‘నేను కొనుక్కున్న సమాధిలో ఇంకెవరినో ఖననం చేశారు’

మేరీ లేన్
ఫొటో క్యాప్షన్, మేరీ లేన్
    • రచయిత, సారా-మే బుసియెరి
    • హోదా, డీపింగ్ సెయింట్ జేమ్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

తన కోసం రిజర్వ్ చేసుకుని, డబ్బులు చెల్లించిన సమాధిలో పొరపాటున మరొకరిని ఖననం చేశారని ఒక మహిళ ఆరోపించారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని బయటకు తీసినట్లు చెప్పారు.

అయితే, ఈ ఘటన తర్వాత.. ఆ సమాధి పట్ల తాను 'మునుపటిలా భావించలేకపోతున్నానని' ఒక మహిళ చెప్పారు.

లింకన్‌షైర్‌లోని డీపింగ్ సెయింట్ జేమ్స్ సిమెట్రీలో... చనిపోయిన ఆమె తల్లిదండ్రుల సమాధుల వెనుకాల ఒక ప్లాట్‌ను బుక్ చేసుకున్నట్లు 69 ఏళ్ల మేరీ లేన్ చెప్పారు.

ఆ ‘పొరపాటుకు కారణమైన’ పారిష్ కౌన్సిల్ తీరు తనకు తీవ్ర 'దిగ్భ్రాంతికి' గురిచేసిందని ఆమె చెప్పారు.

ఈ తప్పును సరిదిద్దేందుకు.. లేన్ సమాధిలో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసేందుకు ఈ ఏడాది అక్కడి అధికారులు అనుమతి మంజూరు చేశారు.

తప్పు జరిగినట్లు ఒప్పుకుంటున్నట్లు డీపింగ్ సెయింట్ జేమ్స్ పారిష్ కౌన్సిల్ తెలిపింది. దీనివల్ల రెండు కుటుంబాలకు కలిగిన మనోవేదనకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది. సమాధి ప్రాంతాన్ని తిరిగి లేన్‌కు ఇచ్చినట్లు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2013లో తన తల్లి సమాధికి వెనుకాల తనను ఖననం చేసుకునేందుకు ప్లాట్‌ను కొనుగోలు చేశానని మేరీ లేన్ లేన్ చెప్పారు. బీబీసీ పరిశీలించిన 'డీపింగ్ సెయింట్ జేమ్స్ పారిష్ కౌన్సిల్' పత్రాలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నాయి.

''నేను ఈ ల్యాండ్‌ను కొనుగోలు చేశాను. అప్పుడు నా తల్లిదండ్రులకు సమీపంలో ఖననం చేసుకోవచ్చని అనుకున్నాను'' అని మేరీ లేన్ తెలిపారు.

''నా ప్రియమైన వాళ్లతో పాటు నేను ఉండలేనప్పుడు, ఇక ఇక్కడ నన్ను ఖననం చేయడంలో ఎలాంటి అర్థం లేదు" అని లేన్ అన్నారు.

2023 ప్రారంభంలో, తాను ఆ స్మశానవాటికను సందర్శించగా తన ప్లాట్‌లో వేరే ఎవరినో ఖననం చేసినట్లు చూశానని లేన్ చెప్పారు.

"నిజం చెప్పాలంటే.. నేను అక్కడ అలాగే నిలబడిపోయాను, ఏమి చేయాలో నాకు తోచలేదు" అని ఆమె ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

మేరీ లేన్
ఫొటో క్యాప్షన్, తన తల్లిదండ్రుల సమాధులను ఇక సందర్శించడం తన వల్ల కాదని మేరీ లేన్ చెబుతున్నారు

"నా సమాధిలో నాకు తెలియని వ్యక్తిని ఖననం చేశారు"

తన సమాధిలో ఖననం చేసిన వ్యక్తి మృతదేహాన్ని వేరే దగ్గరికి తరలించేందుకు అనుమతి పొందేందుకు తనకు మూడేళ్లకు పైగా పట్టిందని మేరీ లేన్ చెప్పారు. అయితే, తన తల్లిదండ్రుల సమాధుల దగ్గర వేరే స్థలం ఏదీ అందుబాటులో లేకపోవడంతో, తనకు "వేరే మార్గం లేకుండా పోయింది" అని ఆమె పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌లో స్మశానవాటికలో సమాధి చేసిన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీయాలంటే, న్యాయశాఖ నుంచి మతపరమైన ఆచారాల ప్రకారం అనుమతి అవసరం. సాధారణంగా మృతుని సమీప బంధువుల సమ్మతి కూడా అవసరం.

డీపింగ్ సెయింట్ జేమ్స్ పారిష్ కౌన్సిల్‌కు న్యాయ శాఖ పంపిన లేఖలో.. మృతుని సమీప బంధువుల మతపరమైన, నైతిక కారణాలతో అభ్యంతరం తెలిపినప్పటికీ.. వారి సమ్మతి లేకుండానే మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.

తప్పును సరిదిద్దేందుకు మరో దారి లేకపోవడంతో.. మృతదేహాన్ని వెలికితీసేందుకు అనుమతి జారీ చేసినట్లు న్యాయ శాఖ వివరించింది. మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది

ఈ మొత్తం ఘటన తన భార్యపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని మేరీ లేన్ భర్త ఎరిక్ లేన్ చెప్పారు.

''ఇలాంటి పొరపాటు జరగకుండా నివారించడానికి పారిష్ కౌన్సిల్ సరైన రికార్డులను నిర్వహించడంలో విఫలమైంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పొరపాటే మళ్లీ జరగవచ్చు'' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలపై, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై పారిష్ కౌన్సిల్‌ను బీబీసీ ప్రశ్నించింది. అయితే, దీనిపై పారిష్ కౌన్సిల్ స్పందించలేదు.

ఎరిక్, మేరీ లేన్
ఫొటో క్యాప్షన్, ఈ పొరపాటు మళ్లీ జరగవచ్చని తాము ఆందోళన చెందుతున్నట్లు ఎరిక్, మేరీ లేన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మేరీ లేన్‌కు ఈ సిమెట్రీకి వెళ్లడం ఇష్టం లేదని ఆమె భర్త ఎరిక్ అన్నారు.

''ఈ ప్రదేశంతో ప్రస్తుతం చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోగలనో లేదో అనేది నాకు తెలియదు'' అని తెలిపారు.

తమ స్థలం ఖననం చేశాక బయటకు తీయించిన మృతదేహానికి సంబంధించిన కుటుంబీకులకు మేరీ లేన్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటన వల్ల ఆ కుటుంబం ఎంతటి వేదనకు గురై ఉంటుందో తనకు అర్థమవుతోందని ఆమె పేర్కొన్నారు.

''ఆ కుటుంబాన్ని నేను కలవాలనుకుంటున్నా'' అని చెప్పారు.

''ఆ కుటుంబంతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని పారిష్ కౌన్సిల్‌ను పదేపదే అభ్యర్థించాను. కానీ, ప్రతిసారి వారు తిరస్కరించారు'' అని తెలిపారు.

''కానీ, ఇప్పుడు ఆ స్మశానవాటికకు వెళ్లడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. అంతకుముందు మాదిరి తరచూ మేం అక్కడికి వెళ్లడం లేదు'' అన్నారు.

ఈ విషయంపై తన వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయన్నారు.

"దీనికి 3 ఏళ్ల 3 నెలల సమయం పట్టకూడదు. దీని కోసం మేం ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండకూడదు" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)