నేపాల్ వరదలు: 'పిల్లి అనుకుని వెళ్తే శిథిలాల కింద పాప కనిపించింది'

నేపాల్ వరద, ప్రకృతి విపత్తు, సహాయక చర్యలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శిథిలాల కింద కనిపించిన పాపకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు.
    • రచయిత, ఆజాదె మొషిరి, ఆండ్రూ క్లారెన్స్
    • హోదా, కాఠ్‌మాండూ నుంచి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదల తరువాత సహాయ బృందాలు శుక్రవారం(ఆగస్టు 28) ఒక చిన్నారిని కాపాడాయి. ఆ అయిదేళ్ల చిన్నారి మనీషా తాజాగా తన తల్లిదండ్రులను కలుసుకుంది. చిన్నారి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే వారంతా కలుసుకున్నారు.

మనీషా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాఠ్‌మాండూలోని టీచింగ్ ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు.

రాసువా జిల్లాలోని స్యాబ్రుబేసి సమీపంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయ సిబ్బంది గాలిస్తుండగా, శిథిలాల కింద ఏదో పిల్లి చిక్కుకున్నట్టు వారికి శబ్దం వినిపించింది. రక్షించడానికి వెళ్లగా అక్కడ చిన్నారి కనిపించింది.

సహాయ బృందాలు ఆ ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తుండగా వాటి కింద చిక్కుకున్న మనీషా కనిపించిందని నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన పోలీసు అధికారి సంజు ఖత్రి చెప్పారు.

ఆమెను రక్షించడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేపాల్ వరద, ప్రకృతి విపత్తు, సహాయక చర్యలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చిన్నారులను సురక్షితంగా తీసుకెళ్తున్న సైనికులు

స్పృహలో లేని పాప

తాము రక్షించే సమయానికి ఆమె ప్రాణాలతో ఉన్నప్పటికీ స్పందించే స్థితిలో లేదని అధికారి వివరించారు. సహాయ బృందం హెలికాప్టర్ కోసం ప్రయత్నించినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆమెను వెంటనే తరలించలేకపోయారు.

ఆ తర్వాత సహాయక బృందాలు ఆమెను శిబిరానికి తీసుకెళ్లాయి. మంచినీళ్లు తాగించిన తర్వాత కాసేపటికి మనీషాకు స్పృహ వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవడానికి మొదట కొద్దిగా జావ తాగించారు.

అప్పటికి మనీషా తీవ్ర భయాందోళనలో ఉంది.

శనివారం(ఆగస్టు 29) మధ్యాహ్నం మనీషాను హెలికాప్టర్‌లో కాఠ్‌మాండూలోని టీచింగ్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు.

మనీషా క్రమంగా కోలుకుంటోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

నేపాల్ వరద, ప్రకృతి విపత్తు, సహాయక చర్యలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నేపాల్ వరదల్లో కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు

అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్ వరదల్లో ఆదివారం మధ్యాహ్నానికి స్థానిక కాలమానం ప్రకారం ఒంటి గంట సమయానికి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలు) మృతుల సంఖ్య 752కి చేరినట్టు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఆర్ఆర్ఎంఏ) తెలిపింది. ఇంకా 2,502 మంది ఆచూకీ తెలియలేదని ఎన్‌డీఆర్ఆర్ఎంఏ వెల్లడించింది.

మరోవైపు ఆదివారం కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నువాకోట్ జిల్లాలో ఓ ఆర్మీ బ్యారక్స్ వద్ద.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కాపాడిన చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సైనికులు కనిపించారు.

ఆచూకీ తెలియని తమవారి కోసం ఎంతోమంది ఆర్మీ బ్యారక్స్ దగ్గర ఆశతో, ఆందోళనతో వేచి చూస్తున్నారు.

ఈ సహాయ చర్యల్లో హెలికాప్టర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)