'చిన్నప్పటి నుంచీ నన్ను రోగిగా మార్చింది నా కన్నతల్లే'

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, ఏడేళ్ల వయసులో నీనా బ్లోమ్
    • రచయిత, ఇండియా రాకుసేన్, రాడెక్ బొషెట్టి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

నెదర్లాండ్స్‌లో 1970, 80ల కాలంలో పెరిగిన నీనా బ్లోమ్ అందరిలాగే ఒక సాధారణ బాలికలా కనిపించేది. ఆమెకు సంగీతం, పాటలు, డాన్స్ అంటే చాలా ఇష్టం. తన ఇంటి అటకపై సోదరితో కలిసి ఆడుకున్న సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా ఆమెకు ఉన్నాయి.

కానీ, ఆ ఆనంద క్షణాలు చాలా అరుదుగా ఉండేవి. ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి చాలా అరుదుగా అనుమతించేవారు. ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి, నీనాకు తీవ్రమైన అనారోగ్యం ఉందని ఆమె తల్లి నమ్మించారు.

కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆరు వేర్వేరు ఆసుపత్రులలో 15 సార్లు పరీక్షలు, చికిత్సల కోసం తీసుకువెళ్లారు. కాలక్రమేణా, నీనా వీల్‌చైర్‌కే పరిమితమయ్యేలా చేశారు. ఆమెకు నయంకాని కండరాల వ్యాధి ఉందని, త్వరలోనే చనిపోతుందని చెప్పారు.

ఆ సంవత్సరాల్లో ఎంతోమంది వైద్య నిపుణులు ఆమెను పరీక్షించారు. కానీ, ఎవరూ సమస్యను సరిగా గుర్తించలేకపోయారు. అయితే ఒక నిశితమైన ఆలోచన గల డాక్టర్ మాత్రమే నీనా కథలోని విషయాలన్నింటినీ పరిశీలించి, ఆమె 'అనారోగ్యం' వెనుక ఉన్న భయంకరమైన కారణాన్ని బయటపెట్టారు. ఆ కారణం మరెవరో కాదు, ఆమె తల్లే.

'పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్' (దీనినే ఫ్యాబ్రికేటెడ్ లేదా ఇండ్యూస్డ్ ఇల్‌నెస్, ముంచౌసేన్ సిండ్రోమ్ బై ప్రాక్సీ అని కూడా అంటారు) అనేది బాలలపై జరిగే ఒక రకమైన వేధింపు. ఇందులో సంరక్షకులు (సాధారణంగా తల్లిదండ్రులు) పిల్లల అనారోగ్యాన్ని పెంచి చెప్పడం, అబద్ధాలు సృష్టించడం లేదా ఉద్దేశపూర్వకంగా వారికి అనారోగ్యం కలిగించడం చేస్తారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మొదటిసారి ఆసుపత్రిలో చేరడం

నీనాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు, ఆమె తరచూ కడుపు సమస్యలతో బాధపడుతూ చాలా బరువు తగ్గింది.

ఆసుపత్రిలో చేర్చినప్పుడు, ఆమెకు ఆపిల్ జ్యూస్, సూప్ ఇచ్చారు. ఆమె వెంటనే కోలుకోవడం ప్రారంభమైంది."డాక్టర్.. 'నీనా బాగానే ఉంది... ఇంటికి వెళ్ళవచ్చు' అని చెప్పేవారు"

కానీ, నీనా తల్లి మాత్రం మళ్లీ ఆసుపత్రికి వెళ్లాలని పట్టుబట్టారు. కడుపునొప్పి తగ్గకపోయినా, ఇంకా నొప్పిగానే ఉందని డాక్టర్లతో చెప్పమని నీనాను బలవంతం చేశారు.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, చిన్నప్పుడు నీనా సంతోషంగా ఆడుకునేది.

తర్వాతి సంవత్సరాల్లో ఇదే పద్ధతి పదే పదే జరిగింది. ఒకసారి కుటుంబంతో కలిసి సెలవులకు వెళ్లినప్పుడు, ఈత కొట్టిన తర్వాత ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని నీనా చెప్పింది. వెంటనే ఆమె తల్లి, నీనాకు కండరాల వ్యాధి ఉందని నిర్ణయించేసి, మరోసారి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చూశారు.

నీనా వద్దని వారించినప్పుడు, "నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేయకు. నీకు నొప్పిగా ఉంది, ఇదే విషయాన్ని డాక్టర్‌తో చెప్పాలి" అని తల్లి అనేవారు.

ఈ పరిస్థితి నీనాను తీవ్ర అయోమయానికి గురిచేసేది. "క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల మధ్య వార్డులో పడుకోవడం చాలా గిల్టీగా అనిపించేది" అని నీనా అన్నారు.

"నాకు ఏ సమస్యా లేదు కదా అనుకునేదాన్ని" అన్నారామె.

ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే పక్క బెడ్‌పై ఉన్న అబ్బాయి చనిపోయాడు. ఇది నీనాను మరింత కుంగదీసింది.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, మూడేళ్ల వయసులో తల్లితో నీనా బ్లోమ్.

'ఆమె క్రూరంగా ప్రవర్తించేవారు'

బోన్ మ్యారో బయాప్సీ వంటి బాధాకరమైన పరీక్షలతో సహా నీనా అనేక రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా డాక్టర్లకు ఎలాంటి సమస్యా కనిపించలేదు. ఆమె తల్లి ఎప్పుడూ ఆమె పక్కనే ఉండేది. నీనా నవ్వడం చూసినప్పుడల్లా కోపంతో ఊగిపోతూ, ఆమెను శిక్షించేది.

నాలుగు వారాల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత, చివరికి డాక్టర్లు నీనాను ఇంటికి పంపాలని నిర్ణయించారు. ఇంటికి రాగానే ఆమె తల్లి నీనాను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టారు.

స్కూల్ మాన్పించేసి, లివింగ్ రూమ్‌లో వేసిన మంచంపైనే రోజంతా గడిపేలా చేశారు. దీంతో ఆమె స్నేహితులను కలవడం పూర్తిగా ఆగిపోయింది.

నీనా ఎంతో ఇష్టంగా వినే సంగీతాన్ని కూడా ఆమె తల్లి దూరం చేశారు. ఆ బాధలో అల్లికలు అల్లడం ద్వారా నీనా కొంత ఉపశమనం పొందేది. కానీ చేతులు త్వరగా అలసిపోతూ నొప్పులు పుట్టేవి. వెంటనే ఆమె తల్లి ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని పట్టుబట్టి, నీనా చేతులకు గట్టిగా కట్లు కట్టేశారు. ఆ కట్లు ఎంత గట్టిగా ఉన్నాయంటే, నీనా చేతులు, వేళ్లు మొద్దుబారిపోయేవి.

ఈ పరిస్థితి ఆమె తల్లికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు అనిపించింది: "మా అమ్మ ఆ బాధను చూసి ఆనందిస్తున్నట్లు కనిపించడం ఎంత భయంకరంగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను" అని నీనా అన్నారు.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, ఇల్లు మారిన ప్రతిసారీ నీనాను కొత్త డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లేవారు.

'నువ్వు చనిపోతావు'

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, ఆమె తల్లి చెప్పే మాటలు మారుతూ వచ్చాయి.

"నీకు ఎలాంటి నొప్పి లేదని, ఇదంతా నువ్వే సొంతంగా సృష్టించావని నాకు తెలిస్తే, నిన్ను గాయపరుస్తాను" అని నీనాతో ఆమె చెప్పారు.

దీంతో నీనా తీవ్ర అయోమయానికి గురై, తనని తాను పూర్తిగా కోల్పోయినట్లు అనిపించిందని చెప్పారు.

ఎక్కువ సమయం మంచంపైనే గడపడం, చేతులకు కట్లు కట్టి ఉంచడం వల్ల ఆమె క్రమంగా తన శక్తిని కోల్పోయారు.

చివరికి డాక్టర్లు ఆమెను ఫిజియోథెరపీ కోసం రిహాబిలిటేషన్ క్లినిక్‌కు పంపారు. అక్కడ ఆమె మళ్లీ నడవడం నేర్చుకున్నారు. అంతేకాదు, అక్కడ చికిత్స పొందుతున్న ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డారు.

చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆమె సంతోషాన్ని అనుభవించడం ప్రారంభించారు.

కానీ, వారాంతాల్లో ఇంటికి వెళ్లడానికి క్లినిక్ అనుమతించినప్పుడు, ఆమె తల్లి వెంటనే మళ్లీ తన నియంత్రణలోకి తీసుకునేవారు. మళ్లీ కట్లు కట్టుకునేలా బలవంతం చేస్తూ, మంచం దిగకుండా నిషేధించారు. నీనాకు గుండె జబ్బు ఉందని తల్లి చెబుతూ, ఒకరోజు "నువ్వు చనిపోతావు" అన్నారు.

"నేను నిజంగా ఒంటరినయ్యానని భావించిన మొదటి క్షణం అదే, ఏదో బ్లాక్ హోల్‌లో పడిపోతున్నట్లు అనిపించింది" అని నీనా అన్నారు.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, 1990లో ఇంటికి దూరంగా ఒక చోట చేర్చిన తర్వాత, ఆసుపత్రిలో ఐస్‌క్రీమ్ తింటున్న నీనా.

'మాకు యూథనేషియా కావాలి'

ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మరోసారి ఆసుపత్రిలో చేరిన సమయంలో, నీనాకు ఒక కొత్త పిల్లల వైద్యుడు (పీడియాట్రిషియన్) ఫ్రియెంటెన్ పరిచయమయ్యారు.

ఆమె మళ్లీ నడవడానికి... కాళ్లు, చేతులు, కీళ్ల కదలికలను మెరుగుపరిచే నిపుణులు ఉండే చోటును వెతకాలనుకుంటున్నట్లు ఆయన నీనాతో చెప్పారు

ఈ మాటలకు నీనా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. తనకు ప్రాణాంతకమైన కండరాల వ్యాధి ఉందని, దానివల్లే చనిపోతుందని ఆమె తల్లి ఎప్పుడూ చెబుతూ వచ్చేది. మనసులో ఎక్కడో అనుమానాలు ఉన్నప్పటికీ, నీనా ఎప్పుడూ ప్రశ్నించే ధైర్యం చేయలేదు.

ఈ పరిణామంతో ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి రాగానే నీనా కాళ్లను ఇంగ్లీష్ అక్షరం 'X' ఆకారంలో పెట్టి, కదలకుండా దిండ్లతో కట్టేశారు. ఆమె ఆహారాన్ని తగ్గించేసి, ముక్కు ద్వారా ఫీడింగ్ ట్యూబ్ పెట్టారు. రోజుకు 20 మాత్రలు మింగేలా చేశారు.

ఒకసారి డాక్టర్ వచ్చినప్పుడు, నీనాకు యూథనేషియా ప్రసాదించాలని ఆమె తల్లి కోరారు. అనారోగ్యంతో, తీవ్ర అలసటతో ఉన్న నీనా కూడా అందుకు అంగీకరించారు.

"డాక్టర్, నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయగలరా?" అని నీనా అడిగారు. అప్పుడు డాక్టర్ ఆమె తల్లితో కొద్దిసేపు మాట్లాడి, 24 గంటల పాటు మార్ఫిన్ ఇవ్వడానికి ప్రిస్క్రిప్షన్ రాశారు.

"ఆమెను నిద్రపోయేలా ఉంచుతాం" అని డాక్టర్ చెప్పారు.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, 1989లో మొదటిసారి సాధారణ దుస్తులు ధరించి కూర్చున్న నీనా.

ఎలా రక్షించారు?

కానీ, డాక్టర్ ఫ్రియెంటెన్ ఈ విషయాలన్నింటినీ సమీక్షించి అసలు నిజాన్ని గ్రహించారు. వెంటనే ఆయన చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్‌ను సంప్రదించారు.

ఒకరోజు, ఒక మహిళ నీనా గదిలోకి వచ్చి, ఆమెను వేరే ఆసుపత్రికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. నీనా ఆమెతో "వద్దు, దయచేసి నన్ను చనిపోనివ్వండి" అన్నారు.

ఆ సమయంలో తన తల్లి కంగారుపడటం నీనా గమనించారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వెంటనే ఆమెను స్ట్రెచ‌ర్‌పై పడుకోబెట్టి, అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. ఆమె చేతులు, కాళ్లకు ఉన్న కట్లను తొలగించారు. ఆమె ఉన్న గదిలో ఒక వీడియో కెమెరాను ఏర్పాటు చేశారు.

రెండు రోజుల పాటు ఆమె తన తల్లిదండ్రులలో ఎవరినీ చూడలేదు.

చివరికి వారు వచ్చి కలిసినప్పుడు, నీనా పదే పదే వారితో "నాకు ఎలాంటి అనారోగ్యం లేదు" అన్నారు.

నీనా ఆ మాటను అలా 18 సార్లు చెప్పారు. గదిలో కెమెరా రికార్డ్ అవుతోందనే విషయం మరిచిపోయిన ఆమె తల్లి తీవ్ర కోపానికి గురయ్యారు. ఇన్నేళ్లుగా ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదే బలమైన సాక్ష్యంగా మారింది.

నీనా బ్లోమ్, పీడియాట్రిక్ కండిషన్ ఫాల్సిఫికేషన్, చిన్నారులపై వేధింపులు

ఫొటో సోర్స్, Courtesy of Nina Blom

ఫొటో క్యాప్షన్, నీనా తన గతాన్ని వదిలేసి, బతికి బయటపడిన క్షణాలను ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

కొత్త జీవితం

కొంతకాలం తర్వాత, నీనా తన తల్లిదండ్రులతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెను ఒక చికిత్సా కేంద్రానికి మార్చారు. అక్కడ నీనాకు శారీరక, మానసిక చికిత్సలు అందించారు.

చివరికి ఒక కొత్త నగరంలో తన గుర్తింపును మార్చుకుని స్థిరపడ్డారు. ఆమె ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్నారు: ఆర్ట్ స్కూల్ నుంచి పట్టభద్రురాలయ్యారు, ఉద్యోగం సంపాదించారు, ప్రేమలో పడ్డారు.

ఆమె తల్లిదండ్రులు తాము చేసిన తప్పును ఎన్నడూ ఒప్పుకోలేదు. పైగా ఒకానొక సమయంలో ఆమెను వెతకడానికి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ను కూడా నియమించారు. ఈ పరిణామం ఆమెకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని, బాధను కలిగించింది.

ఒకానొక సమయంలో ఆమె వారిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ, చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.

"మా తల్లిదండ్రులు నాకు చేసింది ఒక నేరం. అది తీవ్రమైన బాలల వేధింపు, నేను చాలా కష్టమ్మీద బతికి బయటపడ్డాను" అని నీనా అన్నారు.

"నేను బతికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, జీవితంలో జీవించడానికి ఎంతో ఉంది" అన్నారామె.

ఈ కథనం బీబీసీ వరల్డ్ సర్వీస్‌లోని 'అవుట్‌లుక్' కార్యక్రమం ఆధారంగా రూపొందించినది. నీనా జ్ఞాపకాల పుస్తకానికి (మెమొయిర్‌కు) 'యూ ఆర్ ఎ హారిబుల్ చైల్డ్' అని పేరు పెట్టారు. మార్గ్రీట్ డి హీర్, నీనా బ్లోమ్ కలిసి రూపొందించిన గ్రాఫిక్ నావెల్ 'యు ఆర్ గోయింగ్ టు డై'లో కూడా ఆమె కథను వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)