‘నేనెప్పుడూ డ్రగ్స్ మొహమే చూళ్లేదు’: మాదకద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడ్డ టీవీ యాంకర్ ఇంకా ఏమన్నారంటే...

డ్రగ్స్, ఈజిప్టు, నేరాలు

ఫొటో సోర్స్, Sarah Khalifa Instagram account

    • రచయిత, పౌలిన్ కోలా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో దోషులుగా తేలిన టీవీ యాంకర్ సారా ఖలీఫాతో పాటు మరో 11 మందికి ఈజిప్టులో మరణశిక్ష విధించారు.

వాళ్లంతా ఓ క్రిమినల్ గ్యాంగ్‌లో భాగమని ప్రభుత్వ న్యూస్ పేపర్ అల్-అక్రమ్ తెలిపింది.

డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను ఈ గ్యాంగ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, వాటితో మాదకద్రవ్యాలు తయారుచేసి విక్రయించినట్టు ఆరోపణలున్నాయి.

వారి దగ్గర అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా లభించాయి.

39 ఏళ్ల సారా ఖలీఫా 'మిషన్ ఇంపాజిబుల్' అనే టీవీ షోతో పాపులర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసులను చూపించేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డ్రగ్స్, ఈజిప్టు, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తానెప్పుడూ డ్రగ్స్ మొహం చూళ్లేదని గత ఏడాది కోర్టుకు చెప్పారు ఖలీఫా

అప్పీల్‌కు అవకాశం

ఈ కేసులో తొలిసారి గత నెలలో తీర్పు వెలువడింది. ఒక నెల తర్వాత తీర్పును అధికారికంగా ధ్రువీకరించారు.

మరణశిక్ష విధించేముందు ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ నుంచి మతపరమైన అభిప్రాయాన్ని కోర్టు తీసుకోవాల్సిఉంటుంది. ఈజిప్టులో మరణశిక్ష కేసుల్లో ఇధి చట్టపరమైన ప్రక్రియలో ఒక భాగం. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశముంది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 750 కిలోగ్రాములకు పైగా డ్రగ్స్, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని విచారణలో అధికారులు కోర్టుకు తెలిపారు.

డ్రగ్స్, ఈజిప్టు, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మరణశిక్షపై అప్పీలు చేసుకునేందుకు ఈజిప్ట్ యాంకర్‌కు అవకాశముంది.

‘మొదటిసారి డ్రగ్స్ చూసిందే అప్పుడు’

ఇరవైమంది సాక్షులు ప్రాసిక్యూషన్‌ ముందు వాంగ్మూలాలు ఇచ్చినట్టు అల్-అక్రమ్ పత్రిక తెలిపింది. దీంతో పాటు సంభాషణలు, వీడియో క్లిప్‌లతో కూడిన ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా కోర్టులో సమర్పించారు.

ఖలీఫా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. గత ఏడాది సెప్టెంబరులో సారా ఖలీపాను కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ కేసులో ఆమె పాత్ర గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా డ్రగ్స్‌ను తానెప్పుడూ చూడలేదని ఆమె బదులిచ్చినట్టు ప్రభుత్వ పత్రిక అల్-యౌమ్ తెలిపింది.

మాదకద్రవ్యాల నిరోధక సంస్థ కార్యాలయంలో డ్రగ్స్‌తో పాటు తన ఫోటో తీసినప్పుడే తాను మొదటిసారి వాటిని చూశానని ఆమె చెప్పారు.

మరణశిక్ష విధించినప్పటికీ సారా ఖలీఫా, ఇతర దోషులకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా మూసుకుపోలేదు. వారు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చు.

ఈ కేసు ఈజిప్టు అత్యున్నత అప్పీళ్ల న్యాయస్థానమైన కోర్ట్ ఆఫ్ కాసేషన్‌ వరకు వెళ్ళవచ్చు. అక్కడ ప్రతివాదులు దిగువ కోర్టు తీర్పును, అందుకు కోర్టు చూపించిన న్యాయపరమైన కారణాలను సవాలు చేయవచ్చు.

ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయాన్ని కూడా కోర్టు కోరింది. మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో ఇది తప్పనిసరి ప్రక్రియ. అయితే గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయం న్యాయస్థానానికి కట్టుబడి ఉండాల్సింది కాదు.

దీని అర్థం ఏంటంటే కోర్టు ప్రస్తుత తీర్పు మరణశిక్ష. కానీ దాన్ని ఇప్పుడే అమలుచేయరు. అప్పీళ్ల ప్రక్రియలో ఈ శిక్షను సమర్థించవచ్చు, మార్చవచ్చు లేదా కేసును మళ్లీ విచారించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)