే మ్యాగజీన్ అభివర్ణించింది.

ఆమెను అర్థం చేసుకోవడం కష్టమని, ఎక్కువగా మాట్లాడేవారు కాదని, భద్రతా కారణాలతో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవారు కాదని పేర్కొంది.

కానీ ఆమెకు రాజకీయాల్లో అధికారం ఎలా ఉపయోగించాలో బాగా తెలుసన్న విషయం అప్పటికే అర్థమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆమె అందరి అభిప్రాయాలు వినివారు, సమాచారం సేకరించేవారు.

కానీ చివరికి సొంత నిర్ణయమే అమలుచేసేవారు.

దాదాపు 30 ఏళ్ల తర్వాత.. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తి నుంచి, కాంగ్రెస్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా ఎదిగిన తీరు వరకు తన రాజకీయ ప్రయాణం గురించి స్వయంగా చెప్పబోతున్నారు సోనియా గాంధీ.

విలియమ్ కాలిన్స్ సంస్థ, పుస్తకం, ప్రచురణ

ఫొటో సోర్స్, William Collins

ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం నవంబర్‌లో విడుదల కానుంది.

79 ఏళ్ల సోనియా గాంధీ జీవితంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరిగాయి.

ఆమె అత్తయ్య ఇందిరా గాంధీని భద్రతా సిబ్బంది కాల్చారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు సోనియా. ఏడేళ్ల తర్వాత ఆత్మాహుతి దాడిలో మరణించిన తన భర్త రాజీవ్ గాంధీ మృతదేహాన్ని కూడా ఆమె ఇంటికి తీసుకువచ్చారు.

ఆమె ఆత్మకథ పుస్తకం పేరు ‘బిలాంగింగ్.. ఎ జర్నీ ఆఫ్ లవ్’.

ఈ పుస్తకం ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అల్‌ఫ్రెడ్ ఎ.నోప్, బ్రిటన్‌లో విలియమ్ కాలిన్స్ సంస్థల ప్రచురణలో అందుబాటులోకి రానుంది.

ఈ పుస్తకం భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ పుస్తకాలలో ఒకటయ్యే అవకాశం ఉంది.

'ఈ ఆత్మకథ నా జీవితంలో ఎదురైన సంతోషాలు, బాధలు, నిరాశలను తెలియజేసే నా మనసు ప్రయాణానికి గుర్తుగా ఉండాలి' అని అల్‌ఫ్రెడ్ ఎ.నోప్ విడుదల చేసిన ఒక ప్రకటనలో సోనియా గాంధీ చెప్పారు.

ఈ పుస్తకంలోని కథ 1965లో కేంబ్రిడ్జ్‌లో మొదలవుతుంది. అక్కడ 19 ఏళ్ల ఇటలీ విద్యార్థిని సోనియా మైనో, భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీని ప్రేమిస్తారని విలియమ్ కాలిన్స్ సంస్థ తెలిపింది.

సాధారణంగా ఎక్కువగా మాట్లాడని సోనియా గాంధీ ఈ పుస్తకంలో తన జీవితాన్ని నిజాయితీగా, స్పష్టంగా గుర్తుచేసుకున్నారు అని ప్రచురణకర్తలు చెబుతున్నారు.

ప్రేమ, దేశం విడిచి వెళ్లడం, రాజకీయ అధికారం, తీవ్ర విషాదం వంటి అనుభవాలతో ఆమె జీవితం ఎలా మారిందన్న అంశాలన్నీ ఇందులో ఉన్నాయి.

ఇటలీలోని చిన్న పట్టణంలో తన బాల్యం నుంచి మొదలుపెట్టి, ఊహించని విధంగా భారత రాజకీయాల్లోకి వచ్చిన ప్రయాణం వరకు అన్నింటినీ ఆమె వివరించారు.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, Keystone/Getty Images

ఫొటో క్యాప్షన్, సోనియా (కుడివైపు) కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని కలిశారు.

ఈ ఆత్మకథను ప్రచురించే విషయంలో ఇప్పటికే భారత్‌లో వివాదం నెలకొంది.

పుస్తకంలోని కొన్ని భాగాల్లో మార్పులు చేయాలని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా

కోరినట్లు వార్తలు వచ్చాయి.

తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించే కొన్ని విషయాలను మార్చాలని ప్రచురణ సంస్థపై రాజకీయ ఒత్తిడి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

అయితే పెంగ్విన్ ఈ ఆరోపణలను ఖండించింది. పుస్తకాన్ని ప్రచురించడానికి తాము ఆసక్తిగా, సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ తెలిపింది.

కానీ పాఠకులు మాత్రం ఒక విదేశీ యువతి భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలోకి కోడలిగా ఎలా వచ్చారనే కథను మాత్రమే తెలుసుకోవాలని అనుకోవడం లేదు.

సోనియా గాంధీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఎనిమిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ 2004లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెరవెనుక ఏం జరిగింది? వంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారు.

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంత్యక్రియల్లో రాజీవ్ గాంధీ (ఎడమ నుంచి రెండో వ్యక్తి, టోపీ ధరించి) తన కుమార్తె ప్రియాంక, భార్య సోనియాతో కలిసి.

అప్పటికి.. సొంత పార్టీ, మిత్రపక్షాల మద్దతు ఉన్నప్పటికీ సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించారు? దానికి బదులుగా భారత ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్ సింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు? అన్నదే పెద్ద ప్రశ్న.

తన విదేశీ నేపథ్యం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడుతుందని ఆమె భయపడ్డారా?

'ఇంకా సమాధానం దొరకని అతిపెద్ద ప్రశ్న ఇదేనని అనుకుంటున్నా. ఆమె సులభంగా ప్రధానమంత్రి అయ్యేవారు. పార్టీ, మిత్రపక్షాల పూర్తి మద్దతు ఆమెకు ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించే లేఖను రాష్ట్రపతి కార్యాలయం కూడా సిద్ధంగా ఉంచింది' అని జర్నలిస్ట్, రచయిత నీర్జా చౌదరి చెప్పారు.

మాజీ కాంగ్రెస్ నాయకుడు, విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథలో, సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని రాశారు.

తన అమ్మమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీకి జరిగినట్టుగానే తన తల్లి విషయంలో కూడా జరుగుతుందని రాహుల్ భయపడ్డారని ఆయన చెప్పారు.

ఆమె ప్రధాని కాకుండా ఆపడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా అని రాహుల్ చెప్పడంతో పరిస్థితి తారస్థాయికి చేరిందని నట్వర్ సింగ్ రాశారు.

మరి సోనియా గాంధీ ఆత్మకథ ఆ అసాధారణ విషయాలు గురించి కొత్త విషయాలు వెల్లడిస్తుందా? లేక తెరవెనుక జరిగిన విషయాలపై భిన్నమైన కథనాన్ని అందిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, 1985లో వైట్ హౌస్‌లో జరిగిన విందులో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, ఆయన భార్య నాన్సీ రీగన్‌తో రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా. (చిత్రంలో వరుసగా రోనాల్డ్ రీగన్, సోనియా గాంధీ, నాన్సీ రీగన్, రాజీవ్ గాంధీ)

కారణం ఏదైనా, సోనియా తీసుకున్న ఆ నిర్ణయం భారత రాజకీయాలను మార్చేసింది.

అయితే అది ఒక పెద్ద ప్రశ్నలోని ఒక భాగం మాత్రమే.

అసలు సోనియా గాంధీ మొదట రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు...

చాలా ఏళ్లపాటు రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించారు సోనియా. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కూడా ఎక్కువగా ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. కానీ 1990లలో కాంగ్రెస్ బలహీనపడుతూ ఉండటంతో, 1997లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడాది కూడా పూర్తికాకముందే పార్టీ అధ్యక్షురాలయ్యారు.

ఆ సమయంలో ఆమెను ప్రత్యర్థులు పెద్దగా పట్టించుకోలేదు.

మొదట్లో కొంతమంది ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఆమెను గృహిణి, ఇటాలియన్ వండర్ అని మాత్రమే పిలిచేవారని 1998 డిసెంబర్‌లో ఇండియా టుడే పేర్కొంది.

అయితే కొన్ని నెలల్లోనే ఆమె తన పార్టీలో మార్పులు ప్రారంభించారు.

"ఈమె ఇంత సర్‌ప్రైజ్ చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అని కాంగ్రెస్‌లోని ఒక సీనియర్ నాయకుడు అన్నారు.

ఆమెకు రాజకీయాల్లో ఎంతటి సామర్థ్యం ఉందో ‘ఇండియా టుడే’ అప్పటికే గుర్తించింది.

వెల్వెట్ గ్లౌవ్‌లో ఇనుప పిడికిలి ఉన్న నాయకురాలిగా ఆమెను అభివర్ణించింది.

అలాగే పెద్ద పెద్ద నాయకుల అహంకారాన్ని కూడా సులభంగా అదుపులోకి తీసుకురాగలరని పేర్కొంది.

అయితే ఆమె రాజకీయ జీవితానికి కారణమైన విషాద సంఘటనలు కూడా ఉన్నాయి.

మహాత్మా గాంధీ, నెహ్రూ కుటుంబం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 1991లో తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంత్యక్రియల సమయంలో కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్‌తో సోనియా గాంధీ (మధ్యలో).

1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత తన కుటుంబంలో వచ్చిన మార్పులను సోనియా గాంధీ స్వయంగా చూశారు. ఏడేళ్ల తర్వాత, ఆత్మాహుతి దాడిలో తన భర్త రాజీవ్ గాంధీని కోల్పోయారు.

ఈ మరణాలు భారత రాజకీయాలనే కాకుండా, ఆమె జీవితాన్ని కూడా మార్చేశాయి.

ఆ సమయంలో ఉన్న పరిస్థితుల గురించి సోనియా గాంధీ తన పుస్తకంలో ఏం చెబుతారు?

తాను తీవ్రంగా వ్యతిరేకించిన రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం గురించి ఆమె ఏమంటారు?

తన పిల్లల భద్రత విషయంలో ఆమెకు ఉన్న భయాల గురించి ఏం చెబుతారు?

గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అలా వదిలేయలేమని ఆమె నిర్ణయించుకున్న సందర్భం గురించి ఏం చెబుతారు?

ఇలాంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి.

సోనియా గాంధీ బోఫోర్స్ కుంభకోణం గురించి మాట్లాడతారా? ఈ కుంభకోణం రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించింది. అలాగే ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచీతో గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధాలపై దశాబ్దాలుగా వివాదం కొనసాగింది.

ఈ ఆరోపణల గురించి ఆమె మళ్లీ మాట్లాడి, తనకు తెలిసిందంతా చెబుతారా?

మరి ఆమె ఇటలీ మూలాలపై వచ్చిన వివాదం సంగతేంటి?

సోనియా గాంధీ విదేశీయురాలని, ఆమె భారతదేశానికి నాయకత్వం వహించడానికి అర్హురాలు కాదని కొన్నేళ్లపాటు విమర్శలు వచ్చాయి.

దిల్లీలోని కొన్ని వర్గాల్లో ఆమెను 'ఇటాలియన్ ఆయా' అంటూ ఎగతాళి చేసేవారు.

2004లో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, విదేశీ మూలాలున్న వ్యక్తి ప్రధానమంత్రి కావడం "దేశానికి అవమానం" అని అన్నారు. సోనియా ప్రధానమంత్రి అయితే తాను రాజీనామా చేసి, తల వెంట్రుకలు తీసేసుకుని, తెల్లని దుస్తులు ధరించి, సన్యాసిలా జీవిస్తానని ఆమె ప్రకటించారు.

సోనియా గాంధీని విమర్శించే వారు ఆమెను ప్రభుత్వానికి "రిమోట్ కంట్రోల్" అని పిలిచేవారు.

ఆమె మన్మోహన్ సింగ్‌పై ఎంత అధికారం చూపుతున్నారో వారు ప్రశ్నించేవారు.

అయితే ఆమెకు మద్దతు ఇచ్చేవారు, చాలా కష్టమైన కూటమిని కలిపి ఉంచిన ప్రధాన రాజకీయ శక్తి సోనియానే అని భావించేవారు.

కాంగ్రెస్, మన్మోహన్ సింగ్‌

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images)

ఫొటో క్యాప్షన్, 1991లో తన భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత, ఆయన స్థానంలో కాంగ్రెస్ నాయకురాలిగా బాధ్యతలు చేపట్టడానికి సోనియా గాంధీ నిరాకరించారు.

1999లోనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆమె విదేశీ మూలాలపై ప్రశ్నలు లేవనెత్తారు అని జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ అన్నారు.

సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 2004, 2009లో వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ముఖ్యమైన చట్టాలు తీసుకొచ్చింది.

కానీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొంది.

పార్టీ అంతా సోనియా గాంధీ నాయకత్వంపై ఎక్కువగా ఆధారపడుతోందనే విమర్శలు కూడా వచ్చాయి.

సోనియా గాంధీని విమర్శించిన వారు ఆమెను ప్రభుత్వానికి "రిమోట్ కంట్రోల్" అని పిలిచేవారు. ఆమె మన్మోహన్ సింగ్‌పై అధికారం చెలాయించడాన్ని వారు ప్రశ్నించేవారు.

అయితే ఆమెను సమర్థించిన వారు మాత్రం చాలా కష్టమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించగలిగిన రాజకీయ శక్తి సోనియానే అని భావించారు.

ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే, సోనియా గాంధీ 2017లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు.

రాహుల్ గాంధీ పార్టీని తిరిగి బలమైన స్థితికి తీసుకురావడంలో విఫలమయ్యారని చాలామంది భావిస్తున్నారు. గాంధీ కుటుంబం రాజకీయంగా బలహీనపడటానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమని భావిస్తారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి తాను శతవిధాలా ప్రయత్నించానని 1994లో ప్రచురించిన రాజీవ్ అనే పుస్తకంలో సోనియా గాంధీ రాశారు.

అయినప్పటికీ చివరికి ఆ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడు రాహుల్‌కు అప్పగించారు.

రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.

ఒకప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడని వ్యక్తి అని విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీకి దూరంగా ఉండే నాయకుడని ప్రత్యర్థులు ఎగతాళి చేసేవారు.

"తన కుమారుడి భిన్నమైన రాజకీయ శైలి, ఆలోచనా విధానాన్ని సోనియా ఎలా చూస్తారు? ఆయన రాజకీయాలకు ఆమె ఎంతవరకు మద్దతిస్తారు? ఈ ప్రశ్నలకు పుస్తకంలో సమాధానాలు ఉంటాయని ఆశిస్తున్నా" అని కిద్వాయ్ అన్నారు.

మరో ప్రశ్న ఏంటంటే కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి ఎక్కువ ఆకర్షణ ఉన్న తన కుమార్తె ప్రియాంకకు బదులుగా రాహుల్‌ను సోనియా ఎందుకు ఎంచుకున్నారు?

అలాగే ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారని ఎన్నో ఏళ్లుగా ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఆమె 2019లో మాత్రమే అధికారికంగా ఎన్నికల రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?

రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది తన పిల్లలే నిర్ణయించుకోవాలని సోనియా గాంధీ చెప్పేవారని కిద్వాయ్ అన్నారు.

వీటితోపాటు ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది.

అభివృద్ధిలో తానూ భాగం పంచుకున్న నేటి భారతదేశం గురించి సోనియా గాంధీ ఏమనుకుంటున్నారు?

ఉత్తరప్రదేశ్‌ ప్రచారం

ఫొటో సోర్స్, Sygma via Getty Images

ఫొటో క్యాప్షన్, 1980లలో ఉత్తరప్రదేశ్‌లో తన భర్త రాజీవ్ గాంధీ తరఫున ప్రచారం చేస్తున్న సోనియా గాంధీ.

భారత రాజకీయాల్లో కూటమి ప్రభుత్వాలు, ఆర్థిక సంస్కరణల కాలం నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ, హిందూ జాతీయవాద రాజకీయాలు మరింత బలపడిన కాలం వరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు.

అయితే సోనియా ఆత్మకథలో ఏం చెబుతారు, ఏం చెప్పకుండా వదిలేస్తారు అనేదే బహుశా మరింత ముఖ్యమైన ప్రశ్న.

దీనికి సమాధానం బిలాంగింగ్ పుస్తకంలో ఉండవచ్చని జర్నలిస్ట్ నీర్జా చౌదరి అన్నారు.

"నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తనపై ఉందని సోనియా అనుకున్నారు. ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచాలి" అని చౌదరి అన్నారు.

ఈ ఆత్మకథలో కుటుంబం, దాని చరిత్ర గురించి, ముఖ్యంగా సోనియాకు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి, అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన విధానం గురించి ఎక్కువగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

అయితే ఆ రాజకీయ వారసత్వంపై ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

అధికారంలో ఉన్న బీజేపీ 'కాంగ్రెస్-ముక్త భారత్' అనే నినాదంతో ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ను విమర్శించే వారు దీన్ని వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా చూపిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ, ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ప్రత్యర్థి పార్టీల్లో చేరుతుండటంతో, ఇప్పుడు ప్రశ్న కేవలం గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ను మళ్లీ బలమైన పార్టీగా మార్చగలదా? అనేదే కాదు. ఆ పార్టీని ఐక్యంగా ఉంచగలదా? అన్నది.

సోనియా తన ఆత్మకథలో చెప్పాలనుకుంటున్న విషయానికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది.

'నా కుటుంబం గురించి చాలా రాశారు. కానీ వారి ఆలోచనలు, వారు చేసిన పనులు, వారి మానవ సహజమైన తప్పుల వెనుక ఉన్న నిజాన్ని చాలా కొద్దిమంది మాత్రమే చూపించగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పుస్తకం వారి మానవత్వానికి ఒక నివాళి' అని ఈ పుస్తకం గురించి సోనియా చెప్పినట్టు పేర్కొన్నారు.

అందువల్ల ఆమె ఆత్మకథ కేవలం రాజకీయాలను సమీక్షించే పుస్తకం కాకపోవచ్చు.

తనకు నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వం అంటే ఏమిటో, అది తన జీవితంలో ఎందుకు ముఖ్యమో వివరించే ఒక ప్రయత్నం కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)