నేపాల్: ‘తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరిని రక్షించిన ఆ అద్భుతం ఎలా సాధ్యమైందంటే... ’

ఫొటో సోర్స్, Nepalese Prime Minister's Office
- రచయిత, టెస్సా ఓంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
వరదల వల్ల నేపాల్ జల విద్యుత్ కేంద్ర సొరంగంలో చిక్కుకుపోయినవారిని రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్న సొరంగ తవ్వకాల నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ బీబీసీతో మాట్లాడారు. బాధితులను ఉన్న ప్రాంతానికి ఎలా చేరుకున్నారో, వారిని ఎలా రక్షించారో వివరించారు.
సొరంగంలో ఏర్పడిన అడ్డింకిని తొలగించి త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రానికి చేరుకునేందుకు ఎలా తవ్వకాలు జరపాలో నేపాల్ జల విద్యుత్ అధికారులకు ఆర్నాల్డ్ డిక్స్ సూచనలు ఇస్తున్నారు.
గత వారం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న పలు జల విద్యుత్ కేంద్రాల్లో త్రిశూలీ-3 ఒకటి.
అందులోంచి తాజాగా ఇద్దరు వ్యక్తులను సజీవంగా గుర్తించడం అనేక అడ్డంకుల మధ్య జరిగిన అద్భుతాల పరంపరలాంటిదని, అనేక సవాళ్లు ఎదుర్కున్నామని ఆయన చెప్పారు.
వరదల వల్ల ప్రస్తుతం ఆ ప్రాంతమంతా గుర్తుపెట్టలేనంతగా మారిపోయింది. 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సొరంగ ప్రవేశ మార్గం గుర్తించడమే తమ మొదటి సవాలని ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు.

సొరంగం ప్రవేశద్వారాన్ని ఎలా గుర్తించారంటే...
"గతంలో కొండపై కనిపించి, ఇప్పుడు కొండ చరియల కింద భూగర్భంలో కూరుకుపోయిన సొరంగ ప్రవేశ ద్వారం వెతికే ఇలాంటి సహాయక ఆపరేషన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ప్రవేశ ద్వారాన్ని పూర్తిగా మూసివేసి ఆ ప్రాంత రూపురేఖలు మార్చివేసిందంటే కొండచరియల పరిమాణం ఎంత భారీగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని డిక్స్ చెప్పారు. ఆయన ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్.
ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆ ప్రాంతానికి చెందిన పాత మ్యాప్‌లు, విపత్తు తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలు, హెలికాప్టర్ ద్వారా తీసిన వీడియోలు, కొండపై కనిపించే విద్యుత్ స్తంభాలు... ఒకటేమిటి దొరికిన ప్రతి ఆధారాన్ని పరిశీలించిన తర్వాత డిక్స్, ఆయన బృందం సొరంగ ప్రవేశ ద్వారం ఉండే అవకాశం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తవ్వకాలు జరిపింది.
ఎట్టకేలకు సొరంగం ప్రవేశ ద్వారం కనిపించింది.

ఫొటో సోర్స్, Nepalese Prime Minister's Office
మాటలు వినిపించడంతో...
సొరంగ మార్గాన్ని గుర్తించిన తర్వాత అందులో చిక్కుకుపోయిన బాధితులను గుర్తించడం మరో సవాల్.
"సొరంగ ప్రవేశ ద్వారానికి ముందు భాగంలో వారు ఉంటారని తెలుసు. కానీ వారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అందుకే సరైన దిశలో తవ్వకాలు జరిపాలి. అదే సమయంలో ఎవరన్నా మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుందేమో అని కూడా జాగ్రత్తగా వినాలి" అని ఆయన చెప్పారు.
"బురద, రాళ్లతో పూర్తిగా నిండిపోయిన సొరంగంగుండా రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్లాల్సివచ్చింది. కొన్ని రాళ్లు కార్లు కంటే పెద్దవిగా ఉన్నాయి. వాటిని తొలగించుకుంటూ దారిని ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం కొన్నిసార్లు పేలుడు పదార్థాలు వాడాల్సి వచ్చింది. ఇలాంటి పని సాధారణంగా చేయరు. ఎందుకంటే ఇలా చేయడం లోపల ఉన్న బాధితులకు, బయట నుంచి పని చేస్తున్న వారికి ఇద్దరికీ ప్రమాదమే" అని డిక్స్ చెప్పారు.
పేలుళ్ల కారణంగా సొరంగం బలహీన పడి మరింత కుంగిపోకుండా జాగ్రత్తగా పేలుళ్లు జరిపారని, ఈ విషయంలో నేపాల్ సైన్యం అద్భుతంగా పని చేసిందని ఆయన ప్రశంసించారు.
లోపలికి వెళ్లే కొద్దీ సొరంగం ఇప్పటికీ నీళ్లలో నిండిపోయేఉందని గుర్తించారు.
సొరంగంలో ఉన్న నీటిని బయటకు పంపేందుకు పంపింగ్ యంత్రాలు, ఎక్స్కవేటర్లు ఉపయోగించారు. సొరంగానికి కాస్త దూరంలో ఉన్న నది వరకు కాలువ మాదిరిగా తవ్వకాలు చేసి నీటిని పంపించారు.
చివరకు సొరంగంలో పేరుకుపోయిన శిథిలాల గుండా ఒక మనిషి వెళ్లగలిగే చిన్న సొరంగాన్ని తవ్వాల్సి వచ్చింది.
"ఈ లొకేషన్ వల్ల తవ్వుతున్న సొరంగానికి ఇది పైకప్పుగా ఉపయోగపడింది. పైగా వరద ముప్పును కూడా తగ్గించింది" అని డిక్స్ తెలిపారు.
శుక్రవారం(సెప్టెంబరు 4) ఉదయం ఏవో మాటలు వినిపిస్తున్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం సిబ్బంది వారితో మాట్లాడారు. " మీరు ఆందోళన పడకండి, మిమ్మల్ని రక్షించడానికే మేం వచ్చాం" అని చెప్పారు. అటు నుంచి నీరసించిన గొంతుతో "సరే" అని స్పందన వచ్చింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే వారు సంజయ్ షా, కబీర్ మహరాజన్ను బయటకు తీసుకొచ్చారు.
కానీ ఇప్పటికీ ఆ సొరంగంలో పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నందున సహాయక చర్యలు ఇంకా పూర్తికాలేదు.

ఫొటో సోర్స్, Nepal Army
గోల్డీలాక్స్ జోన్ వైపు వెళ్తున్న సహాయక బృందాలు
బీబీసీతో డిక్స్ మాట్లాడే సమయానికి సొరంగం ప్రవేశద్వారంనుంచి 60 మీటర్లకు చేరుకున్నట్టు చెప్పారు. జలవిద్యుత్ కేంద్రం కొండలోపల చాలా లోతులో ఉంది. అక్కడకు చేరుకోవడానికి ఇంకా 150 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు.
వరద శిథిలాలు జలవిద్యుత్ కేంద్రం వరకు చేరకపోయిఉండొచ్చని భావిస్తున్నారు.
అవి అక్కడకు చేరి ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయని డిక్స్ చెప్పారు.
''జలవిద్యుత్ కేంద్రంలో ఎవరైనాఉంటే రాళ్లు, బురదలో చిక్కకుని ఉండొచ్చు. లేదా ఆ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయిఉండొచ్చు'' అని అన్నారు.
అయితే అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది ఇప్పటికీ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
''ముందుకు వెళ్తున్నకొద్దీ ఇప్పుడు కూడా నీళ్లు ఉండొచ్చు. సొరంగం తవ్వుతున్నవారిని ముంచేయవచ్చు. అదే సమయంలో బయట మరో వరద వచ్చినా కూడా వెనుక నుంచి వచ్చే వరదతో ముప్పు పొంచి ఉంది. అంటే రెండువైపుల నుంచి ప్రమాదం ఉంది" అని డిక్స్ చెప్పారు.
శుక్రవారం ఇద్దర్ని రక్షించిన సహాయక బృందం ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మిగతావారిని కూడా సమయానికి సజీవంగా బయటకు తీసుకురాగలమనే నమ్మకం ఇప్పుడు వారికి కలిగింది.
''మేం గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆపరేషన్స్ చేయలేదు. అందుకే ఇద్దర్ని రక్షించడం మాకు బాగా ఉపశమనం కలిగించింది. సరైన దారిలో వెళ్తున్నామని అర్థమైంది. మా ఆలోచనలు ఫలించాయనే విషయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది" అని డిక్స్ చెప్పారు.
ఇప్పుడు తాము గోల్డిలాక్స్ జోన్ అని పిలిచే ప్రాంతంవైపు వెళ్తున్నామని, ఎవరైనా జీవించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతమని డిక్స్ తెలిపారు.
ఇది జల విద్యుత్ కేంద్రం పైభాగంలో ఉంది. అక్కడ కొంత ఖాళీ ప్రదేశం ఉండడంతో ప్రాణాలతో ఉన్నవారు అక్కడ ఉండే అవకాశముందని రెస్క్యూ బృందం భావిస్తోంది.
"ఇద్దరిని మేం బయటకు తీసుకొచ్చాం. మేం క్యాసినో ఆడుతున్నామనుకుంటే గెలిచినంత వరకు చాలనుకుని వెళ్లిపోవచ్చు. కానీ మేం ఆగిపోం. విజయం సాధించే వరకు పోరాడుతాం" అని డిక్స్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























