'నాకు ఎండోమెట్రియాసిస్ ఉందని 13 ఏళ్ల వయసులో గుర్తించే వరకు నొప్పి వచ్చిన ప్రతిసారీ డాక్టర్లు మార్ఫిన్ ఇచ్చేవారు'

- రచయిత, విక్కీ లోడర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
గ్రేస్ ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.
ఆమె ఎంతటి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారంటే..ఇంట్లో నుంచి కారు వరకు కూడా నడవలేకపోతున్నారు.
దీంతో తల్లిదండ్రులు ఆమెను చేతుల్లో ఎత్తుకుని కారు వరకు తీసుకెళ్లాల్సి వస్తోంది.
ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చూసేవరకు ఆమె గంటల తరబడి వేచిఉంటున్నారు.
చివరకు కన్నీళ్లతో, పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ల ప్రిస్క్రిప్షన్‌తో ఇంటికి తిరిగి రావడం ఆమెకు అలవాటైపోయింది.


ఫొటో సోర్స్, Getty Images
14ఏళ్ల గ్రేస్ ప్రస్తుతం లండన్‌కు ఉత్తరంగా సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న యార్క్‌షైర్‌లో నివసిస్తున్నారు. చాలా కాలంగా వైద్యులు తన నొప్పిని తక్కువ చేసి చూస్తున్నారని ఆమె భావిస్తున్నారు.
"స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేక నొప్పిని ఎక్కువగా ఊహించుకుని చెబుతున్నట్లు వాళ్లు నన్ను చూస్తున్నారని నాకు అనిపించింది" అని గ్రేస్ చెప్పారు.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, గడ్డ, ఆందోళన లేదా "కేవలం ఒక సాధారణ పీరియడ్ నొప్పి" కావచ్చని వైద్యులు ఆమె లక్షణాలకు రకరకాల కారణాలు చెప్పారు.
"కానీ, అది అంతకంటే పెద్ద సమస్యని నాకు తెలుసు" అని ఆమె చెప్పారు.
శరీరంలోని అంతర్గత అవయవాలపై నయం చేయడానికి వీల్లేని గాయాలు, మచ్చలు ఏర్పడే 'ఎండోమెట్రియాసిస్' అనే వ్యాధి ఆమెకు వచ్చే అవకాశం లేదని వైద్యులు పదేపదే చెప్పారు. ఎందుకంటే ఆ వ్యాధి రావడానికి ఆమె వయసు చాలా చిన్నదని వారు వాదించారు.
మరిన్ని వైద్య పరీక్షలు చేయాలన్న తన అభ్యర్థనలను వైద్యులు పట్టించుకోలేదని గ్రేస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Courtesy of Grace
"పొట్టలో ముళ్ల తీగ చుట్టినట్లు ఉంటుంది"
గ్రేస్‌కు 11 ఏళ్ల వయసులో నెలసరి ప్రారంభమైంది. 13 ఏళ్లు వచ్చేసరికి పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పితో బాధపడటం మొదలైంది.
ఆ నొప్పి ఎలా ఉంటుందో వివరిస్తూ "నా పొట్టలో ఎవరో వేడివేడి ముళ్ల తీగను గట్టిగా చుట్టేసినట్లు" అనిపిస్తుందని చెప్పారు.
"నా లోపలి అవయవాలన్నీ ముక్కలైపోతున్నట్లు ఉంటుంది" అని ఆమె అన్నారు.
ఆమె తరచూ మంచానికే పరిమితం కావాల్సి వచ్చేది.
ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్స్ అయిపోయినప్పుడు ఆమెను ఆసుపత్రిలో చేర్పించేవారు అక్కడ ఆమెకు క్రమం తప్పకుండా 'మార్ఫిన్' ఇచ్చేవారు.
ఆమెకు 'కో-కోడమోల్' 'ట్రామడాల్' వంటి మందులు కూడా ఇచ్చారు.
ఇలాంటి శక్తివంతమైన ఓపియాయిడ్ డ్రగ్స్‌కు బానిస అవుతానేమోనని ఆమె ఆందోళన చెందుతున్నారు.
"ఇది చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే నా జీవితాంతం వీటిపైనే ఆధారపడటం నాకు ఇష్టం లేదు" అని ఆమె చెప్పారు.
కానీ గ్రేస్‌ను అన్నింటికంటే ఎక్కువగా నిరాశకు గురిచేస్తున్న విషయం, ఆమె బీబీసీ వాయిస్‌ను సంప్రదించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. టీనేజ్ అమ్మాయిలు కూడా 'ఎండోమెట్రియాసిస్' బారిన పడవచ్చనే విషయాన్ని వైద్య నిపుణులు గుర్తించకపోవడం.
ఆమె ఫ్యామిలీ డాక్టర్ లేదా ఆమె ప్రైవేట్‌గా సంప్రదించిన మొదటి స్పెషలిస్ట్ కానీ ఆమె అనారోగ్యాన్ని గుర్తించలేకపోయారు.
"కనీసం ఒక స్పెషలిస్ట్ కూడా నన్ను నమ్మలేదు. ఒక నిపుణుడే నా మాట విననప్పుడు ఇక ఎవరు వింటారు?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కుటుంబం పట్టుబట్టి ప్రైవేట్‌గా సెకండ్ ఒపీనియన్ తీసుకునేంత వరకు ఆమెకు అసలు సమస్య ఏమిటనేది నిర్ధరణ కాలేదు. చివరకు ఆమెకు 'ఎండోమెట్రియాసిస్' ఉన్నట్లు తేలింది.

ఫొటో సోర్స్, BBC/Raw Media Productions
ఏమిటీ సమస్య?
గర్భాశయం లోపలి పొరను పోలిన కణజాలం, గర్భాశయం వెలుపల పెరిగినప్పుడు ఎండోమెట్రియాసిస్ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల పెల్విక్ పెయిన్, నెలసరి సమయంలో తీవ్రమైన రక్తస్రావం, విపరీతమైన అలసట వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి.
బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఎండోమెట్రియాసిస్ కారణంగానే తన గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని బీబీసీ ప్రెజెంటర్ ఎమ్మా బార్నెట్ చెప్పారు.
తనకు అస్సలు ఇష్టం లేకపోయినా ఈ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
నెలసరి ప్రారంభమైన తర్వాత ఏ వయసులోనైనా ఈ సమస్య రావచ్చు. కేవలం వయసు పైబడిన మహిళలు మాత్రమే దీని బారిన పడతారనేది అపోహ అని 'ఎండోమెట్రియాసిస్ యూకే' అనే స్వచ్ఛంద సంస్థ హెచ్చరించింది.
భవిష్యత్ తరాలు ఇలాంటి సమస్యల వల్ల బాధ పడకూడదనుకుంటే ప్రభుత్వం, ఎన్హెచ్ఎస్, ఆరోగ్య నిపుణులు యువతకు రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలని ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫే ఫార్థింగ్ కోరారు.
ఎండోమెట్రియాసిస్ను నిర్ధరించడానికి చాలా సమయం పడుతోంది. వయోజన మహిళల్లో దీని నిర్ధారణకు సగటున 9ఏళ్లు పడుతోందని 'ఎండోమెట్రియాసిస్ యూకే' చెబుతోంది.
ఆరంభ దశల్లో ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో, ఇది అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కూడా తరచూ బయటపడదు.
ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంలో సహాయపడే సరికొత్త వైద్య పరీక్షలు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Grace
సంతానోత్పత్తిపై ప్రభావం
ఈ వ్యాధి వల్ల గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. గ్రేస్‌కు ఈ వ్యాధి వల్ల ఆమె సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.
ఆమె పునరుత్పత్తి అవయవాలు దెబ్బతినడం వల్ల 30 ఏళ్ల తర్వాత ఆమె పిల్లలను కనడం సాధ్యం కాకపోవచ్చని వైద్యులు చెప్పారు.
"నేను రాబోయే 15 ఏళ్లలోనే పిల్లలను కనాలి. లేదంటే నాకు ఆ అవకాశం ఉండకపోవచ్చు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది తనను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని అన్నారు.
దాదాపు 80 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో పీరియడ్స్ నొప్పిని అనుభవిస్తారని అయితే రోగి లక్షణాలు సాధారణమైనవి కావా అనేది వైద్యులు గుర్తించగలగాలని పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ గెయిల్ బస్బీ చెప్పారు.
ప్రతి నెల నెలసరి సమయంలో స్కూల్‌కు వెళ్లలేకపోవడం జిమ్ క్లాస్‌కు హాజరు కాలేకపోవడం లేదా స్నేహితులతో బయటకు వెళ్లలేకపోవడం వంటివి సాధారణమైనవి కావు.
"నొప్పి వల్ల మీరు మంచానికే పరిమితమై మీ బెస్ట్ ఫ్రెండ్ కేవలం ఒక 'హాట్ వాటర్ బ్యాగ్' మాత్రమే అయినప్పుడు, అది అస్సలు సాధారణమైన విషయం కాదు" అని ఆమె వివరించారు.
13 ఏళ్ల వయసులోనే ఎండోమెట్రియాసిస్ లక్షణాలు కనిపించిన గ్రేస్ కేసు వింతైనదేమీ కాదని తన క్లినిక్‌లో గ్రేస్ కంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిలను కూడా చూస్తుంటానని డాక్టర్ బస్బీ చెప్పారు.
డాక్టర్ బస్బీ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పని చేస్తూనే మాంచెస్టర్‌లో టీనేజ్ అమ్మాయిల ఎండోమెట్రియాసిస్ కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించారు.
ఈ వ్యాధి లక్షణాల ప్రభావం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. గ్రేస్ లాంటి అమ్మాయిలు ఆందోళన లేదా కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే వారి నొప్పి వారి విద్య, మానసిక సామాజిక ఎదుగుదల దశను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
"వాళ్లు టీనేజ్ వయసును ఆనందించాలి. కానీ వారి వయసు పిల్లలు చేసే పనులను వీరు చేయలేకపోతున్నారు" అని బస్బీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"నొప్పి నిజమే.. దాన్ని గుర్తించండి"
గ్రేస్ కుటుంబంలో ఇంతకుముందు ఎండోమెట్రియాసిస్ చరిత్ర ఉంది. అయినప్పటికీ వ్యాధి నిర్ధరణ అంత సులభం కాలేదని ఆమె తల్లి సమంత చెప్పారు.
"మీ కుమార్తె నొప్పితో నేలపై పడి దొర్లుతున్నప్పుడు అది కేవలం ఒక సాధారణ పీరియడ్ నొప్పి కాదని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వైద్య నిపుణులు మాత్రం 'సరే ఒక ఆరు నెలలు ఈ మాత్రలు వాడి చూడండి. ఎలా ఉంటుందో చూద్దాం' అని చాలా తేలికగా చెబుతారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండోమెట్రియాసిస్ కణజాలాన్ని తొలగించడానికి గ్రేస్ ఇటీవల లాపరోస్కోపీ చేయించుకున్నారు.
ఈ సర్జరీ వల్ల తన లక్షణాల నుండి తాత్కాలికంగానైనా ఉపశమనం లభిస్తుందని ఆమె ఆశిస్తున్నారు.
ప్రతి నెలా కణజాలం పెరగకుండా ఆపడానికి, నొప్పి తగ్గించడానికి హార్మోనల్ గర్భనిరోధక మందులను వాడాలని వైద్యులు ఆమెకు సూచించారు.
ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటం ద్వారా మరింత మంది టీనేజర్లు భయం లేకుండా వ్యాధి నిర్ధరణ కోసం ముందుకు వస్తారని గ్రేస్ ఆశిస్తున్నారు.
"నాకు పిచ్చి పడుతోందేమో అనిపించింది. ఇదంతా నా భ్రమ మాత్రమేనని అనుకున్నాను" అని ఆమె అన్నారు.
"కానీ వాస్తవం ఏంటంటే మీ శరీరం గురించి మీకంటే ఎవరికీ బాగా తెలియదు. మీ నొప్పి నిజమైనది" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























