గుంటూరు: యువకుడి మృతిపై లాకప్ డెత్ ఆరోపణలు, కుటుంబ సభ్యులు ఏమన్నారు, పోలీసులు ఏం చెప్పారు?

గుంటూరు, జీజీహెచ్‌., మృతదేహం, ధర్నా

ఫొటో సోర్స్, kiran

ఫొటో క్యాప్షన్, గుంటూరు జీజీహెచ్‌ వద్ద మృతదేహంతో ధర్నాకు దిగిన దృశ్యాలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

గుంటూరు జిల్లాలో దళిత యువకుడు చీకటి గోపీ (29) మృతి కలకలం రేపుతోంది.

తాడికొండ పోలీసులు కొట్టడం వల్లనే గోపి చనిపోయాడంటూ ఆయన భార్య, కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌ వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

తాడికొండ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లనే తన భర్త చనిపోయాడని గోపీ భార్య జ్యోతి ఆరోపించారు.

అయితే తాము గోపీని కొట్టలేదని తాడికొండ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ ఉమేశ్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణ చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ బీబీసీతో అన్నారు.

ఈ ఘటన పూర్వాపరాలను మృతుడి భార్య జ్యోతి, సోదరుడు సతీశ్, తాడికొండ సీఐ ఉమేశ్ బీబీసీకి వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామం దళితవాడకు చెందిన గోపీ.. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆటో నడుపుతూ గుంటూరులో ఉన్న గోపీకి తాడికొండ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆగస్టు 26న ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ఓ బంగారు ఉంగరం చోరీ కేసు నిందితులు ఆ బంగారాన్ని అమ్మి, రూ.10,000 నీకు ఇచ్చినట్టు చెబుతున్నారు. నిన్ను విచారించాల్సి ఉంది. స్టేషన్‌కి రావాలంటూ ఫోన్‌ చేశారు. ఆగస్ట్ 26 మధ్యాహ్నం గోపీ తాడికొండ స్టేషన్‌కి వెళ్లారు.

చోరీ గురించి తనకు తెలియదని, ఆ నిందితుల్లో ఒకరు తనకు పదివేలు అవసరానికి ఇచ్చిన మాట నిజమేననీ, అవి కావాలంటే తిరిగి చెల్లిస్తానని చెప్పారు. చోరీ కేసు కావడం, అందులోనూ తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నాడు కాబట్టి రాత్రికి ఇంటికి పంపించేస్తారని భావించి పోలీస్‌ స్టేషన్‌ వద్దే కుటుంబసభ్యులందరం ఎదురు చూశాం’’ అని జ్యోతి, సతీశ్ బీబీసీకి వివరించారు.

గుంటూరు పోలీసులు

ఫొటో సోర్స్, satheesh

ఫొటో క్యాప్షన్, మృతుడు చీకటి గోపి

‘‘పోలీసులు 26వ తేదీ రాత్రి గోపీని పంపించలేదు. గోపీకి ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రిలో చూపించాలని మేం ప్రాధేయపడితే 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పంపారు.

మేం పొన్నెకల్లు పీహెచ్‌సీకి తీసుకువెళ్లి చికిత్స చేయించాం. అయితే అప్పటికే ప్లేట్‌‌లెట్లు పడిపోవడంతో 28వ తేదీ ఉదయం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం.

ఆగస్ట్ 29వ తేదీ, 30వ తేదీ తెనాలి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆగస్టు 31వ తేదీ రాత్రి ఒక్కసారిగా కాళ్లు చచ్చుపడిపోవడంతో గోపీని తెనాలి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్‌కి తీసుకువచ్చాం’’ అని గోపీ భార్య జ్యోతి, సోదరుడు సతీశ్ వివరించారు.

‘‘ఉన్నట్టుండి ఎందుకు ఇలా ఇంత అనారోగ్యం వచ్చిందని గోపీని అడిగితే తనను 26వ తేదీ రాత్రి పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టారని విలపించారనీ, అప్పటికే జ్వరంగా ఉండటంతో ఆ దెబ్బలు తాను తట్టుకోలేకపోయానని గోపీ చెప్పాడు’’ అని వారు బీబీసీకి తెలిపారు.

అనారోగ్యంతో 31వ తేదీ రాత్రి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో చేరిన గోపీ, సెప్టెంబర్‌ 1వ తేదీ తెల్లవారుజామున చనిపోయాడని ఆయన సోదరుడు సతీశ్ చెప్పారు.

మృతదేహం

ఫొటో సోర్స్, satheesh

ఫొటో క్యాప్షన్, మృతుడి పాదాలపై గాయాలు.. ఇవి పోలీసుల దెబ్బలే అంటున్న భార్య జ్యోతి

మృతదేహంతో జీజీహెచ్‌ గేట్‌ ఎదుట ధర్నా

సెప్టెంబర్‌ 1వ తేదీ మంగళవారం నాడు మృతుడు గోపీ బంధువులు ఆస్పత్రి మెయిన్‌ గేటు ఎదుట మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకి దిగారు.

పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లనే తన భర్త చనిపోయారంటూ గోపీ భార్య జ్యోతి విలపించారు. అందుకు సాక్ష్యం ఇవే అంటూ మృతుడి శరీరంపై ఉన్న గాయాలను చూపించారు.

అయితే, తాము అస్సలు కొట్టలేదని తాడికొండ సీఐ ఉమేశ్ చెప్పారు.

‘‘బంగారం చోరీ కేసులో విచారణ నిమిత్తం నిందితులు శాంతిరాజు, గోపీకృష్ణతో పాటు చీకటి గోపీని తీసుకొచ్చాం. గతంలో కూడా పలుచోరీ కేసులకు సంబంధించి మృతుడు చీకటి గోపీ అనుమానితుడుగా ఉన్నాడు. అందుకే విచారణకు సమయం పట్టింది. విచారణ క్రమంలో చీకటి గోపీని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. అయితే అప్పటికే అతను తనకు ఒంట్లో బాగోలేదని నీరసంగా ఉన్నానని చెబితే అతని కుటుంబసభ్యులను పిలిపించి అప్పగించాం. ఇది జరిగిన నాలుగురోజుల తర్వాత పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయాడని అంటున్నారు. అసలు మాకు సంబంధం లేదు. కుటుంబసభ్యుల డిమాండ్‌ మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని బీబీసీతో తాడికొండ సర్కిల్‌ ఇన్‌‌స్పెక్టర్‌ ఉమేశ్ అన్నారు.

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విచారణ చేయిస్తాం - జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

చీకటి గోపీ మృతికి సంబంధించి తాడికొండ పోలీసులపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బీబీసీతో అన్నారు.

‘‘పోలీస్‌స్టేషన్, లాకప్‌రూం, స్టేషన్‌ ప్రాంగణం.. అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ రోజు ఆ ఫీడ్‌ అంతా నేను చూశాను, ఎక్కడా పోలీసులు అతన్ని టచ్‌ చేసిన దృశ్యాలు కూడా లేవు. అయితే యువకుడి బంధువుల ఆందోళన మేరకు కచ్చితంగా విచారణ చేస్తాం’’ అని ఎస్పీ వ్యాఖ్యానించారు.

అయితే పోలీసుల దెబ్బలతోనే తన భర్త గోపీ చనిపోయాడని, అందుకు కారణమైన తాడికొండ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య జ్యోతి డిమాండ్ చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)