'మన పొరుగువాళ్లే మనల్ని రక్షిస్తున్నారు' అంటూ కశ్మీర్ గురించి ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వివాదమేంటి? పార్టీలు ఏమన్నాయి?

ఫారూఖ్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, పాకిస్తాన్
ఫొటో క్యాప్షన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.

ఆయన వ్యాఖ్యలను 'భారత దేశానికి వ్యతిరేకం' అని బీజేపీ మండిపడింది.

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఫారూఖ్ అబ్దుల్లా పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా "వాళ్లే మనల్ని కాపాడుతున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఫారూఖ్ అబ్దుల్లా ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని కాంగ్రెస్ అన్నది.

పలువురు ముస్లిం మత పెద్దలు సైతం ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫారూఖ్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, పాకిస్తాన్
ఫొటో క్యాప్షన్, బారాముల్లాలో ఒక కార్యక్రమంలో ఫారూఖ్ అబ్దుల్లా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

ఫారూఖ్ అబ్దుల్లా ఏమన్నారు?

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా శనివారం బారాముల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆయన తన ప్రసంగంలో ఆర్టికల్ 370 కింద కశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా రద్దు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలను ప్రస్తావిస్తూ.. ముస్లింల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని ఆరోపించారు.

"దిల్లీ నుంచి మీరు ఏం ఆశించగలరు? వాళ్లు న్యాయం చేస్తారా? వారిని ఎదిరించే ధైర్యం చేయండి. మీరు అలా చేయకపోతే మిమ్మల్ని తుడిచి పెట్టేస్తారు. మీరు పూర్తిగా తుడిచి పెట్టుకుపోతారు. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందనే వాళ్లు మౌనంగా ఉన్నారు. అలాగే మన పొరుగు వారు వాళ్ల వెంట పడుతున్నారు. కశ్మీర్ అంశం ఇంకా తేలలేదని వాళ్లు ప్రతిచోటా చెబుతున్నారు. వాళ్లే మనల్ని రక్షిస్తున్నారు" అని ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు.

"వారి ఉద్దేశాలు మంచివి కావు. ఒకటి చెప్పి మరొకటి చేస్తారు. నిజం ఏదో తెలుసుకునే శక్తిని కలిగి ఉండండి. నిజం చెప్పడం అంత సులభం కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంకా ఆయన తన ప్రసంగంలో "జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇబ్బందులు సృష్టించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు జరిగాయి. వాళ్లు లేవలేకపోతున్నారు. వాళ్లు పాకుతూనే ఉంటారు. మనం వాళ్లను( దిల్లీని) అడుగుతూనే ఉంటాం. మీ కాళ్లపై మీరు నిలబడే వరకు మీ గౌరవాన్ని మీరు తిరిగి పొందలేరు. ఇది గుర్తుంచుకోండి" అని అన్నారు.

భారతదేశానికి తాను వ్యతిరేకమని, భారతీయుడిని కాదని ఎప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్‌ల భారతదేశంలోనే తాను చేరానని పదేపదే చెప్పినట్లు ఆయన తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలు ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు.

"కుర్చీ కోసం హిందువులు ముస్లింలు పోరాడుకునే రోజు వస్తుందని వాళ్లు ఊహించలేదు. భారతదేశ పరిస్థితి నాశనమైంది" అని ఆయన అన్నారు.

ఫారూఖ్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, పాకిస్తాన్
ఫొటో క్యాప్షన్, ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు భారత్‌కు వ్యతిరేకమని జమ్మూ కశ్మీర్ బీజేపీ నాయకుడు అల్తాఫ్ ఠాకూర్ అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ స్పందన

అబ్దుల్లా వ్యాఖ్యలు భారత్‌కు వ్యతిరేకమన్నారు జమ్మూ కశ్మీర్ బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్.

నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరి ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగానే ఉంటుందని ఆయన విమర్శించారు.

"ఇది దేశానికి వ్యతిరేకంగా చేసిన బహిరంగ తిరుగుబాటు. ఆయన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు, ఐక్యతకు వ్యతిరేకం. నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పుడూ దేశ వ్యతిరేక విధానాలనే అవలంబించింది. ఫారూఖ్ అబ్దుల్లా చేసిన ప్రకటన పూర్తిగా దేశ వ్యతిరేకం. ఆయనపై చర్యలు తీసుకోవాలి" అని అల్తాఫ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.

"ఫారూఖ్ అబ్దుల్లా సాహబ్ ప్రశంసిస్తున్న పాకిస్తాన్ కశ్మీర్‌లోని ఈ ప్రాంతానికి ఏమి ఇచ్చింది? ఉగ్రవాదం, వేర్పాటువాదం, ప్రజలను రాళ్లు విసిరేవాళ్లుగా మార్చడం మాత్రమే" అని బీజేపీ ప్రతినిధి ఆర్‌పీ సింగ్ అన్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్ ప్రధాన స్రవంతిలో కలిసిపోయిందని పెట్టుబడులు వస్తున్నాయని, పర్యాటకుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

"కశ్మీర్ గురించి పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమైనవి. ఆయన మరోసారి దేశద్రోహానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ ప్రజల శ్రేయోభిలాషి ఎలా కాగలదు? ఎప్పటికీ కాలేదు" అని బీజేపీ నాయకుడు రవీందర్ రైనా అన్నారు.

ఫారూఖ్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్, బీజేపీ, కాంగ్రెస్, పాకిస్తాన్
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ మసూద్ ( ఫైల్ ఫోటో)

కాంగ్రెస్, ఎస్పీ నాయకుల ప్రకటనలు

కాంగ్రెస్ నాయకులు కూడా అబ్దుల్లా వ్యాఖ్యలను విమర్శించారు.

"పాకిస్తాన్ తనను తాను కాపాడుకోలేకపోతోంది. పాకిస్తాన్ మంచిదైతే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కశ్మీరీలను బాగా చూసుకునేది. పాకిస్తాన్ మోసపూరిత దేశం. పాకిస్తాన్ నుంచి ఏమీ ఆశించవద్దు. ఫారూఖ్ అబ్దుల్లా ఎందుకు అలాంటి ప్రకటన చేశారో నాకు అర్థం కావడం లేదు. షేక్ అబ్దుల్లా, ఫారూఖ్ అబ్దుల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు వారి విధానం ఎప్పుడూ భారతదేశం కోసమే" అని సహారన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నారు.

ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని ఇలాంటి ప్రకటనను తాను సమర్థించలేనని మసూద్ పేర్కొన్నారు.

"ఈ రోజు వరకు నేను ఫారూఖ్ అబ్దుల్లా నుంచి ఇలాంటి మాట వినలేదు. ఆయన ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కశ్మీరీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి. వారు భారతదేశంలో చేరాలని కోరుకుంటున్నారు. వారు పాకిస్తాన్‌లో సంతోషంగా ఉంటే భారతదేశంలో చేరడానికి ఎందుకు పోరాడుతారు?" అని కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ ప్రశ్నించారు.

"కశ్మీర్ మనది. కశ్మీరీలు మనవారే. సోషలిజం నమ్మే మేము అందరికీ గౌరవం ఇవ్వడం గురించి మాట్లాడుతాం. కశ్మీర్‌లో ఉన్న అశాంతికి పాకిస్తాన్ జోక్యమే కారణం. దాని తప్పుడు విధానాల వల్ల కశ్మీరియత్ దెబ్బతింది, కశ్మీరీ ముస్లింలు, పండిట్లు, సిక్కులు కూడా నష్టపోయారు" అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మోహిబుల్లా నద్వీ తెలిపారు.

ఫారూఖ్ అబ్దుల్లా అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని ఆయన అన్నారు.

"ఫారూఖ్ అబ్దుల్లా చేసిన ప్రకటన ఖండించదగినది. ఆయన భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అని దేవ్‌బంద్ మత పెద్ద ఖారీ ఇషాక్ గోరా అన్నారు.

కశ్మీర్‌ను భారత భద్రతా బలగాలు రక్షిస్తున్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి అన్నారు.

"జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతం భద్రతను ఎప్పుడూ మన భద్రతా దళాలే నిర్థరించాయి. అందుకే ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులతో సహా పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది అక్కడ భద్రత కోసం మోహరించారు" అని ఆయన తెలిపారు.

"అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద సంఖ్యలో భద్రత సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల జమ్మూ కశ్మీర్‌ను మరో దేశం కాపాడుతోందని చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది ఆక్షేపణీయం. ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి" అని ఫిరంగి మహాలి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)