పదమూడేళ్లుగా హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూపులు.. దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందిన తన్వీ తల్లిదండ్రులు ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Mohar Singh Meena
- రచయిత, మోహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ కోసం, రాజస్థాన్‌లోని కోటా నుంచి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
''ఆపరేషన్ పేరుతో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ, నా బిడ్డకు ఆపరేషన్ జరగలేదు. ఆగస్టు 31న రాత్రి 3:30 గంటలకు నా కళ్ల ముందే నా బిడ్డ ప్రాణాలు విడిచింది.''
గుండెలో రంధ్రం కారణంగా అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందిన 15 ఏళ్ల తన్వీ తండ్రి ముకేశ్ చెప్పిన మాటలివి.
దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో తన్వీ కన్నుమూశారు.
ఎయిమ్స్ యాజమాన్యం ఆపరేషన్ చేయకుండా తేదీల మీద తేదీలు ఇస్తూ కాలయాపన చేసిందని, 13 ఏళ్లైనా తమ కూతురికి సర్జరీ చేయలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తమ కూతురికి 2012 నుంచి ఎయిమ్స్‌లో వైద్యం జరుగుతోందని వారు చెప్పారు. సర్జరీ చేస్తామని ఆసుపత్రి వాళ్లు పలుమార్లు చెప్పారని, ఒకసారి డబ్బులు కూడా కట్టించుకుని ఆ తర్వాత సర్జరీని వాయిదా వేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై దిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం సెప్టెంబరు 2న ఒక ప్రకటన విడుదల చేసింది.
మీడియా కథనాల ఆధారంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

''పేషెంట్ తన్వీకి పలుమార్లు సునిశిత పరీక్షలు చేశాం. ఈ పరీక్షల్లో ఆమెకు సర్జరీ చేయడం సాధ్యం కాదని తేలింది. అందుకే మెడికల్ మేనేజ్‌మెంట్, రెగ్యులర్ ఫాలోఅప్స్ తీసుకోవాలని సూచించాం'' అని ఆ ప్రకటనలో ఎయిమ్స్ తెలిపింది.
తన్వీ తండ్రి ముకేష్ కుమార్, బీబీసీ న్యూస్‌తో మాట్లాడారు.
''ఎయిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేస్తామని చెప్తూ వచ్చారు. అందుకే మేం వారిపైనే ఆశలు పెట్టుకున్నాం. దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2013లో తన్వీకి పరీక్షలు చేయించాం. అయితే వారు మూడు ఆపరేషన్లు చేయాలని, చాలా ఖర్చవుతుందని చెప్పారు. అందుకే మేం ఎయిమ్స్‌నే నమ్ముకున్నాం'' అని ముకేష్ కుమార్ తెలిపారు.
ఈ పరిణామాలతో నిరాశ చెందిన ఆయన 2016లోనే తన కూతురికి సర్జరీ చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) తొలుత ఫిర్యాదు పంపినట్లు చెప్పారు. ఆ తర్వాత అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా ఈమెయిల్ చేశారు.
ఎయిమ్స్‌పై త్వరలోనే ఫిర్యాదు నమోదు చేస్తానని ముకేష్ అన్నారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
తన్వీకి రెండేళ్ల వయసు నుంచి ఎయిమ్స్‌లోనే చికిత్స..
రాజస్థాన్‌లోని గుమాన్‌పురా ప్రాంతంలో తన్వీ కుటుంబం నివసిస్తుంది. తండ్రి ముకేష్ కుమార్ పరియానీ, తల్లి భావిక పరియానీ. వారు తమ కూతురు తన్వీకి దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స చేయిస్తున్నారు.
ముకేష్ ఒక దుస్తుల షాప్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య గృహిణి. వారికి ఇద్దరు పిల్లలు. తన్వీ చిన్నది. పెద్ద కుమారుడు జైపూర్‌లోని ఒక కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.
తల్లి భావిక తన కూతురు తన్వీని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.
వారి ఇంట్లోని ఒక గోడపై తన్వీ రాసిన 'ఐ కెన్ అండ్ ఐ విల్' అనే వాక్యాలు మాకు కనిపించాయి.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
‘2014 నుంచి సర్జరీ చేస్తామనే చెబుతున్నారు’
తన్వీకి దాదాపు రెండేళ్ల వయసున్నప్పుడు ఆరోగ్యం క్షీణించిందని ముకేష్ చెప్పారు. 2012 ఆగస్టు 15న కోటాలో చేసిన వైద్య పరీక్షల్లో పాప గుండెలో రంధ్రం ఉన్నట్లు తేలినట్లు ఆయన తెలిపారు.
పాపకు మెరుగైన చికిత్స కోసం స్థానిక వైద్యుడే ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించినట్లు భావిక చెప్పారు.
''నేను 2012లో మొదటిసారి నా కూతురిని ఎయిమ్స్‌కు తీసుకెళ్లాను. తర్వాత చికిత్స కొనసాగింది. 2013లో టెస్ట్‌లు చేశారు. ఆపై 2014లో సర్జరీ చేస్తామని చెప్పారు. అందుకే మేం డబ్బులు కూడా జమ చేశాం. మిగతా ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, ఆ తర్వాత దానిని వాయిదా వేశారు'' అని ముకేష్ చెప్పారు.
ఎయిమ్స్‌లో రూ. 1,25,000 కట్టిన స్లిప్‌ను కూడా ముకేష్ చూపించారు.
''ఆ తర్వాత 2015 సెప్టెంబరు 2న ఆపరేషన్ చేస్తామంటూ తేదీ ఇచ్చారు. నేను పాపను ఆపరేషన్ కోసం తీసుకెళ్తే, వారు దాన్ని వాయిదా వేశారు. మళ్లీ డిసెంబరు16న తన్వీని అడ్మిట్ చేసుకుని, ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్ వాయిదా వేశారు'' అని ముకేష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
‘ఎన్నో ఫిర్యాదులు చేశాం, ప్రయోజనం లేదు’
ఎయిమ్స్‌లో 2012 నుంచి ఇప్పటివరకు జరిగిన చికిత్సకు సంబంధించిన వివరాలు, ఆపరేషన్ కోసం కట్టిన రూ. 1.25 లక్షల రసీదు సహా పలు పత్రాలను బీబీసీకి ముకేష్ చూపించారు.
''ఎన్నో ఫిర్యాదులు చేశాం. కానీ, ప్రయోజనం లేదు'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి తమ బాధను వివరించినట్లు చెప్పారు. ఎయిమ్స్‌లో తమ కూతురి గుండె ఆపరేషన్‌ను వీలైనంత త్వరగా జరిపించాలని ఆయనను కోరినట్లు తెలిపారు.
ఓం బిర్లా పీఏ కూడా ఎయిమ్స్‌కు ఫోన్ చేసి సర్జరీ చేయమని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయినా ఆపరేషన్ జరగలేదని అన్నారు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఈమెయిల్ ద్వారా ఎయిమ్స్ డాక్టర్ సచిన్ తల్వార్‌ను బీబీపీ వివరణ కోరగా, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఆ తర్వాత కూడా ఈ ఏడాది వరకు కూడా తమకు ఆపరేషన్ తేదీలు ఇస్తూనే వచ్చారని, కానీ బిడ్డకు ఆపరేషన్ చేయలేదని ముకేష్ చెప్పారు.
ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా తమ కూతురి పరిస్థితి బాగానే ఉందని, కానీ ఉన్నట్లుండి అకస్మాత్తుగా తన కూతురు చనిపోయిందని తల్లి భావిక అన్నారు.
హైపోక్సిక్ స్పెల్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కావడం వల్ల తన్వీ మరణించినట్లు ప్రకటనలో ఎయిమ్స్ వెల్లడించింది. అంటే శరీరంలో ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోవడం వల్ల గుండె ఆగిపోయింది.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
‘వారికి శిక్ష పడాలి’
''అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారనే ఆశతో వెళ్లాను. కానీ, చివరకు ఏం జరిగిందో చూడండి. మాకు నిరాశే ఎదురైంది'' అని భావిక ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కూతురు మరణించిన తర్వాత తాను 112 నంబరుకు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ముకేష్ చెప్పారు.
''ఆ సమయంలో నేను, నా భార్య మాత్రమే ఆసుపత్రిలో ఉన్నాం. మేం భయపడిపోయాం. బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంది. అందుకే పోస్ట్‌మార్టమ్ చేయించి మృతదేహాన్ని తీసుకొచ్చాం'' అని ఆయన అన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి తనకు సమయం దొరకలేదని, అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయిస్తానని ఆయన చెప్పారు.
''మా కూతురు ఇక తిరిగి రాదు. కానీ, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మా కూతురు అనారోగ్యంతో చనిపోలేదు, ఇది హత్య. నిందితులకు శిక్ష పడితేనే మాకు న్యాయం జరుగుతుంది'' అని తన్వీ తల్లిదండ్రులు అంటున్నారు.
విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయడంపై ముకేష్ స్పందించారు.
కమిటీలు వేసినంత మాత్రాన ఏమీ కాదని, ఇది కేవలం విషయాన్ని సద్దుమణిగేలా చేసే ప్రయత్నమేనని అన్నారు.
ఉన్నత స్థాయిలో, నిష్పాక్షిక విచారణ జరిపిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ఎయిమ్స్ ఏం చెప్పింది?
తన్వీ ఆరోగ్యం క్షీణించడంతో ఆగస్టు 24న ఎయిమ్స్‌లో చేర్పించారని ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆ ప్రకటనలో పేర్కొన్న ఇతర వివరాల ప్రకారం, ''ఈసారి హార్ట్-లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశాన్ని పరిశీలించారు. ఆగస్టు 31 రాత్రి సుమారు 3:00 గంటలకు ఆమె పరిస్థితి విషమించింది. సెప్టెంబరు 1న ఉదయం 5:00 గంటలకు ఆమె మరణించినట్లు ప్రకటించాం.
రాత్రి సమయంలో తన్వీ ఒక్కసారిగా తీవ్రమైన అలసట, వీక్‌నెస్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆమెకు తీవ్రమైన సయానోసిస్ (శరీరంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల చర్మం నీలంగా మారడం) రావడం వల్ల ఆక్సిజన్ శాచురేషన్ దాదాపు 48 శాతానికి పడిపోయింది.
ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ తీవ్రమైన హైపోక్సిక్ స్పెల్ కొనసాగింది. దీనివల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ, ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఉదయం 5 గంటలకు మరణించారు'' అని ఆ ప్రకటనలో ఎయిమ్స్ పేర్కొంది.
తన్వీని 2012 అక్టోబరు 10న తొలిసారిగా ఎయిమ్స్ కార్డియాలజీ ఓపీడీ విభాగానికి చికిత్స కోసం తీసుకువచ్చారని ఎయిమ్స్ వెల్లడించింది.
అప్పుడు చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు వీఎస్‌డీ (గుండెలో రంధ్రం)తో పాటు పల్మనరీ అట్రీషియా ఉన్నట్లు తేలింది.
తన్వీకి గుండె సర్జరీ చేసే వీలుందా అనే అంశంపై 2013లో సీటీ ఎంజియోగ్రఫీ, కార్డియాక్ క్యాథటరైజేషన్ వంటి సమగ్ర పరీక్షలు నిర్వహించారు.
''తన్వీ గుండె పరిస్థితి, వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, 2017లో నిర్వహించిన తదుపరి పరీక్షల ఆధారంగా ఆ సమయంలో సర్జరీ చేయడం సాధ్యం కాదని తేల్చాం. ఆమెకు క్రమం తప్పకుండా ఫాలోఅప్స్ తీసుకోవాలని, మందులతో చికిత్స పొందాలని సూచించాం. ఆ తర్వాత కూడా రోగి కుటుంబం మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సర్జరీకి సంబంధించి మళ్లీ సలహా కోరారు. దాంతో నిరుడు కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగాధిపతిని సంప్రదించగా, ఆయన కూడా మెడికల్ మేనేజ్‌మెంట్‌నే సరిపోతుందని సూచించారు" అని ప్రకటనలో ఎయిమ్స్ పేర్కొంది.
ఎయిమ్స్ ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మెడికల్ రికార్డులు, చికిత్స కాలక్రమం, మరణానికి దారితీసిన పరిస్థితులను సమీక్షిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































