లిండ్సే క్లాన్సీ: ఈమె తన ముగ్గురు పిల్లలను ఎందుకు చంపారు, ‘హత్య చేయమని ఒక గొంతు ఆదేశించిందనే’ వాదన నిలబడుతుందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఆనా ఫాగై
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
లిండ్సే క్లాన్సీ కేసు విచారణ గత ఐదు వారాలుగా అమెరికాలో ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాసెచూసెట్స్లోని తన ఇంటి బేస్మెంట్లో ఈ 36 ఏళ్ల మాజీ నర్సు తన ముగ్గురు చిన్న పిల్లలను హత్య చేశారు.
ఆమెపై మూడు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అభియోగాలు నమోదయ్యాయి. 2023లో తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను హత్య చేసిన విషయాన్ని ఆమె ఖండించ లేదు.
అయితే, ఆ సమయంలో ఆమె పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (ప్రసవానంతర మానసిక వ్యాధి)తో బాధపడుతున్నారని, అందువల్ల ఆమె మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే స్థితిలో లేరని ఆమె తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.
అయితే పిల్లలను హత్యచేయడానికి క్లాన్సీ ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే నిర్ణయం తీసుకున్నారని, ఆమెకు ఆ సమయంలో మంచిచెడుల మధ్య తేడా తెలిసిన స్థితిలోనే ఉన్నారని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది.
తొమ్మిది మంది మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జ్యూరీ లిండ్సే కేసుపై మూడు రోజులపాటు చర్చించింది.
ఈ జ్యూరీ తమ ముందున్న అనేక అంశాల ఆధారంగా ఈ కేసును విచారిస్తోంది.
వీటిలో నిర్దోషి, మానసిక అస్వస్థత కారణంగా దోషి కాకపోవడం, ఫస్ట్‌డిగ్రీ హత్య, సెకండ్ డిగ్రీ హత్య, హత్య చేయాలనే ఉద్దేశం లేకపోవడం అనే అంశాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, JOSEPH PREZIOSO/AFP via Getty Images
మానసిక అనారోగ్యమే కారణమని..
మానసిక అస్వస్థత కారణంగా నిర్దోషి అని నిరూపించాలంటే..
ఈ కేసు ప్రధానంగా పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు సంబంధించిన వాదనపై ఆధారపడి ఉంది. చిన్న కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత క్లాన్సీకి భ్రమలకు గురయ్యారని, ఆమెకు ఎవరిదో గొంతు వినిపించడం మొదలైందని ఆమె తరఫు న్యాయ బృందం వాదించింది. పిల్లలను చంపాలని ఆ గొంతే ఆమెకు చెప్పిందని పేర్కొన్నారు.
ఈ వ్యాధి తీవ్రతను దానికి సంబంధించిన నిపుణులైన సాక్షులు కోర్టుకు వివరించారు. క్లాన్సీ మానసిక పరిస్థితి గురించి ఆమె కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యమిచ్చారు.
మాసెచూసెట్స్ చట్టం ప్రకారం, తాను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నిరూపించాల్సిన బాధ్యత క్లాన్సీపై ఉండదు.
బదులుగా, ఆమె పిల్లలను హత్య చేసిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే హత్య చేయాలనే మానసిక స్థితిలోనే ఉన్నారని సందేహానికి తావులేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించాలి.
క్రిమినల్ లాయర్ ఎలిస్ హెర్షాన్ ఈ విషయాన్ని బీబీసీ న్యూస్‌కు తెలిపారు.
ప్రాసిక్యూషన్ దీన్ని రెండు మార్గాల్లో ఒకదాని ద్వారా నిరూపించవచ్చు.
మొదటిది, ఆ సమయంలో క్లాన్సీ ఎలాంటి మానసిక అనారోగ్యంతో బాధపడలేదని నిరూపించడం. రెండోది, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తనను తాను నియంత్రించుకునే పరిస్థితిలోనే ఉన్నారని, తాను చేయబోయే పని తప్పు అని ఆమెకు తెలుసని నిరూపించడం.
క్లాన్సీని జ్యూరీ నిర్దోషిగా తేల్చితే, ఆమె విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది జరిగే అవకాశం చాలా తక్కువ.
మానసిక అస్వస్థత కారణంగా ఆమెను నిర్దోషిగా ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అలాంటి తీర్పు వస్తే క్లాన్సీని ఆసుపత్రిలో నిర్బంధిస్తారు.
"ఆమె ఇక జీవితాంతం ఎక్కడ గడపాలి అనే విషయమే తీర్పులో కీలకం. ఆమె మానసిక వైద్య కేంద్రంలో ఉండాలని డిఫెన్స్ భావిస్తోంది. లేదు ఆమెను జైలుకు పంపాలని ప్రాసిక్యూషన్ భావిస్తోంది" అని హెర్షాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, John Tlumacki/The Boston Globe via Getty Images
ఫస్ట్ డిగ్రీ హత్య
క్లాన్సీకి ఎదురయ్యే అవకాశమున్న పరిణామాల్లో అత్యంత తీవ్రమైంది ఇదే. ఆమెను ఫస్ట్ డిగ్రీ హత్యకు దోషిగా తేల్చవచ్చు. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో హత్య చేయడం.
మాసెచూసెట్స్ రాష్ట్రంలో ఈ నేరానికి దోషిగా తేలితే, అందుకుగాను పెరోల్‌కు అవకాశం లేకుండా జీవిత ఖైదు విధించడం తప్పనిసరి.
న్యూయార్క్ లా స్కూల్ ప్రొఫెసర్, మానసిక ఆరోగ్య చట్టాల నిపుణురాలు హీథర్ కుకుల్లో ఈ విషయమై బీబీసీతో మాట్లాడారు.
క్లాన్సీని దోషిగా తేల్చాలంటే, ఇది చాలా క్రూరమైన, అమానవీయమైన నేరమని, హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని లేదా ఈ రెండూ నిజమని జ్యూరీ సభ్యులు నమ్మాలి.
అంటే, క్లాన్సీకి అనుకూలంగా పరిగణించగల ఎలాంటి పరిస్థితులు లేవని ప్రాసిక్యూషన్ నిరూపించినట్టవుతుంది.
అయితే, ఈ కేసులో చట్టం నిర్వచించిన ప్రకారం శిక్ష నుంచి ఉపశమనం కల్పించడానికి మానసిక అనారోగ్యం లేదా మానసిక రుగ్మతను ఒక కారణంగా పరిగణించవచ్చు.
క్లాన్సీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, అయితే మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించలేనంత తీవ్రంగా ఆమె పరిస్థితి లేదని ప్రాసిక్యూటర్ జెన్నిఫర్ స్ప్రాగ్ తుది వాదనల్లో తెలిపారు.
క్లాన్సీ తన పిల్లలను హత్య చేయాలని ఆదేశించినట్లు చెప్పిన స్వరాన్ని నిజంగానే విన్నారా అనే విషయంపై ప్రాసిక్యూషన్ తరఫు నిపుణులైన సాక్షులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, David L. Ryan/The Boston Globe via Getty Images
సెకండ్ డిగ్రీ హత్య
మాసెచూసెట్స్ చట్టం ప్రకారం, ఫస్ట్ డిగ్రీ హత్య పరిధిలోకి రాని ఏ హత్యైనా దీని కిందే వస్తుంది.
దురుద్దేశంతో లేదా తీవ్రమైన నిర్లక్ష్యంతో, ముందస్తు ప్రణాళిక లేని హత్యలకు ఇది వర్తిస్తుంది.
సెకండ్ డిగ్రీ హత్యకు కూడా క్లాన్సీకి జీవిత ఖైదు విధించే అవకాశముంది. అయితే ఇందులో పెరోల్‌కు అవకాశం ఉంటుంది.
అకారణంగా, అకస్మాత్తుగా హత్య చేయడం
హత్య చేయాలనే ఉద్దేశం లేకపోవడం అనే మరో అవకాశం ద్వారా క్లాన్సీని దోషిగా తేల్చేందుకు కూడా న్యాయమూర్తి జ్యూరీకి ఇచ్చారు. ఈ అంశంపై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ మధ్య విభేదాలు ఉన్నాయి.
అంటే ఒక వ్యక్తిని అకారణంగా, నిర్లక్ష్యంతో హత్య చేయటం. ఈ నేరానికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది.
అకారణ హత్యకు, మిగతా రెండు రకాల హత్యల తీర్పులకు మధ్య ఉన్న కీలకమైన తేడా హత్య చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నదేనని నిపుణులు చెప్పారు.
"దీని ద్వారానే హత్యలు ముందస్తు ప్రణాళికతో జరగలేదని, ముందుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదని, క్లాన్సీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో ఆ పని చేశారని జ్యూరీ నమ్మే అవకాశం ఉంటుంది" అని కుకుల్లో చెప్పారు.
అనుకోకుండా జరిగిన హత్యకు క్లాన్సీని దోషిగా తేల్చేందుకు, పిల్లల మరణాలకు కారణం కావాలనే ఉద్దేశం క్లాన్సీకి ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
క్లాన్సీ విచారణలో జ్యూరీ సభ్యులు నాలుగు రోజుల చర్చల అనంతరం తాము ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నామని మంగళవారం న్యాయమూర్తికి తెలిపారు. అయితే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చే వరకు చర్చలను కొనసాగించాలని న్యాయమూర్తి వారిని కోరారు.
జ్యూరీ ఏకగ్రీవ తీర్పుకు రాలేకపోతే, న్యాయమూర్తి విచారణ రద్దు అయినట్టు ప్రకటించవచ్చు.
అలా జరిగితే, ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే విచారణ ముగుస్తుంది.
ఆ తర్వాత ప్రాసిక్యూషన్‌కు రెండు మార్గాలు ఉంటాయి. కేసును మళ్లీ దాఖలు చేసి, కొత్త జ్యూరీతో విచారణను మొదటి నుంచి ప్రారంభించవచ్చు. లేదా నిందితుడితో ప్లీ అగ్రిమెంట్ పై చర్చలు జరపవచ్చు. ఆరోపణలను పూర్తిగా ఉపసంహరించుకోవడమనే మరో ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































