'నాకు క్యాన్సర్ లేకపోయినా 11 ఏళ్లు కీమో థెరపీ చేశారు, నా జీవితం మొత్తం తలకిందులైంది'

- రచయిత, డేవిడ్ లంబ్, వనెస్సా పియర్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
బెక్కీ జోన్స్ 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెకు ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఎక్కువకాలం బతకదని చెప్పారు.
అప్పటికి బెక్కీ తన పార్టనర్‌ను కలిసి కొద్దికాలమే అయింది. పోలీసు శాఖలో ఉద్యోగం చేయాలన్నది ఆమె కల. కానీ ఒక్కసారిగా ఆమె భవిష్యత్తు చీకటిమయమైంది.
సీనియర్ క్యాన్సర్ నిపుణులు చేసిన ఆ నిర్ధరణ కారణంగా ఆమెకు 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చికిత్స కొనసాగింది. అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
తరచూ వాంతులు, వికారం వంటి సమస్యలతో ఆమె బాధపడేవారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయేవారు. కెరీర్‌కు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎప్పుడూ కత్తి మీద సాము చేస్తున్నట్టే జీవించాల్సి వచ్చేది అని చేప్పారు.
ఇప్పుడు ఆమె వయసు 34 ఏళ్లు. తనకు అసలు క్యాన్సర్ లేదని, స్టెరాయిడ్లతో చికిత్స చేయగలిగే మెదడు వాపు మాత్రమే ఉందని ఇటీవలే ఆమెకు తెలిసింది.

దీర్ఘకాలంగా లేదా అవసరం లేకపోయినా క్యాన్సర్ చికిత్స అందించారనే ఆరోపణలతో యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ అండ్ వార్విక్‌షైర్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌పై కేసులు వేసిన 40 మందికి పైగా రోగుల్లో జోన్స్ కూడా ఒకరు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి.
"కీమోథెరపీ తీసుకోకపోతే నేను చనిపోతానని పదేపదే చెప్పారు" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
యువతిగా ఉన్నప్పుడు తాను జీవితాంతం టెమోజోలోమైడ్ (టీఎంజెడ్) అనే కీమోథెరపీ మెడిసిన్‌ను తీసుకోవాల్సి ఉంటుందని కోవెంట్రీలోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ చెప్పారని జోన్స్ తెలిపారు.

ఫొటో సోర్స్, Becky Jones
అయితే అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఆ మెడిసిన్‌ను ఆరు నెలల వ్యవధిలో ఆరు సైకిళ్లుగా మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు.
తనకు చేయించిన అనేక స్కాన్లలో ట్యూమర్ ఉన్నట్లు ఆధారాలు కనిపించకపోవడంపై ఆమె ప్రశ్నించగా, అది కంటికి కనిపించే ట్యూమర్ కాదని కన్సల్టెంట్ చెప్పినట్లు జోన్స్ తెలిపారు.
2025లో ఆ ట్రస్ట్‌లో ప్రొఫెసర్ బ్రౌన్‌కు సంబంధించిన క్యాన్సర్ కేసులను సమీక్షించడం ప్రారంభమైన సమయంలోనే ఆమె అసలు విషయం తెలుసుకున్నారు.
"నాకు ఎప్పుడూ బ్రెయిన్ ట్యూమర్ లేదు. తప్పుడు నిర్ధరణ చేశారు. నా జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండా ఈ చికిత్స తీసుకున్నాను. చెప్పాలంటే ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు" అని జోన్స్ అన్నారు.
బ్రౌన్ దగ్గర చికిత్స పొందిన మరికొందరు రోగులు కూడా తాము సంవత్సరాల పాటు టీఎంజెడ్ అనే మెడిసిన్ తీసుకున్నామని బీబీసీకి తెలిపారు. దీనివల్ల తమకు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పారు.
ఒక రోగి ఆ ఔషధం వల్ల తాను సంతానలేమికి గురయ్యానని అనుమానిస్తున్నట్లు చెప్పారు. మరో రోగి అవసరం లేని చికిత్సను వంద సైకిళ్ల వ్యవధిలో తీసుకున్న తర్వాత లుకేమియాకు గురైనట్లు వెల్లడించారు.
రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నిర్వహించిన నివేదిక ప్రాథమిక ఫలితాల ప్రకారం, ప్రయోజనం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆ ఆసుపత్రిలో టీఎంజెడ్‌ను ఎక్కువ కాలం వరకు రోగులకు అందించేవారు.
అంతే కాకుండా ఆసుపత్రిలో సిబ్బంది వైఫల్యాలు రోగుల నమ్మకాన్ని వమ్ము చేసిందని నివేదిక పేర్కొంది. 10 నుంచి 15 ఏళ్ల పాటు నిరంతరం నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీని పొందుతున్న రోగులను ఆంకాలజీ ఫార్మసీ బృందాలు ఎందుకు ప్రశ్నించలేదని కూడా నివేదిక సందేహం వ్యక్తం చేసింది.
వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించబోమని యూహెచ్‌సీడబ్ల్యూ తెలిపింది. అయితే టీఎంజెడ్ ఔషధాన్ని సూచించడం, ఉపయోగించడంపై మరింత పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

ఫొటో సోర్స్, Supplied
2012లో కోవెంట్రీ సిటీ స్టేడియంలో సీసీటీవీ ఆపరేటర్‌గా జోన్స్ జీవితం అప్పుడే మొదలైంది. తనకు మంచి భవిష్యత్తు ఉందనుకున్నారామె. అక్కడే స్టీవార్డ్‌గా పనిచేస్తున్న తన భాగస్వామి పీట్‌ను కలిశారు. అయితే కొద్దికాలానికే ఆమెకు తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో వైద్య సహాయం కోరారు.
ఒక ప్రైవేట్ న్యూరోసర్జన్ ఆమెకు బ్రెయిన్ బయాప్సీ నిర్వహించారు.
బయాప్సీ ఫలితాలు రాకముందే ప్రొఫెసర్ బ్రౌన్ ఆమెకు గ్రేడ్ ఫోర్ గ్లియోబ్లాస్టోమా ఉందని నిర్ధరించారని బ్రాబ్నర్స్ అనే లా ఫర్మ్ సభ్యురాలు ఫియోనా టిన్స్‌లీ తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన బ్రెయిన్ క్యాన్సర్ రకాలలో ఒకటి.
రిటైర్ అయిన ప్రొఫెసర్‌ను సంప్రదించేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది.

కీమోథెరపీ చికిత్స తీసుకున్న ఆ సంవత్సరాలను జోన్స్ భయంకరమైనవిగా వర్ణించారు.
"నిత్యం వికారం, కడుపునొప్పి, నోటిలో పుండ్లు, ప్రతిరోజూ తీవ్రమైన అలసట. అంతా భయంకరంగా ఉండేది" అని అన్నారు జోన్స్.
ఇన్ఫెక్షన్ అవుతుందనే భయంతో ఆమె విందులకు, కుటుంబ సమావేశాలకు ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆ ఔషధం ఆమె జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసినట్లయింది.
ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా మొదట రద్దు చేసారు. ఆ తర్వాత కొన్ని పరిమితులు విధించారు.
"చికిత్సకు ముందు నేను జిమ్‌కు వెళ్లేదాన్ని. పరుగెత్తేదాన్ని. నేను, పీట్ తరచూ తినేందుకు బయటకి వెళ్ళేవాళ్లం. కానీ ఆ తర్వాత అవేవీ చేయలేకపోయా" అని ఆమె అన్నారు.
గర్భం దాల్చే అవకాశంలేదని కూడా ఆమెకు, ఆమె భర్తకు చెప్పారు.
"తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లిద్దరూ మా జీవితంలో అద్భుతాలేనని ఆయన నాకు చెప్పారు" అని ఆమె అన్నారు.
ఆమె చికిత్స దశాబ్ద కాలానికి పైగా కొనసాగింది. అయితే 2024లో అకస్మాత్తుగా ఒక వైద్యుడి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఇకపై తన కీమోథెరపీ చికిత్సను నిలిపివేస్తున్నట్లు ఆ వైద్యుడు చెప్పారు.
"ఎందుకు ఆపుతున్నారో కారణం చెప్పలేదు. ఇయాన్ బ్రౌన్ రిటైర్ అయ్యారని చెప్పారు. ఆ విషయం నేను అప్పుడే మొదటిసారి వినడం" అని జోన్స్ తెలిపారు.
‘‘మీకేమైనా సందేహాలుంటే మరో కొత్త ఆంకాలజిస్ట్ సమాధానం ఇస్తారు’’ అని ఆమెకు చెప్పారు. అయితే ఆ వైద్యుడి పేరు మాత్రం చెప్పలేదు.
"ఆ సమయంలో ఆసుపత్రి నుంచి నాకు ఎలాంటి సహాయం లేకపోవడంతో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో తెలియలేదు" అని ఆమె అన్నారు.

2025 మేలో, ఆమె తరఫు న్యాయవాదుల సమక్షంలో న్యూరోసర్జన్లు, రేడియాలజిస్టులతో స్వతంత్రంగా పరీక్ష చేయించిన తర్వాత, ఆమెకు అసలు బ్రెయిన్ క్యాన్సర్ ఎప్పుడూ లేదని వైద్యులు చెప్పారు.
వాస్తవానికి ఆమె ట్యూమెఫాక్టివ్ డీమైలినేషన్‌తో బాధపడుతున్నారు. ఇది మెదడులో ఏర్పడే ఒక వాపు. సాధారణంగా దీనికి న్యూరాలజిస్టులు బలమైన స్టెరాయిడ్లతో చికిత్స చేస్తారు.
న్యాయవాదులు, నిపుణులతో జరిగిన వీడియో కాల్‌లో జోన్స్ ఈ విషయం తెలుసుకున్నారు.
"విషయం తెలిసినప్పుడు అందరి కళ్లలో నీళ్ళు తిరిగాయి" అని టిన్స్‌లీ అన్నారు. ఆమె ఇలాంటి మోసానికి గురైన అనేకమంది రోగులకు టిన్స్‌లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్‌ను ఆర్సీపీ రివ్యూలో డాక్టర్ వైగా పేర్కొన్నారు. సమీక్షించిన 20 కేసుల్లో 15 కేసులు సంతృప్తికరంగా లేవని తేలింది. ఈ నివేదికలో సదరు కన్సల్టెంట్ పాల్గొనలేదు.
ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ విషయంలో సరిపడా ఆధారాలు లేవని నివేదిక బృందం గుర్తించింది.
కొన్ని కేసుల్లో తగినంత వైద్యపరమైన కారణం, లోతైన పరిశీలన లేకపోవడం, అలాగే ఇతర విభాగాల వైద్యలతో సమన్వయం లేకపోవడం వల్ల తప్పుడు నిర్ధరణలకు అవకాశం ఏర్పడిందని ప్రాథమిక ఫలితాలు పేర్కొన్నాయి.
ఈ ఫలితాలు భయంకంరంగా ఉన్నాయన్నారు జోన్స్.
"ఆయన ఏం చేశారన్నది మాత్రమే కాదు, ఇంతకాలం ఆయన తనకు నచ్చినట్లు వ్యవహరించేలా అసలు ఎలా అనుమతించారన్నదే అసలు విషయం" అని ఆమె అన్నారు.
"ఆయనే సొంతంగా ఈ తంతంతా నడుపుతున్నట్లు అనిపిస్తోంది. ఆయన ఏం చేస్తున్నారో పర్యవేక్షించడానికి ఎవరూ లేరు."
మరిన్ని దర్యాప్తులు
ప్రభావితమైన రోగులందరినీ సీనియర్ వైద్యులు సమీక్షించారని "తగిన చికిత్సా ప్రణాళికలు రూపొందించామని" యూహెచ్‌సీడబ్ల్యూ ప్రతినిధి తెలిపారు.
"సిబ్బంది తమ ఆందోళనలను స్వతంత్రంగా నిర్భయంగా వ్యక్తం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక మూడో పార్టీ ఆధ్వర్యంలో వాంగ్మూలాల ప్రక్రియను సమీక్షిస్తున్నాం.
"ఆర్‌సీపీ రివ్యూ పూర్తిగా ప్రచురితమైన తర్వాత దాన్ని ట్రస్ట్ పరిశీలిస్తుంది. దాని ఫలితాల ఆధారంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటుంది. రోగుల భద్రత, వారి అనుభవం, సంక్షేమమే మా అత్యున్నత ప్రాధాన్యతలుగానే కొనసాగుతున్నాయని మా కమ్యూనిటీకి భరోసా ఇవ్వాలనుకుంటున్నాం" అని ట్రస్ట్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























