గుడ్‌నైట్
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన కథనాలు:
చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తాయని అయితే పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానం ద్వారా వాటిని ప్రభుత్వం దెబ్బతీసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన కథనాలు:

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ రాజధాని కీయేవ్‌లోని వంతెనలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో తీవ్రస్థాయిలో దాడులు చేసింది.
ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా ఈ దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అభివర్ణించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.
యుక్రెయిన్‌లోని పలు నగరాలు, ప్రాంతాలపై రష్యా దాడులు చేసిందని,నివాస భవనాలు, ఇంధన సరఫరా కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుందని జెలియన్‌స్కీ చెప్పారు.
రష్యా 110కి పైగా క్షిపణులు, 400కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో వరుసగా దాడులు చేసిందని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యూహమని ఆయన అన్నారు. ఈ దాడుల కారణంగా మంటలను ఆర్పడం, శిథిలాలను తొలగించడం, అత్యవసర సేవలను పునరుద్ధరించడం మరింత కష్టంగా మారిందన్నారు.
క్రిమియా బ్రిడ్జిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే హెచ్చరించారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా తాజా దాడులకు పాల్పడింది.
యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతుతో భద్రతా హామీలు కల్పించే ప్రతిపాదనకు రష్యా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా చేసిన వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, ANI
భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) శతాబ్ది సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు.
పన్నులు తగ్గించినప్పటికీ పారిశ్రామికవేత్తలు ఉద్యోగుల జీతాలు పెంచలేదని, కొత్త ఉద్యోగాలు కల్పించలేదని సదస్సులో మోదీ విమర్శించారు.
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.
‘‘మీరు వారిపై ఆరోపణలు చేయడం లేదు. మీ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరే అంగీకరిస్తున్నారు" అని మోదీని ఉద్దేశించి రాహుల్ అన్నారు.
తీర్చలేనంత ఆకలి ఉందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యపైనా రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ఆ ఆకలి ఎవరిదో దేశ ప్రజలందరికీ తెలుసని అన్నారు.
విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్, బొగ్గు, రహదారులు వంటి వాటిని కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం పెట్టిందని రాహుల్ ఆరోపించారు. వీరంతా కలిసి ఎన్ని ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు.
చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తాయని అయితే పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానం ద్వారా వాటిని ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. నిజాయతీగా పోటీపడే పెద్ద కంపెనీలకు కూడా వ్యాపారం చేసుకునే అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు.
గుత్తాధిపత్యం వల్ల ఉద్యోగాలు రావని, దీనివల్ల ధరలు పెరుగుతాయని, పోటీ కూడా తగ్గిపోతుందని రాహుల్ గాంధీ అన్నారు.
'మీరు పని చేయండి.. మిగతాది మేం చూసుకుంటాం' అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశ సంపదను దోచుకున్నది ప్రధాని, ఆయన సన్నిహితులేనని ఆరోపించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గతంలో చూశారని, ఇప్పటికీ చూస్తున్నారని అన్నారు.
సదస్సులో తన ప్రసంగానికి పారిశ్రామికవేత్తలు చప్పట్లు కొట్టకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని కూడా రాహుల్ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగ యువత.. ఇలా ఎవరూ చప్పట్లు కొట్టే పరిస్థితిలో లేరని అన్నారు.
మిగిలి ఉన్న కొద్దిమంది మద్దతుదారులతోనైనా ప్రధాని చప్పట్లు కొట్టించుకోవాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images

ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.
న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.
న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.
భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న తమ స్వగ్రామం పంచూర్‌లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. సావిత్రీ దేవి మరణించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సమాచార విభాగం ధ్రువీకరించింది.
తల్లి మరణవార్త తెలిసినప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం, నవంబర్ 20న గోరఖ్‌పూర్‌లో స్వామి వివేకానంద యువ సాధికారత పథకం కింద విద్యార్థులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.
యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఉత్తరాఖండ్ అటవీ శాఖలో అధికారిగా పనిచేశారు. ఆయన 2020 ఏప్రిల్‌లో కన్నుమూశారు. కరోనా తొలి దశలో తండ్రి మరణించినప్పుడు అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న బాధ్యతల కారణంగా తండ్రిని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా దక్కలేదని అప్పట్లో ఆయన చెప్పారు.
2024 జూన్‌లో అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు యోగి ఆదిత్యనాథ్ రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు వెళ్లారు. చాలాకాలం తర్వాత ఆయన తల్లిని కలిశారని అప్పట్లో మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉన్నారు.
"కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, భారత ప్రధాని ఈ టేబుల్ వద్ద కూర్చుని ఉండేవారు. రాజీపడిన ప్రధాని ఎన్నడూ అక్కడ కూర్చోలేరు" అని ఆయన ఎక్స్ పోస్టులో రాశారు.
గతంలో ఇరాన్ యుద్ధం, భారత విదేశాంగ విధానంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్ కేవలం చూస్తూ ఉండిపోయిందని అన్నారు.
"భారత్ పరిమాణం, చరిత్ర, ఇతర దేశాలతో దానికున్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, దానిని ప్రపంచ చర్చలో చేర్చాలి. కానీ, భారత్ ఇప్పుడు ఒక అప్రధాన పాత్రధారిగా మారింది. మనం ప్రపంచ వేదిక నుంచి తప్పుకున్నాం" అని రాహుల్ గాంధీ చెప్పారు.
భారత్‌కు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయని, ఇరాన్ యుద్ధం వాటిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ ఉదాసీనంగా ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ పోస్టుపై బీజేపీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఆశిష్ అగర్వాల్ స్పందించారు.
"అంతర్జాతీయ దౌత్య వాస్తవాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. అమెరికా, రష్యా, చైనాల మధ్య జరిగే త్రైపాక్షిక సమావేశం భారత్ స్థానాన్ని నిర్ణయించదు. భారతదేశం బ్రిక్స్, క్వాడ్, ఎస్‌సీఓ, జీ20, జీ7 వంటి వివిధ వ్యూహాత్మక వేదికల ద్వారా ప్రత్యర్థి దేశాలతో సంబంధాలు కొనసాగిస్తుంది" అని ఆశిష్ అగర్వాల్ ఎక్స్ పోస్టులోతెలిపారు.
"భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే ముందు లేదా ప్రధానమంత్రిని 'రాజీ పడిన ప్రధాని' అని పిలిచే ముందు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ విదేశీ దేశాధినేతలను ఎందుకు కలిశారో రాహుల్ వివరించాలి" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, IMD
‘అక్వాన్’ తుపాను ఒడిశాలో తీరాన్ని దాటింది. శుక్రవారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ ప్రకారం, తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే, తుపాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పట్టనుంది.
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

ఫొటో సోర్స్, IMD
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ బలహీనపడి తుపానుగా మారింది. గత ఆరు గంటలుగా తుపాను గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది.
ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలని తాకిన అక్వాన్ తుపాను బాహ్యవలయం, మరో 2 గంటల్లో పూర్తిగా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
ప్రస్తుతం ఈ తుపాను కళింగపట్నానికి 80 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 190 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 60 కిలోమీటర్లు, పూరీకి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ తుపాను కదలికలను విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లోని డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఓవర్‌నైట్ స్కోరు 243/5తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 125 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. నికోల్స్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (118) కూడా సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, IMD
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని వాతావరణ శాఖ తెలిపింది.
అక్వాన్ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదిలిందని తెలిపింది. ప్రస్తుతం కళింగపట్నానికి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 170 కిలోమీటర్లు, పూరీకి 250 కిలోమీటర్లు, నరసాపురానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
తుపాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 3 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.