ఆంధ్రప్రదేశ్: డీజేలపై చర్చ ఏమిటి, అతి శబ్దం తెచ్చే ప్రమాదమేమిటి, మన చెవులు ఎంత శబ్దాన్ని భరిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క డీజే వాహనాన్ని కూడా జప్తు చేయద్దని ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పోలీసులకు చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలను అనుమతించడం లేదంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని, ఒక్క డీజే వాహనాన్ని కూడా జప్తు చేయొద్దని హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీకి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
"వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని నాకు సందేశాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అనుమతులు మంజూరు అయ్యేలా చూడాలని హోం మంత్రి అనితను, డీజీపీని కోరుతున్నాను. ఏపీ పోలీసులు ఒక్క డీజే వాహనాన్ని కూడా జప్తు చేయకూడదు" అని తన పోస్ట్‌లో నారా లోకేశ్ కోరారు.
లోకేశ్ పోస్ట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు.
"గణేశ నిమజ్జనానికి సంబంధించిన డీజే అనుమతులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా జారీ చేసేలా చూడాలని నేను పోలీసు శాఖను ఆదేశించాను. ఈ అనుమతులు వేడుకల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉండాలి. హిందూ ధర్మ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండకూడదు." అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

శబ్దకాలుష్యం ప్రజారోగ్య సంక్షోభంగా మారిందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. శబ్దాన్ని కంటికి కనిపించని కిల్లర్‌గా చెబుతున్నారు.
ఇంతకీ డీజే వాహనాలను రోడ్లపై ఎలా నడపాలి. దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? ఎక్కువ డెసిబుల్స్‌తో శబ్దాలు వింటే ఏమవుతుంది? భారీ శబ్దాలకు మనుషులు తట్టుకోలేక కుప్పకూలిపోతారా? వైద్యులు ఏమంటున్నారు?
మన చుట్టూ ఉంటూ మనకు తెలియకుండానే శబ్దం మన ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్‌కు, జ్ఞాపకశక్తి కోల్పోవడానికీ ఇది కారణమవుతోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ప్రజారోగ్య సంక్షోభమని, ప్రతిరోజూ చాలామంది బాధితులవుతున్నారని లండన్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ జార్జ్ విద్యా సంస్థ ప్రొఫెసర్ షార్లెట్ క్లార్క్ గతంలో బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గుండెపై ప్రభావం చూపే శబ్దం
‘‘మన చెవి ధ్వనిని గుర్తించి మెదడుకు పంపుతుంది. మెదడులోని అమిగ్డాలా అనే భాగం ధ్వనికి సంబంధించిన భావోద్వేగాన్ని ప్రేరేపిస్తుంది. ఇది శరీర సహజ రక్షణ వ్యవస్థలో భాగం. ప్రమాదాలకు త్వరగా స్పందించడానికి సహాయపడుతుంది. కాబట్టి హృదయ స్పందన రేటు పెరుగుతుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మీ శరీరం ఒత్తిడి హార్మోన్లు విడుదల చేస్తుంది. చాలా ఏళ్లు ఇదే పరిస్థితిలో ఉంటే మాత్రం అధిక రక్తపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది" అని ప్రొఫెసర్ క్లార్క్ చెబుతున్నారు.
"గుండె ఆరోగ్యానికి 53 డెసిబుల్స్ ఫర్వాలేదు. శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే, ఆరోగ్యానికి అంత ప్రమాదం. రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, విషపూరితం కావొచ్చని మనకు తెలుస్తుంది. కానీ శబ్దం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం కష్టం" అని డాక్టర్ ఫోరాస్టర్ అభిప్రాయపడ్డారు.
డీజే శబ్దాల ధాటికి తట్టుకోలేక మృతి చెందుతున్న కేసులు ఈ మధ్య కాలంలో రికార్డు అవుతున్నాయి.
గతంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు రిపోర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పరిధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. దీనికి కూడా డీజే సౌండ్ కారణమని తేలింది. ఆ శబ్దం ఎక్కువగా వినడం వల్ల అది గుండెపై ప్రభావం చూపిందని, అందుకే చనిపోతున్నారని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత శబ్దం ప్రమాదకరం
53 డెసిబుల్స్ నుంచి 70 డెసిబుల్స్ వరకు గుండె తట్టుకోగలదని ఆ తర్వాత పెరిగే కొంచెం శబ్దమైనా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
"మన చెవులు 70 డెసిబుల్స్ వరకు శబ్దాలను తట్టుకోగలవు. అయితే 80 నుంచి 100 డెసిబుల్స్ నిరంతరం వింటే వినికిడి లోపం ఏర్పడుతుంది. 100, 120 డెసిబుల్స్ మధ్య శబ్దాలకు చెవిలో నొప్పి వస్తుంది, తల తిరుగుతుంది. అంతేకాదు ఈ ధ్వని గుండెకు అనుసంధానమై ఉన్న నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది గుండెను ప్రమాదంలోకి నెడుతుంది" అని చెవి, ముక్కు, గొంతు నిపుణుడు అశోక్ పురోహిత్ గతంలో బీబీసీకి చెప్పారు.
"శబ్ద కాలుష్యం మనిషి ఆరోగ్యానికి హానికరం. ఇది ధమనుల్లో అధిక రక్తపోటు(ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్)కు దారితీస్తుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరగుతుంది. శబ్ద కాలుష్యం వల్ల రక్తపోటు పెరగడం, హృదయ స్పందన రేటు పెరగడంతోపాటు హార్మోన్ స్థాయుల్లో మార్పులూ వచ్చే అవకాశం ఉంది." అని కార్డియాలజిస్ట్ తుకారాం ఔటీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక ఆరోగ్యానికీ దెబ్బే
"పెద్ద శబ్దం కారణంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. అది చెవిలోని కణాలను దెబ్బతీస్తుంది. వినే సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. చెవులలో తేనెటీగలు సందడి చేస్తున్నట్టు, ఈల వినిపించినట్టు అనిపిస్తుంది. 'టిన్నిటస్' అని పిలిచే ఈ పరిస్థితి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది" " అని చెవి-ముక్కు-గొంతు స్పెషలిస్ట్ నీతా గాడే చెప్పారు.
ఇలాంటి వినికిడి లోపం, దాని సంబంధిత సమస్యలకు నివారణ మార్గాలూ ఉన్నాయని ఆమె తెలిపారు.
డీజే శబ్దం తీవ్రతలో పరిమితిని పాటించడం అవసరమని నీతా సూచించారు.
భారీ శబ్దాల వల్ల మనిషి శరీరమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. "ప్రతి ఒక్కరూ సంగీతానికి ప్రాధాన్యం ఇస్తారు, ఎంత సౌండ్‌లో వినాలో ఎంపిక చేసుకునే అవకాశం అందరికీ ఉంది. కానీ డీజే డాల్బీ మ్యూజిక్‌లో అలాంటి సదుపాయం ఉండదు" అని సైకియాట్రిస్ట్ శుభాంగి గార్గానిస్ అంటున్నారు.
"డీజే మ్యూజిక్ వినడం వల్ల సామాన్యులు చిరాకు పడతారు. ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది" అని శుభాంగి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డీజేలతో గుండెపోటు సమస్యలు వస్తాయా?
డీజే సౌండ్ సిస్టమ్ శబ్దాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీజే సౌండ్ సిస్టమ్ కారణంగా తక్షణమే గుండెపోటు రాదని.. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారిపై దీని ప్రభావం ఉంటుందని కార్డియాలజిస్టు ఎ.రవికాంత్ గతంలో బీబీసీతో చెప్పారు.
''డీజే శబ్దాలు ఒక్కసారిగా మొదలై, ఉలిక్కిపడే పరిస్థితి ఎదురైతే గుండెపై ప్రభావం పడుతుంది. అది కూడా అప్పటికే గుండె జబ్బులు లేదా ఏదైనా బ్లాక్స్ వంటివి ఉంటే ఒక్కసారిగా మొదలయ్యే డీజే శబ్దంతో ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది.
ఆ సందర్భాల్లో గుండెపోటు రావడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం జరగొచ్చు. డీజేల భారీ శబ్దాల వల్ల గుండె దడ మొదలై గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది. అప్పటికే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది'' అని డాక్టర్ రవికాంత్ చెప్పారు.
పరిమితులకు మించి డీజే శబ్దాలు వస్తే మన చెవి కర్ణభేరిపై ప్రభావం పడుతుందని, మానసిక ఆందోళనకు గురిచేస్తుందని వివరించారు.

హైదరాబాద్‌లోనూ ఆంక్షలు
భారీ శబ్దాలతో వస్తున్న దుష్ప్రభావాలను గుర్తించిన తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు డీజీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. చాలా కాలంగా హైదరాబాద్ పోలీసులు డీజేలపై ఆంక్షలు విధించారు.
గతంలో ఈ నిబంధనలు అతిక్రమించారనే నాటి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఉన్న విజయలక్ష్మి సహా పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలని, శబ్ద కాలుష్యాన్ని తగ్గిద్దామని పోలీసులు సూచిస్తున్నారు.
2000 ఆగస్టు 30న చర్చ్ ఆఫ్ గాడ్ (ఫుల్ గాస్పెల్) ఇన్ ఇండియా వర్సెస్ కేకేఆర్ మెజస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కేసులో తమిళనాడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నివాస ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వాడటం సరికాదని స్పష్టం చేసింది.
అలాగే 1986 పర్యావరణ (పరిరక్షణ) చట్టం ప్రకారం నివాసాలు, వాణిజ్య, పరిశ్రమలు లేదా నిశ్శబ్ద ప్రాంతాల వారీగా శబ్ద పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
శబ్ద కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, పరిమితులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సవరిస్తూ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్దేశిత సమయాలను దాటిన తర్వాత డీజేల వినియోగంపై నిషేధం ఉంది.
2010 అక్టోబరు 12న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 172 ప్రకారం.. పగలు, రాత్రి సమయాల్లో నిర్దేశిత ప్రాంతాలను బట్టి ఎంత మేర డీజే శబ్దాలు ఉండొచ్చనే విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇలా ఉన్నాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం పగలు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అని అర్థం. ఈ మార్గదర్శకాలకు తగ్గట్టుగా లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదా డీజే సిస్టమ్ వంటివి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య వినియోగించడానికి వీల్లేదని హైదరాబాద్ పోలీసులు 2024లో తీసుకొచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తర్వులు ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 – సెక్షన్ 15 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం ఉల్లంఘనలు రుజువైతే నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా లక్షరూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు.
డీజే శబ్దాల కారణంగా గుండెపోటు వంటివి వచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో గతంలో బీబీసీ చేసిన వీడియో మీరు చూడొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























