సోషల్ మీడియాలో చూసి ఉమ్మెత్త ఆకు వండుకుని తిని ఆసుపత్రి పాలు... ఈ ఆకు నిజంగా ఎంత ప్రమాదకరం?

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

చూడటానికి అందంగా కనిపించే ఉమ్మెత్త మొక్క మన చుట్టుపక్కలే కనిపిస్తుంటుంది. ఒకప్పుడు చిన్న పిల్లలు ఈ మొక్క ఆకులను తెంపుకుని పలకలకు రాసుకునే వాళ్లు.

అందుకే దీనిని కొందరు 'పలకాకు' అని అనేవారు. కానీ అదే ఉమ్మెత్త ఆకులతో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వంటకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది మేలో కాకినాడకు చెందిన ఓ కుటుంబం సోషల్ మీడియాలో చూసిన ఓ వీడియోను నమ్మి ఉమ్మెత్త ఆకులతో వంట చేసుకుని తినడంతో అస్వస్థతకు గురైంది.

కర్ణాటకలో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆహారంగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు.

అసలు ఉమ్మెత్తలో ఏముంది? దాని ఏ భాగాలు ప్రమాదకరం? ఔషధంగా ఉపయోగించవచ్చా? సోషల్ మీడియాలో కనిపించే ఉమ్మెత్త వంటకాలను ప్రయత్నించవచ్చా?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉమ్మెత్త ఆకును తినడం, అమ్మడం గురించి ఇటీవల అనేక కథనాలు మీడియాలో కనిపించాయి.

ఈ నేపథ్యంలో ఈ ఆకు గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఏయూ బోటనీ విభాగానికి చెందిన ప్లాంట్ టెక్సానమిస్ట్ డాక్టర్ జె. ప్రకాశరావు, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) డిప్యూటీ డైరెక్టర్ సురేశ్ ఉప్పరాపల్లితో మాట్లాడినప్పుడు తెలుసుకున్న ఏడు విషయాలు ఇవి...

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

ఉమ్మెత్త మొక్క శాస్త్రీయ నామం దతూరా స్ట్రామోనియం (Datura stramonium). ఇది సోలనేసీ కుటుంబానికి చెందిన మొక్క. ఇదే కుటుంబంలో వంకాయ, టమాటా, పచ్చిమిర్చి వంటి మనం సాధారణంగా తినే కూరగాయలు కూడా ఉన్నాయి.

ఉమ్మెత్త సాధారణంగా ఖాళీ ప్రదేశాలు, వ్యర్థ భూముల్లో పెరుగుతుంది. దీన్ని కూరగాయల మొక్కలాగానో, అలంకరణ మొక్కలాగానో ఎవరూ ఇళ్లలో పెంచుకోరని ఏయూ బోటనీ విభాగానికి చెందిన ప్లాంట్ టెక్సానమిస్ట్ డాక్టర్ జె. ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

"తెల్ల ఉమ్మెత్తకు సాధారణంగా పెద్దగా కనిపించే తెల్లటి, గొట్టం ఆకారంలో ఉండే పువ్వులు ఉంటాయి. మరోరకాన్ని సాధారణంగా నల్ల ఉమ్మెత్త అని పిలుస్తారు. దాని పువ్వుల్లో ఊదా లేదా పర్పుల్ ఛాయలు కనిపిస్తాయి.

మొక్క చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దాని అందాన్ని చూసి ఆహారంగా తీసుకోవచ్చని అనుకోకూడదు. ఉమ్మెత్త మొక్కలో సహజంగానే కొన్ని క్రియాశీల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో కొన్ని ఔషధ ప్రయోజనాలకు ఉపయోగపడినా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే విషపూరిత ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే ఉమ్మెత్తను 'ఆహార మొక్క కాదు' అని చెప్పవచ్చు" అని డాక్టర్ జె. ప్రకాశరావు తెలిపారు.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

ఉమ్మెత్త మొక్కలో కొన్ని విషపూరిత రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా అట్రోపిన్, స్కోపోలామైన్ వంటి ఆల్కలాయిడ్లు దాని విషపూరిత ప్రభావానికి కారణమవుతాయని డాక్టర్ జె. ప్రకాశరావు చెబుతున్నారు.

"ఈ రసాయనాలు శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఉమ్మెత్తను తీసుకున్న తర్వాత నోరు, చర్మం పొడిబారడం, కంటి గుడ్లు పెద్దవిగా కావడం, చూపు మసకబారడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. విష ప్రభావం పెరిగితే గందరగోళం, ఆందోళన, భ్రాంతి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత లక్షణాలు కూడా రావచ్చు. తీవ్ర పరిస్థితుల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే ఉమ్మెత్తలో ఈ రసాయనాల పరిమాణం మొక్కలోని భాగాన్ని బట్టి, మొక్క పెరిగిన పరిస్థితులను బట్టి మారవచ్చు" అని డాక్టర్ జె. ప్రకాశరావు హెచ్చరిస్తున్నారు.

ఉమ్మెత్తలోని ఏ భాగాన్నైనా నేరుగా తినడం లేదా సోషల్ మీడియాలో కనిపించే వంటకాలను ప్రయత్నించడం ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఫొటో క్యాప్షన్, డాక్టర్ జె. ప్రకాశరావు
ఉమ్మెత్త

పువ్వులు మాత్రమే కాదు. ఆకులు, పండ్లు, కాయలు, విత్తనాలు, వేర్లు సహా మొక్కలోని వివిధ భాగాల్లో విషపూరిత సమ్మేళనాలు ఉండవచ్చని డాక్టర్ జె. ప్రకాశరావు చెబుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మెత్త పండ్లను చిన్నపిల్లలు తెలియక నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో ఇలాంటి మొక్కలు లేకుండా చూడటం మంచిదని ఆయన సూచిస్తున్నారు.

ఉమ్మెత్తను ఆహారంగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో 1999లో తైవాన్‌లో వెటర్నరీ అండ్ హ్యూమన్ టాక్సికాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే అడవిలోని కొన్ని మొక్కలను గిరిజన సమూహాలు సంప్రదాయంగా తినే సందర్భాలు ఉన్నాయి. వాటి వినియోగంలో కొన్ని ప్రత్యేక పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తుంటారు. అలాంటి సంప్రదాయ వినియోగాన్ని చూసి ఉమ్మెత్తను కూడా ఆహారంగా తీసుకోవడం మాత్రం సరికాదని డాక్టర్ జె. ప్రకాశరావు చెబుతున్నారు.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

ఉమ్మెత్తకు కొన్ని ఔషధ వినియోగాలు ఉన్నాయని డాక్టర్ జె. ప్రకాశరావు చెబుతున్నారు. కొన్ని గిరిజన సముదాయాలు సంప్రదాయ వైద్యంలో దీన్ని ఉపయోగిస్తుంటాయని ఆయన తెలిపారు.

అయితే ఔషధంగా ఉపయోగించడం, ఉమ్మెత్తను కూరగా వండుకుని తినడం ఒకటి కాదు. సంప్రదాయ వైద్యంలో మొక్కలను నిర్దిష్ట పద్ధతుల్లో, ఇతర మొక్కలతో కలిపి, నిర్దిష్ట మోతాదులో ఉపయోగిస్తుంటారని ఆయన చెప్పారు.

అందువల్ల గిరిజనులు ఔషధంగా ఉపయోగిస్తారనే కారణంతో ఉమ్మెత్త ఆకులను లేదా ఇతర భాగాలను మిగతా వాళ్లు కూడా వండుకుని తినడం సరికాదు.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

ఉమ్మెత్తలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో తెల్ల ఉమ్మెత్త (దతూరా స్ట్రామోనియం - Datura stramonium), నల్ల ఉమ్మెత్త (దతూరా మెటల్ - Datura metal) అని సాధారణంగా పిలిచే రకాలు ఉన్నాయి.

తెల్ల ఉమ్మెత్తలో పువ్వులు సాధారణంగా తెల్లగా ఉంటాయి. నల్ల ఉమ్మెత్తగా పిలిచే దతూరా మెటల్‌ లో పువ్వులకు పర్పుల్ లేదా ఊదా రంగు ఛాయ కనిపించవచ్చు. కాండం కూడా ముదురు రంగులో కనిపించవచ్చని డాక్టర్ జె. ప్రకాశరావు వివరించారు.

అయితే మొక్కను గుర్తించగలిగినంత మాత్రాన దాన్ని ఆహారంగా లేదా ఔషధంగా ఉపయోగించకూడదు.

గుర్తించడం కంటే ముఖ్యమైనది.. గుర్తించిన తర్వాత దాన్ని తినకపోవడం.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

ఉమ్మెత్తను ఆయుర్వేదంలో కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారని తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

అయితే దాన్ని నేరుగా ఉపయోగించకుండా నిర్దిష్టమైన శుద్ధి ప్రక్రియ, తయారీ విధానం, మోతాదు పాటించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

మొక్కలపై ఉపయోగించే కొన్ని రసాయనాలు కూడా వాటితో ప్రతిచర్య (రియాక్షన్) కు గురయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఉమ్మెత్తను సేకరించి ఔషధంగా ఉపయోగించడం సరికాదని డాక్టర్ రేణు దీక్షిత్ హెచ్చరించారు.

‘‘ఈ విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి’’ అని డాక్టర్ రేణు దీక్షిత్ బీబీసీతో అన్నారు.

ఉమ్మెత్త ఆకులు, చెట్టు, ప్రమాదకరం, ఆయుర్వేదం
ఉమ్మెత్త

సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను చూసి ఉమ్మెత్త మొక్కలు, పువ్వులతో వంటలు చేసుకోవద్దని ప్లాంట్ టెక్సానమిస్ట్ డాక్టర్ జె. ప్రకాశరావు, డాక్టర్ రేణు దీక్షిత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ సురేశ్ ఉప్పరాపల్లి సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో కనిపించే వంటకాలు, ఇంటి వైద్య చిట్కాలను నిపుణుల సలహా లేకుండా ప్రయత్నించకూడదని వారు చెబుతున్నారు.

"సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నమ్మకుండా, ఆహార భద్రతకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను పాటించాలి. ముఖ్యంగా తెలియని మొక్కలను గుర్తించకుండా, వాటి విషపూరిత లక్షణాలు తెలియకుండా ఆహారంగా తీసుకోవడం ప్రమాదకరం. "ఔషధ మొక్క" అనే పేరుతో ఉమ్మెత్త ఆకులు, పువ్వులు, పండ్లు లేదా విత్తనాలను ఆహారంగా తీసుకోవడం సురక్షితం కాదు." అని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ సురేశ్ ఉప్పరాపల్లి సూచించారు.

అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వంటకం లేదా ఇంటి వైద్య చిట్కాను నిజమని నమ్మకుండా, మొక్కలను ఆహారంగా లేదా ఔషధంగా ఉపయోగించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని..అలాగే చూడటానికి అందంగా కనిపించే ఉమ్మెత్త.. ఆహారం మాత్రం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)