స్టెమ్ సెల్స్: బిడ్డ భవిష్యత్తుకు భద్రతా కవచమా.. ప్రచార ఆర్భాటమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రాకూడదని, వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే ఏదైనా చేయాలని కోరుకుంటారు.
ఇలాంటి ఆలోచనలతోనే ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు ప్రసవ సమయంలో బొడ్డుతాడు రక్తాన్ని (అంబిలికల్ కార్డ్ బ్లడ్), బొడ్డుతాడు కణజాలాన్ని (కార్డ్ టిష్యూ) సేకరించి భద్రపరిచే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు.
ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకులు వీటిని భవిష్యత్తులో రక్త క్యాన్సర్లు, తలసేమియా, రక్తహీనతకు సంబంధించిన కొన్ని వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థ లోపాలు, ఇతర అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే జీవసంబంధమైన పెట్టుబడిగా ప్రచారం చేస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. పుట్టినప్పుడు సేకరించి భద్రపరిచిన స్టెమ్ సెల్స్ భవిష్యత్తులో అన్ని వ్యాధులనూ నయం చేయగలవా? ప్రతి తల్లీదండ్రి వీటిని తప్పనిసరిగా భద్రపరచాలా? ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బు చెల్లించి నిల్వ చేయడం నిజంగా ప్రయోజనకరమా?

స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి?
వైద్యశాస్త్రంలో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు నిరూపితమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ విషయంలో కొన్ని ముఖ్యమైన పరిమితులు కూడా ఉన్నాయి. వీటిని శాస్త్రీయ ఆధారాలతో అర్థం చేసుకోవడం అవసరం.
స్టెమ్ సెల్స్ అనేవి ప్రత్యేకమైన కణాలుగా మారగలిగే సామర్థ్యం కలిగిన మూలకణాలు. ఇవి శరీరంలోని వివిధ కణజాలాలు, అవయవాల అభివృద్ధి, మరమ్మతు ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
స్టెమ్ సెల్స్ ప్రధానంగా రెండు ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. ఒకటి సెల్ప్ రెన్యువల్ అనగా తమలాంటి కొత్త స్టెమ్ సెల్స్‌ను తిరిగి ఉత్పత్తి చేసుకోగలగడం. రెండవది డిఫరెన్షియేషన్ అనగా అవసరాన్ని బట్టి కొన్ని ప్రత్యేక కణాలుగా మారగలగడం.

ఫొటో సోర్స్, Getty Images
కార్డ్ బ్లడ్, కార్డ్ టిష్యూ అంటే ఏమిటి?
స్టెమ్ సెల్స్‌లో అనేక రకాలు ఉన్నప్పటికీ ప్రసవ సమయంలో భద్రపరిచే వాటిలో ప్రధానంగా హెమటోపోయెటిక్ స్టెమ్ సెల్స్ (హెచ్ఎస్సీఎస్) ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే రక్త సంబంధిత క్యాన్సర్లు, కొన్ని జన్యుపరమైన రక్తవ్యాధులు, రోగనిరోధక వ్యవస్థ లోపాల చికిత్సలో వీటికి ప్రాధాన్యత ఉంది.
1. కార్డ్ బ్లడ్
బిడ్డ పుట్టిన తరువాత బొడ్డుతాడులో, ప్లాసెంటాలో మిగిలి ఉండే రక్తాన్ని కార్డ్ బ్లడ్ అంటారు. ఇందులో హెమటోపోయెటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. వీటిని సేకరించి, పరీక్షించి, ప్రత్యేక ప్రక్రియ ద్వారా అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు.
2. కార్డ్ టిష్యూ
బొడ్డుతాడులో ఉండే వార్టన్స్ జెల్లీ అనే కణజాలంలో మెసెన్కైమల్ స్టెమ్ సెల్స్ (ఎంఎస్సీఎస్) ఉండొచ్చు. ఇవి ఎముక, మృదులాస్థి, కొవ్వు వంటి కణజాలాలకు సంబంధించిన పరిశోధనల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అయితే కార్డ్ టిష్యూలోని ఎంఎస్సీఎస్ను భద్రపరిచినంత మాత్రాన భవిష్యత్తులో గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, ఆటిజం లేదా నరాల వ్యాధులను నయం చేయగలమని అర్థం కాదు. వీటి కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
స్టెమ్ సెల్స్ ఎలా సేకరించి భద్రపరుస్తారు?
ప్రసవం పూర్తయిన తరువాత బిడ్డకు బొడ్డుతాడు కట్ చేసిన తర్వాత, బొడ్డుతాడులోని రక్తాన్ని ప్రత్యేకమైన స్టెరైల్ బ్యాగ్‌లో సేకరిస్తారు.
సాధారణంగా ప్రసవం తరువాత సేకరణ జరుగుతుంది.
ఇది తల్లి లేదా బిడ్డకు అదనపు నొప్పి కలిగించదు.
సేకరించిన రక్తాన్ని ప్రయోగశాలకు తరలిస్తారు.
కణాల సంఖ్య, నాణ్యత, ఇన్ఫెక్షన్లు, ఇతర అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు.
అనుకూలమైన నమూనాలను క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరుస్తారు.
సాధారణంగా ద్రవ నైట్రోజన్ ఆధారిత వ్యవస్థల్లో సుమారు -196°C వద్ద నిల్వ చేస్తారు.
ఇలా నిల్వ చేసిన కణాలు చాలా కాలం జీవించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ప్రతి నమూనా భవిష్యత్తులో చికిత్సకు పనికొస్తుందని హామీ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ వ్యాధుల చికిత్సలో కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయి?
కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రస్తుతం నిరూపితమైన వైద్య ఉపయోగాలు ఉన్నాయి.
ముఖ్యంగా రక్త సంబంధిత క్యాన్సర్లు, బీటా తలసేమియా మేజర్, సికిల్ సెల్ అనీమియా, కొన్ని రకాల రోగనిరోధక వ్యవస్థ లోపాలు జన్యుపరమైన మెటబాలిక్ వ్యాధుల్లో తగిన రోగికి, తగిన కణాల సరిపోలికతో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉపయోగపడుతుంది.
అయితే అన్ని రోగాలకు కార్డ్ బ్లడ్ సరైన చికిత్స కాదు. వ్యాధి స్వభావం, రోగి వయస్సు, హెచ్ఎల్ఏ సరిపోలిక, కణాల సంఖ్య, ఇతర వైద్య అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ వల్ల ప్రయోజనాలేంటి?
1. భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం: బిడ్డ పుట్టిన సమయంలో సేకరించిన స్టెమ్ సెల్స్‌ను అవసరమైన పరిస్థితుల్లో చికిత్స కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది.
2. సేకరణ సులభం, సురక్షితం: సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ సమయంలో బొడ్డుతాడు రక్తాన్ని సేకరించవచ్చు. సేకరణ ప్రక్రియ తల్లికి, బిడ్డకు సాధారణంగా అదనపు ప్రమాదం కలిగించదు.
3. హెచ్ఎల్ఏ సరిపోలికలో ప్రయోజనం: బొడ్డుతాడు రక్తంలోని స్టెమ్ సెల్స్‌ను అదే బిడ్డకు లేదా తగిన హెచ్ఎల్ఏ సరిపోలిక ఉన్న కుటుంబ సభ్యులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కార్డ్ బ్లడ్‌లో కొన్ని సందర్భాల్లో ఎముక మజ్జ (Bone marrow) కంటే కొంత హెచ్ఎల్ఏ అసమతుల్యతను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.
4. కుటుంబంలో ఇప్పటికే వ్యాధి ఉన్నప్పుడు: ఒక పెద్ద బిడ్డకు తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి లేదా కొన్ని ఇతర స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో చికిత్స చేయగల వ్యాధులు ఉంటే, పుట్టబోయే మరో బిడ్డ నుంచి సేకరించిన కార్డ్ బ్లడ్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే హెచ్ఎల్ఏ సరిపోలిక, జన్యుపరమైన పరీక్షలు చేయించి ప్రణాళిక రూపొందించడం ముఖ్యం.
5. పరిశోధనలకు ఉపయోగం: కార్డ్ టిష్యూ నుంచి లభించే MSCs, ఇతర కణాలపై పునరుత్పత్తి వైద్యం (రీజనరేటివ్ మెడిసన్) రంగంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పరిమితులేంటంటే...
అయితే కొన్ని ముఖ్యమైన పరిమితులు కూడా ఉన్నాయి!
స్టెమ్ సెల్ బ్యాంకింగ్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకులు ప్రచారం చేసే ప్రతి ప్రయోజనానికి సమానమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
1. సేకరించిన కణాలను అదే బిడ్డకు ఉపయోగించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు:
బిడ్డకు భవిష్యత్తులో జన్యుపరమైన వ్యాధి వచ్చినప్పుడు, అదే బిడ్డ కార్డ్ బ్లడ్‌ను ఉపయోగించడం సాధారణంగా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ వ్యాధికి కారణమైన జన్యు లోపం స్టెమ్ సెల్స్‌లోనూ ఉండే అవకాశం ఉంది.
2. లుకేమియా వచ్చినప్పుడు స్వంత కార్డ్ బ్లడ్ ఉపయోగించలేకపోవచ్చు:
బిడ్డకు భవిష్యత్తులో లుకేమియా వచ్చినప్పుడు, పుట్టినప్పుడు సేకరించిన స్వంత కార్డ్ బ్లడ్‌ను సాధారణంగా ఉపయోగించరు. ఎందుకంటే వ్యాధికి సంబంధించిన ముందస్తు అసాధారణ కణాలు ఆ నమూనాలో ఉండే అవకాశం ఉంది.
3. కణాల సంఖ్య పరిమితంగా ఉంటుంది:
ఒక బిడ్డ పుట్టినప్పుడు సేకరించే కార్డ్ బ్లడ్‌లోని స్టెమ్ సెల్స్ సంఖ్య పరిమితంగా ఉంటుంది. చిన్న పిల్లలకు ఉపయోగపడే నమూనా, పెద్దయ్యాక అదే వ్యక్తికి అవసరమైన కణాల సంఖ్యను అందించకపోవచ్చు. పెద్దవారిలో అవసరమైనప్పుడు ఇతర దాతల నుంచి కణాలు సేకరించడం లేదా ఇతర ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతులు పరిశీలించాల్సి రావచ్చు.
4. ప్రతి నమూనా నాణ్యమైనది కాదు:
సేకరించిన రక్తంలో తగిన సంఖ్యలో స్టెమ్ సెల్స్ లేకపోవచ్చు. ఇన్ఫెక్షన్, కలుషితం కావడం, నిల్వ సమయంలో సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో నమూనా ఉపయోగానికి పనికిరాకపోవచ్చు.
5. ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ:
ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రారంభ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. చాలా సంవత్సరాల పాటు ఈ ఖర్చు కొనసాగుతుంది.
6. భవిష్యత్తులో అన్ని వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుందనే హామీ లేదు:
పార్కిన్సన్స్, అల్జీమర్స్, ఆటిజం, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులకు కార్డ్ బ్లడ్ లేదా కార్డ్ టిష్యూ స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయని ప్రచారం చేసే సందర్భాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలావాటికి సాధారణ వైద్య చికిత్సగా ఉపయోగించేందుకు తగిన స్థాయి నిరూపితమైన ఆధారాలు ఇంకా లేవు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేట్ బ్యాంకింగ్ లేదా పబ్లిక్ బ్యాంకింగ్ – ఏది మంచిది?
ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ (ప్రైవేట్ బ్యాంకింగ్):
తల్లిదండ్రులు డబ్బు చెల్లించి తమ బిడ్డ కార్డ్ బ్లడ్‌ను తమ కుటుంబం కోసం ప్రత్యేకంగా భద్రపరచుకుంటారు. భవిష్యత్తులో అవసరమైతే ఆ నమూనాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ (పబ్లిక్ బ్యాంకింగ్):
తల్లిదండ్రులు తమ బిడ్డ బొడ్డుతాడు రక్తాన్ని దానం చేస్తారు. ఆ నమూనాను పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఇతర అవసరమైన రోగులకు ఉపయోగించేందుకు అందుబాటులో ఉంచుతారు.
పబ్లిక్ బ్యాంకింగ్ ద్వారా మరింత ఎక్కువమంది రోగులకు స్టెమ్ సెల్స్ అందుబాటులోకి వస్తాయి. అందువల్ల వైద్య నిపుణులు పబ్లిక్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. అయితే భారతదేశంలో పబ్లిక్ బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు, ప్రాంతీయ లభ్యత పరిమితంగా ఉండవచ్చు.
మన దేశంలో ప్రసవ సమయంలో కార్డ్ బ్లడ్ సేకరణ, ప్రాసెసింగ్, క్రయోప్రిజర్వేషన్ సేవలను అందించే అనేక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు కార్డ్ బ్లడ్తో పాటు కార్డ్ టిష్యూ నిల్వ సేవలను కూడా అందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్టెమ్ సెల్ బ్యాంక్ ఎంచుకునేటప్పుడు ఏం పరిశీలించాలి?
- సీడీఎస్‌సీవో/డీసీజీఐకి సంబంధించిన వర్తించే లైసెన్సులు, అనుమతులు ఉన్నాయా?
- ఏఏబీబీ, ఎఫ్ఏసీటీ, ఎన్ఏబీఎల్ వంటి గుర్తింపులున్నాయా? అవి ఏ కేంద్రానికి, ఏ సేవకు వర్తిస్తాయి?
- నమూనా సేకరణ నుంచి ప్రయోగశాలకు చేరేవరకు రవాణా విధానం ఏంటి?
- టోటల్ న్యూక్లియేటెడ్ సెల్ కౌంట్(టీఎన్సీ), సీడీ34+సెల్ కౌంట్, వయబిలిటీ పరీక్షలు నిర్వహిస్తారా?
- హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వంటి ఇన్ఫెక్షన్ల పరీక్షలు చేస్తారా?
- నమూనా కలుషితమైతే లేదా నాణ్యతా ప్రమాణాలకు సరిపోకపోతే ఏం చేస్తారు?
- నిల్వ ఉష్ణోగ్రత, నిరంతర మానిటరింగ్, విద్యుత్ అంతరాయానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా?
- సంస్థ మూతపడితే లేదా వ్యాపార కార్యకలాపాలు ఆగిపోతే నమూనా పరిస్థితి ఏమవుతుంది?
- నిల్వ కాలం, వార్షిక చార్జీలు, అదనపు ఖర్చులు, నమూనా విడుదల విధానం ఏంటి?
ప్రత్యేకంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏఏబీబీ లేదా ఎఫ్ఏసీటీ గుర్తింపు ఉండటం నాణ్యతా వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన సూచిక. కానీ ఆ గుర్తింపు ఒక్కటే ఆ బ్యాంకులో నిల్వ చేసిన నమూనా భవిష్యత్తులో తప్పనిసరిగా చికిత్సకు ఉపయోగపడుతుందని హామీ ఇవ్వదు.
భారతీయ కుటుంబాల పరిస్థితి – ఎప్పుడు స్టెమ్ సెల్స్ భద్రపరచుకోవడం సమంజసం?
భారతదేశంలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విషయంలో కుటుంబ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.
కుటుంబంలో ఎలాంటి జన్యుపరమైన లేదా రక్త సంబంధిత వ్యాధులు లేని సందర్భంలో
ఆరోగ్యవంతులైన తల్లిదండ్రులకు మొదటి బిడ్డ పుట్టబోతున్నప్పుడు ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ చేయించుకోవాలా అనే సందేహం ఉంటుంది. భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఒక్క కారణంతో వేల రూపాయలు ఖర్చు చేసి నిల్వ చేయడం తప్పనిసరి కాదు. సాధారణ ప్రజలకు రొటీన్ ప్రైవేట్ బ్యాంకింగ్‌ను ప్రధాన వైద్య సంస్థలు సిఫార్సు చేయడం లేదు.
కుటుంబంలో ఇప్పటికే తలసేమియా లేదా ఇతర జన్యుపరమైన రక్తవ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఉన్న సందర్భంలో పుట్టబోయే బిడ్డ కార్డ్ బ్లడ్‌ను భద్రపరచడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే ముందుగానే హెచ్ఎల్ఏ టైపింగ్, జన్యుపరమైన పరీక్షలు, ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుల సలహా తీసుకోవాలి. కొత్తగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి, భవిష్యత్తులో ఆ బిడ్డ స్వతంత్ర ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
కుటుంబంలో లుకేమియా లేదా ఇతర రక్త క్యాన్సర్లు ఉన్నప్పుడు కుటుంబ చరిత్ర ఉన్నంత మాత్రాన బిడ్డ కార్డ్ బ్లడ్‌ను తప్పనిసరిగా భద్రపరచాలని అర్థం కాదు. వ్యాధి రకం, జన్యుపరమైన ప్రమాదం, దాతగా ఉపయోగపడే అవకాశం వంటి అంశాలను హెమటాలజిస్ట్ పరిశీలించాలి.
పరిశోధనలు భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించవచ్చు. కానీ ప్రస్తుతం నిరూపితంకాని చికిత్సలపై ఆశ పెట్టుకుని ప్రస్తుత ఖర్చును సమర్థించుకోవడం శాస్త్రీయంగా సరైన విధానం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఖర్చు ఎంత?
సేకరణ కిట్, ప్రసవ సమయంలో సేకరణ సేవలు.
నమూనా రవాణా, ప్రాసెసింగ్, కార్డ్ బ్లడ్ నిల్వ,
కార్డ్ టిష్యూ నిల్వ (ఎంచుకుంటే), వార్షిక నిర్వహణ, అదనపు నిల్వ కాలపు ఛార్జీలు వంటి వాటిని బట్టి సంస్థను బట్టి ఖర్చు మారుతుంది.
కొన్ని సంస్థలు ఒకేసారి 21 సంవత్సరాల నిల్వ ప్యాకేజీలను అందిస్తుండగా, మరికొన్ని సంస్థలు ప్రారంభ చెల్లింపుతో పాటు వార్షిక ఫీజు వసూలు చేస్తాయి. ఒకే విధమైన ధరల వ్యవస్థ అన్ని సంస్థల్లో లేదు. అందువల్ల ప్రస్తుత ధరలను, అదనపు ఛార్జీలను నేరుగా సంస్థల నుంచి లిఖితపూర్వకంగా తీసుకోవాలి.
ఒక ముఖ్యమైన విషయం: కార్డ్ బ్లడ్తో పాటు కార్డ్ టిష్యూ నిల్వ చేయించడం వల్ల భవిష్యత్తులో అన్ని రకాల స్టెమ్ సెల్ చికిత్సలకు అర్హత వస్తుందని భావించకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆలస్యంగా బొడ్డుతాడు కత్తిరించడం (డిలేడ్ కార్డ్ క్లాంపింగ్) వల్ల సేకరణపై ప్రభావం ఉంటుందా?
ప్రసవం తరువాత బొడ్డుతాడును వెంటనే కత్తిరించకుండా కొంతసేపు వేచి ఉండటాన్ని డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు. దీనివల్ల బిడ్డకు అదనపు రక్తం, ఐరన్ అందుతాయి. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే ఆలస్యంగా కత్తిరించడం వల్ల సేకరించగల కార్డ్ బ్లడ్ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. అందువల్ల కార్డ్ బ్లడ్ సేకరణ కోసం బిడ్డకు ప్రయోజనకరమైన డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ను అనవసరంగా తగ్గించకూడదు. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
అపోహ : స్టెమ్ సెల్స్ భద్రపరిస్తే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చు.
వాస్తవం: కొన్ని రక్త, జన్యుపరమైన వ్యాధులకు మాత్రమే ఉపయోగాలున్నట్టు నిరూపితమైంది.
అపోహ: బిడ్డకు లుకేమియా వస్తే తన కార్డ్ బ్లడ్‌తోనే చికిత్స చేయవచ్చు.
వాస్తవం: సాధారణంగా అదే బిడ్డ కార్డ్ బ్లడ్‌ను ఉపయోగించరు.
అపోహ: కార్డ్ టిష్యూ నిల్వ చేస్తే పక్షవాతం, ఆటిజం నయమవుతాయి.
వాస్తవం: ఈ చికిత్సలకు తగిన నిరూపిత ఆధారాలు లేవు.
అపోహ: ప్రతి బిడ్డకు ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అవసరం.
వాస్తవం: సాధారణ కుటుంబాలకు రొటీన్ ప్రైవేట్ నిల్వను సిఫార్సు చేయరు.
అపోహ: 21 సంవత్సరాలు నిల్వ చేస్తే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
వాస్తవం: నిల్వ కాలం, నమూనా నాణ్యత, కణాల సంఖ్య, వ్యాధి స్వభావం కీలకం.
అపోహ: స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
వాస్తవం: సేకరణ సాధారణంగా సురక్షితమే. అయితే తల్లి, బిడ్డ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీఓజీ), అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా అందరికీ ప్రైవేట్ కార్డ్ బ్లడ్ నిల్వ చేయించడం శాస్త్రీయ ఆధారాలతో సమర్థించలేదు.
కుటుంబంలో ఇప్పటికే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో చికిత్స చేయగల వ్యాధి ఉన్న వ్యక్తి ఉంటే ప్రైవేట్ బ్యాంకింగ్‌ను పరిగణించవచ్చు. ఇతర సందర్భాల్లో పబ్లిక్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
భారతీయ వైద్య నిపుణుల అభిప్రాయం కూడా ఇదే దిశలో ఉంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 2018లో ప్రచురించిన కన్సెన్సస్ స్టేట్మెంట్ ప్రకారం పబ్లిక్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించాలి. కుటుంబంలో ఇప్పటికే సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఉంటే ప్రైవేట్ బ్యాంకింగ్‌ను పరిగణించవచ్చు.
స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ అనేది వైద్యశాస్త్రంలో ఒక ముఖ్యమైన పురోగతి. ముఖ్యంగా రక్త క్యాన్సర్లు, తలసేమియా, కొన్ని జన్యుపరమైన రోగనిరోధక వ్యవస్థ లోపాల చికిత్సలో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వేలాది మంది రోగులకు కొత్త జీవితాన్ని అందిస్తోంది.
అయితే స్టెమ్ సెల్ బ్యాంకింగ్, స్టెమ్ సెల్ చికిత్స రెండూ ఒకటే కాదు. స్టెమ్ సెల్స్‌ను భద్రపరచుకోవడం వల్ల భవిష్యత్తులో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వస్తుందని చెప్పలేం.
ప్రతి తల్లీతండ్రి తమ బిడ్డ కోసం ముందుచూపుతో నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో సంబంధిత వ్యాధుల చరిత్ర ఉంటే వైద్య నిపుణుల సలహాతో ప్రైవేట్ బ్యాంకింగ్‌ను పరిశీలించవచ్చు. అలాంటి ప్రత్యేక అవసరం లేని కుటుంబాలు కేవలం ప్రకటనలు, భయాలు, భవిష్యత్తుపై ఆశల ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు.
బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే తల్లిదండ్రుల లక్ష్యం కావాలి. శాస్త్రీయ ఆధారాలతో తీసుకునే నిర్ణయమే నిజమైన జీవసంబంధమైన పెట్టుబడి.
(గమనిక: రచయిత వైద్యురాలు. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























