యూపీఐ పేమెంట్లపై చార్జీలు ఖరారు, అక్టోబర్ 15 నుంచి అమల్లోకి.. మినిమమ్ ఎంత, మ్యాగ్జిమమ్ ఎంత? ఎవరికి వర్తించదు

A horse attached with paytm scanner code near its eyes used for payment after joy ride on the beach. Paytm is an Indian multinational company that specializes in digital payments allowing users to make UPI payments, use merchant services and make bill payments using the mobile app.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంబయి బీచ్‌లో పర్యటకులను సవారీ చేయించిన తరువాత చెల్లింపుల కోసం గుర్రానికి వేలాడదీసిన యూపీఐ స్కానర్
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒక కీలక ప్రకటన చేసింది.

ఇకపై 2,000 రూపాయలు దాటిన పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం రుసుము వసూలు చేస్తారు. ఈ ఛార్జీ గరిష్టంగా 300 రూపాయలకు మించి ఉండదు.

అయితే యూపీఐ చెల్లింపులపై విధించే ఈ ఛార్జీల వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు.

వినియోగదారులకు యూపీఐ సేవలను పూర్తిగా ఉచితంగానే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన కొన్ని వ్యాపార (మర్చంట్) లావాదేవీలపై సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది.

ఈ కొత్త విధానం కింద రెండు వేల రూపాయల లోపు ఉన్న 95 శాతం యూపీఐ లావాదేవీలను, చిన్న వ్యాపారుల లావాదేవీలను (పీ2పీఎం) పూర్తిగా ఉచితంగానే ఉంచినట్లు ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తోడ్పడేలా ఒక కొత్త ఫండ్‌ను కూడా ప్రతిపాదించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూపీఐ లావాదేవీలు, నగదు

ఫొటో సోర్స్, Thomas Fuller/SOPA Images/LightRocket via Getty Images

ఫొటో క్యాప్షన్, యూపీఐ

ఎలాంటి చెల్లింపులపై ఛార్జీ పడుతుంది?

ఎన్‌పీసీఐ తన తాజా ప్రకటనలో వివిధ రకాల చెల్లింపులపై విధించే ఛార్జీల గురించి వివరంగా తెలియజేసింది. అవేంటంటే:

  • వినియోగదారులు ఎప్పటిలాగే యూపీఐ ఉపయోగించి ఎలాంటి ఖర్చు లేకుండా లావాదేవీలు కొనసాగించవచ్చు. 2,000 రూపాయల వరకు ఉన్న పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) లావాదేవీలు, పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలు ఎండీఆర్ పరిధిలోకి రావు.
  • పర్సన్-టు-పర్సన్ మర్చంట్ (పీ2పీఎం) విధానం కింద పనిచేసే చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ ప్రయోజనం కొనసాగుతుంది. యూపీఐ క్యూఆర్ చెల్లింపుల ద్వారా ప్రతి నెలా లక్ష రూపాయల వరకు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో పొందే చిన్న వ్యాపారులకు ఈ కేటగిరీ తోడ్పడుతుంది. దీనివల్ల అసంఘటిత రిటైల్ రంగంలో డిజిటల్ చెల్లింపుల వినియోగానికి ప్రోత్సాహం లభిస్తుంది.
  • డిజిటల్ చెల్లింపులను మరింత వేగంగా అలవాటు చేసుకునేలా చిన్న వ్యాపారుల కోసం ఒక ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది టైర్-3 నగరాలు, చిన్న మార్కెట్లలోని ప్రస్తుత వ్యాపారులకు, డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలకు అండగా నిలుస్తుంది.
  • రైల్వే, టెలికాం సేవలు, బీమా, ఇంధనం లాంటి నిర్దిష్ట మర్చంట్ కేటగిరీలలో 2,000 రూపాయలు దాటిన యూపీఐ చెల్లింపులపై ప్రతి లావాదేవీకి 5 రూపాయల ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది.
  • 2,000 రూపాయలకు పైబడిన పీ2ఎం యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఇందులో ప్రతి లావాదేవీపై ఎండీఆర్ గరిష్ట పరిమితిని 300 రూపాయలుగా నిర్ణయించారు.
  • యూపీఐ పీ2ఎం లావాదేవీల్లో 95 శాతానికి పైగా ఉన్న 2,000 రూపాయల లోపు తక్కువ విలువైన చెల్లింపులపై వ్యాపారులందరికీ ఎలాంటి ప్రభావం ఉండదు.
  • సవరించిన ఈ యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వాలెట్ లాంటి పలు ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ఛార్జీలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.
నగదు, యూపీఐ లావాదేవీలు, రుసుము

ఫొటో సోర్స్, Ministry of Finance

ఫొటో క్యాప్షన్, యూపీఐ లావాదేవీలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ఏముంది?

యూపీఐ చెల్లింపుల విధానాన్ని వినియోగిస్తున్న లక్షల మంది ప్రజల మనసుల్లో ప్రస్తుతం కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి. ఈ సందేహాలకు కారణం అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక నోటిఫికేషన్. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం విడుదల చేసిన ఆ గెజిట్ నోటిఫికేషన్‌లో "రూ. 2000 వరకు జరిగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు.. అలాగే రూపే డెబిట్ కార్డుతో రూ. 2000 వరకు చెసే చెల్లింపులపైనా ఎటువంటి ఛార్జీలు విధించరాదు" అని స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం.. "ఈ మార్గాల్లో డబ్బు పంపే లేదా స్వీకరించే వారి నుంచి బ్యాంకులు లేదా ఇతర పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి రుసుము వసూలు చేయడానికి లేదు"

ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10ఏ కింద జారీ చేసింది.

కాంగ్రెస్ ఆరోపణలు

యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రజల నుంచి అదనపు వసూళ్లకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఆరోపించింది.

పార్టీ చెప్పినదాని ప్రకారం, ప్రభుత్వం రూ. 2,000కు మించిన ప్రతి యూపీఐ చెల్లింపులపై 0.5 శాతం రుసుం విధించే యోచనలో ఉంది.

2026 సెప్టెంబర్ 14న విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో మాత్రం రూ. 2000 వరకు యూపీఐ ద్వారా చెల్లింపులపై ఎలాంటి రుసుం ఉండదని పేర్కొంది.

కాంగ్రెస్ వాదన ప్రకారం, ఒకవేళ కొత్త విధానం అమల్లోకి వస్తే రూ. 5000 చెల్లింపుపై రూ. 25, రూ. 10,000 చెల్లింపుపై రూ. 50 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ ఎక్స్ పోస్టులో "నరేంద్రమోదీ ప్రజల నుంచి వసూళ్లకు కొత్త ప్రణాళిక రూపొందించారు. రూ. 2000కు పైబడిన ప్రతి యూపీఐ చెల్లింపుపై 0.5 శాతం ఛార్జీ వసూలు చేయాలని యోచిస్తున్నారు. అంటే 5000 కొనుగోలుకి రూ. 25 , 10,000 కొనుగోలుకి రూ. 50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది" అని తెలిపింది.

అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.

"కాంగ్రెస్ మరోసారి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది" అని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

నగదు, యూపీఐ లావాదేవీలు, రుసుము

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాలు ఏంటి?

ప్రస్తుతం యూపీఐ వినియోగదారుడి నుంచి చెల్లింపులు చేయడానికి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జీ వసూలు చేయడం లేదు.

2026 ఆగస్టులో కూడా ప్రభుత్వం సామాన్య వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే పీ2పీ(వ్యక్తి నుంచి వ్యక్తికి) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రకటించింది.

భవిష్యత్‌లో ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధించినా, అది పరిమిత సంఖ్యలోని వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

ఎండీఆర్ అంటే ఏంటి?

ఇక్కడ ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఎండీఆర్, వినియోగదారుని నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ ఒకటి కాదు.

ఎండీఆర్ అనేది చెల్లింపు వ్యవస్థలో వ్యాపార సంస్థలు(మర్చంట్స్) బ్యాంకులకు, పేమెంట్ సేవల ప్రొవైడర్స్‌కు చెల్లించే రుసుము.

అంటే ఎండీఆర్ అమల్లోకి వచ్చినా, యూపీఐ చెల్లింపు చేసే వినియోగదారుడి నుంచి ప్రతి ట్రాన్సాక్షన్‌కు అదే మొత్తాన్ని తప్పనిసరిగా వసూలు చేయబోరు.

ప్రభుత్వం ఆగస్టులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే.. "యూపీఐ వినియోగదారులపై ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవు, పీ2పీ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయి".

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)