పురుషుల జననాంగాలను దొంగలించడం, చిన్నవిగా మార్చడం సాధ్యమా? వదంతులు ఏంటి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, ముంగై ఎన్గిగే, అల్ఫ్రెడ్ లాస్టెక్
- హోదా, బీబీసీ గ్లోబల్ డిస్ఇన్ఫర్మేషన్ యూనిట్ యూనిట్, బీబీసీ ఆఫ్రికా
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
హెచ్చరిక: ఇందులో మిమ్మల్ని కలవరపరిచే అంశాలు ఉంటాయి.
అక్టోబరు 2025 నుంచి ఈ ఏడాది జూలై వరకు 80మందికి పైగా హత్యకు గురయ్యారు. దీనికి కారణం 'జననాంగాల దొంగతనం' అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారమేనని బీబీసీ గ్లోబల్ డిస్ఇన్ఫర్మేషన్ యూనిట్ గుర్తించింది. ఆరు ఆఫ్రికా దేశాల పోలీసు విభాగాల నుంచి ఈ సమాచారాన్నిసేకరించింది బీబీసీ.
భుజంపై మామూలుగా ఎవరైనా చెయ్యివేయగానే పురుషుడి జననాంగాలు చిన్నవైపోతాయని లేదా మాయమైపోతాయని వ్యాపించిన వదంతులకు, ఈ హత్యలకు సంబంధముంది. శాస్త్రీయ ఆధారంలేని ఈ తప్పుడు ప్రచారాలు.. సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారంతో మరింత బలపడుతున్నాయి.
''మేం ఎవరో ఒకరి జననాంగాలను దొంగిలించామని వాళ్లు అరుస్తున్నారు. మేం అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాం. మమ్మల్ని పెద్ద మూక చుట్టుముట్టింది'' అని టాంజానియాకు చెందిన మెకానిక్ బోనిఫేస్ ఎంజాలా బీబీసీతో చెప్పారు. బోనిసెఫ్ను జననాంగాల దొంగగా భావించిన కొందరు ఆయన్ను విపరీతంగా కొట్టారు. బీబీసీ చూసిన వీడియోల్లో ఘటనలు కూడా ఆయన అనుభవాన్ని పోలి ఉన్నాయి.
అపరిచితులను కలిసిన తర్వాత తమ జననాంగాలు, పురుషాంగం, వృషణాలు మాయమయ్యాయని లేదా కుంచించుకుపోయాయని కొందరు పురుషులు చెబుతున్నారు. జననాంగాలను దొంగలించారని కొందరిపై గుంపుగా చేరిన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి ఆరోపణలకు చాలా కాలంగా కొనసాగుతున్న భయాలు, మూఢనమ్మకాలే కారణం. ఆఫ్రికా ఖండంలో ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. ముఖ్యంగా మంత్రతంత్రాలను నమ్మే సమాజాల్లో ఇలాంటి నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ భయాలను సోషల్ మీడియా మరింత వ్యాపింపచేస్తోంది.
ఇటీవల వ్యాప్తిచెందుతున్న ఈ వదంతులు గత ఏడాది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదట ప్రారంభమయ్యాయి. అక్కడ ఇలాంటి ఆరోపణలు 2008లో కూడా వినిపించాయి.
ఆ తర్వాత ఇవి క్రమంగా ఈ ప్రాంతంలోని బురుండి, జాంబియా, టాంజానియా, మొజాంబిక్, అంగోలా, మలావి, కెన్యా దేశాలకు వ్యాపించాయి.
‘ఇలా జరుగుతుందంటే...అక్కడికి వెళ్లేవాడినే కాదు’
జాంబియాలో ఈ వార్తలు మొదట మార్చిలో వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో ఓ మహిళను ఒక గుంపు కొట్టి చంపింది. ఆ తర్వాత ఈ భయాందోళనలు సరిహద్దు దాటి టాంజానియాకు వ్యాపించాయి.
జాంబియా సరిహద్దుకు సమీపంలో రద్దీగా ఉండే వ్యాపార పట్టణం టాండుమా దగ్గరలోని ఎంపెంబాలో తన ఇంటి దగ్గర నివసిస్తుంటారు ఎంజాలా. తల కుడివైపు కొడవలి ఆకారంలో ఉన్న గాయపుమచ్చపై వేళ్లతో తడుముకుంటూ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
''ఆ రోజు నేను చావుకు అంత దగ్గరగా వెళ్తానని ముందే తెలిసుంటే తినడానికి ఆ రెస్టారెంట్లోకి వెళ్లేవాణ్ణికాదు. కానీ చావుకు ఎంత దగ్గరగా ఉన్నామో మనకు తెలియదు కదా'' అని ఆ మెకానిక్ చెప్పారు.
ఆయన, ఆయన స్నేహితుడు ఏప్రిల్ ఒకటిన కారు అమ్మకం గురించి కస్టమర్‌ను కలడానికి టుండుమాకు వెళ్లారు. ముందుగా భోజనం చేయాలనుకున్నారు. రెస్టారెంట్లో కూర్చున్న కొద్దిసేపటికే ఓ గుంపు వారిని బయటకు లాగింది.
ఆ దాడి వల్ల ఆయన గడ్డంపై రెండు గాయాల మచ్చలు ఏర్పడ్డాయి. ఒక పన్ను కూడా ఊడిపోయింది.
దాడి జరుగుతున్న సమయంలో ఆయన స్పృహ కోల్పోయారు. రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన ఎంజాలాకు తన స్నేహితుడు చనిపోయాడనే వార్త తెలిసింది.
భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసించే ఇంటికి తిరిగివచ్చిన ఆయన కుంటుకుంటూ నడుస్తున్నారు. తనకు తరచుగా తలనొప్పి కూడా వస్తోందని ఆయన చెబుతున్నారు.
ఇంతకు ముందులాగా తన మెకానిక్ షాపులో తిరిగి పనిచేయలేకపోతున్నారు. అవసరమైన కొన్ని మందుల ఖర్చును పొరుగువారు, స్నేహితులు కలిసి భరిస్తున్నారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Alfred Lasteck / BBC
మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
ఎంజాలా, ఆయన స్నేహితుడిపై దాడి జరిగిన అదే రోజు టుండుమాలో ఇలాంటి దాడి మరొకటి చూశానని కమర్షియల్ ఫోటోగ్రాఫర్, వ్యాపారవేత్త మైఖేల్ సిలావే చెప్పారు. జననాంగాలు దొంగిలిస్తున్నారనే వీడియోలు టిక్‌టాక్‌లో చక్కర్లు కొట్టడం మొదలైన తర్వాత అక్కడ ప్రజల్లో ఆందోళన పెరిగిందని ఆయన చెప్పారు.
కొంతమంది తన షాపు ముందు నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లడం ఆయన చూశారు. దగ్గరలో ఒక వ్యక్తిపై ఆరోపణలుచేసి ఆయన్ను కొడుతున్నారని ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని నిప్పంటించి కాల్చివేశారని ఆయన చెప్పారు.
''వాళ్లు ఆయనకు నిప్పటించిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. దాంతో అందరూ అక్కడినుంచి పారిపోయారు'' అని బీబీసీతో అన్నారు సిలావే.
టిక్‌టాక్, ఫేస్బుక్లో కనిపించిన ఓ వీడియోను బీబీసీ గ్లోబల్ డిస్ఇన్ఫర్మేషన్ యూనిట్ ధ్రువీకరించింది. ఈ వీడియోను లక్షలమంది చూశారు. వీడియోలో ఒక గుంపు ఓ వ్యక్తిని కొడుతోంది. జననాంగాలు దొంగిలించాడని ఆయనపై ఆరోపణలు చేస్తూ వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
కాలక్రమంలో అలాంటి ఘటనలు పెరిగిపోయాయి. ప్రజలపై దాడులు కూడా పెరిగాయి. ఆ సమయంలో తనలాంటి యువకులు భయపడేవారని, కానీ ఇప్పుడా వదంతుల్లో ఎలాంటి నిజం లేదని తాము అర్థం చేసుకున్నామని సిలావే చెప్పారు.
మోంబా జిల్లాలోని టుండుమాకు చెందిన 50ఏళ్ల టైలర్, ఫ్యాషన్ డిజైనర్ ఆశాస్టీవెన్ మ్వాకిలాసా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆ వదంతుల్లో నిజం లేదని తనకు అర్ధమైందన్నారు.
అయినా ఆమె భయం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తన భర్త లేదా కుమారులు బయటకు వెళ్లినప్పుడు ఆమె కంగారు పడతారు. అయితే పోలీసులు ఇప్పుడు గస్తీ పెంచడంతో ఆమెకు కొంత ఉపశమనంగా అనిపిస్తోంది.
కొన్ని ఘటనల వెనక ఉద్దేశపూర్వక నేరపూరిత చర్యలున్నట్టు స్థానిక దర్యాప్తులో తేలిందని మోంబా జిల్లా కమిషనర్ ఎలియాస్ డేనియల్ మ్వాండోబో బీబీసీతో చెప్పారు. కొంతమంది కలిసి నేరానికి కుట్రపన్నారని, తమ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లలో దాడుల వీడియోలు
టాంజానియా ప్రధాన నగరమైన దార్ ఎస్ సలామ్‌లో చిత్రీకరించిన మరో వీడియోలో ఒక గుంపు ఒక వ్యక్తిని దుమ్ముతో నిండిపోయిన మార్కెట్ వీధిలోకి లాక్కెళ్లడం కనిపిస్తోంది. వారు ఆయన్ను తోస్తూ పట్టుకుని కొడుతూ జననాంగాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యక్తేమో తాను నిర్దోషినని వేడుకుంటున్నారు.
మొజాంబిక్, కెన్యాల్లో జరిగిన ఇలాంటి దాడుల వీడియోలను కూడా బీబీసీ డిస్ఇన్ఫర్మేషన్ యూనిట్ ధ్రువీకరించింది.
ఇలాంటి హింసకు సంబంధించిన డజన్లకొద్దీ వీడియోలు టిక్‌టాక్, ఫేస్‌బుక్‌ల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో జననాంగాలు దొంగతనానికి గురయ్యాయని ఆరోపించే వ్యక్తుల ప్రత్యక్ష అనుభవాలుగా చెప్పే వీడియోలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే పోస్టులు, వ్యాఖ్యలు, కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలుగా చూపించే వీడియోలున్నాయి.
బీబీసీ విశ్లేషించిన అనేక వీడియోలు, వాటిలో మూక హింసను చూపే కొన్ని వీడియోలు కూడా ఇప్పటికీ ఆన్లైన్లో ఉన్నాయి.
''మా ప్లాట్ఫామ్లో షేర్ అయిన కంటెంట్‌ను మేం పరిశీలిస్తున్నాం. మా విధానాలను ఉల్లంఘించినట్టు తేలిన కంటెంట్‌పై చర్యలు తీసుకుంటాం'' అని మెటా ప్రతినిధి చెప్పారు.
దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ కోరగా టిక్‌టాక్ ఇంకా స్పందించలేదు.
కొంతమంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే వారు నిజంగా ఈ వాదనలను నమ్ముతున్నారా లేక ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడానికి అలా చేస్తున్నారా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
ఇలాంటి పోస్టులతో పాటు జననాంగాల దొంగతనం నుంచి రక్షిస్తాయని చెప్పే తాయెత్తులు, ఇతర వస్తువులను కొంతమంది విక్రయిస్తున్నారు. మరికొందరు కమెడియన్లు ఈ వదంతులను కామెడీ స్కిట్ల రూపంలో ఎగతాళి చేస్తున్నారు.
''స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వల్ల వదంతులు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒకసారి వ్యాపించడం ప్రారంభించిన తర్వాత వాటిని నియంత్రించడం మరింత కష్టమవుతోంది'' అని రచయిత జూలియన్ బోనోమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మొజాంబిక్‌లో మూకదాడులతో 55మంది మృతి
జూలియన్ బోనోమ్ 'ది సెక్స్ థీవ్స్: ది ఆంత్రొపాలజీ ఆఫ్ ఎ రూమర్' అనే పుస్తకం రాశారు. 'సెక్స్ థీవ్స్'పై వదంతులు ఎలా వ్యాపించాయి, ప్రజలు వాటిని ఎందుకు నమ్ముతారనే విషయాన్ని అందులో ఆయన రాశారు.
''జననాంగాలను కోల్పోయామని చెప్పేవారి గురించి ప్రజలు వినడం మాత్రమే కాదు అలా జరిగిందని చెబుతున్నవారిని వీడియోల్లో చూస్తున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులపై గుంపులు ఎలా స్పందిస్తున్నాయో కూడా చూస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో షేర్ అయ్యే వీడియోలు, ధ్రువీకరించని వాదనలు మరింత నమ్మదగేవి కనిపించేలా చేయొచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే అవి వెంటనే కళ్లముందు కనిపిస్తాయి. గతంలో ఇలాంటి వదంతులు వ్యాపించిన పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత డిజిటల్ వాతావారణం అత్యంత ముఖ్యమైన తేడాల్లో ఒకటని ఆయన వివరించారు.
మొజాంబిక్‌పై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. అక్కడ ఆరువారాల్లో 55మంది చనిపోయారని పోలీసులు మే నెలలో తెలిపారు. మృతుల్లో ఒకరు పోలీసు అధికారి. ఆరోగ్యకార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మృతుల్లో ఉన్నారు.
విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ అనుమానాలను, వాటి కారణంగా మరణాలను మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో ఖండించారు. ఈ వాదనలు పూర్తిగా అబద్ధమని, ఎవరైనా తమ శరీరంలో ఏదన్నా భాగాన్ని కోల్పోయారనే విషయానికి ఎలాంటి వైద్య పరమైన ఆధారాలు లభించలేదని చెప్పారు.
ఏప్రిల్‌లో కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో ఇద్దరు ఆరోగ్యకార్యకర్తలపై వారి ఇళ్లలో, వారు పనిచేసే ప్రదేశాల్లో దాడి జరిగింది. ఈ ప్రాంతం టాంజానియా సరిహద్దులో ఉంది. దాదాపు పదేళ్లగా ఇక్కడ ఇస్లామిక్ తిరుగుబాటు కొనసాగుతోంది.
దాడులు జరిగిన ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను కొన్ని వారాల పాటు మూసేయాల్సి వచ్చింది. అదే సమయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రారంభించారు.
ప్రజల్లో ఉన్న కొన్ని భయాలకు కోరో సిండ్రోమ్ కారణం కావొచ్చని ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తెలిపింది. జననాంగాలు మాయమవుతున్నాయనీ, లేదా లోపలికి ముడుచుకుపోతున్నాయనీ వ్యక్తమవుతున్న అనుమానాలను భ్రమతో కూడిన మానసిక రుగ్మతగా భావిస్తారు

ఫొటో సోర్స్, Getty Images
‘చూస్తుండగానే రాళ్లతో కొట్టి చంపుతున్నారు’
కెన్యాలోనూ ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్కడ తీర ప్రాంతంలోని క్వాలే, మొంబసా కౌంటీల్లో మూక దాడుల్లో ఐదుగురు చనిపోయారు.
జూలైలో మొదటి ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత మొంబాసా కౌంటీ కమిషనర్ మొహమ్మద్ నూర్ కొంతమంది కంటెంట్ క్రియేటర్లపై ఆరోపణలు చేశారు. కేవలం వ్యూస్ పెంచుకోవడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రజలను భయపెట్టే ఇలాంటి అనుమానాలను, అసత్యాలను వారు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
''ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల ప్రాణనష్టం తేలిగ్గా జరుగుతుంది'' అని నూర్ బీబీసీతో చెప్పారు.
హింసాత్మక ఘటనలను ఆ తర్వాత పోలీసులు నియంత్రించారని, పలువురిని అరెస్టు చేశారని ఆయన చెప్పారు. పురుషుల జననాంగాలు మాయమవ్వడానికి కారణమయ్యారని ఆరోపిస్తూ ఒక మహిళపై దాడి చేసిన తండ్రి, కొడుకులు కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. వారు నేరాన్ని అంగీకరించడంతో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
ఇలాంటి ఆరోపణలే మలావిలో కూడా మూక దాడులకు దారితీశాయి. అక్కడ ఎనిమిది మంది చనిపోయారు.
ఇక సరిహద్దుకు అవతల టాంజానియాలోని టుండుమాలో మెకానిక్ ఎంజలా తనపై జరిగిన శారీరక దాడి నుంచి కోలుకుంటున్నప్పటికీ ఆ ఘటన వల్ల కలిగిన మానసిక వేదన మాత్రం ఇంకా తగ్గలేదు.
''నా స్నేహితుడు అర్థం లేని రీతిలో చనిపోయిన విషయాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఎలాంటి కారణం లేకుండా ఒక్కసారిగా ప్రజలు మనపై రాళ్లు విసురుతుంటే మనం ప్రాణాలు కోల్పోవడం అన్నది ఎంత భయంకరమైన విషయం కదా'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































