‘హోమోసెక్సువాలిటీ ఆలోచనలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానాన్ని బయటపెడుతున్న బాధితులు

నార్మన్ గుడ్‌మాన్
ఫొటో క్యాప్షన్, నార్మన్ గుడ్‌మాన్
    • రచయిత, హేలీ హాసల్
    • హోదా, బీబీసీ నార్త్ వెస్ట్ ఇన్వెస్టిగేషన్స్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమ సెక్సువాలిటీని మార్చడానికి ఉపయోగించిన వివాదాస్పదమైన ఎలక్ట్రిక్ షాక్ థెరపీకి గురైన కొందరు బాధితులు ముందుకు వచ్చి... ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

1960,70ల కాలంలో యూకేలోని ఎన్‌హెచ్ఎస్ ఆస్పత్రుల్లో 260 మందికి పైగా వ్యక్తులకు ఈ చికిత్స ఇచ్చినట్లు బీబీసీ వెల్లడించిన తర్వాత వారిలో కొందరు బయటకు వచ్చి మాట్లాడారు.

ప్రస్తుతం 70, 80 ఏళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తులు.. తమ అనుభవాల వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్రంగా గాయపడ్డామని చెప్పారు.

''అవర్షన్ థెరపీ''ని నిషేధించేందుకు చట్టాన్ని రూపొందించనున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ.. పది నెలలు గడిచినా.. తాము పడిన వేదనకు ఇప్పటికీ ఎలాంటి క్షమాపణ లభించలేదని బీబీసీతో మాట్లాడిన బాధితులు తెలిపారు.

ఇంగ్లాండ్‌లోని ఎన్‌హెచ్ఎస్ ఆస్పత్రుల్లో ఎల్‌జీబీటీ ప్లస్ రోగులకు ఎలక్ట్రిక్ షాక్ అవర్షన్ థెరపీ నిర్వహించినట్లు బీబీసీ దర్యాప్తులో ఆధారాలతో బయటపడ్డాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోగుల సెక్సువాలిటీని మార్చే ప్రయత్నంలో భాగంగా వారికి బాధాకరమైన విద్యుత్ షాక్‌లు ఇస్తూనే... సేమ్ సెక్స్ అట్రాక్షన్‌కు సంబంధించిన చిత్రాలను చూపించారు.

75 ఏళ్ల నార్మన్ గుడ్‌మాన్, చిన్నప్పటి నుంచి తాను అబ్బాయిగా కంటే అమ్మాయిలాగే ఎక్కువగా భావించానని, తాను ఆడపిల్లగా మారాలని కోరుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకు చెప్పానని తెలిపారు.

1960ల చివరిలో తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మాంచెస్టర్‌లోని ఒక సైకియాట్రిక్ హాస్పిటల్‌లో చేర్పించారు.

వైద్యులు తనకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తామని చెప్పారని, కానీ తనకు విద్యుత్ షాక్‌లు ఇచ్చారని ఆయన బీబీసీకి తెలిపారు.

''నా మెదడులో హోమోసెక్సువాలిటీ (స్వలింగ సంపర్క) ఆలోచనలు తొలగించడానికే ఇదంతా అని నాకు తెలియదు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

తనను మంచానికి కట్టేసి, చేతులు, కాళ్లు, తల రెండు వైపులా ఎలక్ట్రోడ్లను ఉంచి, వాటి ద్వారా విద్యుత్‌ను ప్రసరింపజేశారని ఆయన చెప్పారు.

"అది నిజంగా భయంకరమైనది. వారు నాకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. నాకు చాలా భయమేసింది''

''ఆ తర్వాత క్షణంలో, నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియని పరిస్థితి ఏర్పడింది''

''నేనెవరో కూడా నాకు తెలియలేదు. నాకు చాలా బలహీనంగా అనిపించింది. ఆకలి లేదు, శక్తి లేదు'' అని నార్మన్ గుడ్‌మాన్ గుర్తు చేసుకున్నారు.

కానీ, ఆ చికిత్స లైంగిక ఆసక్తుల విషయంలో తన వ్యక్తిత్వాన్ని మార్చలేదన్నారు.

నార్మన్ గుడ్‌మాన్
ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ షాక్ థెరపీపై గతంలో జరిగిన ఒక బీబీసీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తమతో మాట్లాడేందుకు నార్మన్ ముందుకు వచ్చారు.

'అన్యాయం'

తన తాత ఆర్థర్ జేమ్స్ ఎంబర్టన్ కూడా ఎలక్ట్రిక్ షాక్ థెరపీ చేయించుకున్నారని డెబ్బీ బర్లీ బీబీసీకి తెలిపారు.

తను చనిపోయిన చాలా కాలం తర్వాత.. దాదాపు 20 ఏళ్ల క్రితం మాత్రమే తన తాత పడిన వేదన గురించి ఆమెకు తెలిసింది.

ఆయన చెషైర్‌లో పేరున్న వ్యాపారవేత్త. సొంతంగా చీజ్ కంపెనీని నడిపేవారు.

1965లో 61 సంవత్సరాల వయస్సులో, ఒక అబ్బాయిని గుమ్మానికి సమీపంలో ముద్దుపెట్టుకుంటూ కనిపించిన తర్వాత ఆయనపై ‘అసభ్యకరమైన దాడి’ అభియోగం నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయన నాంట్‌విచ్ మెజిస్ట్రేట్స్ కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది.

వైద్య చికిత్స తీసుకోవాలనే షరతుపై ఆయనకు ప్రొబేషన్ (కొంతకాలం పర్యవేక్షణలో ఉంచడం) మంజూరు చేశారు. ఆయనకు శిక్ష పడటానికి ముందే, చికిత్స ప్రారంభమైందని కోర్టు పత్రాలలో వెల్లడైంది.

డెబ్బీ బర్లీ చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్థర్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చారు. ఆయనను బలవంతంగా కుటుంబ వ్యాపారాల నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఆ వ్యాపారాలను విక్రయించారు. తన మిగిలిన జీవితాన్ని వైఎంసీఏ వసతి గృహంలో ఒంటరిగా గడిపారు.

అయితే, ఆయన ఎలాంటి చికిత్స పొందారో కోర్టు పత్రాలలో పేర్కొనలేదు. ఎలక్ట్రిక్ షాక్ అవర్షన్ థెరపీ ఆయనకు కూడా చేసినట్లు కుటుంబ సభ్యులకు తర్వాత తెలిసింది.

దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని డెబ్బీ చెప్పారు.

''తన జీవితాన్ని పునర్‌నిర్మించుకోలేదు. ఆ అవమానాన్ని జీవితాంతం మోశారు''

''పెద్దయ్యాక ఆయనకు జరిగిన అన్యాయం ఇప్పుడు నాకు అర్థమైంది'' అని డెబ్బీ తెలిపారు.

ఆయనకు ప్రభుత్వం, వైద్య వ్యవస్థ, అప్పటి కాలంలో ఉన్న వైఖరుల వల్ల అన్యాయం జరిగిందన్నారు.

ఎలక్ట్రిక్ షాక్ థెరపీ, హోమోసెక్సువాలిటీ
ఫొటో క్యాప్షన్, బీబీసీని సంప్రదించిన మరో వ్యక్తి.. తనకు 16 ఏళ్లు ఉన్నప్పడు తాను పురుషుల పట్ల ఆకర్షితుడిని అవుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

బీబీసీని సంప్రదించిన మరో వ్యక్తి.. తనకు 16 ఏళ్లు ఉన్నప్పడు తాను పురుషుల పట్ల ఆకర్షితుడిని అవుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

''ఈ ప్రపంచంలో నేన్కొక్కడినే ఇలా ఉన్నానేమో అనుకున్నాను'' అని పేరు బయటికి చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి చెప్పారు.

ఎందుకంటే, తనకు 80 ఏళ్లు పైబడినప్పటికీ.. తాను గే అన్న విషయం ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకు తెలియదు, ఎప్పుడూ ఆయన చెప్పలేదు.

తన తల్లిదండ్రులు తనను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారని, ఆయన టెస్టోస్టెరాన్ మాత్రలు రాశారని చెప్పారు.

కానీ, ఆ మందుల వల్ల తాను మరింత కోపంగా, అనారోగ్యంగా తయారయ్యానని తెలిపారు.

దీంతో, తనను మానసిక ఆరోగ్య కేంద్రంలో ఎలక్ట్రిక్ షాక్ చికిత్స కోసం పంపించారు.

సుమారు రెండు సంవత్సరాల పాటు వారానికి ఒకసారి చికిత్స జరిగింది.

"ఆ షాక్ ట్రీట్‌మెంట్ చాలా భయంకరంగా ఉండేది" అని ఆయన చెప్పారు.

"ఆ షాక్‌ల తర్వాత నేను ఒక జాంబీలా అయిపోయాను. నేను ఇంట్లో పగలంతా నిద్రపోయి, ఏడుస్తూ నిద్రలేచేవాడిని'' అని గుర్తు చేసుకున్నారు. కానీ, ఈ చికిత్స తనను బాగు చేస్తుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.

కానీ, తనలోని ఆ భావనను ఈ చికిత్స మార్చలేదన్నారు.

ఈ చికిత్స తనను మరింత కుంగదీసిందని తెలిపారు.

''నేను ఇప్పటికీ కుంగిపోయే ఉన్నాను'' అని చెప్పారు.

విద్యుత్ షాక్ చికిత్స చేయించుకున్న వారిలో ఎక్కువ మంది పురుషులే.

అయితే, కొంతమంది మహిళలకు, కొన్ని సందర్భాల్లో పిల్లలకు కూడా ఈ చికిత్స చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.

హెల్ స్పాండ్లర్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ హెల్ స్పాండ్లర్

ఇలా అవర్షన్ థెరపీ చేసినవారి సంఖ్య 260గా చెబుతున్నారు. అయితే.. 260 అనేది వాస్తవ సంఖ్య కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని లాంక్‌షైర్‌ యూనివర్సిటీలో మెంటల్ హెల్త్ స్టడీస్ ప్రొఫెసర్ హెల్ స్పాండ్లర్ చెప్పారు.

"ఆ కాలంలో గే లేదా ట్రాన్స్‌గా ఉండటం ఒక మానసిక రుగ్మతగా పరిగణించేవారు. దాన్ని 'నయం' చేయడానికి ప్రయత్నించడానికి ఉపయోగించిన అనేక చికిత్సలలో ఈ రకమైన అవర్షన్ థెరపీ కూడా ఒకటి" అని చెప్పారు.

''బహుశా ఇది అత్యంత వివాదాస్పద పద్ధతి అయినప్పటికీ, దశాబ్దానికి పైగా ఇది ఎన్‌హెచ్ఎస్‌లో ఆమోదించిన పద్ధతిగా ఉండేది'' అని తెలిపారు.

ఈ పద్ధతిని ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చేసినట్లు, వందలాది మంది ఈ చికిత్సకు గురై ఉండవచ్చనే దానికి ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ స్పాండ్లర్ తెలిపారు.

బాధితుల్లో చాలామంది ఇప్పుడు తమ వృద్ధాప్యంలో ఉన్నారు. కొందరైతే దశాబ్దాల పాటు ఈ మానసిక క్షోభను మౌనంగా భరించారు.

వారు చారిత్రక మార్పిడి పద్ధతులపై సమగ్ర విచారణ జరగాలని కోరడమే కాకుండా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల మార్పిడి చికిత్సలపై పూర్తి నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, పార్లమెంటులో పరిశీలనలో ఉన్న డ్రాఫ్ట్ కన్వర్షన్ ప్రాక్టీసెస్ బిల్లు కొన్ని మతపరమైన గ్రూపాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

'అవమానకరం'

తనలాంటి వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు నార్మన్ బీబీసీకి తెలిపారు.

''నాలాంటి వాళ్లకు ఏమి జరిగిందో దాని గురించి వాళ్లు టీవీలో మాట్లాడటం చూడాలనుకుంటున్నా. అవును, క్షమాపణ చెప్పడానికి'' అని అన్నారు.

''వారు చాలా ఏళ్ల క్రితం నాటి రికార్డులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయం మీడియాలో మరింతగా ప్రచారం కావాలని ఆశిస్తున్నాను. దీంతో, నేటి యువత ఏమి జరిగిందో చూడగలరు, నేటి వైద్యులు దాని నుండి పాఠాలు నేర్చుకోగలరు'' అని చెప్పారు.

ప్రజల లైంగిక అభిరుచిని లేదా జెండర్ గుర్తింపును మార్చాలనే ఉద్దేశంతో లేదా వారు వాటిని మార్చుకున్నట్లు నమ్మించే ఉద్దేశంతో ఏ పని చేసినా దానిని 'కన్వర్షన్ ప్రాక్టీస్' (మార్పిడి పద్ధతి)గా డ్రాఫ్ట్ కన్వర్షన్ ప్రాక్టీసెస్ బిల్లు నిర్వచిస్తుంది.

ఈ అసహ్యకరమైన చారిత్రక పద్ధతులకు సంబంధించి తమ అనుభవాలను పంచుకోవడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)