కడుపులో గ్యాస్, ఉబ్బరం.. బంగాళదుంపలు తింటే ఈ ఇబ్బంది తప్పదా?

ఫొటో సోర్స్, Getty Images
బంగాళదుంపలు తినడం వల్ల భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుందని, గ్యాస్ ఎక్కువగా వస్తుందని కొందరు చెప్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువగా తినే ఆహారపదార్థాల్లో బంగాళదుంపలు ఒకటి.
మెత్తగా ఉడికించిన బంగాళదుంపలను, ఫ్రైస్ లేదా చిప్స్ వంటి వాటిని ఎక్కువగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరంలా అనిపిస్తుందని కొంతమంది చెబుతారు.
అయితే బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల నిజంగా కడుపు ఉబ్బరం వస్తుందా?
దీనికి సంబంధించి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అరుల్ ప్రకాశ్ ‘బీబీసీ’తో మాట్లాడారు.
బంగాళాదుంపలు, కడుపు ఉబ్బరానికి సంబంధంపై కచ్చితమైన సమాధానం లేదని ఆయన అన్నారు.
"చాలామందిలో పొట్టలో గ్యాస్ ఎక్కువగా తయారవడానికి కారణమయ్యే ఆహారం బంగాళదుంపలు ఒక్కటే కాదు. అయితే బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి పొట్ట నిండుగా ఉన్నట్లు, ఉబ్బరంగా ఉన్నట్లు అనిపించొచ్చు. పేగులలో గ్యాస్ వంటి అసౌకర్యాలు కలగవచ్చు. కానీ ఇది మనిషికి మనిషికి మారుతుంది" అని ఆయన వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
'బంగాళదుంపలు మాత్రమే కారణం కాదు'
ఇలాంటి సమస్యలకు బంగాళదుంపలు మాత్రమే కారణం కాదని.. వాటిని వండే విధానం, తీసుకునే పరిమాణం, వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, కొన్ని రకాల పిండి పదార్థాలకు శరీరం స్పందించేతీరు వంటి అనేక ఇతర అంశాల పాత్ర కూడా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
చిన్న పేగులో పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్లు, పెద్ద పేగులోని బ్యాక్టీరియా ద్వారా కిణ్వ ప్రక్రియకు లోనైప్పుడు గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, డైజెస్టివ్, కిడ్నీ డిసీజెస్(ఎన్ఐడీడీకే) తెలిపింది.
"ఈ ప్రక్రియ సహజంగా హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ చర్య ఎక్కువగా ఉంటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి" అని తెలిపింది.
బంగాళదుంపల్లో పిండిపదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ పిండిపదార్థంలో ఎక్కువ భాగం చిన్న పేగులో జీర్ణమవుతుంది. అయితే దానిలో కొంత భాగం జీర్ణం కాకుండా పెద్ద పేగుకు చేరుకుంటుంది. అక్కడ దాన్ని పేగులలోని బ్యాక్టీరియా పులియబెడుతుంది.
రెసిస్టెంట్ స్టార్చ్ అనే పదార్థం మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసే ప్రీబయోటిక్‌లాగా పనిచేస్తుంది. దీర్ఘకాలంలో పేగుల ఆరోగ్యానికి ఇది మంచిదే అయినప్పటికీ ఈ బ్యాక్టీరియా ఆ రెసిస్టెంట్ స్టార్చ్‌ను కిణ్వనం చేసే ప్రక్రియలో భాగంగా కొంతమందిలో కాసేపు గ్యాస్ సమస్య ఏర్పడుతుందని న్యూట్రిషన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.
"అనేక ప్రాంతాల్లో బంగాళదుంపలు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. అలాగే బంగాళదుంపలు మాత్రమే కాకుండా బీన్స్, ముల్లంగి వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కూరగాయల వల్ల కూడా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి అసౌకర్యాలు ఏర్పడవచ్చు'' అని అరుల్ ప్రకాశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జీర్ణవ్యవస్థ ప్రభావం
బంగాళాదుంపల వంటి ఆహారపదార్థాలు కొంతమందికి అసౌకర్యాన్ని కలిగిస్తున్నంత మాత్రాన అవి అనారోగ్యకరమైనవని అర్థం కాదని, ప్రతి వ్యక్తి జీర్ణవ్యవస్థ ఒక్కో ఆహారానికి ఒక్కోలా స్పందిస్తుందని ఆయన అన్నారు.
అందరూ బంగాళదుంపల వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటారని నిజానికి పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, బీన్స్, ముల్లంగి వంటివి ఉబ్బరానికి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు.
"వ్యక్తి శరీర నిర్మాణం, జీర్ణ వ్యవస్థ పనితీరు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే బంగాళదుంపలతో పాటు కలిపి తినే ఇతర ఆహార పదార్థాల వల్ల కూడా ఇలాంటివి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పప్పులు, బంగాళదుంపలు ఉన్న భోజనం తిన్నప్పుడు ఈ అసౌకర్యాలు కలిగితే, ఇంకోసారి వాటిని విడివిడిగా తిని ఆరోగ్యాన్ని గమనించాలి. అప్పుడు ఏ రకమైన ఆహారం వల్ల సమస్య వస్తుందో అర్థం చేసుకోగలం. అలాంటి అసౌకర్యాలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుణ్ని సంప్రదించడం అవసరం" అని డాక్టర్ అరుల్ ప్రకాశ్ అన్నారు.
అలాగే లాక్టోస్‌ను జీర్ణం చేసుకోలేనివారు పాల ఉత్పత్తులతో తయారైన ఆహారపదార్థాలు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే బాగా వేయించిన బంగాళదుంపలను తినడం వల్ల, వాటిలోని అధిక కొవ్వు వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిపోయే ఉన్న భావన ఉంటుంది. కొంతమందికి భోజనం తర్వాత అసౌకర్యంగా అనిపించవచ్చు.

బీన్స్, శనగలు, బఠానీలు...
బంగాళదుంపల మాదిరిగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను కలిగించే అనేక రకాల ఆహారపదార్థాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు బీన్స్, శనగలు, బఠానీలు, పప్పుధాన్యాలు ఇలాంటివే అని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అరుల్ ప్రకాశ్ చెప్పారు.
వీటిలో ఒలిగోసాకరైడ్లు అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వాటిని పూర్తిగా జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లు చిన్న పేగులో తగినంతగా ఉండవు కాబట్టి అవి పెద్ద పేగుకు చేరుకుంటాయి. అక్కడ బ్యాక్టీరియా వాటిని పులియబెడుతుంది. దీనివల్ల గ్యాస్ ఏర్పడుతుంది.
అదేవిధంగా "కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయల్లో రాఫినోస్, సల్ఫర్ కలిగిన సమ్మేళనం ఉంటుంది. జీర్ణక్రియ సమయంలో ఈ సమ్మేళనాలు గ్యాస్ బాగా ఏర్పడటానికి కారణమవుతాయి" అని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
"ఈ కూరగాయలల్లో అధిక పోషక విలువలు ఉన్నప్పటికీ, ఇవి కడుపు ఉబ్బరానికి కారణమవుతాయని భావిస్తాం" అని అరుల్ ప్రకాశ్ అన్నారు.
అంతేకాకుండా పాలు, ఐస్ క్రీమ్, చీజ్, పెరుగులో లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్‌తో ఇబ్బంది ఉన్నవారు అది జీర్ణమవ్వడానికి కారణమైన లాక్టోస్ ఎంజైమ్‌ను తగినంతగా ఉత్పత్తి కాదు.
జీర్ణం కాని లాక్టోస్ పెద్ద పేగుకు చేరుకుంటుంది. అక్కడ దాన్ని బ్యాక్టీరియా పులియబెడుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు వంటి అసౌకర్యాలు కలుగుతాయని అరుల్ ప్రకాశ్ వివరించారు.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం తృణధాన్యాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచివి. దీర్ఘకాలిక జీర్ణసమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే పీచుపదార్థాలు ఎక్కువగా తినడం అకస్మాత్తుగా మొదలుపెడితే జీర్ణవ్యవస్థపై భారం పడి గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీయొచ్చని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కూల్‌డ్రింక్స్‌తోనూ గ్యాస్’
పంచదార లేని చూయింగ్ గమ్‌లు, క్యాండీలు, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లో సోర్బిటాల్, మానిటాల్, జైలిటాల్, మాల్టిటాల్ వంటి చక్కెర ప్రత్యామ్నాయాలుంటాయి. ఈ తీపి పదార్థాలు చిన్న పేగులో పాక్షికంగా మాత్రమే శోషణ చెందుతాయని అధ్యయనాలు వెల్లడించాయి.
శోషణ కాని మిగిలిన భాగం పెద్ద పేగుకు చేరుకుంటుంది. పేగులలోని బ్యాక్టీరియా అక్కడ దాన్ని పులియబెడుతుంది. అంతేకాకుండా పేగులలోకి నీళ్లు చేరతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరోచనాలు వంటివి కలగొచ్చని అధ్యయనాల్లో తేలింది.
సోర్బిటాల్ శోషణ సరిగా లేకపోవడం వల్ల జీర్ణాశయ సమస్యలు వస్తాయని 'గట్, పీడియాట్రిక్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలియజేసింది. అదే విధంగా సోర్బిటాల్, మానిటాల్, జైలిటాల్ వంటి పంచదార ప్రత్యామ్నాయాలు పేగుల్లో గ్యాస్ ఎక్కువగా ఏర్పడడానికి కారణాలని మయో క్లినిక్ తెలిపింది.
కార్బోనేటెడ్ పానీయాలు కూడా జీర్ణ సంబంధిత రుగ్మతలకు కారణమవుతాయి. "కూల్ డ్రింక్స్ కడుపులో గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాకుండా కార్బోనేటెడ్ పానీయాలు జీర్ణవ్యవస్థలోకి కార్బన్‌డయాక్సైడ్ వాయువును పంపుతాయి. తేనుపులకు కారణాల్లో అది ఒకటి" అని మేయో క్లినిక్ తెలిపింది.
"వాటిని ఎక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు ఈ అదనపు గ్యాస్ కడుపు ఉబ్బరానికి, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడానికి, తేన్పులు ఎక్కువగా రావడానికి కారణమవుతుంది" అని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కడుపులో అసౌకర్యం ఉండకూడదంటే..
జీర్ణవ్యవస్థ పనితీరు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందని డాక్టర్ అరుల్ ప్రకాశ్ చెప్పారు.
అంటే "ఒక వ్యక్తికి ఎంత గ్యాస్ తయారవుతుందనేది వారి పేగుల్లోని బ్యాక్టీరియా నిర్మాణం, జీర్ణక్రియ వేగం, ఆహారపు అలవాట్లు, ఆహార అలర్జీలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని అని ఆయన తెలిపారు.
గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సాధారణ ఆహార, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చని చెప్పారు.
వేగంగా తినడం వల్ల గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంది. ఆ గాలి జీర్ణవ్యవస్థలో చిక్కుకుపోయి కడుపు ఉబ్బరం, తేనుపులకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తినడం వల్ల ఈ లక్షణాలను తగ్గించవచ్చని ఆయన సూచించారు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు కొంతమందిలో ఇలాంటి లక్షణాలకు కారణమవుతాయి. బంగాళదుంపలువంటివి తిన్న తర్వాత కొందరికి ఈ లక్షణాలు కనిపిస్తే పాల ఉత్పత్తులు లేదా పప్పుధాన్యాలు తీసుకుంటే మరికొందరికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ అరుల్ ప్రకాశ్ అంటున్నారు.
అందరికీ ఒకే ఆహారం ఒకే తరహా సమస్యలను కలిగిస్తుందని చెప్పలేం.
"కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనబడితే వాటి మోతాదును తగ్గించడం లేదా ఆహారాన్ని తయారుచేసే పద్ధతులను మార్చడం గురించి ఆలోచించవచ్చు.
గ్యాస్, కడుపు ఉబ్బరం సాధారణంగా ప్రమాదకరం కాదు. అయితే వాటితో పాటు కారణంలేకుండా బరువు తగ్గడం, కడుపు నొప్పి ఎక్కువకాలం కొనసాగడం, విరోచనాలు, మలంలో రక్తం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి'' అని వైద్యులు సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























