‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’

చార్లీ క్లార్క్ , బ్రిటన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్, నార్తర్న్ ఐలండ్
ఫొటో క్యాప్షన్, తనకున్న అనారోగ్యం కొన్నిసార్లు తన జీవితాన్ని నరకంలా మార్చిందని చార్లీ చెప్పారు.
    • రచయిత, మేరీ లూసీ కాన్నోల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

యుక్త వయసులో స్కూల్‌కు వెళ్లేటప్పుడు చార్లీ క్లార్క్ యూనిఫామ్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు.

శారీరక వైకల్యం కారణంగా ఏర్పడిన ఆత్మనూన్యత భావంతో ఆమె తోటి విద్యార్థుల కంట పడకుండా దాక్కునేవారు.

ఇంట్లో ఉన్నప్పుడు కూడా తన ఛాతీ భాగాన్ని ఎవరూ చూడకూడదని డ్రెస్సింగ్ గౌన్‌ను గట్టిగా చుట్టుకునేవారు. చివరికి తన సమస్య గురించి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు.

ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న చార్లీ పుట్టుకతో వచ్చే 'పెక్టస్ ఎక్స్‌కావటమ్' అనే ఛాతీ ఎముకల వైకల్యంతో ఏళ్లుగా జీవిస్తున్నారు.

ఈ సమస్య వల్ల ఛాతీ భాగం లోపలికి కుంగిపోయినట్లు లేదా గుంత పడినట్లు కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న చార్లీ ఈ సమస్య వల్ల తాను అనుభవించిన మానసిక, శారీరక వేదన "ఊహించలేనిది, విస్మరించలేనిది" అని చెప్పారు.

"నా చొక్కా కింద దాగి ఉన్న ఈ వైకల్యం, దీన్ని భరిస్తూ జీవించడం ఒకానొక సమయంలో నాకు నరకంలా అనిపించింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్కూల్లో ఆటలాడే సమయంలో తోటి అమ్మాయిలు తనకు "నాలుగు రొమ్ములు" ఉన్నాయని ఎక్కడ వెక్కిరిస్తారోనన్న భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులే తన టీనేజ్ జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకాలని ఆమె గుర్తుచేసుకున్నారు.

చార్లీ క్లార్క్ , బ్రిటన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్, నార్తర్న్ ఐలండ్
ఫొటో క్యాప్షన్, తన పరిస్థితి తీవ్రత గురించి సంవత్సరాల తరబడి చార్లీ తన తల్లిదండ్రులకు చెప్పకుండా దాచారు.

ఎవరికీ చెప్పుకోలేక..

"నా శరీర ఆకృతి వల్ల, అలాగే జనం నా ఛాతీ వైపు చూస్తూ చేసే వ్యాఖ్యల వల్ల స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలంటేనే అసహ్యం వేసే స్థాయికి చేరుకున్నాను" అని చార్లీ తెలిపారు.

ప్రతి 200 మందిలో ఒకరిని ప్రభావితం చేసే ఈ సమస్య వల్ల గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతోంది.

దీనివల్ల శ్వాస ఆడకపోవడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు తలెత్తి, ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

నార్తర్న్ ఐర్లాండ్‌లో పెక్టస్ సంబంధిత శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న 85 మందిలో చార్లీ ఒకరు.

వీరిలో చాలామంది రెండేళ్లుగా ఆపరేషన్ కోసం వేచి చూస్తుండగా ఐదుగురు మాత్రం ఐదేళ్లకు పైగా ఎదురు చూస్తున్నారు.

నార్తర్న్ ఐర్లాండ్‌లో కొందరు రోగులు "సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చిందన్న" విషయాన్ని ఆరోగ్య శాఖ అంగీకరించింది.

రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, "థొరాసిక్ సర్జరీ విభాగంపై ఇతర ఒత్తిళ్లు ఉండటం వల్ల వెయిటింగ్ సమయం పెరిగిందని" పేర్కొంది.

అయితే వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించేందుకు అదనపు శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని, ఫలితంగా గత మూడేళ్లలో అదనపు పెక్టస్ ఆపరేషన్లు జరిగాయని తెలిపింది.

"వేచి ఉన్న రోగుల సంఖ్య, వారి నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి దోహదపడే" మరో ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

చార్లీ క్లార్క్ , బ్రిటన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్, నార్తర్న్ ఐలండ్
ఫొటో క్యాప్షన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరమని ఆమె చెప్పారు.

'నాకు రోగనిర్ధరణ తప్పుగా చేశారు'

ఈ సమస్యను చిన్న వయసులోనే గుర్తిస్తే చాలావరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే చికిత్స అందించవచ్చు.

కానీ సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. పెక్టస్ రకం, దాని తీవ్రత, రోగి వయసును బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

గతంలో తనకు "తప్పుడు రోగనిర్ధరణ జరిగిందని, తనకు యాంగ్జైటీ సమస్య కూడా ఉందని చెప్పారని" చార్లీ వాపోయారు.

"ఒకసారి స్కానింగ్ సమయంలో నేను చొక్కా విప్పిన తర్వాత నా గుండె ఒత్తిడికి గురై స్కాన్‌లో కనిపించడం లేదని క్లినికల్ టెక్నీషియన్ చెప్పారు. ఆ తర్వాతే నన్ను థొరాసిక్ సర్జన్ వద్దకు పంపారు" అని ఆమె చెప్పారు.

అప్పటికే ఆమె వయసు 23 ఏళ్లు దాటడంతో తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే తన బాధను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిని కలిసినప్పుడు చార్లీ జీవితంలో ఒక కీలక మలుపు తిరిగింది.

చార్లీ క్లార్క్ , బ్రిటన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్, నార్తర్న్ ఐలండ్
ఫొటో క్యాప్షన్, పెక్టస్ వైకల్యం వల్ల తాను ఎదుర్కొన్న కష్టాల నుంచి డాక్టర్ కావాలని నియాల్ మెక్‌గోనిగల్ నిర్ణయించుకున్నారు.

తన కష్టాలే డాక్టర్ అయ్యేందుకు ప్రేరణ

నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ నియాల్ మెక్‌గోనిగల్ ఛాతీ ఎముకల వైకల్యాల చికిత్సలో నిపుణుడు.

చిన్నతనంలో పెక్టస్ వైకల్యంతో బాధపడిన ఆయన 17 ఏళ్ల వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

"స్కూల్లో నన్ను వింత మనిషి అని, వికృత జీవి అని పిలిచేవారు" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

"స్కూల్లో ఆటలు ఆడేందుకు బట్టలు మార్చుకోవాల్సి వస్తుందన్న భయంతో నేను ఆటలకు దూరమయ్యాను. నన్ను ఎంతో వేధించారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆ అనుభవమే నన్ను వైద్య రంగం వైపు నడిపించింది. సర్జరీపై, ముఖ్యంగా పెక్టస్ చికిత్సపై నాకు లోతైన ఆసక్తి కలిగింది" అని చెప్పారు.

నార్తర్న్ ఐర్లాండ్‌లో ఈ సమస్యకు సరైన గుర్తింపు లేదని ఆయన తెలిపారు. ఈ వ్యాధితో బాధ పడుతున్న వారు కాస్మెటిక్ సర్జరీ కోరుకుంటున్నారని కొట్టిపారేస్తారని, కానీ అది నిజం కాదని మెక్‌గోనిగల్ అన్నారు.

"ఈ సమస్య వల్ల ఊపిరితిత్తులు, గుండె పనితీరుపై తీవ్ర ఆంక్షలు ఏర్పడతాయని, అది మనిషిని నిస్సహాయులను చేస్తుందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి" అని ఆయన వివరించారు.

"దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే, శస్త్రచికిత్స లేని సేవల ద్వారా నయం చేయవచ్చు. కానీ నార్తర్న్ ఐర్లాండ్‌లో ఆ సదుపాయం లేకపోవడంతో మా యువత ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి వస్తోంది" అని చెప్పారు.

నిధుల కొరత కారణంగా నార్తర్న్ ఐర్లాండ్‌లో పరిమితంగా ఉన్న పెక్టస్ సర్జరీ సేవలు దెబ్బతిన్నాయని మెక్‌గోనిగల్ పేర్కొన్నారు.

చార్లీకి జరగబోయే శస్త్రచికిత్సలో, ఆమె గుండె, ఊపిరితిత్తులు తిరిగి తమ సహజ స్థానాలకు చేరుకునేలా ఛాతీలో రెండు లోహపు కడ్డీలను, రొమ్ము ఎముకలో ఒక లోహపు ప్లేట్‌ను అమర్చనున్నారు.

ఈ సమస్యపై అవగాహన కల్పించడానికే తాను ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని, తన 11 ఏళ్ల చెల్లెలితో సహా ఈ సమస్య ఉన్న ఇతరులకు సహాయం చేయడమే తన లక్ష్యమని చార్లీ చెప్పారు.

"నా చెల్లెలు కూడా నాలాగే ఇంతకాలం వేచి ఉండటం, తన జీవితం ఆగిపోవడం, తన పరిస్థితి ప్రాణాంతకంగా మారడం నాకు ఇష్టం లేదు" అని చార్లీ అన్నారు.

చార్లీ క్లార్క్ , బ్రిటన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్, నార్తర్న్ ఐలండ్
ఫొటో క్యాప్షన్, పెక్టస్ ఎక్స్‌కావటమ్‌ బాధితులకు వ్యాక్యూమ్ బెల్ థెరపీ శస్త్రచికిత్స అవసరం లేని చికిత్స. ఇది యువకులకు ఉత్తమంగా పనిచేస్తుంది.

'పెక్టస్ ఎక్స్‌కావటమ్' అంటే ఏమిటి?

"ఫన్నెల్ చెస్ట్" (ఛాతీలో గుంత) అని కూడా పిలిచే పెక్టస్ ఎక్స్‌కావటమ్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.

ఈ సమస్య ఉన్నవారిలో చాలామందికి ఇది పుట్టుకతోనే వస్తుంది.

ఇందులో రోగి రొమ్ము ఎముక లోపలికి వంగి, పక్కటెముకల వద్ద ఒక గుంతలా ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీ లోపలికి కుంగిపోయినట్లు కనిపిస్తుంది.

సాధారణంగా చిన్నతనంలో లేదా టీనేజ్ వయసులో ఇది స్పష్టంగా బయటపడుతుంది.

దీనికి ఉన్న చికిత్సలలో 'వాక్యూమ్ బెల్ థెరపీ' ఒకటి.

ఇందులో ఛాతీ కుంగిపోయిన భాగంపై ఒక సక్షన్ పరికరాన్ని ఉంచి, రొమ్ము ఎముకను క్రమంగా ముందుకు లాగుతారు.

ఛాతీ ఎముకలు మృదువుగా ఉండి, వైకల్యం తక్కువగా ఉన్న చిన్నపిల్లల్లో ఇది బాగా పనిచేస్తుంది.

మరొక చికిత్స 'కంప్రెషన్ బ్రేసింగ్'. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన పట్టీ లాంటి సాధనం అమరుస్తారు. ఇది టీనేజర్లలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ పెద్దయ్యాక ఛాతీ ఎముకలు గట్టిపడిన తర్వాత దీని ప్రభావం తక్కువగా ఉంటుంది.

తాము చేసిన కృషి ఫలితంగా 2023లో "పెక్టస్ కారినాటమ్ కోసం శస్త్రచికిత్స లేని బ్రేసింగ్" సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ తన ప్రకటనలో తెలిపింది.

"సరైన రోగులను ఎంచుకుని ఈ చికిత్స అందిస్తే, శస్త్రచికిత్స అవసరాన్ని నివారించవచ్చని" భావిస్తున్నట్లు పేర్కొంది.

"ఈ సేవ ప్రభావాన్ని మేము అంచనా వేస్తాము. దీనివల్ల కేవలం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నయమయ్యే రోగులకు ఆపరేషన్ థియేటర్ సమయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గత నెలలో, ఈ సమస్యపై చర్చించేందుకు యూకే నలుమూలల నుంచి వచ్చిన రోగులు, ఆరోగ్య నిపుణులు బెల్‌ఫాస్ట్‌లో సమావేశమయ్యారు.

చిన్న వయసులోనే చికిత్స అందించడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య వ్యవస్థకు డబ్బు ఆదా అవుతుందని పెక్టస్ మ్యాటర్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సైమన్ కెండాల్ అన్నారు.

"రోగి చిన్న వయసులో ఉండి, ఛాతీ ఎముకలు మృదువుగా ఉన్నప్పుడే చికిత్స అందిస్తే భవిష్యత్తులో పెద్ద ఆపరేషన్ల అవసరాన్ని నివారించవచ్చు" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)