కొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసిన భారత్ ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతోంది?

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పటం, భారత్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన కొత్త ప్రపంచ పటం చుట్టూ కొత్త వివాదం మొదలైంది.

ఆఫ్రికా ఖండాన్ని మరింత కచ్చితంగా చూపేందుకు ఈ కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితి తీసుకొచ్చింది.

దీనికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా మినహా 164 దేశాలు ఆమోదించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించిన దేశాల్లో ఉన్నాయి.

కానీ, కొత్త ప్రపంచపటంలో భారత్ భౌగోళిక సరిహద్దులను భిన్నంగా చూపించారని కొత్త వివాదం మొదలైంది. సీనియర్ పాత్రికేయులు సుహాసిని హైదర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో దీనిపై స్పందించారు.

"కొత్తగా విడుదల చేసిన ప్రపంచ పటంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్, చైనాలో భాగంగా చూపించారు" అని ఆమె తన మెసేజ్‌లో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పటం, భారత్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్

ఫొటో సోర్స్, ANI

భారత విదేశాంగ శాఖ ఏం చెబుతోంది?

వివాదంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ దీనిపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

భారత ప్రభుత్వం గుర్తించిన భారత పటాన్నే ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ప్రపంచ పటంలో చూపించాలని పేర్కొంది.

జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను యథావిధిగానే ఉంచాలని స్పష్టం చేసింది. దీన్ని కాదని ఎలాంటి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే చిత్రీకరణలను అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.

కొత్త ప్రపంచ పటంపై భారత విదేశాంగ శాఖ తన వైఖరిని ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ ప్రకటనను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జారీ చేశారు.

విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం "సమాన వైశాల్యం కలిగిన ప్రపంచ పటంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 4న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఖండాలకు చెందిన భూభాగాల వాస్తవ రూపాన్ని వాడకంలోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం" అని పేర్కొన్నారు.

"ఈ తీర్మానం ఎలాంటి ప్రత్యేక ప్రపంచ పటాన్ని ఆమోదించడంగానీ, స్వీకరించడంగానీ చేయలేదు. అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలు, ప్రదేశాల పేర్లకు సంబంధించిన రాజకీయ పటానికి సంబంధించిన సమస్యలను ఇందులో ప్రస్తావించలేదు" అని ఆయన తెలిపారు.

సమాన వైశాల్యం గల పటాలను ఉపయోగించాలనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడే భారత్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు తన ప్రకటనలో విదేశాంగ శాఖ పేర్కొంది.

"తప్పుగా లేదా తప్పుదారి పట్టించేలా మ్యాప్ రూపకల్పనకు అంగీకరించబోం. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇందులో రాజీ ప్రసక్తే లేదు" అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పటం, భారత్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త ప్రపంచ పటంపై ఐక్యరాజ్య సమితి తీర్మానానికి దేశాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

అసలు వివాదం ఏంటి?

మరింత కచ్చితత్వంతో ఖండాలను, వాటి భూభాగాలను చూపించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి శుక్రవారం జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి 164 దేశాలు మద్దతు ఇస్తూ ఓటు వేశాయి. ఓటింగ్‌లో ఆరు దేశాలు పాల్గొనలేదు.

ఐక్యరాజ్యసమితి తీసుకొచ్చిన ఈ తీర్మానం కచ్చితంగా అమలు చేయాలనే నిబంధన లేకున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఉపయోగించే ప్రపంచ పటంలో మార్పులకు దారి తీస్తుంది.

16వ శాతాబ్దం నుంచి వినియోగంలో ఉన్న ప్రస్తుతం ప్రపంచ పటం విమర్శలను ఎదుర్కొంటోంది. గ్రీన్‌ల్యాండ్ పరిమాణంలోనే ఆఫ్రికాను చూపించడం అందులో ఒకటి. వాస్తవానికి గ్రీన్ ‌ల్యాండ్ కంటే ఆఫ్రికా 14 రెట్లు పెద్దది.

భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను, శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తుందనే విమర్శ ఉంది.

మెర్కేటర్ మ్యాప్‌‌ను 1569లో ఫ్లెమిష్ పటాల రూపకర్త (కార్టోగ్రాఫర్) గెరార్డస్ మెర్కేటర్ రూపొందించారు. ఇందులో భూమిని వక్రంగా చూపించారు.

భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దేశాలు వాస్తవ పరిమాణం కంటే చిన్నవిగా చూపించారని, ధ్రువాలకు దగ్గరగా ఉండే దేశాలను చాలా పెద్దవిగా చిత్రీకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

దీన్ని సరి చేసేందుకే పటాల నిపుణులు 2018లో సమాన వైశాల్య పటాన్ని రూపొందించారు. దీన్ని ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని పేరు పెట్టారు.

ఈ కొత్త మ్యాప్‌ను ఆఫ్రికా యూనియన్‌కు చెందిన 54 సభ్య దేశాలు ఆమోదించాయి. అన్ని ఖండాలు, ముఖ్యంగా ఆఫ్రికా ఆకారం కచ్చితంగా ఉందని పేర్కొన్నాయి.

"యూఎస్, చైనా, ఇండియా, జపాన్, మెక్సికో, యూరప్‌లోని పెద్ద భూభాగాలు ఆఫ్రికాలో పెట్టినా ఇంకా స్థలం మిగిలే ఉంటుంది." అని #CorrectTheMap అనే ఆన్‌లైన్ క్యాంపెయిన్ గ్రూప్ అభిప్రాయపడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)