ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

ఫొటో సోర్స్, Kevin Shoesmith/BBC
- రచయిత, కెవిన్ షూస్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
కార్ల్ బుష్బీ 1998లో ఇంటి నుంచి సుదీర్ఘ ప్రయాణానికి బయల్దేరారు. ఇప్పుడు ఆయన తన గమ్యానికి చేరువయ్యారు. నాలుగు ఖండాల్లో సాగిన ఈ సాహస యాత్రలో ఎన్నో అడ్డంకులను అధిగమించారు. అయితే ఈ ప్రయాణం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు తన జీవితం పూర్తిగా మారనుందని ఆయన భావిస్తున్నారు.
మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ 1998లో తన 29 ఏళ్ల వయసులో చిలీలోని పుంటా అరెనాస్ నుంచి తన స్వస్థలమైన యూకేలోని హల్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలి నడకనే చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఆయన తనకు తానుగా రెండు నియమాలు విధించుకున్నారు.
ప్రయాణం పూర్తయ్యే వరకు బ్రిటన్‌కు తిరిగి వెళ్లకూడదు. అంటే మధ్యలో కాలినడకను ఆపి మరో ప్రయాణసాధనం ద్వారా బ్రిటన్‌కు చేరుకోకూడదని నిర్ణయించుకున్నారు.
అలాగే గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించకూడదు.
ఇప్పుడు 57 ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. ప్రయాణంలో చివరి కొన్ని మైళ్లు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డారియన్ గ్యాప్‌లోని దట్టమైన అడవులను దాటారు. గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని కాలినడకన దాటారు. కొన్ని వారాల క్రితమే ఇంగ్లిష్ ఛానల్‌ను ఈదుకుంటూ బ్రిటన్ చేరుకున్నారు.


ఫొటో సోర్స్, Karl Bushby
ఈ సుదీర్ఘ ప్రయాణం ముగిసిన తర్వాత ఆయనకు స్వాగతం పలికేందుకు 36 ఏళ్ల కుమారుడు ఆడమ్, ఇప్పటివరకు ఎప్పుడూ కలవని 12 ఏళ్ల మనవరాలు, తండ్రి, సోదరులు ఎదురుచూస్తున్నారు. 28 ఏళ్ల క్రితం తాను వదిలి వెళ్లిన చిన్ననాటి ఇంటి వద్ద తల్లి స్వాగతం పలకనున్నారు.
"మనం ఇప్పుడు పూర్తిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. త్వరలోనే అది స్పష్టంగా తెలుస్తుంది" అని ఇంగ్లండ్‌లోని గ్రామీణ లింకన్‌షైర్ ప్రాంతంలో తనను కలిసిన బీబీసీ ప్రతినిధితో బుష్బీ అన్నారు.
"ప్రస్తుతం నేను చేస్తున్న పనిలోనే ఉన్నాను కాబట్టి సౌకర్యంగానే ఉంది. కానీ త్వరలోనే ఇదంతా ఆగిపోతుంది" అని చెప్పారు.
ఆయన మాటలకు సరిగ్గా సరిపోయేలా ఆ ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉన్న భారీ తోపుడుబండి 'ది బీస్ట్' కూడా ఓ సమస్య తెచ్చిపెట్టింది. ప్రయాణానికి అవసరమైన సామగ్రిని అందులోనే తీసుకెళ్తారు. ఈ దశలో కొన్ని మైళ్లు నడిచిన తర్వాత దాని టైరు పంక్చర్ అయింది.
"చాలా కాలం తర్వాత ఇలా జరిగింది. ఇప్పుడు కాస్త ఇబ్బందే" అంటూ టైరు బాగు చేసేందుకు ప్రయత్నించారు.
రోడ్డు పక్కన హడావుడిగా మరమ్మతులు చేస్తున్న సమయంలో నవ్వుతూ.. "వర్షం పడుతూ ఉంటే బహుశా ఇంకా ఎక్కువగా విసుక్కునేవాడినేమో" అన్నారు.
"డోవర్‌కు చేరుకున్న తొలి రోజుల్లో వర్షం మొదలైంది. కానీ, వాతావరణం పరిశీలిస్తే మేం సరైన సమయాన్ని ఎంచుకున్నాం. ఛానల్ ఈతకు అనువుగా వరుసగా మూడు రోజులు మంచి వాతావరణమే ఉంది" అని కార్ల్ బుష్బీ గుర్తుచేసుకున్నారు.
టైరు పంక్చర్ వంటి భౌతిక అడ్డంకులను అధిగమించడం బుష్బీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ ప్రయాణం తర్వాత ఎదురుకాబోయే పరిస్థితులకు ఆయన సిద్ధంగా ఉన్నారా?

ఫొటో సోర్స్, Kevin Shoesmith/BBC
"ఇప్పుడు మళ్లీ నేనెవరో తెలుసుకోవాలి"
"ఇప్పటివరకు నేను ఎవరిని, నాలో ఉన్న లక్షణాలు ఏమిటి అనే విషయాలన్నీ మారనున్నాయి. అదే నాకు సమస్య కావచ్చు. నా గుర్తింపుపై మళ్లీ సందిగ్ధత ఏర్పడుతుంది. ఎందుకంటే నా జీవితంలో సగభాగం కార్ల్ అంటే ఒక సాహస యాత్రికుడు అనే గుర్తింపే ఉంది" అని బుష్బీ అన్నారు.
"ఇప్పుడు మళ్లీ నేను ఎవరో తెలుసుకోవాలి. జీవితానికి అర్థం ఏమిటి? ఆ అర్థాన్ని, లక్ష్యాన్ని ఎలా వెతుక్కోవాలి? ఒక్కసారిగా నా జీవితంలో ఏర్పడబోయే శూన్యాన్ని ఎలా పూరించుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. ప్రతిరోజూ నా ఆలోచనలు, నా శక్తి మొత్తం ఈ ప్రయాణం చుట్టూనే తిరిగాయి. ఇదే నా లక్ష్యంగా మారిపోయింది" అన్నారు.
"ఓ సామెత ఉంది. కలలను నెరవేర్చుకోలేని వ్యక్తి కంటే, తన కలలన్నింటినీ నెరవేర్చుకున్న వ్యక్తే ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆ తర్వాత ఏం చేయాలి?" అని బుష్బీ తన మనసులోని మాటలను వెల్లడించారు.
ఇంగ్లిష్ ఛానల్‌ను ఈదుకుంటూ డోవర్ చేరుకున్న తర్వాత ఆయనతో కలిసి నడిచేందుకు అమెరికాకు చెందిన సుదూర నడక యాత్రికురాలు ఏంజెలా మ్యాక్స్‌వెల్ కూడా వచ్చారు.
"ప్రయాణం ముగిసిన తర్వాత కార్ల్‌కు రహదారిపై గడిపిన రోజులెంతగా గుర్తొస్తాయో ఆయనకే ఆశ్చర్యం కలగవచ్చు. కార్ల్‌కు నడవడం అంటే అంత ఇష్టం ఉండదని మేం సరదాగా చెప్పుకుంటాం. కానీ, ఆయనకు ఈ ప్రయాణం అంటే ఇష్టం. అందులోని ఉత్సాహం, లక్ష్యం ఆయనకు ఎంతో ముఖ్యం" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Karl Bushby
తన స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజల్లో తనపై ఇంత ఆసక్తి ఉంటుందని బుష్బీ ఊహించలేదు.
"ప్రజల నుంచి వస్తున్న స్పందన దాదాపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దారిలో చాలామంది నన్ను గుర్తుపట్టారు. అది బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు నన్ను చూసి మరీ ఎక్కువగా ఉత్సాహపడుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకలా స్పందిస్తున్నారో నాకు అర్థం కాదు. నా దృష్టిలో నేను కేవలం నడుచుకుంటూ వెళ్తున్న ఒక సాధారణ వ్యక్తిని" అని చెప్పారు.
ఇంతలో ఓ కారు రోడ్డు పక్కన ఆగింది. అందులోని వ్యక్తి ఆయనను చూసి.. "మీరు ఆ కార్ల్ బుష్బీనేనా?" అని అడిగారు. అనంతరం ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగారు.
తన ప్రయాణం ఆధ్యాత్మిక అన్వేషణ కోసం కాదని, తనను తాను తెలుసుకునే ప్రయత్నం కూడా కాదని బుష్బీ మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఆయన కథపై ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆసక్తి ఎందుకు ఏర్పడిందని అడిగినప్పుడు.. మనలో చాలామందికి సాహస యాత్రలు చేయాలనే కోరిక ఉంటుందని, కానీ కొద్దిమంది మాత్రమే ఆ కోరికను నిజం చేసుకుంటారని అన్నారు.
"అదే కారణమనుకుంటున్నా. లక్షలాది మంది కలలు కనే జీవితాన్ని నేను జీవించాను. ఇంటి నుంచి బయల్దేరి, వెనక్కి చూడకుండా అలా ముందుకు సాగిపోవాలని చాలామందికి ఉంటుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Karl Bushby
భార్యతో వివాహ బంధం ముగిసిన తర్వాత తనకు ఈ సుదీర్ఘ నడక యాత్ర చేసే అవకాశం వచ్చిందని బుష్బీ తెలిపారు. ఆ సమయంలో ఆయన భార్య తన కుమారుడిని తీసుకుని ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిపోయారు. అయితే రోడ్లపై సాగే జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
"రోజువారీ సమస్యలతోనే నా జీవితం గడిచిపోతుంది. టైర్లు పంక్చర్ కావడం, ఉతుక్కోవడానికి ఓ చోటు వెతుక్కోవడం.. ఇవే నా పనులు. వర్షంలో నడవాలి. అంతులేని దూరం ప్రయాణించాలి. బయటకు కనిపించినంత గొప్పగా ఈ జీవితం ఉండదు" అని వివరించారు.
28 ఏళ్లలో తాను దాదాపు 15 ఏళ్లు మాత్రమే నడక యాత్రలో గడిపినట్లు బుష్బీ చెప్పారు. మిగిలిన సమయంలో ఎక్కువగా మెక్సికోకు వెళ్లి ఉండేవారు. అక్కడ జీవన వ్యయం తక్కువగా ఉండటంతో ప్రయాణాల మధ్య కొంతకాలం అక్కడే గడిపేవారు.
వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాన్ని కొనసాగించడం వంటి పనుల్లో మిగిలిన సమయం గడిచిపోయిందని తెలిపారు. కొవిడ్-19 సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షల వల్ల కూడా యాత్ర ఆలస్యమైంది.
ప్రయాణం పూర్తయ్యే వరకు బ్రిటన్‌కు తిరిగి వెళ్లకూడదని పెట్టుకున్న నియమం కారణంగా ఆయన కుటుంబ సభ్యులను స్వదేశంలో కలవలేకపోయారు. అరుదైన సందర్భాల్లో ఇతర దేశాల్లో కుమారుడిని, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులను కలుసుకునేవారు.
"కుటుంబం అంటే కుటుంబమే కదా! వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉంటారు. కానీ, దూరం పెరిగితే సంబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కొంతకాలానికి ఒకరికొకరు దూరమవుతారు. ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని పరిస్థితి వస్తుంది. ప్రేమ విషయానికి వస్తే మాత్రం ముందే సిద్ధంగా ఉండాలి. అక్కడ మీకు ఎదురుదెబ్బ తప్పదు. అది అనుకున్నట్లు సాగదు" అని బుష్బీ తన అనుభవాలను పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Karl Bushby
'వయసు పెరిగింది అంతే..'
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత డోవర్‌కు చేరుకున్న బుష్బీ తొలిసారి ఫిష్ అండ్ చిప్స్, మెత్తగా ఉడికించిన బఠానీల వంటకాన్ని రుచి చూశారు. ప్రపంచంలో మరెక్కడా బ్రిటన్‌లో తయారు చేసినంత రుచిగా ఈ వంటకం ఉండదని ఆయన అన్నారు. అయితే ఆహారం వంటి విషయాలను పక్కనపెడితే.. బ్రిటన్‌ను పెద్దగా మిస్ కాలేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
"ప్రపంచం నాకు ఆహ్వానం పలుకుతోంది. ఎన్నో కొత్త విషయాలు, ఆకర్షణీయమైన అనుభవాలు నా దృష్టిని మళ్లించాయి" అని చెప్పారు.
తన వయసుకు తగ్గట్టుగా తాను ముసలివాడిని కాలేదని బుష్బీ భావిస్తున్నారు.
"నా వయసు పెరిగింది. కానీ అంత పెద్దవాడిననే భావన నాకు లేదు. మానసికంగా చూస్తే నా వయసు కంటే చాలా చిన్నవాడిలా అనిపిస్తుంది. అమెరికా ఖండాల్లో నా ప్రయాణం మొదలుపెట్టినప్పటి వ్యక్తిగానే నన్ను నేను భావిస్తా" అని అన్నారు.
"నాలో సాహస యాత్రల పట్ల ఆసక్తి ఇంకా అలాగే ఉంది" అని చిరునవ్వుతో చెప్పారు.

ఫొటో సోర్స్, Kevin Shoesmith/BBC
ఈ ప్రయాణం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలుసుకునే అవకాశం కూడా ఆయనకు లభించింది.
"వ్యక్తిగతంగా నేను మనుషుల్లోని అత్యుత్తమ లక్షణాలను చూశాను. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మానవత్వంపై నా నమ్మకాన్ని మరింత బలపరిచింది. అపరిచితులు చూపిన దయ వల్లే నా ప్రయాణం సాధ్యమైంది. ప్రపంచం సహకారం లేకపోతే నేను ఈ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయేవాడిని" అని తెలిపారు.
స్పాన్సర్లు, పుస్తక ఒప్పందాలు లభించకముందు తాను డబ్బుల్లేని బ్యాక్‌ప్యాకర్‌గా ఉండేవాడినని బుష్బీ చెప్పారు. ఇతరులు ఇచ్చే విరాళాలపై ఆధారపడటంతో పాటు, రోడ్డు పక్కన పడేసిన ఆహారాన్ని కూడా తిని జీవించాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
సాహస యాత్రలు చేయాలనుకునే వారికి ఆయన ఓ సలహా ఇచ్చారు.
"ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ చేయగలరు. కొంచెం ఆత్మవిశ్వాసం ఉంటే చాలా దూరం వెళ్లగలరు. ఏమీ చేయకుండా ఉంటే ఏదీ సాధించలేరు" అన్నారు.
చివరగా.. 29 ఏళ్ల వయసులో చిలీకి బయల్దేరిన మీకు మీరు ఏం సలహా ఇస్తారని అడిగితే..
"అతను నా మాట వినడు. అతనికి ఏమీ చెప్పకూడదు. కేవలం నవ్వుతూ ఉండనివ్వాలి" అని బుష్బీ సమాధానమిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























