మూత్రాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు ఇంట్లోనే పరీక్షలు

మూత్రాశయ క్యాన్సర్, సిస్టోస్కోపిస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫెర్గస్ వాల్ష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్‌కి సంబంధించిన పది కేసుల్లో తొమ్మిదికి పైగా ఇక ఇంట్లోనే సులభంగా మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

యూరోపియన్ యూరాలజీ ఆంకాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, నోనకస్ అనే డయాగ్నస్టిక్స్ సంస్థ దీనికి నేతృత్వం వహించాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లలోని ఏడు ఆస్పత్రుల్లో పేషెంట్లపై ఈ పరీక్షలను నిర్వహించారు.

ఈ మూత్ర పరీక్షతో సిస్టోస్కోపీ అవసరం తగ్గుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.

సిస్టోస్కోపీలో మూత్రమార్గం వద్ద, మూత్రాశయంలో కెమెరా పంపించడం వంటి నొప్పి కలిగించే వైద్య ప్రక్రియలు ఉంటాయి.

ఇలాంటి అత్యవసర వైద్య సేవల అవసరాన్ని తగ్గించవచ్చని అధ్యయనకర్తలు భావిస్తున్నారు.

మరింత భారీ స్థాయిలో ఈ పరీక్షలు సఫలమైతే, ఏటా వేలాది రోగులకు ఇలాంటి బాధాకరమైన ప్రక్రియల నుంచి విముక్తి లభించవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోగులకు మరింత సాంత్వన

యూకేలో ఏటా 3 లక్షల మందికి పైగా సిస్టోస్కోపీ నిర్వహిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అనేకమంది ఇంకా వెయిట్‌లిస్ట్‌లో ఉన్నారు.

సిస్టోస్కోపీస్‌కి ఈ మూత్ర పరీక్షలు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏ రోగికి అధిక ముప్పు పొంచి ఉంది? ఎవరికి అత్యవసర చికిత్స అవసరం? అని తేల్చడంలో వైద్యులకు అవి ఉపయోగపడవచ్చు.

92శాతం మూత్రాశయ క్యాన్సర్లను ఈ గాలియస్ మూత్ర పరీక్షలు గుర్తించినట్లు ఎన్‌హెచ్ఎస్ పరిశోధనలో తేలింది.

ఫలితాల్లో నెగటివ్ అని వస్తే రోగిలో 99శాతానికి పైగా మూత్రాశయ క్యాన్సర్ లేకపోవచ్చని అర్థం.

ఇది మూత్రాశయ క్యాన్సర్ ద్వారా మూత్రంలోకి విసర్జితమయ్యే ఎలాంటి జన్యు పదార్థాన్ని అయినా గుర్తిస్తుంది. దీనిని మొదట క్యాన్సర్ రీసెర్చ్ యూకే (సీఆర్‌యూకే) నిధుల సహాయంతో యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ అభివృద్ధి చేసింది.

మూత్రాశయ క్యాన్సర్, సిస్టోస్కోపిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో బ్లాడర్ క్యాన్సర్ అధికంగా ఉంటోంది

‘మూత్రాశయ క్యాన్సర్ పరీక్షల కోసం ఎదురుచూపు తప్పుతుంది’

23 జన్యువులలో మూత్రాశయ క్యాన్సర్‌కి సంబంధించిన 450 డీఎన్‌ఏ మ్యూటేషన్స్‌ (డీఎన్ఏ నిర్మాణంలో జరిగే మార్పుల)ని ఈ పరీక్ష గుర్తిస్తుంది.

"ఏళ్ల తరబడి శాస్త్రవిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి, పరీక్షించిన తర్వాత.. భారీ స్థాయిలో రోగులపై నిర్వహించిన అధ్యయనం ఇది. తొలిదశలో ఇలాంటి ఆశాజనక ఫలితాలు కనిపించడం చాలా ఆనందంగా ఉంది." అని అధ్యయనం సహ రచయిత బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ బ్రియాన్ అన్నారు.

లైసెన్స్ ఒప్పందం ప్రకారం ఈ పరీక్ష వాణిజ్య హక్కులు నోనకస్‌ సంస్థకు చెందుతాయి. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని యూనివర్సిటీ,సీఆర్‌యూకేకి అది తిరిగి చెల్లిస్తుంది.

"బ్లాడర్ క్యాన్సర్ పరీక్షల కోసం ఎంతో మంది అవసరమైనదానికన్నా ఎక్కువ కాలం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యను అధిగమించే మార్గాల కోసం అన్వేషించడం అవసరం." అని సీఆర్‌యూకేకి చెందిన మిషెల్ మిచెల్ అన్నారు.

"ఈ పరీక్ష ఇంకా తొలిదశలోనే ఉంది. మరింత పరిశోధన అవసరం. అయితే క్యాన్సర్‌ని గుర్తించేందుకు సులభమైన, తక్కుప ప్రయాసతో కూడిన వేగవంతమైన మార్గాలను కనుగొనే ప్రక్రియ కొనసాగడం ఎంతో అవసరం." అని మిచెల్ పేర్కొన్నారు.

60 ఏళ్లు దాటిన పురుషుల్లో బ్లాడర్ క్యాన్సర్ అధికంగా ఉంటోంది. వారిలో మూత్రంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మూత్రాశయ క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉందనేది క్యాన్సర్ ఎంత పెద్దగా ఉంది? శరీరంలోని ఇతర భాగాలకు ఏమైనా వ్యాపించిందా? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

క్యాన్సర్‌ని త్వరగా గుర్తించి, చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)