మహిళ కడుపులో 13 పెన్నులు, 5 చెక్క చెంచాలు, కొవ్వొత్తి.. బయటకు తీసిన డాక్టర్ ‘బీబీసీ’తో ఏం చెప్పారంటే

డాక్టర్ రామచంద్రా రెడ్డి

ఫొటో సోర్స్, Dr. Ramachandra Reddy

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మహిళ కడుపులో 13 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి.. అందులో ఒక పెన్ను ఏకంగా 25 సెంటీమీటర్ల పొడవు ఉంది.

వీటిన్నింటిన్నీ విజయవంతంగా బయటికి తీసి, ఆ మహిళ ప్రాణాలను కాపాడారు వైద్యులు.

అయితే, ఇవన్నీ ఒక మహిళ కడుపులోకి ఎలా వెళ్లాయి? అన్నదే ఇక్కడ ప్రశ్న.

సాధారణంగా.. మనం ఏదైనా పడని ఆహార పదార్థాన్ని తింటేనే విపరీతమైన కడుపు నొప్పి లేదా విరోచనాలతో బాధపడుతూ ఉంటాం.

కానీ, ఒక మహిళ కడుపులో అన్ని వస్తువులు ఉన్న ఆమె ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నారు? వాటిని ఎలా బయటకు తీశారనేది శస్త్రచికిత్స చేసిన వైద్యులు ‘బీబీసీ’తో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

వివరాలలోకి వెళ్తే.. నరసరావుపేటకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహితకు ఎడమ వైపు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మాతాశ్రీ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.

వెంటనే వైద్యులు ఆమెకు ఈసీజీ, ఎండోస్కోపీ చేశారు. ఈసీజీలో అంతా బాగుందని, ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు పొట్టలో కొన్ని బయట వస్తువులు అంటే పెన్నులు, స్పూన్లు, కొవ్వొత్తులు చూసినట్లు డాక్టర్ రామచంద్రారెడ్డి ‘బీబీసీ’తో చెప్పారు.

వెంటనే ఆమెకు సీటీ స్కాన్ చేసి, దాన్ని ధ్రువీకరించుకున్న తర్వాత తాము ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ సర్జరీ ప్లాన్ చేశామని డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు.

ఈ సర్జరీ ద్వారా పెన్నులు, కొవ్వొత్తి, చెక్క స్పూన్లు అన్ని బయటికి తీశామన్నారు.

ఆ మహిళ కడుపులో చిన్న పిల్లలు వాడే 25 సెంటీమీటర్లు పొడవైన పెన్ను, కడుపులో గుచ్చుకోవడం వల్ల అక్కడ రంధ్రమేర్పడి న్యుమోమెడియాస్టినమ్ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు.

దానివల్ల నొప్పి వచ్చి ఆ అమ్మాయి తమ దగ్గర చేరినట్లు తెలిపారు.

ఆ తర్వాత లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసి మహిళ కడుపులో ఉన్న వస్తువులను బయటకు తీసినట్లు డాక్టర్ రామచంద్రా రెడ్డి బీబీసీతో చెప్పారు.

డాక్టర్ రామచంద్రారెడ్డి

ఫొటో సోర్స్, Dr. Ramachandra Reddy

మొత్తం 13 పెన్నులు, ఒక కొవ్వొత్తి, 5 చెక్క స్పూన్లు తీశామని తెలిపారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.

ఇలాంటి సమస్య సాధారణంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారిలో తలెత్తుతుందన్నారు.

మానసిక పరిస్థితి బాగోలేని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, వారు టాబ్లెట్లు వేసుకున్నారో లేదో చెక్ చేయడం తల్లిదండ్రుల బాధ్యతని డాక్టర్ రామచంద్రా రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం ఆపరేషన్ జరిగిన మహిళ ఏడాది క్రితం కూడా ఇలానే నాలుగు పెన్నులను మింగారని.. అప్పుడు కూడా ఆపరేషన్ చేసి వాటిని తొలగించినట్లు చెప్పారు.

ఆమె మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో, సైకియాట్రిస్ట్ వద్దకు కూడా రిఫర్ చేశామని ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని డాక్టర్ రామచంద్రా రెడ్డి తెలిపారు.

అయితే, ఇలాంటి వస్తువులను మింగడం అందరికీ సాధ్యం కాదని, మానసికంగా ఇబ్బంది పడుతున్న రోగులు మాత్రమే ఇలా చేస్తుంటారని వివరించారు.

డాక్టర్ రామచంద్రా రెడ్డి

ఫొటో సోర్స్, maathasreehospitals.com

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రామచంద్రా రెడ్డి

25 సెంటీమీటర్ల ఒక వస్తువు లోపలికి వెళ్లడం చాలా అరుదు అని, తన కెరీర్‌లో ఇంత పెద్ద పెన్నును మింగిన వ్యక్తిని చూడటం ఇదే తొలిసారని చెప్పారు.

ఆమె తన తండ్రితో గొడవపడి.. వీటిని మింగారని డాక్టర్ తెలిపారు.

అయితే, చాలామంది జీర్ణం చేసుకోలేని జుట్టు లాంటి వాటిని తింటూ ఉంటారని, ఇలాంటి కేసులను ట్రైకో బెజోర్ అని పిలుస్తుంటారని రామచంద్రారెడ్డి తెలిపారు.

కొంతమంది అనీమియా పేషెంట్లు, ఈటింగ్ డిజార్డర్లు ఉన్న వారు బియ్యం, బలపం వంటివి తింటుంటారని చెప్పారు.

అయితే, మానసికంగా ఇబ్బంది పడే వారు మాత్రమే పెన్నులు లాంటి వస్తువులను మింగుతారని అన్నారు.

ఇలా మింగినప్పుడు రంధ్రం పడకుండా ఉంటే, పేగు బ్లాక్ అయి, వాంతులు అవుతాయని, పదునైన వస్తువులు, బోల్టులు, పెన్నులు లాంటి వాటివల్ల పేగులకు రంధ్రం పడే ప్రమాదం ఉంటుందన్నారు.

చిన్న వస్తువులు అయితే మల విసర్జన సమయంలో బయటకు వచ్చేస్తాయని వివరించారు. చిన్న పిల్లలు తెలియక కాయిన్లు మింగినా చాలామంది బయటికి చెప్పరని, అవి మల విసర్జన సమయంలో బయటికి వెళ్లిపోతాయని తెలిపారు.

పేగులకు రంధ్రం పడితే.. కొందరు పేషెంట్లకు ఇన్‌ఫెక్షన్ అయి, సెప్టిక్ షాక్‌కు గురవుతారని, అలాంటి పరిస్థితిలో వారి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు.

డాక్టర్ రామచంద్రా రెడ్డి

ఫొటో సోర్స్, Dr. Ramachandra Reddy

ఇలాంటి కేసులు అప్పుడప్పుడు వస్తుంటాయని, ఈ కేసుల్లో 90 శాతం మానసికంగా సమస్యులున్న రోగులేనని గుంటూరుకు చెందిన డాక్టర్ సాయికృష్ణ ‘బీబీసీ’తో చెప్పారు.

ఇలాంటి రోగులు కొందరు అప్పటికప్పుడు ఒకేసారి ఇవన్నీ మింగేయరని.. అప్పుడప్పుడు మింగినవన్నీ ఇలా కడుపులో ఉండిపోతాయని అన్నారు. ఇవి కడుపులో పొడుచుకుంటేనే నొప్పి వస్తుందని, ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ లాంటి సర్జరీలు చేసి వెంటనే పొట్టలో ఉన్న ఈ వస్తువులను తీస్తామని తెలిపారు.

ఇటీవల తాము ఒక రోగి పొట్టలో నుంచి 20 బ్యాటరీలను తొలగించినట్లు చెప్పారు. మింగిన తర్వాత కొన్నిసార్లు ఈ వస్తువులు నెలల పాటు పొట్టలోనే ఉంటాయని, పొట్టలో ఉన్నప్పుడు పేగులోకి వెళ్లవని, పేగులోకి వెళ్తే ఎక్స్‌రే తీసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఇలాంటి కేసులకు ఇంట్రా ఆపరేటివ్ లాప్రోస్కోపీ చేస్తామన్నారు.

ట్రైకో బెజోర్ కేసుల్లో జుట్టు ఉండలాగా కడుపులో ఉండిపోతుందని, వాటిని సర్జరీ చేసి తీయాల్సి ఉంటుందని డాక్టర్ సాయికృష్ణ తెలిపారు.

నరసరావుపేటలో జరిగిన కేసులో వైద్యులు రోగికి వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, లోపల రంధ్రం పడిందని, అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అని ఆయన చెప్పారు.

లాప్రోస్కోపిక్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు ఇలాంటి కేసులు ఎప్పుడైనా నమోదయ్యాయా?

2025లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్‌లోని ఒక ఆస్పత్రిలో 40 ఏళ్ల వ్యక్తి కడుపు నుంచి 29 స్టీల్ స్పూన్లను, 19 టూత్‌బ్రష్‌లను, రెండు పెన్‌లను వెలికితీసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ ఆపరేషన్ జరగడానికి కనీసం నెల ముందు గాజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో ఆయన్ను చేర్చినట్లు ఈ కథనం తెలిపింది.

అయితే, డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్చిన తర్వాత తనను ఎవరూ అక్కడ సరిగ్గా పట్టించుకోలేదని, తనకు తగిన ఆహారం కూడా అందకుండా చేశారని ఆ రోగి తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది..

దీంతో, కోపంతో, నిస్సహాయంగా మారిన ఆ వ్యక్తి, తనకు తాను హాని చేసుకునేందుకు ఈ వస్తువులను మింగేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

ఇరాన్‌లోని అహ్వాజ్‌లో ఉన్న ఇమామ్ ఖొమేనీ ఆస్పత్రిలో కూడా 2024లో 36 ఏళ్ల ఒక వ్యక్తి కడుపు నుంచి 450కి పైగా మెటల్ వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటికి తీసినట్లు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.

తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, నిత్యం వాంతులు, ద్రవ, ఘన ఆహార పదార్థాలు ఏది తీసుకున్నా పడకపోవడంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. రోగికి తీసిన ఎక్స్-రే, ఎండోస్కోపీలో, ఆయన కడుపులో అనేక మెటల్ వస్తువులను గమనించారు.

రోగికి గ్యాస్ట్రోస్టమీ శస్త్రచికిత్స చేసి, 2900 గ్రాముల బరువున్న 452 స్క్రూలు, నట్లు, కీలు, రాళ్లు, ఇతర లోహ భాగాలను కడుపు నుంచి తొలగించినట్లు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తన నివేదికలో పేర్కొంది.

ఆహార పదార్థాలు కానీ వాటిని మింగినప్పుడు విజయవంతంగా వెలికితీయడం చాలా అరుదు అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.

ఆహార పదార్థాలు కానీ వాటిని మింగడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య అని, ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. అయితే, కొంతమంది పెద్ద వారు ముఖ్యంగా మానసికంగా ఆరోగ్య సమస్యలున్న వారు, ఖైదీలలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుందని ఈ నివేదిక పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)