‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు అమెరికాకు ఎలాంటి సందేశం?

‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు
ఫొటో క్యాప్షన్, ఇది చారిత్రక విజయమని బ్రెజిల్‌లోని అనేక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా విజయం సాధించారు.

ఈ విజయంతో 80 ఏళ్ల వర్కర్స్ పార్టీ అధినేత నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.

రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి, రైట్ వింగ్ లిబరల్ పార్టీ నాయకుడు ఫ్లావియో బోల్సోనారోపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్‌లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి లులాకు 51.76 శాతం ఓట్లు వచ్చాయి.

జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారోకు 48.24 శాతం ఓట్లు లభించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రెజిల్, అధ్యక్ష ఎన్నికలు, లులా డ సిల్వా, బోల్సోనారో, డోనల్డ్ ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, లులా విజయాన్ని అంగీకరించడం లేదని బోల్సోనారో చెప్పారు.

బోల్సోనారో స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు అంతకుముందు వచ్చిన పలు సర్వేల అంచనాలను లులా విజయం తలకిందులు చేసింది.

ఈ నెల మొదట్లో జరిగిన మొదటి రౌండ్ పోలింగ్‌లో 45 ఏళ్ల సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో దాదాపు రెండు శాతం పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు.

ఓటమి తర్వాత ఫ్లావియో బోల్సోనారో ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరించారు.

ఈ ఫలితాలు "అసాధ్యం, అర్థం లేనివి" అని ఆయన అభివర్ణించారు.

లులా విజయాన్ని అంగీకరించనని ఆయన ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తాజా వ్యాఖ్యలతో ఫ్లావియో తన తండ్రి జైర్ బోల్సోనారో బాటలోనే పయనించారు.

జైర్ బోల్సోనారో కూడా 2022 ఎన్నికలలో తన ఓటమిని అంగీకరించడానికి నిరాకరించారు.

బ్రెజిల్, అధ్యక్ష ఎన్నికలు, లులా డ సిల్వా, బోల్సోనారో, డోనల్డ్ ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడిగా లులా డ సిల్వా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.

వామపక్ష రాజకీయాల్లో ప్రముఖుడిగా..

వామపక్ష నాయకుడైన లులా గతంలో 2003 నుంచి 2010 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.

నాలుగేళ్ల క్రితం ఆయన మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ఆదివారం నాటి ఓటింగ్ ప్రక్రియ వివాదాల మధ్య సాగింది.

పోలింగ్ కేంద్రాలు మూసివేసే సమయానికి పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

పలు రాష్ట్రాల్లో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజా రవాణా సరిగ్గా లేదని లులా కూటమి ఫిర్యాదు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

లులా తిరిగి ఎన్నికవవడం లాటిన్ అమెరికాలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే అమెరికా ఆశలకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు.

అంతేకాకుండా లాటిన్ అమెరికాలో రైట్ వింగ్ పార్టీల విజయాల పరంపరకు ఇది బ్రేక్ వేసింది.

గతంలో కార్మికుడిగా పని చేసిన లులా 1989లో మొదటిసారి అధ్యక్ష బరిలోకి దిగినప్పటి నుంచి బ్రెజిల్ వామపక్ష రాజకీయాల్లో ప్రముఖుడిగా ఎదిగారు.

ప్రస్తుతం ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఆయన కొత్త పదవీకాలం 2027జనవరి 5న ప్రారంభం కానుంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అసంతృప్తితో పాటు దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సవాళ్ల మధ్య లులా పాలన ప్రారంభం కానుంది.

ట్రంప్ నేరుగా ఫ్లావియో బోల్సోనారోకు మద్దతు ఇవ్వనప్పటికీ కొలంబియా, హోండురాస్‌లో గెలిచిన రైట్ వింగ్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.

21.3 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్‌లో ఒక సంప్రదాయవాద నాయకుడు అధికారంలో ఉండాలని అమెరికా యంత్రాంగం భావించిందనడంలో సందేహం లేదు.

అమెరికా వైట్ హౌస్ లాటిన్ అమెరికాను తన ప్రభావ ప్రాంతంగా భావిస్తుంది.

రక్షణ, భద్రత, వాణిజ్యంతో సహా విభిన్న అంశాలపై తమ విధానాలకు మద్దతు ఇచ్చే నాయకులు ఈ ప్రాంతంలో అధికారంలో ఉండాలని ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటోంది.

బ్రెజిల్, అధ్యక్ష ఎన్నికలు, లులా డ సిల్వా, బోల్సోనారో, డోనల్డ్ ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, బోల్సోనారో ఓటమిపై ట్రంప్ స్పందించలేదు.

అమెరికాకు ఎదురు దెబ్బ తగిలిందా?

డోనల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని మాజీ ట్రేడ్ యూనియన్ నాయకుడైన లులా తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు బోల్సోనారో వైట్ హౌస్‌లోని తన సైద్ధాంతిక మిత్రుడితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

గత ఏడాది కాలంగా బ్రెజిల్‌పై అమెరికా వాణిజ్య సుంకాలు ఇతర ఆంక్షలను విధించింది. మొదటి రౌండ్ ఓటింగ్ తర్వాత లులా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ.. రుణాల మాఫీ, వారాంతాల్లో ఉచిత ప్రజా రవాణా, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు.

ప్రస్తుత అధ్యక్షుడు లులా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఈ చర్యలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఫ్లావియో బోల్సోనారో తండ్రి జైర్ బోల్సోనారో 2022 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు గత ఏడాది తేలింది.

ప్రస్తుతం ఆయన 27 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

అనారోగ్య కారణాల వల్ల ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు.

వ్యవస్థీకృత నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి, పన్నులను తగ్గిస్తానని ఫ్లావియో బోల్సోనారో హామీ ఇచ్చారు.

మొదటి రౌండ్ ఫలితాల తర్వాత పెట్టుబడిదారులు బోల్సోనారో వ్యాపార అనుకూల విధానాల పట్ల సానుకూలంగా స్పందించారు.

అనేక అవరోధాలు ఎదురైనప్పటికీ లులా సాధించిన విజయం ఆధునిక బ్రెజిల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఈ విజయం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

లోహ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసిన లులా మొదట 2003 నుంచి 2010 వరకు దేశాన్ని పాలించారు.

ఆ సమయంలో ఆయన పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

ఆ తర్వాత అవినీతి ఆరోపణలపై జైలు జీవితం గడిపారు.

నాలుగేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను ఓడించి రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారారు.

ఫ్లావియో బోల్సోనారో ఓటమి దాదాపు దశాబ్దం క్రితం ఆయన తండ్రి ప్రారంభించిన తీవ్ర ప్రజాకర్షక (రాడికల్ పాపులిస్ట్) రాజకీయ ఉద్యమానికి పెద్ద దెబ్బ.

బ్రెజిల్ రాజకీయాల్లో ఈ ఉద్యమం ప్రస్తుతం రైట్ వింగ్‌లో అత్యంత ప్రభావవంతమైన వర్గంగా మారింది.

బ్రెజిల్, అధ్యక్ష ఎన్నికలు, లులా డ సిల్వా, బోల్సోనారో, డోనల్డ్ ట్రంప్, అమెరికా
ఫొటో క్యాప్షన్, అధ్యక్ష ఎన్నికల్లో లులా డ సిల్వాకు 51.79 శాతం ఓట్లు వచ్చాయని బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ ప్రకటించింది.

లులా ముందు సవాళ్లు

చమురు నిల్వలతో పాటు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) నిల్వలు ఉన్న దేశం బ్రెజిల్.

దక్షిణ అమెరికాలోని ప్రధాన దేశాలలో రైట్ వింగ్ నాయకుడు అధికారంలో లేని ఏకైక దేశం బ్రెజిల్ మాత్రమే.

లులా చైనాకు అనుకూలమైన వైఖరి గల నాయకుడిగా పేరుపొందారు.

ఫ్లావియో బోల్సోనారో బ్రెజిల్‌ను అమెరికాకు మరింత దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అమెరికా జోక్యంపై లులా గతంలో హెచ్చరించారు.

బ్రెజిల్ "ఎప్పటికీ ఎవరికీ లొంగి ఉండదని" స్పష్టం చేశారు.

లులా విజయం వైట్ హౌస్‌కు నిరాశ కలిగించినప్పటికీ పర్యావరణ కార్యకర్తలు మాత్రం దీనిని స్వాగతించారు.

బోల్సోనారో గెలిస్తే బ్రెజిల్‌లోని శక్తివంతమైన వ్యవసాయ, మైనింగ్ రంగాలు మరింత బలం పుంజుకుంటాయని వారు భయపడ్డారు.

జైర్ బోల్సోనారో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెజాన్ అడవుల నరికివేత, కార్చిచ్చుల రికార్డులను వారు గుర్తుచేశారు.

జూనియర్ బోల్సోనారో అధికారంలోకి వస్తే పర్యావరణ నిబంధనలు సడలిపోయే ప్రమాదం ఉందని తద్వారా ఈ కీలక పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరుగుతుందని వారు వాదించారు.

ఈ ఎన్నికల్లో బోల్సోనారోకు చెందిన లిబరల్ పార్టీ పెద్ద ఎత్తున ఆధిక్యం సాధించినప్పటికీ, లూలాకు చెందిన వర్కర్స్ పార్టీ మొదటి రెండో రౌండ్ ఓటింగ్ మధ్య భారీ ర్యాలీలు నిర్వహించి పార్టీకున్న బలమైన క్షేత్రస్థాయి మద్దతును నిరూపించుకుంది.

ఎన్నికలకు ముందు లులా ఈ పోటీని "బ్రెజిల్‌కు ఒక మలుపు" అని అభివర్ణించారు.

సరికొత్త పాలనా విధానం ద్వారా బ్రెజిల్‌లోని పరస్పర విరుద్ధమైన రాజకీయ సిద్ధాంతాల మధ్య ఉన్న అంతరాన్ని పూడుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికలకు ముందు వాట్సాప్‌లో జరిగిన లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ దేశం ఇకపై ఎప్పటికీ పాతపద్ధతిలో ఉండబోదని చెప్పారు.

కొత్త తరహా పాలన గురించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉండే ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాలు సాగే మరింత న్యాయబద్ధమైన దేశం కోసం తాను పోరాడుతూనే ఉంటానని నొక్కి చెప్పారు.

అయితే, పార్లమెంట్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న లులాకు తన గత మూడు పర్యాయాల కంటే ఈ నాలుగో పర్యాయం మరింత కష్టతరమైన సవాలుగా మారే అవకాశం ఉంది.

ఈ నాలుగో పదవీకాలం ముగిసే సమయానికి ఆయనకు 85 ఏళ్లు నిండుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)