ఈ నగరానికి ఏమైంది పార్ట్-2 రివ్యూ: 8 ఏళ్ల నాటి కల్ట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'ఇఎన్ఇ' మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?

ఫొటో సోర్స్, ENE Repeat insta
- రచయిత, జిఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఈ నగరానికి ఏమైంది వచ్చి 8 ఏళ్లయింది. అదో కల్ట్ మూవీ. ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్‌లో దానిదే హవా.
మళ్ళీ ఇపుడు ఇఎన్ఇ రిపీట్ అంటూ పార్ట్-2 వచ్చింది. మరి దర్శకుడు తరుణ్‌భాస్కర్ మ్యాజిక్ రిపీట్ చేశాడా?
కథ ఏమంటే పార్ట్-1 లోని అదే నలుగురు స్నేహితులు. కానీ ఈ సినిమాలో ఒక నటుడు మారాడు. కార్తీక్‌గా శ్రీనాధ్ మాగంటి వచ్చారు. మిగిలిన వివేక్ (విశ్వక్సేన్), కౌశిక్ (అభినవ్ గోమఠం) ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) సేమ్.
ఈ నలుగురు కలిసి ఒక సినిమా తీస్తారు. అది డిజాస్టర్. అప్పులు తీర్చుకోవడానికి నానా తిప్పలు పడతారు.
వివేక్ ఒక వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీలో, కౌశిక్ చెంపదెబ్బలు తినే నటుడిగా, ఉపేంద్ర సినిమా ఎడిటర్‌గా, కార్తీక్ కెమెరామన్‌గా పనిచేస్తుంటారు. ఇది లీడ్.

ఎనిమిదేళ్ళు గడిచాయి. కీర్తన ఒక డాక్టర్. ఆమె తండ్రి ప్రియదర్శిని రామ్ బాగా పేరున్న డాక్టర్. చాలా స్ట్రిక్ట్. కీర్తనకి సినిమాల్లో కెమెరా వుమన్‌గా పనిచేయాలని కోరిక. తండ్రికి తెలియకుండా కార్తీక్‌తో పనిచేస్తూ ఉంటుంది. కార్తీక్‌కి ఆమె అంటే చాలా ఇష్టం.
కీర్తనకి ఒకరోజు పెళ్లిచూపులు జరిగి ఇంకో డాక్టర్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి కాబోయే పెళ్ళికొడుకుకి బ్యాచిలర్ పార్టీ ఇస్తారు.
అక్కడ జరిగిన గొడవతో కథ మారిపోతుంది. కీర్తన తండ్రి వీళ్ళకి ఒక ఛాలెంజ్ విసురుతాడు. అదేంటి? చివరికి ఏమైంది.

ఫొటో సోర్స్, ENE Repeat insta
ఈ సినిమాలో కథగా చెప్పుకునేది ఏమీలేదు. కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా వస్తూ మనల్ని నవ్విస్తూ ఉంటాయి. దీన్ని సర్కస్ ఫీట్ స్క్రీన్‌ప్లే అంటారు. తరుణ్‌భాస్కర్‌కి ఈ ఫీట్ చాలా ఇష్టం. తాడు మీద సక్సెస్‌ఫుల్‌గా నడిస్తే అందరూ ఆశ్చర్యంగా చూసి చప్పట్లు కొడతారు. తేడా వస్తే నవ్వుతారు. కిందపడడం కూడా తరుణ్‌భాస్కర్‌కి కొత్తకాదు. ఈ సినిమాలో అక్కడక్కడ అడుగులు తడబడినా విజయవంతంగా ఫీట్ పూర్తిచేశాడు.
రైటింగ్ గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రాసలు, పంచ్‌లు కాదు, జెన్ జికి కనెక్టయ్యే వన్‌లైనర్స్, కొన్ని ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్యాక్డ్గా ఉంటాయి. తరుణ్ కెరీర్లోనే బెస్ట్ రైటింగ్.
నటన విషయానికొస్తే అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్‌తో చెడుగుడు ఆడేశాడు. ఫస్టాఫ్‌లో పబ్ సీన్, సెకండాఫ్‌లో బీచ్ షూటింగ్‌కి డబ్బులు ఇచ్చేయవచ్చు. ఈ రెండు సీన్లు ఇంచుమించుగా సింగిల్ టేక్‌లో తీయడం విశేషం.
విష్వక్సేన్కి ఈ క్యారెక్టర్ డెడ్ ఈజీ. మామూలుగా అయితే కొంచెం అతి చేస్తాడు కానీ ఇక్కడ మాత్రం చాలా బాలెన్స్డ్గా ఉన్నాడు. సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించాడు. వెంకటేష్ కాకుమాను, మాగంటి శ్రీనాధ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫొటో సోర్స్, ENE Repeat insta
శివాత్మికకి హీరోయిన్గా గుర్తుపెట్టుకునే పాత్ర దొరికింది. ప్రియదర్శిని రామ్ మంచి నటుడు. ఆయన జర్నలిజంలో బిజీగా ఉండి నటనకి దూరమైనట్టున్నాడు. ఇండస్ట్రీ ఆయన్ని వదులుకుందో, ఆయనే ఇండస్ట్రీని వదులుకున్నాడో తెలియదు. చిన్నదే అయినా కరుణకుమార్ తన పాత్రలో బాగా నటించాడు.
సంగీతం, కెమెరా రెండూ బావున్నాయి. ఎడిటింగ్‌లో సులభంగా 20 నిమిషాలు లేపేయవచ్చు. ప్రియదర్శిని రామ్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసే సీన్ అవసరం ఏమిటో బుర్రగోక్కోవాలి.
పార్ట్-1 వచ్చి 8 ఏళ్లయింది. అప్పటికి ఇప్పటికీ కాలం మారింది. మధ్యలో కరోనా వచ్చి ప్రేక్షకుడి కళ్ళు తెరిపించింది. అప్పటికంటే ఇప్పుడే పార్ట్ 2 కనెక్టయ్యే అవకాశముంది.
రెగ్యులర్ ఫార్మాట్ కొలతలకి ఇది ఇమడదు. బిగినింగ్, మిడిల్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ ఈ లెక్కలుండవు. స్క్రీన్ మీద ఆ నలుగురు లాజిక్ లేని మ్యాజిక్ చేస్తూ ఉంటారు. కాసేపు నవ్వుకోవాలి. మెసేజ్ ఉండదు ఓన్లీ కామెడీ డోసేజ్. ఇదో టైప్ సెటైర్.
సెకండాఫ్‌లో వచ్చే ఎలుగుబంటి ఎపిసోడ్ గతంలో విఠలాచార్య సినిమాల్లో చూసిందే. ఈ జనరేషన్‌కి కొత్త.
అన్నిటికంటే రిలీఫ్ ఏమంటే ఈమధ్య సినిమాలో రక్తం చూసి చూసి అలసిపోయాం. ఇది నాన్ వయొలెన్స్ మూవీ.
ప్లస్ పాయింట్స్
- అభినవ్ గోమఠం కామెడీ
- గుడ్ రైటింగ్
- జెన్ జి మూవీ
మైనస్ పాయింట్స్
- మొదటి 20 నిమిషాలు
ఫైనల్‌గా ఇది కొంచెం కంగాళీగా అనిపించే సూపర్బ్ కామెడీ.
(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























