‘ఆడవాళ్లు లేకపోతే హార్బర్ నడవదు’ - విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
తెల్లవారేసరికల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి మొదలవుతుంది. మగవాళ్లు పడవలపై సముద్రంలోకి వెళ్లి తీసుకువచ్చిన చేపలు మార్కెట్లోకి పంపే ప్రక్రియతో హడావుడిగా ఉంటుంది.
ఆ చేపలను వేలం వేసేవారు, వేలంలో కొనేవారు, శుభ్రం చేసేవారు, ఎండబెట్టేవారు, మార్కెట్లోకి వాటిని తీసుకెళ్లేవారితో హార్బర్ రద్దీగా ఉంటుంది.
ఈ పనులన్నింటీలో దాదాపు ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు.
సముద్రంలో వేటకు వెళ్లే పురుషుల పాత్ర ఎంత కీలకమో...చేపలను మార్కెట్‌కు చేర్చడంలో మహిళల పాత్ర కూడా అంతే కీలకం.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మహిళా మత్స్యకారులను కలిసేందుకు బీబీసీ బృందం పర్యటించింది.


చేప ఒడ్డుకు చేరిన తర్వాత...
హార్బర్లో 60 ఏళ్ల మత్స్యకార మహిళ గంగమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించిన నాతో 'మీ పేపరోళ్లు వస్తే మా పనికి అడ్డే...మీతో మాట్లాడే అరగంటలో నాలుగు బుట్టల చేపలు అమ్మేస్తా' అన్నారు. ఈ మాటలతో ఆమెకు పని ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది.
ఇద్దరికి చేపలమ్మిన తర్వాత "చెప్పు బాబు…మా కోసం చెప్తావా, సరే చెప్పు" అంటూ గంగమ్మ మాట్లాడటం మొదలు పెట్టారు.
'మగోళ్లు వేటలకు వెళ్లి చేప తెస్తారయ్యా. మేం వాళ్ల దగ్గర కొని చక్కబెట్టుకుంటాం. షావుకారుకు అమ్ముతాం. మిగిలిపోతే సంతలకు కూడా వెళ్తాం' అని గంగమ్మ చెప్పారు. ః
పడవ నుంచి చేపలు దింపిన తర్వాత వాటి ప్రయాణం అక్కడితో ఆగదు. వాటిని కొనడం, శుభ్రం చేయడం, ఎండబెట్టడం, బ్యాగుల్లో కట్టడం, మార్కెట్‌కు తీసుకెళ్లడం, విక్రయించడం... ఇలా ప్రతి దశలోనూ మహిళలే కనిపిస్తారు.
వేలంలో ఒక బుట్ట చేప ఎంత ధర పలుకుతుందో ముందే అంచనా వేయాలి. అంతకు మించిన ధరకి కొన్నామంటే..కొన్నిసార్లు నష్టం తప్పదన్నారు గంగమ్మ.
'ఎండలో చేపలను ఆరబెట్టడం అంత సులువైన పనేం కాదు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేపలు త్వరగా ఎండిపోయేలా చూడాలి. వర్షం వస్తే అప్పటికే ఎండిన చేపలను తడవకుండా కాపాడుకోవాలి. మాకు ఎండైనా పనే... వానైనా పనే' అని చెబుతున్న గంగమ్మ పని మాత్రం ఎక్కడా ఆపలేదు.

ఒక వర్షం... భారీ నష్టం...
చేపల వ్యాపారంలో పెట్టుబడి ఎంత ఉంటుందో... రిస్క్ కూడా అంతే.
చేపలను కొనుగోలు చేశాక, ధర పడిపోతే నష్టం తప్పదు. పచ్చి చేపలు వెంటనే అమ్ముడైపోతాయి కాబట్టి...ఆ రోజు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఎక్కువ నష్టం లేకుండా అమ్మేసుకోవచ్చు. కానీ...ఎండు చేపల విషయంలో అలా కాదు. వర్షం వచ్చి ఎండు చేపలు తడిస్తే పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం మత్స్యకార మహిళలతో మాట్లాడినప్పుడు అర్థమైంది.
'ఒకసారి రూ. 20 వేల విలువైన చేపలు కొనుగోలు చేస్తే, అమ్మినప్పుడు రూ. 11 వేలు మాత్రమే వచ్చాయి. రూ. 9 వేలు నష్టం వచ్చింది' అని గంగమ్మ బీబీసీతో చెప్పారు.
మరో మహిళ కొండమ్మ చెబుతున్న లెక్క ఇంకా పెద్దది.
ఒక్కసారి రూ. 2 నుంచి రూ. 3 లక్షల విలువైన చేపల సరుకు వర్షాలకు తడిస్తే మొత్తం నష్టపోయే పరిస్థితి ఉంటుందని ఆమె అంటున్నారు.
అంటే వీరి వ్యాపారంలో పెట్టుబడి కూడా మహిళలదే... నష్టాన్ని భరించేది కూడా వారే.

పెట్టుబడికి అప్పులే ఆధారం...
చేపల వ్యాపారం చిన్న స్థాయి వ్యవహారం కాదని కొండమ్మ మాటల ద్వారా తెలుస్తోంది.
ఆమె చెప్పిన లెక్కల ప్రకారం...చేపల వ్యాపారంలో రూ.10 నుంచి రూ. 20 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అంత మొత్తాన్ని సొంత డబ్బుతో సమకూర్చుకోవడం సాధ్యం కాక అప్పులు చేయాల్సి వస్తోంది.
'మేం కష్టపడతాం... అప్పులు చేస్తాం' అని ఆమె చెబుతున్నారు.
తనపై రూ.10 లక్షల వరకు అప్పు ఉందని...అయితే వ్యాపారంలో ఇదంతా తప్పదని...ఇలా అప్పులు చేసే ధైర్యం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార పురుషులకు కూడా ఉండదని ఆమె నవ్వుతూ చెప్పారు. ఇక్కడ మరో సమస్య ఉంది.
చేపల వ్యాపారం కోసం మహిళలు అప్పులు తీసుకుంటున్నప్పటికీ... తమకు అవసరమైన రుణాలు, సంస్థాగత ఆర్థిక సహాయం అందడం లేదని వారు చెబుతున్నారు.

సంఘాలు ఉన్నాయి... సాయం ఉందా?
హార్బర్లో మహిళలు తమకు తాముగా మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నా...వాటి ద్వారా పెద్దగా ప్రయోజనం లేదని కొందరు మత్స్యకార మహిళలు చెబుతున్నారు.
కొండమ్మ మాటల్లో ఆ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది.
'బోట్లలో వేటకు వెళ్లే పురుషులకు ప్రభుత్వం తరపున సాయం అందుతుంది...కానీ మాకు ఏ రూపేణా ప్రభుత్వం సాయం అందదు' అని ఆమె అంటున్నారు.
స్వయం సహాయ సంఘాల ద్వారా లభించే ఆర్థిక సహాయం చేపల వ్యాపారానికి అవసరమైన పెద్ద మొత్తం పెట్టుబడికి సరిపోవడం లేదని కొండమ్మ చెప్పారు.
వ్యాపారం జరగని రోజుల్లో కూలి పనికి వెళుతున్నామని మరికొందరు మహిళలు చెప్పారు. రోజంతా కూలి చేస్తే సుమారు రూ.500 వస్తుందని తెలిపారు.

మత్స్యరంగంలో మహిళలే కీలకం...
దేశవ్యాప్తంగా మత్స్యరంగంలో మహిళల ప్రాధాన్యం ఎంత ఉందో ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి.
నేషనల్ ఫిషరీస్ పాలసీ-2020 ముసాయిదా ప్రకారం...
భారతదేశ సముద్ర మత్స్యకారుల జనాభా 37.7 లక్షలు.
వీరిలో 9.3 లక్షల మంది క్రియాశీల మత్స్యకారులు.
చేపల వేట, అనుబంధ కార్యకలాపాల్లో 5.2 లక్షల మంది ఉన్నారు.
వారిలో 69 శాతం మహిళలే.
ఇక చేపల మార్కెటింగ్‌లో మహిళల భాగస్వామ్యం ఏకంగా 86 శాతం.
అంటే సముద్ర మత్స్యరంగంలో మహిళలు కేవలం సహాయక పాత్రలో లేరు. ముఖ్యంగా చేపల మార్కెటింగ్‌లో మహిళలే ప్రధాన భాగస్వాములు.
అందుకే కొందరు మహిళలు తాము ఎవరిపై ఆధారపడకుండా అంటే ఏ పథకాలు, ప్రయోజనాల కోసం ఎదురు చూడమని చెప్పారు. అలా చెప్పిన వారిలో గంగమ్మ, కొండమ్మ ఉన్నారు.
ఎర్రమ్మ వంటి మరి కొందరు మహిళా మత్స్యకారులైతే ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తితో మాట్లాడారు.
'ఆడోళ్లకి హెల్ప్ చేయలేదు...మగాళ్లు వేటకు వెళ్తారు. వారికే గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి. మేం వేటకు వెళ్లకపోయినా...మార్కెట్ అంతా మా పనే ఉంటుంది. మమ్మల్ని కూడా పట్టించుకోవాలి' అని ఆమె అంటున్నారు.

హార్బర్‌కు మహిళలే రాణులు...
హార్బర్లో మహిళల పాత్రను మహిళలు మాత్రమే చెప్పడం లేదు. అక్కడ పని చేసే పురుషులు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తున్నారు.
కళాసీ పామోడు తన భార్యే చేపల వ్యాపారాన్ని చూసుకుంటుందని చెబుతున్నారు.
'హార్బరులో ఆడోళ్లు పాత్ర చాలా ఎక్కువ' అని సూరీడు అనే కళాసీ బీబీసీతో చెప్పారు.
మరో మత్స్యకారుడు సూర్యనారాయణ అయితే... చేపల కొనుగోలు, అమ్మకం వంటి పనుల్లో మహిళల అనుభవమే తమకంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు వచ్చే చేపల్లో దాదాపు 30 శాతం ఎండు చేపల మార్కెట్‌కు వెళ్తున్నాయని మత్స్యశాఖ అంచనా వేస్తోంది.
ఒకరి కోసం మరొకరు...

హార్బరులో చేపల వ్యాపారం మహిళల్లో ఒక తరం నుంచి మరో తరానికి వస్తోంది. ఈ పని కేవలం ఒక మహిళకే పరిమితం కాదు.
కుటుంబంలో ఒకరు వృద్ధాప్యంలోకి వెళ్తే... మరో మహిళ ఆ బాధ్యతను తీసుకుంటుంది.
నూకమ్మ తల్లి వయసు పెరగడంతో ఎండలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. దీంతో తల్లి చేపలు కొనుగోలు చేస్తే... ఆమె వాటిని ఎండబెట్టి, బ్యాగులు కట్టి, ఆటోలోకి ఎక్కిస్తారు.
ఇలా ఒక తరం నుంచి మరో తరానికి ఈ పని బదిలీ అవుతోంది.
చేపల వ్యాపారం... ఒక కుటుంబానికి కేవలం ఉపాధి కాదు. తరతరాలుగా కొనసాగుతున్న జీవన విధానం.

ఆరోగ్యంపై ప్రభావం...
మత్స్యకార మహిళలు రోజుకు 6 నుంచి 10 గంటల వరకు ఎండలో పని చేయాల్సి ఉంటుంది. చేపలు సర్దడం, బుట్టలు ఎత్తడం, పడవల నుంచి అమ్మే చోటుకు చేపలను మోసుకురావడం, వేలం పాటల్లో అరవడం... ఇలా శారీరక శ్రమతో కూడిన పనులు చేయాల్సి ఉంటుంది.
ఇదంతా బీబీసీ బృందం హార్బర్ లో తిరుగుతున్నప్పుడు స్పష్టంగా కనిపించింది.
'ఎండలో ఒళ్లొంచి పని చేయాలి. గంటల తరబడి ఆగకుండా చేయాల్సి ఉంటుంది. దాంతో వెన్ను, మెడ, మోకాళ్లు, భుజాలు, మడమల్లో నొప్పులు వస్తాయి' అని హార్బురులో చేపల వ్యాపారం చేసే చాలా మంది మహిళలు చెప్పారు. .
ఇదే విషయాన్ని ఎల్లయ్యమ్మ అనుభవం మరింత స్పష్టంగా చెబుతుంది.
'ఒళ్లు నొప్పులు, బరువుగా అనిపించడం, ఒక్కోసారి లేవలేకపోవడం వంటి సమస్యలు వస్తే డాక్టర్‌ను సంప్రదించి మందులు తీసుకుని రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ హార్బర్‌కే వస్తాం' అని ఎల్లయ్యమ్మ బీబీసీతో చెప్పారు.
మాకు ఏదైనా కష్టం వచ్చి హార్బరుకు రాకపోతే ఆ రోజు కుటుంబం ఎలా నడుస్తుంది? ఈ వ్యాపారంలో ఆదాయం కూడా స్థిరంగా ఉండదని మరో మత్స్యకార మహిళ సూరీడమ్మ చెప్పారు.
'కష్టపడి పనిచేసిన రోజున సుమారు రూ. 500 వరకు మిగలవచ్చు. వ్యాపారం చేస్తే అదే రోజు రూ. 50 వేల విలువైన సరుకుతో మార్కెట్‌కు వస్తే...రూ. 5 వేల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది' అని సూరీడమ్మ బీబీసీతో అన్నారు.
అయినా హార్బర్ నే నమ్ముకుని బతుకడం తమకు అలవాటైపోయిందన్నారు.

హార్బర్‌ను నడిపించే చేతులు...
'ఆడోళ్లు లేకపోతే హార్బర్ నడవదు' అని గంగమ్మ చెప్పిన మాట...హార్బర్లో మహిళలు చేస్తున్న పనులను చూస్తే నిజమేననిపిస్తుంది.
అయితే ప్రశ్న ఇక్కడే ఉంది.
మార్కెట్లో ఇంత కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు... రుణాలు, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలలో అదే స్థాయిలో భాగస్వామ్యం ఉందా?
'ఏ రోజైనా వ్యాపారం లేకపోయినా... ... ప్రభుత్వం తరపున మహిళ మత్స్యకారుల కోసం పథకాలేవి లేవు' అని ఎర్రమ్మ చెప్పారు.
'ఏ రోజైనా వ్యాపారం లేకపోయినా...కూలి దొరక్కపోయినా...నిశ్శబ్ధంగా ఇంటి దగ్గర కూర్చోడమే. మాకు వడ్డీకి అప్పులిచ్చే సంఘాలున్నాయి. కానీ...ప్రభుత్వం తరపున మహిళ మత్స్యకారుల కోసం పథకాలేవి లేవు' అని ఎర్రమ్మ చెప్పారు.
వేటకు వెళ్లే మత్స్యకారులకు అందుతున్న కొన్ని ప్రభుత్వ పథకాలు, సహాయాలతో పోలిస్తే... చేపల మార్కెటింగ్‌లో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా అందుతున్న మద్దతు పరిమితంగానే ఉందని విశాఖ మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
చేపల వ్యాపారం హార్బర్ తో ఆగిపోదు. కొందరు మహిళలు ఇతర ప్రాంతాల సంతలకు వెళ్లి అక్కడ వ్యాపారం చేస్తారు. మరికొందరు స్థానికంగా అమ్ముతారు. ఇంకొందరు చేపలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు.
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేది పురుషులు కావచ్చు. కానీ ఆ చేపలను సముద్రం నుంచి మార్కెట్ వరకు నడిపించేది...మహిళలే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































